'ఎందుకు రారు చినబాబు గారూ! మీకేం తక్కువని? మీకున్న పేరు ప్రతిష్టలు , పలుకుబడి , హోదా అన్నింటినీ మించిన లక్ష్జ్మీ ప్రసంనత్వం ' అని ఒక్క క్షణం అలోచించి 'ఆ.....నాకు ఒక చక్కని ఉపాయం తోస్తూ ఉంది. రవీంద్ర భారతి లో సన్మానం జరిగిన తర్వాత ఒక మంచి రోజు చూసి మీరు కూడా మన యింటి ముందున్న తోటలో సన్మానం ఏర్పాటు చేయండి. సన్మానాలంటే రచయితలకు , రచయిత్రులకు ఎక్కడ లేని అభిమానము, పిచ్చి. అప్పుడు అమ్మగారి కోరిక మీ బాధ్యత రెండూ నెరవేరుతాయి!'
'చక్కని ఉపాయం శారదా! డానికి ప్లాను తర్వాత ఆలోచిద్దాం. ' శారదతో అని తల్లిని చూస్తూ 'ఆ ఏర్పాట్లు తర్వాత చేద్దాము. ఇప్పుడు మాత్రం నీవు సభకు తప్పకుండా రావాలి.' పట్టుదలతో అన్నాడు ప్రభాకరం.
అంతగా బలవంతం చేస్తున్న తన కుమారుని మాట తీసి వేయలేక ఒప్పుకున్నారు అన్నపూర్ణమ్మ గారు.
'అమ్మయ్య! అమ్మ ఒప్పుకుంది' అని హాయిగా నిట్టూర్చాడు ప్రభాకరం.
అంతలో నీరజ వచ్చింది. వేరుగా వంటింట్లో కి వస్తూ అక్కడ ప్రభాకరాన్ని చూసి 'ఏం బావా అత్తయ్య దగ్గర, అక్కయ్య దగ్గర వంట నేర్చు కుంటున్నావా?' అని చిలిపిగా ప్రశ్నించింది.
నీరజ ప్రశ్నకు అంతా నవ్వారు. నీరజ కూడా వారి నవ్వులో శృతి కలిపింది.
'అమ్మా....! నీరజ బాగా మాటలు నేర్చింది. ఇక త్వరగా ఎవర్నైనా చూసి ముడి పెట్టెయ్యాలి.' నీరజను చిలిపిగా చూస్తూ అన్నాడు ప్రభాకరం.
'ఫో బావా! నీకెప్పుడూ వేళాకోళమే....?' అంది నీరజ సిగ్గుపడుతూ.
'నీవు మాత్రం తక్కువ తిన్నావటే........!వాణ్ణి ఉడికించడం లేదూ.......?' అన్నారు అన్నపూర్ణమ్మ గారు చిరునవ్వుతో.
'అమ్మా.......! నేను హాలులో ఉంటాను త్వరగా తెమిలి వచ్చేయ్! అన్నాడు ప్రభాకరం హాలు లోపలికి వెడుతూ.
'అమ్మగారూ! మీరు వెళ్ళండి. నేను మిగిలిన పని పూర్తీ చేస్తాను.' అంది శారద.'
'అదేమిటక్కా....? నీవు రావా?' ప్రశ్నించింది నీరజ.
'ఒకవేళ వస్తే సభా ప్రారంభ సమయానికి వస్తాను.' అంది శారద.
'సరదాగా అందరమూ కలిసి వెడదాం నీవు కూడా రా అక్కయ్యా.......!'
'పని మిగిలి పోయిందమ్మా.........పూర్తీ చేసి ఆ తర్వాత వస్తాను. ముందుగా మీరు వెళ్ళండి.' అంది శారద.
'అలాగే తల్లీ.! ఏదో నీవు నాకు సాయం ఉండబట్టి గాని లేకపోతె నేను ఎంత యిబ్బంది పదేదాన్నో.....?' అని అన్నపూర్ణమ్మ గారు దుస్తులు మార్చుకోవడానికి వెళ్ళారు.
సరీగా ఐదు గంటలకు అంతా తయారై రవీంద్ర భారతి కి కారులు బయలుదేరారు------
* * * *
సరీగా ఆరు గంటలకు భగద్గీత శ్లోకాల పఠనంతో సభ ప్రారంభ మైంది. వేదిక పైకి ప్రముఖులందరి నీ ఆహ్వానించాడు కార్యకర్త. ప్రముఖుల మధ్య ముఖ్యమంత్రి గారు సతీసమేతంగా వేదిక పై ఆసీనులయ్యారు.
'ఇప్పుడు కుమారి జ్యోత్స్న గారిని వేదిక పైకి రావలసింది గా అభ్యర్దిస్తున్నాము' ప్రముఖులందరినీ ఆహ్వానించిన కార్యకర్తే రచయిత్రి ని కూడా వేదిక పైకి ఆహ్వానించాడు.
ముందు వరుసలో కూర్చున్న శారద వేదిక పైకి వెళ్లి తన కోసమని నిర్దేశించబడిన కుర్చీలో కూర్చుంది. ఆమెను చూసిన ప్రభాకరం, రామం, ప్రసాదు, శ్రీపతి గారు, అన్నపూర్ణమ్మ గారు, నీరజ వీరంతా ఒక్కసారి నిశ్చేష్టులయ్యారు. ప్రభాకరం పూర్తిగా అయోమయావస్తలో పడ్డాడు. అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ మౌనంగా కళ్ళతోటే మాట్లాడుకుంటూ సంభ్రమాశ్చర్యలలో మునిగి పోయారు.
ఒక ప్రముఖ రచయిత రచయిత్రిని సభికులకు క్లుప్తంగా పరిచయం చేశారు. పరిచయ వాక్యాలు ముసిగిన తర్వాత ముఖ్య మంత్రి గారు కుమారి శారద ను ఎంతగానో శ్లాఘిస్తూ , ఇటువంటి రచయితలు, రచయిత్రులు ప్రస్తుతం ఎంతో అవసరమనీ, మన జాతి, మతం పతనం కాకుండా చూడవలసిన బాధ్యత యువతరం వారి పైన ఉందనీ, అందుకు తగిన విధంగా ఛి. కుమారి శారద తన రచనలలో ఆంధ్ర ప్రజల అడరాభిమానాలను చూరగోన్నదని, సంఘ ఆచార వ్యవహారాలలో , కట్టుబాట్లలో రాతగిన మార్పును తీసుకు రావడానికి తన శాయశక్తు లా ప్రయత్నం చేసిందనీ, ఆమె చేసిన కృషి కి అంతా గర్వించాలనీ, మన సోదరి యైన శారద ను ద్విగుణీకృతం గా ప్రోత్సహిస్తే భవిష్యత్తు లో యింకా రెట్టింపు కృషి జరుపగలదనీ సభికుల నుద్దేశించి ప్రసంగిస్తూ తమ ఉపన్యాసాన్ని ముగించారు;
సభికుల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగి నిశ్శబ్ధమై పోయింది.
ఆ తర్వాత రచయిత్రిని అభినందిస్తూ పలువురు ప్రముఖులు ఉపన్యాసాలిచ్చారు.
ఇదంతా చూస్తున్న ప్రభాకరం అది కలో నిజమో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడసాగాడు. 'ఏమిటిది? శారద, జ్యోత్స్న నా? ఆమె అంత గొప్ప రచనలు ఎలా చేయగలిగిందో? ఎప్పుడూ క్లాసు పుస్తకాలే చదువుతూ ఉండే ఆమెకు తదితర సాహిత్య గ్రంధాలు చదివే తీరిక ఎలా కలిగిందో? ఎంతగానో గ్రంధ పఠనం చేసి వ్రాసిన రచనలని వాటిని చదివిన మరుక్షణ మే అర్ధమౌతుంది. అబ్బ! ఎంత కృష్టి చేసింది? పైగా ఎంత చిలిపి తనమో? 'జ్యోత్స్న' పేరుతొ వెలువడే రచనలు తనవే నని మాట మాత్రం గానైనా చెప్పలేదు. ఈరోజు సాయంత్రం ఆమె ధోరణి వింతగానే కనుపించింది. శారద! శారద! ఆరోజు ట్రైను లో అనాధ బాలికగా పరిచయమైన అమ్మాయి యింత గొప్ప వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంది. నిజంగా ఆమె సంస్కార హృదయాన్ని ఎంతగానో మెచ్చుకోవాలి. నిరాడంబర జీవి, నిగర్వి, నిత్య సంతోషి, తనకు ద్రోహాన్ని తలపెట్టిన వారిని కూడా సునాయాసంగా క్షమించగల ఆమె ఔదార్యం హిమ శిఖర మంత ఉన్నత మైనది. పాలకడలిలా స్వచ్చమైనది. ఎన్నో కష్టాలను, యిబ్బందులను ఎదుర్కుంటూ కూడా తన ద్వేయాన్ని కోనసాగించింది. పతాక స్థాయి నందుకుంది. మనిషిగా జన్మించిన ప్రతి ఒకడూ ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో నైనా తన దేశ ఆచార వ్యవహారాలను సంస్కృతిక సంప్రదాయాలను విస్మరించ కూడదని ఆమె వ్రాసిన ఒక వాక్యం లోని సారంశము గుర్తుకు వస్తూ ఉంది. వోహ్! ఆమె చరితార్ధజీవి. ఇంత పిన్ని వయసు లోనే గొప్ప రచయిత్రి గా పేరు తెచ్చుకుంది' అని ఆలోచిస్తున్న ప్రభాకరానికి హాలులో పెద్దగా కరతాళధ్వని వినిపించి బాహ్య స్మృతిని కలిగించింది. ఆ తర్వాత కుమారి శారద కు సన్మానం జరుగుతూన్న దృశ్యం అతని కంట పడింది. అతని హృదయం ఆనందంతో పొంగి పోయింది. 'ఇంతగొప్ప రచయిత్రి కి నేను సన్నిహితుడను' అనే భావం కలగడం వల్ల అతని హృదయం లో గర్వం పెల్లుబికింది.
సభ జయప్రదంగా ముగిసింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోసాగారు. పత్రికా విలేఖరులు శారద ను తమకు కొద్ది సేపు యింటర్వ్యూ యివ్వవలసిందిగా కోరారు. ఆమె ఒప్పుకుంది.
శ్రీపతి గారు, ప్రభాకరం , నీరజ, అన్నపూర్ణమ్మ గారు, వీరంతా వెళ్ళకుండా శారదను తమతో తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడే కూర్చున్నారు. శారద వీరి నందరినీ సభకు హాజరయిన ప్రముఖులందరికీ పరిచాయం చేసింది. ఆ తర్వాత పత్రికా విలేఖరులతో గోష్టి ప్రారంభమైంది.
'మీరెంత వరకు చదువు కున్నారు?' ఒక విలేఖరి ప్రశ్నించాడు.
'బి.ఇడి ట్రైనింగు పరీక్షలు వ్రాశాను' సమాధాన మిచ్చింది శారద.
'మన సంస్కృతీ సభ్యతలను సమర్ధిస్తూ రచనలు సాగినచాలనే కుతూహలం కలగడానికి కారణాలేమిటి?' మరొకరి ప్రశ్న.
'ఏమున్నాయి? నానాటికీ హీనస్థితికి దిగజారిపోతున్న మన సభ్యతా సంస్కారాలను చూడలేక వాటిని కొంతలో కొంతైనా పునరుద్దరించాలనే ఉద్దేశంతో ఈ విధమైన రచనలు ప్రారంభించాను.'
'అంతేనా? లేక వేరే కారణా లింకేమైనా ఉన్నాయా?'
'ఉన్నా వ్యక్తిగతమైనవి అవి' అని ప్రభాకరాన్ని చిరునవ్వుతో చూసింది శారద.
ఆ చూపుల భావాన్ని గ్రహించిన ప్రభాకరం పెదిమల పై కూడా చిరునవ్వు లాస్యం చేసింది.
'మీ అభిరుచు లేమిటో చెబుతారా?' మరొకరి ప్రశ్న.
'సాహిత్య పఠనం, రచన.'
'థాంక్స్ . వెళ్ళొస్తాం!' అని ప్రెస్ రిపోర్టర్స్ శారద వద్ద శలవు తీసుకొని వెళ్లి పోయారు. వారంతా వెళ్ళిపోయిన తర్వాత 'అమ్మా శారదా! పద యింటికి వెడదాం' అన్నారు శ్రీపతి గారు. అంతా హాలు దాటి కారు వైపు నడిచారు. వారిని మౌనంగా అనుసరించింది శారద.
* * * *
రవీంద్రభారతి నుండి తిరిగి వచ్చే సరికి రాత్రి ఎనిమిది దాటింది. రాగానే భోజనాలు చేశారంతా. భోజనాలు పూర్తయ్యాక అందరినీ హాలులో సమావేశ పరచాడు ప్రభాకరం. వీరంతా హాలులో సమావేశ మయ్యే సరికి అనుకోకుండా సుందరరామయ్య గారు కూడా వచ్చారు.
"ఏం అన్నయ్యా? మేము యింత కాలానికి గుర్తోచ్చామా?' చిరునవ్వుతో సుందరరామయ్య గారిని చూస్తూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు.
'అమ్మాయి రెండు మూడు రోజుల కొకమారు వచ్చి వెడుతూనే ఉంది కదమ్మా! నాకు రోజురోజు కి వోపిక తగ్గిపోతూ ఉంది. మందుల ప్రభావం వల్ల రోగం అణిచి పెట్టబడుతూ ఉంది.'
'అవేం మాటలయ్యా? నాకంటే చిన్నవాడివి. అంత నిరుత్సాహంగా మాట్లాడుతావేం.' సుందరరామయ్య గారి ముఖంలోకి నిశితంగా చూస్తూ ప్రశ్నించారు శ్రీపతి గారు.
"ఏం చెయ్యమంటారండి బావగారూ? నేను శారీరకంగా మానసికంగా ఎంతో కృంగి పోతున్నాను. వారి మాటలలో నిరాశ నిస్పృహలు ప్రస్పుటమౌతూ ఉన్నాయి.
'అన్నయ్యా! తర్వాత మాట్లాడు కుందురు గాని ముందు భోజనం చేద్దువు గాని రా......!'
'లేదమ్మా భోజనం చేసే వచ్చాను' అని ప్రసాద్ వైపు రామం వైపు ప్రశ్నార్ధకంగా చూడసాగారు సుందర రామయ్య గారు.
