"అబ్బ! నువ్వే గెలిచావురా కడకు" అంటూనే స్పృహ తప్పిపోతున్న అతడిని ధర్మారావు ఈదుతూ అతి శ్రమతో తనతో పాటు లాక్కు వస్తున్నాడు.
అప్పటికి కార్లు రెండూ గట్టు మీదికి వచ్చాయి. సంగతంతా వెంటనే గ్రహించిన గౌతమ్, బలరాం గబగబా నదిలోకి దూకి , ధర్మారావు కు శ్రమ తప్పించారు. సుయోధన్ పెద్ద శరీరాన్ని ఆ ఇద్దరూ గట్టుకు చేర్చారు. ధర్మారావు ను దైవాన్ని చూచినట్టే చూచారు అందరూ. మిత్రా ప్రశంసా పూర్వకంగా వీపు నిమిరాడు.
గౌతమ్, ధర్మారావు ఒక్క నిమిషం ఒకరి నొకరు స్వేచ్చగా, కండ్ల లో ఎన్నో భావాలతో మదిలో అనేక ఆలోచనలతో ప్రేమ పొంగి స్రవిస్తుండగా సర్వ ప్రపంచాన్ని మరిచి చూచు కున్నారు. నిజంగా అది ఒక అపూర్వ సన్నివేశం.
"నాన్నగారూ!' దుఃఖ, ఆనంద బాష్పాలు మిళితమై ప్రవహించగా గౌతమ్ పాదాలపై వాలిపోయాడు ధర్మారావు.
"బాబూ!' కన్నీటి తో అతడిని లేవదీసి గుండె లకు హత్తుకున్నాడు గౌతమ్. "ఈ పిలుపు కోసం, ఈ స్పర్శ కోసం ఎన్నేళ్ళుగా జైలు గోడల మధ్య కుమిలి కుమిలి ఏడ్చానో, బాబూ? ఇంత కాలానికి ఆ దైవం కటాక్షించాడు."
నారాయణ్ శర్మ కలగజేసుకున్నాడు. "బహు కాలానికి కలుసుకున్నారు. ఈ మాటలు ఇప్పట్లో తరగవు. నడవండి. రాజ్యలక్ష్మీ గారెలా ఉన్నారో అక్కడ!"
"శర్మా!' ఆవేశంతో అతడి చేతులు పట్టుకున్నాడు గౌతమ్. "నిన్ను నీవు విస్మరించి నా పుత్రుణ్ణి ప్రయోజకుడుగా చేశావు, నీ ఋణం ఎలా తీర్చుకోను?"
వేదాంతి లా నవ్వాడు శర్మ. "గౌతమ్! నీ పుత్రుడు కాడు, నా శిష్యుడు కాడు భారతమాత అనుంగు పుత్రుడు! ధర్మ చక్రాధి పతి! అంతే. అతడిని చూచుకొని గర్వించని వారెవరు?"
"రండి, రండి." అర్జున్ త్వర పెట్టాడు.
అందరూ తేరుకొని అటు చూచేసరికి సుయోధన్ శరీరాన్ని బలరాం, అతని అనుయాయులూ, కారులో తీసుకు పోతున్నారు. సత్య, మిత్రా కూడా అందులోనే ఉన్నారు. మిగిలిన అందరూ జీప్ ఎక్కి త్వరత్వరగా ముందు కారును అనుసరించారు.
అతి ప్రయాస పై డాక్టర్లు ప్రత్యెక ప్రయత్నాలతో సుయోధన్ కు స్పృహ , మాట తెప్పించ గలిగారు.
"ఇక ఇరవై నిమిషాల కంటే ఎక్కువగా నిలవదు అతడి ప్రాణం. అతడితో మీ వ్యవహార మంతా ఈ లోపు గానే తీర్చుకోండి" అన్నాడు సర్జన్.
అతికష్టంతో మాట్లాడుతున్న సుయోధన్ మరణ వాజ్మూల మంతా రికార్డు చేయటానికి రికార్డర్ సిద్దంగా ఉంచారు.
"నేను నిజంగా ద్రోహినే. నాకీ శాస్తి తగినదే. నన్ను నేను మరిచి, నీతీ న్యాయాలను విస్మరించి ఎన్నో పాపాలు చేశాను. ఐశ్వర్యము, అధికారమే ప్రధాన మనుకున్నాను. కాని గౌతమ్, రాజ్యలక్ష్మీ, ధర్మారావు నిస్స్వర్ధమూర్తులై నా కనులు తెరిపించారు."
మిత్రా కఠినంగా హెచ్చరించాడు. "అధికంగా మాటలు వద్దు, సుయోధన్! త్వరగా అసలు విషయం చెప్పు. చచ్చేముందైనా సత్యం చెప్పి,సద్గతులు పొందు."
"చెబుతాను , మిత్రా." వైరాగ్యంతో నవ్వాడు సుయోధన్. "న్యాయ ధర్మాల కోసం ఆత్మీయులను సైతం పరాయి వారుగా తృణీకరించ గల మీ అందరి ముందూ నేనంత అల్పుడినో ఇప్పుడు బాగా గ్రహించాను.
"ఆనాడు స్వర్ణ గంగా డాం ను కాపలా కాస్తూ నేను చాలా విద్రోహమే తలపెట్టాను. నిజానికి నైట్ పెట్రోల్ నారాయణ్ శర్మ ఏ వార్తా తేలేదు. నేనే వేరే పని పురమాయించి అతడిని పంపేశాను. ఆ రాత్రి శత్రు సైన్యాధిపతి కి మన దేశ రహస్య పత్రాలు అందించింతే అతడు నాకు లక్షలు చేసే వజ్రాలు, రత్నాలు ఇవ్వడానికి ఒప్పంద మయింది. అందుకే గౌతమ్ ను కూడా అడ్డు తొలగించుకోవడానికి డైన మైట్ పేల్చే మిష మీద పంపి వేశాను. కాని గౌతమ్ యుద్ద భూమి లో ఎవరినీ నమ్మడు. పైగా అతడూ, నారాయణ్ శర్మా స్నేహితులు. వాళ్ళు నన్ను రహస్యంగా వెంటాడినట్లున్నారు. సరిగా రికార్డు అందజేస్తున్న సమయానికి ఇద్దరూ రంగంలోకి వచ్చారు. నేను నా పధకం సాగలేదనే క్రోధంతో రెచ్చిపోయాను. ఎవ్వరికీ పట్టుబడకుండా రికార్డు ను నదిలోకి విసిరేశాను. పట్టు కోవచ్చిన విష్ణు నారాయణ్ శర్మ ను గాయపరిచి, ఆ నదిలోకే తోసేసి పారిపోయాడని చెప్పాను. స్పృహ తప్పిన స్థితిలో అతడు మూడు రోజుల అనంతరం ఎక్కడో, ఎవరో పల్లె వారికీ చిక్కి రక్షించబడ్డాడనీ ,అతడు కోలుకొనే సరికి ఇక్కడ అంతా అయిపోయినట్టు తెలిసి ఏమీ చేయలేక అనాధశ్రమం స్థాపించాడని ఇటీవల తెలిసింది నాకు. అప్పుడే తెలిస్తే అతడినీ బతకనిచ్చే వాడిని కాదు.
"తర్వాత సమరం లో స్వర్ణ గంగా డాం ను పేల్చి వేసి , శత్రువుల బారినుండి రక్షించింది నేనే అని బ్రిటీష్ ప్రభుత్వం నన్ను గౌరవించింది. కాని నిజంగా పేల్చింది గౌతమే. ప్రజా, అధికారులు నమ్మినా, నమ్మక పోయినా, దేశ రక్షణే తన కర్తవ్యంగా అతడు భావించాడు; అందుకే శిక్ష అధికం కాగలదనీ, తనపై నేరం దృవ పడగలదనీ తెలిసి కూడా అతడు జైలు నుంచి పారిపోయి వచ్చి , నాకు తెలియకుండా , ఎవరికీ తెలియకుండా అవసర సమయంలో డైన మైట్ తో డాం ను పేల్చి వేశాడు. తిరిగి తనకు తానే అక్కడే పట్టుబడి పోయేవరకు నేనుఅసలు రహస్యం గ్రహించక తికమక పడ్డాను. ఆనాడు అతడే డాం ను పెల్చక పొతే దేశాన్ని నేను శత్రు పరం చేసిఉందును; విజయం మనకు దక్కక పోను.
"సరే. మిగిలిన విషయాలన్నీ మీకే తెలుసు. దొంగ నోట్లు, దొంగ బంగారం వర్తకాలెన్నో ఉన్నాయి నాకు, విదేశీయులతో చేసేవి. ఆ ధనమంతా , ఆ రహస్యాలన్నీ మీరు చూచిన ఆ భవనం అడుగున భూగృహం లో ఉన్నాయి. ఊ! ఇక నా పని అయిపొయింది. ధర్మరావ్! కడకు గతరాత్రి నిన్ను చంపించాలని కూడా చూశాను. ఆకోపం మనస్సులో పెట్టుకోకు. సత్య కి వేమీ తెలియవు. అమాయకురాలు. గౌతమ్! నిన్నూ, నీ కుమారుడి నీ వేరు చేసిన పాపం నన్ను శాశ్వతంగా నా కూతురు కి దూరం చేసేస్తున్నది . అమ్మా.....సత్యా....' ఇంకా ఏమేమో చెప్పబోయిన సుయోధన్ మరి మాటలు రాక సత్యను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు కార్చాడు. ఒక్కసారి చుట్టూ అందరినీ చూచాడు. అంతే. అతడి కళ్ళు మూతలు పడి పోయాయి. ప్రాణం ఎగిరి పోయింది!
ఎంతైనా సొంత సోదరుడు. మిత్రా కనులు చేమరించాయి. ఉత్తమ హృదయుడైన గౌతమ్ కనుల నిండా జాలీ, సానుభూతీ! విషయం తెలిసి వచ్చిన సుమిత్ర , తండ్రి శవం వద్ద రోదిస్తున్న సత్యను ఒదార్చ లేకపోయింది.
ధర్మారావు మెల్లగా ఆమె వద్దకు నడిచి తల నిమురుతూ , "సత్యా!" అన్నాడు. మెల్లగా తలెత్తి చూచిన సత్య కనులలో, వదనం లో అతడికే భావమూ ద్యోతకం కాలేదు.
"విచారించకు. సత్యా. క్షమించు. కేవలం మా కర్తవ్యమ్ మాత్రమే మేము నిర్వహించాము."
శోకోద్వేగం లో ఉన్న సత్యకు మాటలు కరువై కన్నీరదికమయింది. తిరిగి ధర్మారావే అన్నాడు మెల్లగా" "ఇటువంటి ఉత్తర దక్షిణ ధ్రువాల సంతానం కావడం మన దురదృష్టం."
"కాదు" కన్నీరు తుడుచుకుని స్థిరంగా అన్నది సత్య. "కోపాలూ, క్షమార్పణ లూ లేవు. జరిగింది ధర్మాధర్మాల మధ్య సమరం. ఇందువల్ల మన వ్యక్తిగత స్నేహం ఏమీ కాదు."
"అవును" ఆమెను సమర్ధించాడు మిత్రా.
"నీ మనస్సు నాకు తెలుసు తల్లీ. "గౌతమ్ హృదయ పూర్వకంగా అన్నాడు సత్యను.
