Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 40


    ఆకాశ మర్గాన ఒక పావుగంట పయనించిన తర్వాత నేల మీద పరుగిడుతున్న పోలీస్ జీపు కనిపించింది, హెలికాప్టర్ లో వారికి.
    "అయితే ఈ జీప్ ఎదరే ఎక్కడో కారో ఉంటుంది" అన్నారు అర్జున్, మిత్రా.
    బలరాం నవ్వాడు. "లేదు. ఉండదు. సుయోధన్ వంటి వాడు పోలీసులకు ముందు నడవదు. వారికి తప్పుడు తోవ చూపుతాడు."
    అతడి మాట నిజమే అయింది! పది నిమిషాల అనంతరం కొండల చాటున మిట్ట పల్లాల మీదుగా, అడ్డ దారులలో రాళ్ళూ రప్పల మీది నుండి పోతున్న సుయోధన్ కారు కనిపించింది బైనాక్యూలర్ లో. జాగ్రత్తగా దానిని దృష్టి పధం లో నుండి తప్పిపోనివ్వ కుండా హెలికాప్టర్ ను చాకచక్యంగా నడపసాగాడు బలరాం.
    కారు తిరిగి తిరిగి ఒక పాడుపడిన కోటలో ప్రవేశించింది. కారు దిగిన సుయోధన్ , సత్యను కారు నుండి దింపి బరబరా లోపలికి ఈడ్చుకు పోవడం స్పష్టంగా కనిపించింది బలరాం ప్రభ్రుతూలకు.
    "కన్న కుమార్తె దగ్గర కూడా కరుకుతనమే!" అన్నాడు మిత్రా.
    "అందరూ పిస్టల్ తో రెడీగా ఉండండి." అని హెచ్చరిస్తూ ఆ ఆవరణ లో దింపాడు  బలరాం హెలికాప్టర్ ను.
    అందరూ జాగ్రత్తగా పిస్టల్ గురిపెట్టుకుంటూ, సవ్వడి చెయ్యకుండా దిగారు. కాని ఆ భవనం తలుపులన్నీ మూసి ఉండి, బహుకాలం నుండి పాడు బడినట్లు ఉంది.
    "ఇద్దరు ఇక్కడే ఉండండి" అని ఇద్దరు పోలీసులను గేటు దగ్గర ఉంచి, మిగిలిన అందరూ భవనం చుట్టూ తిరిగి వచ్చారు. ఎక్కడా పైకి చేరడానికి చిన్న మార్గమైనా ఉన్నట్లు కనిపించలేదు.
    "ఇక హెలికాప్టరే గతి. భవనం పై భాగానికి చేరుకుంటే లోపల ప్రవేశించడానికి మార్గం దొరకవచ్చు" అన్నాడు ధర్మారావు.
    "అవును . చక్కటి ఉపాయం." అన్నాడు బలరాం తిరిగి అందులో ప్రవేశిస్తూ.
    "మార్గమైనా దొరకవచ్చు. లేదా మన ప్రాణాలైనా పోవచ్చు" అన్న అర్జున్ మాటలకు అందరూ చిన్నగా నవ్వుతూ తిరిగి హెలికాప్టర్ లో ప్రవేశించారు.
    భవనం అగ్ర భాగం చేరుకున్న హెలికాప్టర్ ను సాధ్యమైనంత తక్కువ ధ్వనితో ఆపి, అందరూ దిగి చుట్టూ పరిశీలించారు. ఆశించినట్లే, లోపలికి మెట్టదారి కనిపించింది. "జాగ్రత్త" అని హెచ్చరిస్తూ పిస్టలు గురి పెట్టుకుంటూ ముందు బలరాం ప్రవేశించాడు. అక్కడ ఒక అనుచరుణ్ణి కాపలా కు నియమించాడు. తక్కిన  అందరూ కూడా బలరాం ను అనుసరించారు.
    ఎక్కడా మనుషులు నివసిస్తున్నట్లే లేదు. నిండా గబ్బిలాలు, సాలె గూళ్ళు. ఆ అంతస్తంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా మలుపులు తిరిగి వెదకగా వెదకగా , చివరికి మరో మెట్ల వరస కనిపించింది. అంతా చీకటి గా ఉంది. ఆ దోవ గుండా నిశ్శబ్దంగా దిగి వెళ్ళిన వారికీ భయానక దృశ్యం కనిపించింది. హాలులో రెండు రాతి స్తంభాలకు గౌతమ్, నారాయణ్ శర్మ బలమైన తాళ్ళ తో కట్టి వేయబడి ఉన్నారు. జైలు వార్డెన్ రాదాయ్ మరో నలుగురు మనుష్యులూ కలిసి ఆ ఇద్దరినీ ఏమిటో చెప్పమని బలవంతం చేస్తున్నారు -- బాకులూ, మండుతున్న కాగడాలూ చూపి భయపెడుతూ.
    సత్యతో అతి ఆగ్రహంగా మాట్లాడుతున్నాడు సుయోధన్. "రికార్దర్ నువ్వే వాళ్ళ కిచ్చావు. నువ్వా ధర్మారావు ను ప్రేమించావు. వాళ్ళూ, నువ్వూ కలిసి నన్ను దగా చేస్తున్నారు. అవునా?"
    తలవాల్చే సమాధానం చెప్పింది సత్య : "నేనివ్వలేదు. ఇంత జరిగాక అబద్ద మాదవలసిన అగత్యం లేదు. పాపిష్టిడాన్ని-- ప్రేమించడమే గాని అతడికి సాయం చెయ్యలేక పోయాను. మూర్ఖురాలు లాగా నువ్వు చెప్పిన వన్నీ నిజమని నమ్మాను, తండ్రివని."
    "దుర్మార్గురాలా. నీకు కన్నతండ్రి కంటే పరాయివాళ్ళేక్కువయ్యారా?"    
    సత్య మాట్లాడలేదు.    
    పౌరుషంతో ఉరకబోతున్న ధర్మారావు ను అర్జున్ బలవంతంగా అపు చేశాడు.
    "ఆమె ఇవ్వలేదు, సుయోధన్. నేనూ, రాజ్యలక్ష్మీ అపహరించాము." అంటున్న నారాయణ్ శర్మ ను రాదాయ్ చెంప చెళ్ళు మనిపించాడు -- "నువ్వు నోర్మూయ్" అంటూ.
    "మాట్లాడవేం?' గద్దించాడు సుయోధన్, కూతురిని. "ఇకనైనా బుద్దిగా నేను చెప్పినట్లు వింటావా?"
    తలెత్తి చూచిన సత్య నేత్రాలలో అసహ్యం ప్రదర్శిత మయింది. "ఛీ! ఇంకా నువ్వు చెప్పినట్లు వినదమా? నువ్వు తండ్రివా? నిన్ను 'నాన్న' అంటేనే మహాపాపం. నీతి న్యాయాలకు దూరమైన ఎవరూ నావారు కాదు. నీ కడుపున పుట్టినందు కే సిగ్గుపడుతున్నాను."
    ఒళ్ళు మరిచిన కోపంతో సుయోధన్, కుమార్తె మీద ఉన్న ప్రేమ అంతా మరిచి, చెళ్ళున కొట్టాడు. ఆ ఒక్క దెబ్బ కే సుకుమారి అయిన సత్య స్పృహ తప్పిపోయింది.

 

                         
    బిలబిలా వచ్చి హటాత్తుగా తమను చుట్టూ ముట్టిన వారిని చూచి క్షణం పాటు నిశ్చేష్టులయ్యారు. సుయోధన్, రాదాయ్ ప్రభ్రుతులు. కానీ వారూ సాయుధులై ఉండడంతో నిర్భయంగా చూచారు శత్రువుల వైపు.
    "మిత్రా!నువ్వూ శత్రువుల లో చేరావా?" తమ్ముడి నడిగాడు సుయోధన్, తల పంకిస్తూ.
    చీత్కరించాడు మిత్రా. 'అగ్రజుడవనడానికి కూడా మనస్కరించడం లేదు. నువ్వింత దుర్మార్గుడివని ఎప్పుడూ అనుకోలేదే! ఛీ."
    "బలరాం ! ఘటికుడివిరా! నిన్నేనేను కనిపెట్ట లేకపోయాను." అన్నాడు రాదాయ్ , డిటెక్టివ్ బలరాం ను చూస్తూ.
    బలరాం చాలా కోపంగా ఉన్నాడు. "మాటలతో పని కాదు, సుయోధన్! ఎటూ నువ్వు మాకు లోంగిపోక తప్పదు. తెలివి తక్కువ అర్బాటాలు, చేయక సవ్యంగా లొంగిపోతే , ప్రభుత్వం ఏమైనా కనికరించే అవకాశం ఉంటుంది."
    ఇంకా అతడి మాటలు  పూర్తీ కాకుండానే రాదాయ్ చేతిలోని మండుతున్న కాగడా విసిరేయడంతో వల్ల చెల్లాచెదరై పోయింది. ఆ మంచి అదను లో సుయోధన్ ఒక్క అంగలో దాటిపోయాడు, మెట్ల దగ్గర కాపలా ఉన్నవాడిని ఒక్క తోపులో కింద పడవేసి.
    వెంటనే బలరాం, ధర్మారావు అతడిని వెన్నంటారు. మిగిలిన స్పెషల్ పోలీసులకూ, రాదాయ్ ప్రభ్రుతూలకూ ఘోర ఘర్షణ జరుగుతుంటే , బందితులైన గౌతమ్, నారాయణ్ శర్మ నిస్సహాయంగా చూడసాగారు.
    ఆలోచించిన నారాయణ్ శర్మ తన కాలికందుబాటులో ఉన్న నీళ్ళ కూజాను వాటంగా , నేర్పుతో కాలితో తన్నగానే అదిపోయి  సత్య సమీపం లో పడి, బద్దలై , ఆ నీరంతా ఆమె ముఖం పై చిమ్ముకుంది. వెంటనే స్పృహ వచ్చిన సత్య, లేచి క్షణ కాలం పరిసరాలన్నీ అయోమయంగా చూచింది. జరిగిన , జరుగుతున్న ఉదంతాల ను కొద్దిగా ఆకళింపు చేసుకున్న ఆమె నారాయణ్ శర్మ సైగతో కర్తవ్యమ్ తెలుసుకొని త్వరత్వరగా అతడినీ, గౌతమ్ నూ బంధ విముక్తులను చేసింది.
    బలశాలి, ఉపాయశాలి అయిన గౌతమ్ లంఘించి అర్జున్ కు తోడూ కావడంతో రాదాయ్, అతడి అనుచరులు తట్టుకోలేక పోయారు. కొందరు లొంగిపోయారు; కొందరు పారిపో జూచారు. కాని, సుయోధన్ మెట్ల దగ్గర కావలి వాడిని గాయపరిచి పారిపోగానే , మిత్రా ముందు చూపుతో అక్కడ కావలి భారం తన పైన వేసుకుని నిలిచి ఉండడంతో, ఎవ్వరికీ పారిపోవడానికి వీలు కాలేదు. కొద్ది ఘర్షణ అనంతరం వారందరినీ ప్రానాలతోనే బంధించారు.
    పై అంతస్తులో బలరాం, ధర్మారావు లతో సుయోధన్ అతి చతురంగా పోరాడుతున్నాడు, రెండు చేతులతో రెండు రివాల్వర్ లతో, రివాల్వర్ లలో గుళ్ళు అయిపోయేసరికి కుస్తీ లోకి దిగింది పోట్లాట. డాబా మీద , పిట్ట గోడ మీద, చూరుల అంచున భయంకరంగా జరుగుతుంది ముష్టి యుద్ధం.
    లోపల తన అనుచరులన్దరినీ బంధించి, తెరిపి పడ్డ స్పెషల్ పోలీసు బలగం, గౌతమ్ ప్రభుతులు కూడా రావడం చూచినా సుయోధన్ అతి చాకచక్యంగా బలరాం, ధర్మారావు లను నెట్టి వేసి, కంటికి కనిపించిన దారి వెంబడి బాగా పై అంతస్తు కు పారిపోయాడు. అందరూ వెను వెంటనే పరుగులతో వెంటాడినా లాభం లేక పోయింది. అప్పటికే హెలికాప్టర్ లోకి ఎక్కి స్టార్టు చేసిన సుయోధన్ ను నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు. ధర్మారావు సమయోచిత వివేకంతో అర్జున్ చేతిలోని పిస్టల్ లాక్కుని ఒక్క ఉరుకు లో హెలికాప్టర్ ప్రవేశించి , వెంటనే నిచ్చెన కిందికి దింపాడు , కింద నుంచి ఎవరైనా రావడం కోసం. కాని అర్జున్ , బలరాం దానిని అందుకొనే లోగానే హెలికాప్టర్ బాగా పైకి పోయింది. సుయోధన్ సైనిక దళాలలో ఆరితేరిన వాడు మరి!
    సుయోధన్ క్రోధంతో రెచ్చిపోయాడు. "నువ్వు నీ తండ్రిని మించిన వాడివిరా! ఉడుము లాగా పట్టుకున్నావు నన్ను, పట్టు విడవకుండా. సరే. ఫలితం అనుభవించు" అంటూనే అవలీలగా కిందికి నెట్టి వేశాడు ధర్మారావును, ఒకచేతిలో హెలికాప్టర్ ను నడుపుతూనే . అతి బలశాలి అయిన అతడి ముందు నిస్సందేహంగా ధర్మారావు బలహీనుడే. అతడు తోసి వేయగానే కింద పడిపోవలసిన వాడె కాని, దైవికంగా అతడి చేతికి నిచ్చెన ఆఖరి మెట్టు అవలంబనగా దొరికింది.
    కింది నుండి ఆ దృశ్యాన్ని చూస్తున్న అందరికీ ప్రాణా లేగిరి పోయినట్టే అయింది. "రండి, కార్లలో కింద నుంచి అనుసరిద్దాము. వైర్ లెస్ లో చెబితే ఎక్కడి నుంచి అయినా సహాయం రావచ్చు.": అని అరుస్తూ, మిత్రా కింది ఆవరణ లోకి-- కారు, జీప్ ఆగి ఉన్న చోటికి-- పరుగెత్తారు. అంతా అనుసరించే కంటే చేయగలిగింది లేకపోయింది. ఒక వంక అర్జున్ కంగారు పడుతున్న సత్యను ఓదార్చు తున్నాడు.
    హెలికాప్టర్ ఎక్కువ వేగంతో ఆకాశ మార్గ్జాన పోతున్నది. ఆఖరి మెట్టును ఒంటి చేతితో పట్టుకుని వేలాడుతున్న ధర్మారావు అవస్థ ఆ దైవానికే తెలియాలి. ఒక చేతిలో పిస్టల్ ఉంది. అందువల్ల పైకి ఎగబాకటానికి వీలు చిక్కకుండా ఉన్నది. ఏ చెట్టుకో, కట్టడానికో గుద్దించి చంపాలని సుయోధన్ ప్రయత్నం. పిస్టల్ నోటితో పట్టుకుని, అతి శ్రమ పడి రెండు మెట్లు పైకి ఎక్కగలిగాడు ధర్మారావు. ఈలోగా రెండు సార్లు ఒక భవంతి కీ, ఒకసారి ఒక చెట్టుకూ తగల బోయి ఆపద క్షణం లో తప్పిపోయింది. మనస్సులో భాయోద్వేగం, కంగారు వల్ల సుయోధన్ కూడా అనుకున్నట్టు నడపలేక పోతున్నాడని గ్రహించాడు ధర్మారావు. కింద రెండు కార్లలోని జనం మహా కంగారు పడిపోతున్నారు.
    అతి ప్రయాసతో మరో మెట్టు ఎగబాకి, లోపల ఉన్న సుయోధన్  మీదికి పిస్టల్ పేల్చాడు ధర్మారావు. సుయోధన్ గాభరా  అధికమయింది.
    "మూర్కుడా! పిస్టల్ పేల్చితే నాకు  తగిలి నేనొక్కడినే చావను. ఇదెక్కడో కూలి, నువ్వూ చస్తావు." అని అరిచాడు సుయోధన్.
    తేలికగా నవ్వాడు ధర్మారావు. "తెలుసోయ్! నేను చచ్చినా ఫర్వాలేదు. దేశానికే ద్రోహం తలపెట్టిన నిన్ను అంతం చేయడమే నాకు ప్రధానం. "తిరిగి గట్టిగా అరిచాడు ధర్మారావు.
    ఒక్క క్షణం ఆలోచించిన సుయోధన్ పట్టణం పై ఎగురుతున్న హెలికాప్టర్ దారిని మళ్ళించి, ఊరి కావల నది మీదికి తిప్పాడు.
    "నిన్ను నదిలో ముంచి చంపుతాను రా. ఇప్పుడు చూచుకో, ఎవరిది తెలివో!' విజయ గర్వంతో వికట హాసం చేశాడు సుయోధన్, హెలికాప్టర్ ను నది మధ్య భాగాన కిందికి దింపుతూ.
    ధర్మారావు వదనం లో విచారం బదులు సంతోషం పొంగింది. "థాంక్యూ . నన్ను రక్షించావు. ఎవరిది తెలివో ఇప్పుడే తెలుస్తుంది. ఇక నిన్ను బ్రహ్మ కూడా రక్షించ లేడు. చూచుకో. నీ హెలికాప్టర్ మరో ఏడెనిమిది గజాలు వెళ్తే అంతే చాలు" అంటూ తనకు తానె నదిలోకి దుమికేశాడు.
    ధర్మారావు మాటలతో, వెర్రి ఆవేశం నుండి మేల్కొని, కనులు తెరిచిన సుయోధన్ , పెట్రోలు లాంప్స్ నీరస స్థితిని చూచాడు. హెలికాప్టర్ లో ప్యూయల్ అయిపోవచ్చిందన్న మాట! సుయోధన్ కు వెర్రి ముఖం పడిపోయింది. గుండె ఆగినంత పనయింది. అతడూ నదిలోకి దుమికేశాడు. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన ధర్మారావు అప్పటికే బాగా దూరానికి ఈదేసి ఉన్నాడు. అందువల్ల సుయోధన్ అతడిని ఈ విధంగా ముంచి చంపుదామన్న ప్రయత్నం కూడా కొనసాగలేదు. ఇక్కడే ధర్మారావు అమోఘమైన సమయోచిత ప్రజ్ఞను ప్రదర్శించాడు. అతడు నీటిలో కి దూకినప్పుడూ, ఈదుతూ కూడా పిస్టల్ చేయి పైకి ఎత్తి పట్టుకుని సిద్దంగానే ఉన్నాడు, ఏ సమయంలో అయినా పేల్చడానికి అనువుగా. సుయోధన్ హెలికాప్టర్ నుండి  దుముకుతుండగానే రెండు సార్లు పిస్టల్ పేల్చి గాయపరిచాడు ధర్మారావు, ఈదుతూనే. ఒకటి చేతి మీదా, మరొకటి పక్క లోనూ తగిలాయి సుయోధన్ కు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS