ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ వాళ్ళిద్దరికీ కొత్తగా వుంది. ఒకరి కోరిక ఒకరికి వేళ్ళలోంచి పాకుతున్నట్లుంది.
"అదిగో మన రొమాంటిక్ కేజల్"
స్కూలు గది కనిపిస్తోంది.
అంతలోనే తమ వెనుక ఎవరివో హాహాకారాలు వినిపించడంతో ఇద్దరూ ఆగారు.
బాగా పరిశీలించి చూస్తే సత్యనారాయణ ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నాయి. కేకలు గుండెల్ని చీలుస్తున్నాయి ఎవరో రాయి విసిరితే తుట్టెలోంచి బయటపడ్డ తేనెటీగల్లా జనం గేటును తోసుకుని బయటికి పరిగెడుతున్నారు.
"ఏం జరిగింది?" సుజన కంగారు అడిగింది.
"అదే నాకూ తెలియడం లేదు వెళదాం - రా" ఇద్దరూ వడివడిగా నడుస్తున్నారు.
ముందుగా పరిగెత్తుకొచ్చిన ఇద్దరికుర్రాళ్ళను ఆపి "ఏమైంది?" అని అడిగాడు వంశీ.
"ఏం జరిగిందా? వెళ్ళి చూడండి" ఆ కుర్రాళ్ళిద్దరూ నవ్వునీ, ఆయాసాన్నీ ఆపుకుంటూ చెప్పారు.
"ఏదో జరిగింది మీ ఇంట్లో అయితే ఆందోళన పడవలసింది కాదు. లేకుంటే వాళ్ళలా నవ్వరు కదా" అన్నాడు సుజన కంగారు చూసి.
ఆమె కూడా సర్దుకుంది.
అంతలో మరో ముగ్గురు స్త్రీలు ఎదురుపడ్డారు. వాళ్ళు కూడా అంతవరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆయాసం తన్నుకు రావడంతో ఆగారు.
"అదా! చెప్పేది కాదు" అంది అందులో ఒకామె మిగిలిన ఇద్దరు కూడా అంతేనన్నట్లు తలలాడించారు.
ఇక సస్పెన్స్ ను భరించలేక వాళ్ళిద్దరూ నడక వేగం పెంచారు. గుంపులు గుంపులుగా జనం ఏదేదో మాట్లాడుకుంటూ ఎదురుపడుతున్నారు.
అంత రాత్రిపూట వాళ్ళిద్దరూ ఎక్కడ నుండి వస్తున్నారోనని కూడా జనం చూడలేదంటే అంత ఇంట్రెస్ట్ అయిన విషయం ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు నిముషాలకి వంశీ, సుజన అక్కడికి చేరుకున్నారు.
సత్యనారాయణగారిల్లు నిశ్శబ్దంగా వుంది. అంతకుముందు జనంతో కిటకిటలాడిన లాన్ ఇప్పుడు బోసిగా వుంది.
టీవీలో మాత్రం బొమ్మలు కనిపిస్తున్నాయి.
వీసీపీ అయినా ఆఫ్ చేయకుండా జనం ఎందుకలా పరుగెత్తారో ఊహకైనా అందడం లేదు.
తన మామయ్యా ఫామిలీ అంతా ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిడాయించుకున్నారన్న విషయం మాత్రం అర్ధమైంది. లోపల అన్ని లైట్లూ వెలుగుతున్నాయి.
వంశీ ప్రహరీగోడకున్న గేటును దాటి లోపలికి అడుగుపెట్టాడు. అప్పటికీ టీవీలో బొమ్మలు మసగ్గా కనిపిస్తున్నాయి ఎన్టీరామారావు, అంజలీకి బదులు ఎవరో ఇంగ్లీషు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
సుజన వచ్చి వంశీకి వెనగ్గా నిలుచుంది.
సీన్ మారింది.
ఒక్కసారిగా షాక్ తిన్నట్లు ఇద్దరూ అలా గుడ్లప్పగించి చూస్తున్నారు.
ప్లే అవుతున్నది బ్లూఫిల్మ్.
ఆ షాక్ నుంచి ముందుగా తేరుకున్నది సుజన. పరుగున వెళ్ళి కనెక్షన్ పీకేసింది.
జనం ఎందుకంత కేకలు పెడుతూ పరుగెత్తారో తెలిసింది వంశీకి. మామయ్యా వాళ్ళు ఎందుకు టీవీ ఆఫ్ చేసే స్థితిలో కూడా లేరో అర్ధమయింది.
అతని తల కిందకు వాలిపోయింది.
టీవీ ఆఫ్ కాగానే ఇంట్లోంచి ఒక్కొక్కరే బయటికి వచ్చారు.
కూతురు, అల్లుడూ ఏదో ప్లాన్ చేసి, తమను బోల్తా కొట్టించడానికి ప్రయత్నించారని ఊహించిన సత్యనారాయణ "ఇక లోపలికిరా" అంటూ సుజనను గద్దించాడు.
ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి నడిచింది.
"ఛీ ఛీ! ఈ రోజుతో కుటుంబం వీధిన పడింది" సత్యనారాయణ ముఖాన్నంతా వికారంగా చేసుకుని కూతురిని అనుసరించాడు.
ఇక అక్కడ ఓ క్షణం వుండలేక వంశీ వెనుతిరిగాడు. చివరన లోపలికి వెళుతున్న బామ్మ ఓ అడుగు వెనక్కి తగ్గి, వంశీ దగ్గరికి వచ్చింది.
"అబ్బాయ్! లవకుశ కంటే ఇదే బావుందోయ్" అంది మెల్లగా.
"మేఘమాల' అలా ప్లాప్ కావడంతో మరింత ఆరాటపడి పోతున్నాడు వంశీ. అపజయాలన్నీ పట్టుదలను పెంచుతున్నాయి. మరో ప్లాన్ కోసం తెగ ఆలోచిస్తున్నాడు. లవకుశ బదులు బ్లూఫిల్మ్ ప్లే కావడానికి అతని అత్యుత్సాహమే కారణం.
ఆరోజు వీడియో షాపులో అతను బొటనవేలునీ, చూపుడు వేలునీ సున్నాలా చుట్టి 'లవకుశ క్యాసెట్ ఇవ్వు - అదిరిపోవాలి' అని అడగడం కొంపముంచింది. అలా వేళ్ళను సున్నాలా చుడితే బ్లూఫిల్మ్ అని అర్ధం.
"మీరు అలా వేళ్ళను ముడిచి లవకుశ ఇవ్వమంటే బ్లూ ఫిల్మ్ అనుకున్నాను. అది బ్లూఫిల్మ్ కి కోడ్ భాష ఈ షాపుకి వచ్చేవాళ్ళు బ్లూ ఫిల్మ్ కోసం ఆ విధంగా అడగమని నేనే చెప్పాను. వేళ్ళు ముడవకుండా అడిగితే నిజమయిన క్యాసెట్ లే ఇస్తాం. వేళ్ళు ముడిచి భక్తి రసమయిన సినిమా పేర్లు చెబితే బ్లూ ఫిల్మ్ లు ఇస్తాం. బ్లూ ఫిల్మ్ క్యాసెట్లకంతా దేవుళ్ళ సినిమాల కోడ్ పెట్టాం వేశ్యలకు పతివ్రతల పేర్లు పెట్టినట్లు" అని అతి వివరంగా చెప్పాడు షాప్ ఓనర్ కిరణ్.
వంశీ తలపట్టుకున్నాడు. విసీపీని మరికొన్ని రోజులు వుంచుకుంటానని చెప్పి కొన్ని ఇంగ్లీషు సినిమాలు తెచ్చుకున్నాడు.
ఆరోజు నుంచి రోజుకొకటి చొప్పున వేసుకుని చూస్తున్నాడు సినిమా చూస్తున్నా అతని మనసు అక్కడ లగ్నం కావడం లేదు. మరో ప్లాన్ కోసమే బుర్రంతా పెనుగులాడుతోంది.
ఇంటి దగ్గర ఏమీ తోచకపోతే సిగరెట్ కాల్చుకోవడానికి రచ్చ దగ్గరకొచ్చాడు.
అంతకుముందే కానన్ సిరీస్ లో వచ్చిన కానన్ అండ్ ది డెస్ట్రాయర్ సినిమాను వీడియోలో చూసాడు.
నల్లటి బరిశెలాగ వుండే నీగ్రోపిల్ల నటనను మననం చేసుకుంటూ నిలుచున్నాడు.
అప్పుడు పదకొండు గంటలు కావడం వల్ల ఎండ తీక్షణంగా వుంది.
ఎండ అలా వుండడంవల్లే మర్రిచెట్టు నీడ మరింత చల్లగా వుంది.
సిగరెట్ చివరలో వుండగా మోపెడ్ లో ఓ వ్యక్తి రచ్చ దగ్గరికి వచ్చాడు.
"ఇక్కడ వంశీ అనే వ్యక్తి ఇల్లెక్కడ?" అనడిగాడు.
"నేనే - ఎవరు మీరు?" దగ్గరికొస్తూ ప్రశ్నించాడు.
"రాకెట్ కొరియర్ సర్వీస్ నుంచి వస్తున్నాను. మీకు ఓ పార్శిల్ వుంది. డెలివరీ కోసం వచ్చాను"
తనకు కొరియర్ సర్వీసులో పార్శిల్ వచ్చిందంటే ఆశ్చర్యపోయాడతను.
"ఇవ్వండి"
వచ్చిన వ్యక్తి వంశీ దగ్గర సంతకం తీసుకుని ఓ అట్టపెట్టెలాంటి దిచ్చాడు.
వంశీ దానిని తీసుకొని ఇంటికి వచ్చాడు.
ఫ్రం అడ్రస్సు లేదు.
బ్లేడుతో ప్లాస్టిక్ టైలని కట్ చేసి విప్పాడు.
