Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 41


    
    ఆరడుగులు దాటాక నీళ్ళు కూడా పడవు గనుక అతనికేమీ ఇబ్బందిగా అనిపించలేదు.
    
    ఉట్టిని అందుకుని కిందకు జారాడు.
    
    చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
    
    వంశీ నేరుగా సుజన దగ్గరికి వచ్చాడు.
    
    "శెహభాష్ అల్లుడూ" సత్యనారాయణ సంతోషంగా మెచ్చుకున్నాడు. బామ్మయితే అతని ముఖాన్ని ముద్దులతో నింపేసింది.
    
    "ఇక చాల్లేవే" అని సుజన వెనకనించి లాగేవరకూ ఆమె అతని ముఖాన్ని వదలలేదు.
    
    సుజన అక్కయ్యలు మెచ్చుకోలుగా చూసారు.
    
    "ఈ డబ్బుతో జన్మాష్టమి సందర్భంగా మీ ఇంట్లో వీడియో షో ఏర్పాటు చేసాను మామయ్యా" వంశీ చెప్పాడు. ఊరకే అరేంజ్ చేస్తే డౌట్ వస్తుందనే అతను ఈ పందెంలో పాల్గొని గెలిచాడు.
    
    "అలాగేవయ్యా"
    
    వంశీ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అయితే దీన్ని ఎక్స్ ప్రెస్ చేయలేదు.
    
    సత్యనారాయణ అక్కడి నుంచి కదిలాడు.
    
    వాళ్ళు వెళ్ళిపోయాక వంశీ వెనక్కు వెళ్ళి తను గెలిచిన డబ్బునీ వీరాస్వామికి, గంగరాజుకీ, పోటీలో వున్న మరో వ్యక్తి రంగనాయకులకీ సమానంగా పంచి అక్కడ నుంచి బయలుదేరాడు.
    
    గెలిచిన డబ్బులో రూపాయి అయినా తీసుకోకుండా అంతా తమకే పంచిపెట్టి వెళుతున్న అతనివేపు వాళ్ళు విస్మయంగా చూస్తూ నిలబడ్డారు.
    
    వంశీ ఇంటికొచ్చి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. స్కూల్లో జరగాబోయే తను ఫస్ట్ నైట్ అంతా సినిమా రీలులా కదులుతోంది.
    
    ఒక్క దగ్గర వుండడం వీలుకానట్లు అక్కడి నుంచి కొట్టు దగ్గరికి నడిచాడు. సిగరెట్టు కొనుక్కుని రోడ్డు దగ్గరికి వెళ్ళి తిరిగివచ్చాడు.
    
    టైమ్ ఏడు దాటింది.
    
    తమ మామయ్య ఇంట్లో టీవీలో సినిమా వేస్తున్నారని యిద్దరు ముగ్గురు అమ్మలక్కలకి చెప్పాడు. వాళ్ళు మొత్తం ఊరంతా చెబుతారని అతనికి తెలుసు.
    
    ఆ గ్రామంలో కొంతమంది కుర్రకారు అప్పుడప్పుడూ టీవీ షోలు వేస్తుంటారు. టౌన్ నుంచి వీసీపీ, క్యాసెట్లు తీసుకొచ్చి ఎవరింట్లోనయినా షోలు వేస్తారు. రూపాయి యిచ్చి ఎవరయినా చూడవచ్చు. జనం బాగా వస్తే ఖర్చులు పోను ఏభయ్యో వందో మిగులుతాయి.
    
    ఇప్పుడు ఫ్రీగా లవకుశ ప్రదర్శిస్తున్నారని తెలిసి సాయంకాలం నుంచే స్త్రీలు తయారవడం మొదలుపెట్టారు. భోజనాలు వండి పిల్లలకీ, పెద్దలకీ పెట్టి తామింత నోట్లో వేసుకుని ఎప్పుడెప్పుడు తొమ్మిదవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
    
    ఎనిమిది గంటల ప్రాంతాన వంశీ సత్యనారాయణ ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందున్న లాన్ లో కలర్ టీవీ, వీసీపీ అరేంజ్ చేశాడు.
    
    ఉట్ల ఉత్సవంలో గెలిచి, ఆ డబ్బుతో జన్మాష్టమి లాంటి పర్వదినాన భక్తిరస సినిమా చూపిస్తున్న తన అల్లుడ్ని పొగడకుండా వుండలేకపోయాడు సత్యనారాయణ బామ్మయితే అసలు కృష్ణుడ్నే చూస్తున్నట్లు తన్మయత్వంతో అతనివేపు చూస్తోంది.
    
    సుజనకి మెల్లమెల్లగా ప్లాన్ ఏమిటో అర్ధమవుతోంది.
    
    ఇంకాసేపట్లో సినిమా ప్రారంభమవుతుంది. ఇంట్లోని వాళ్ళంతా టీవీ ముందు ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుంటారు. తను మాత్రం చివరలో కూర్చుంటానని చెబుతుంది. ఈలోగా వచ్చి జనంతో లాన్ అంతా నిండిపోతుంది. అంతమంది జనం మధ్య తను వున్నదీ లేనిదీ తెలుసుకోలేరు. అంతేకాక భక్తిరస సినిమాలో లీనమైపోతారు. లవకుశ కాబట్టి తలపక్కకి తిప్పడానికయినా ఇష్టపడరు.
    
    అబ్బాయిలు యిలాంటి అవకాశాల కోసమే టీవీ షోలను ఏర్పాటు చేస్తుంటారని వంశీ ఎప్పుడో చెప్పగా విన్నది. అందువల్లే అంత కరెక్టుగా ఊహించింది. మరి తమ ఫస్ట్ నైట్ ఎక్కడ జరుగుతుందో మాత్రం ఊహించలేకపోయింది.
    
    తొమ్మిదైంది.
    
    వైర్లకు కనెక్షన్ లు ఇస్తూ వంశీ సుజనవేపు చూసి రెడీనా అన్నట్లు కన్ను గీటాడు. రెడీ అన్నట్లు ఆమె కూడా తల ఎగరేసింది.
    
    సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ టీవీ ముందుగా ఒకవేపు వేసిన కుర్చీల్లో కూర్చున్నారు.
    
    సుజనను రమ్మని పిలిచారు.
    
    "నేను అక్కడికి వద్దులే నాన్నా! లవకుశ బోర్ సినిమా. షెనర్జ్ నెగ్గర్ సినిమానో, సిల్వెస్టర్ స్టాలోన్ సినిమానో అయితే ఫవరాలేదు గానీ వినీ వినీ విసిగిపోయిన రామాయణాన్ని ఎవరు చూస్తారు? ఆయనగారు తగుదునమ్మా అని పందెంలో గెలిచి ఈ డొక్కు సినిమా చూపిస్తున్నారు. నేను చూడలేను బాబూ లోపలికెళ్ళి పడుకుంటాను. పదినిమిషాలో, పావుగంటో వెనకాల  ఛెయిర్ వేసుకుని కూర్చుంటాను. ముందు కూర్చుంటే జనాన్ని తప్పించుకుని రావడం కష్టం" అతికినట్లు అబద్దాలాడడం అంటే ఇదే కాబోలు మనసులో అనుకుంది.
    
    "అలానే" అన్నాడు సత్యనారాయణ.
    
    అప్పటికి ఉమకు డౌట్ వచ్చి దొడ్డి తలుపును లాక్ చేసి తాళం చెవిని బొడ్లో దోపుకొచ్చింది. వంశీ వస్తే ఆ దారినే వస్తాడని ఆమె నమ్మకం.
    
    వంశీ క్యాసెట్ ప్లే చేశాడు.
    
    తొలుత ఏవో అడ్వర్టయిజ్ మెంట్లు రావడం ప్రారంభించాయి. జనం అంతా సర్దుకు కూర్చున్నారు.
    
    "నే వస్తాను మావయ్యా! ఇంకా భోజనం కూడా చేయలేదు. ఉట్లు కొట్టి ఒళ్ళంతా ఒకటే నొప్పులు వేడినీళ్ళ స్నానంచేసి పడుకుంటాను. ఈ స్సినిమా దాదాపు మూడుగంటలుంటుంది. పన్నెండు గంటల ప్రాంతాన వస్తాను" అని చెప్పి అక్కడి నుంచి బయటికొచ్చాడు వంశీ.    
    
    జనమంతా వ్యాపార ప్రకటనలను విసుగ్గా చూస్తున్నారు. వంశీ ఓ ఐదు నిముషాలపాటు అక్కడే తారట్లాడి జనం వెనగ్గా నడుస్తూ సుజన దగ్గరికి వచ్చాడు.
    
    టీ.వీ. చూస్తున్న ఆమె నడుంపై చేయి వేశాడు.
    
    వెనక్కి తిరిగిచూసింది.
    
    ఇక వెళదాం రమ్మన్నట్లు ఎయిర్ ఇండియా మహారాజులా స్వాగతం చెప్పాడు.
    
    ఇద్దరూ బయట పడ్డారు. వీధంతా నిర్మానుష్యంగా వుంది. ఇళ్ళలోని జనమంతా టీవీ దగ్గరికి వచ్చేస్తే ఇక వీధుల్లో ఎవరుంటారు? మిగిలిన ముసలీ ముతకా సినిమాకు వెళ్ళక అప్పటికే పడుకుండిపోయారు.
    
    ఆకాశంలో చుక్కల కాంతి తప్ప మరో వెలుగులేదు. వీధిలో రెండు కుక్కలు మాత్రం పరాచికాలు ఆడుకుంటున్నాయి.
    
    "ఓ మూడుగంటల పాటు మనం ఎక్కడో వెతుక్కోరు. ఈ టైమ్ లో మన శోభనం జామ్ జామ్ మని ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది" వంశీ మబ్బుల్లో తేలిపోతూ చెప్పాడు.
    
    "ఇంతకీ ఎక్కడ?"
    
    "స్కూల్లో"
    
    "స్కూల్లోనా!" ఆశ్చర్యపోయింది.
    
    "ఆఁ చిన్నప్పుడు చదువు నేర్చుకున్నాం. ఇప్పుడు సరసం నేర్చుకోబోతున్నాం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS