Next Page 
శాంతినికేతన్ పేజి 1


                              శాంతినికేతన్
                                                           కోడూరి కౌసల్యాదేవి

                         

    కన్నెమనసు నవవికసిత కుసుమం, సుకోమలం. తొలివలపు మాధుర్యం అపారం, అసదృశం. ప్రేమసాఫల్యం జీవితసాగర సముత్తరణ సాధనం. కాకుంటే...? అదే మానవజాతి మనుగడకు, మహత్తర చారిత్రక పరిణామాలకు మూలం.
    "ఇవాళ దక్షిణేశ్వరం, కాళీఘాట్ చూద్దామన్నయ్యా. మళ్ళీ మీరింకో ప్రోగ్రామ్ వెయ్యకూడదు" అంది శాంతి క్రొత్తయింటి గుమ్మాలకు, కిటికీలకు తెరలు అమర్చుతూ.
    "దక్షిణేశ్వరం ఈమూల. కాళీఘాట్ ఆమూల. రెంటికీ పొత్తు కుదరదే?" అన్నాడు శ్రీహరి.
    "ఇవ్వాళ వచ్చామో లేదో, ప్రయాణ బడలికైనా తీరనిదే షికార్లు మొదలెట్టాలేమిటి? ఇవాళా, రేపూ పూర్తి విశ్రాంతి తీసుకుందాం" అంది పద్మా.
    "అవును, వదినా, మరి సుమారివి కదూ? రెండు రోజులేం, వారం రోజులు తీసుకో విశ్రాంతి. నేనూ, అన్నయ్యా చూసొస్తా ములే."
    నవ్వాడు శ్రీహరి. "సరే. అయితే మీయిద్ధరికీ సామరస్యం కుదరలేదు గనుక నేను మధ్యే మార్గం చెపుతున్నాను. మన శ్రమా మరిచిపోవచ్చు. కాలక్షేపం, వినోదం కూడ కలిసి వస్తాయి. 'లైట్ హౌస్'లో మంచి పిక్చరుందట. చూద్దాం."
    "అలాగన్నారింకా, బాగుంది. అయినా నాకాధీ ఇష్టంలేదు. ఇక యిక్కడ కొన్నేళ్ళపాటు ఉండేవాళ్ళమేగాదా? మరీ వచ్చిననాడే వూరిమీద పడిపోవాలని అంత ఆత్రం ఏమిటి?" విసుగు కనపరచింది పద్మ.
    "అదే నే చెప్పేదీని. మీరిక్కడుండేవాళ్ళే గనుక తొందలేదు. నేను కొద్ది రోజుల్లో వెళ్ళిపోయేదాన్నేగా? అదీగాక నేను ఈ కలకత్తాలో కొన్ని చూడాలని, ముఖ్యంగా దక్షిణేశ్వరం విషయంలో ఎంతకాలంనుండి నిరీక్షిస్తున్నానో తెలుసా?"
    శాంతి గంభీరంగా అన్న విషయాన్ని పద్మ హాస్యంగా ఎగరగొట్టబోయింది. "అబ్బో! వూళ్ళు చూడటానికి కూడా నిరీక్షణే. ఏ ప్రాణ స్నేహితుని కోసమో ఎదురు చూచినట్టు!"
    "ఫో వదినా నీకు ప్రతిదీ హాస్యమే." చిరాకు పడుతూ లేచిపోయింది, శాంతి. "సినీమాలూ, నాటకాలూ పుట్టినప్పట్నుంచీ చూస్తూనే వున్నాం."
    "సరేలే. నువ్వనుకొన్న చోటికే వెళ్దాం. కోపగించుకోకు" అన్నాడు శ్రీహరి.
    ఆ సాయంత్రం దక్షిణేశ్వరం చేరేసరికి అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్క సారి నీలిమేఘాచ్చాదితమై కుండపోతగా వర్షించి ఆగిపోయింది.
    "అబ్బ! ఇంతవరకు ఉక్కపోత. అప్పుడే చల్లబడిపోయింది. వీధులన్నీ నీటితో నిండి పోయాయి" అంది ఆశ్చర్యంగా చక్రాలవంటి కళ్ళు త్రిప్పుతూ, శాంతి.
    "ఊఁ, నీలాగే! ఇప్పుడే చికాకు. ఇప్పుడే సంతోషం. అలాగే ఈ కలకత్తా కూడ." చెల్లెల్ని ఉడికించుతూ తామరపద్మం, చెంగల్వపుష్పాలు, పాలకోవాలు ఉన్న పళ్ళెరం కొని లోపలికి దారి తీశాడు శ్రీహరి.
    "అవేమిటి?" అడిగారు శాంతీ, పద్మా.
    "ఇక్కడి దైవానికి సమర్పించటానికి" అన్నాడు శ్రీహరి.
    "ఎంత ముద్ధంమా చెల్లెలంటే! నీ నోటి నుండి మాట వచ్చిందో లేదో తీసుకొచ్చేశా రిక్కడికి."
    "ఓస్. ఈ మాత్రానికే?" అంది శాంతి, అందులో అంత మురిసిపోవలసిందేముందో అర్ధం గాక.
    "అవున్లే. అందరికీ ప్రాణంగా అల్లారు ముద్దుగా పెరిగేదానవు, నీకందులో విశేష మేం కన్పిస్తుంది?" అంది పద్మ.
    విశాలమైన ఆవరణనూ, ఉన్నత పరాకారాన్నీ, ఆలయ గోపురాన్నీ పరవశమై చూశారు. ఆలయం, గోడలు, మెట్లు, చప్టా - అంతా పాలరాయే. ఆలయంలో ప్రసాద పుష్పాలు చలించి, ప్రణామాలర్పించి ఈవలకు వచ్చి కొంత పైకి నడిచారు. అక్కడ ఎత్తైన అరుగు మీద వరుసాగా ఏడు ఆలయాలు. ఆలయాని కొక్కొక్క ముద్ఘమోహన్ సౌందర్య మిథునం - రాధాద్వితీయుడైన వేణుగోపాలుడు! ఏడు ఆలయాలకు అభిముఖంగా మరో అరుగుపై ఏడు ఆలయాలలో ఒక్కొక్క శివలింగం. ఆ వెనుక కొంచెం దిగువలో పూలతోట, ప్రక్కనే గంభీర గంగాస్రవంతి. ఎంతటి మనోహర దృశ్యం!  ప్రశాంత గాంభీర్యం నింపుకొన్న మనోజ్ఞ మధుర ప్రదేశం.
    "శాంతీ! అక్కడే వుండిపోయావేమిటి?" కన్నార్పకుండా రాధా మాధవులను తదేకంగా పరిశీలించి తన్మయమైపోతున్న శాంతి, శ్రీహరి పిలుపు విని అటు చూచింది. అన్నా వదిన లిద్దరూ చాలా దూరాన నడుస్తూ తనకోసమే ఆగారు. ఆ రాధాకృష్ణులను వదలలేక వదలలేక వెనుదిరిగి తిరిగి చూస్తూ అయిష్టంగానే ముందుకు సాగింది శాంతి.
    "ఏం, వేణుమాధవుడు దర్శనమిస్తున్నా డేమిటి, అంత పరవశమై పోతున్నావు?" ఆడపడుచును హాస్యం చేసింది పద్మ.
    "నాకంత అదృష్టమా! వేణుమాధవుడిని చూడగల నేత్రాలా నావి?"
    "అబ్బో! మాటలు నేర్చావు!"
    గంగ ఒడ్డున కొంతసేపు కూర్చున్నాక మళ్ళీ బయల్దేరారు. "ఇంకెక్కడికీ వద్దు. ఇక్కడే చాలా బాగుంది. ఇంకాస్సేపు కూర్చుందాం" అంది శాంతి కూర్చున్న చోటునుంచి లేవకుండా.    
    "బాగుంది, శాంతీ. అదేం మాట? ఎన్నో వున్నాయి చూడవలసినవి. ఇప్పుడు బేలూరు మఠం చూద్దాం పద. రేపు న్యూమార్కెట్, కాళీఘాట్, తర్వాత విక్టోరియా మెమోరియల్, బిర్లా మందిర్, మ్యూజియం. ఒకటేమిటి, చెప్పడానికి? అనేకం. మా బంగారు తల్లివికదూ? లే" అన్నాడు శ్రీహరి.
    "సినీమాలకు ముఖం వాయలేదన్నావు. మరి మిగిలినవన్నీ చూడనివేగా? క్రొత్తవి చూడడానికేం?" అడిగింది పద్మ కొంచెం విసుగ్గానే.
    శాంతి గ్రహించింది, అడుగడుగునా తన పట్టింపులూ, ప్రవర్తనా వదినకయిష్టంగానే ఉన్నాయని. "అబ్బే! వూరికే అన్నాను, వదినా. పద వెళ్దాం" అంటూ లేచింది.
    తిరిగి వచ్చేదారిలో, "బేలూరు మఠంలో ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుంది వదినా! పవిత్రతకూ, ప్రశాంతతకూ అర్ధం చెప్పుతున్నట్లుంది" అంది శాంతి.
    "ఏమో, బాబూ! మరీ అంత నిశ్శబ్దం చూస్తే నాకేమిటో భయమేసింది. ఎప్పుడు బయటపడతామా అనిపించింది. అయినా నీకన్నీ ఇవేం అభిరుచులమ్మా? దక్షిణేశ్వరం వదిలి రానంటావు. బేలూరు మఠం మనస్సుకు హత్తుకుపోయిందంతావు. ఏదో సంసారపక్షం వాళ్ళం. మనకెందుకవన్నీ?"
    శాంతి మనస్సు చివుక్కుమంది. "ఏదో నా అభిప్రాయం చెప్పానుకాని అంతమాత్రాని కంత పెద్దమాటకు లెందుకులే వదినా?" అంది తలవంచుకు నడుస్తూ.
    "అయినా యిటువంటివాటిలో ఎవరి అభిరుచులు వాళ్ళవి. తర్కం దేనికి?" అని సర్దేశాడు శ్రీహరి.
    రాత్రి ఒంటిగంటకు నిద్ర మెలకువ వచ్చిన శ్రీహరి తిరిగి వెంటనే నిద్రపట్టక లేచి వరండా లోకి వచ్చాడు.    
    ఓరగా వేసిఉన్న శాంతి గదితలుపుల మధ్య నుండి వరండాలో పడుతున్న వెలుతురు చూచి ఆశ్చర్యపోతూ మెల్లగా తలుపు త్రోశాడు. రాదాసమేతుడైన వేణుగోపాలుడు శాంతిహస్తం నుండి అప్పుడే ఆకృతి పొందాడు. ప్రేమ కరుణార్ద్రదృష్టులు బరపుతున్నట్లు జీవకళ తొణికిసలాడిపోతున్న నేత్రాలు. ముమ్మూర్తులా దక్షిణేశ్వరం లోని రాధాకృష్ణుడే. ఆ సప్తమిథుమాలలో ఒక మిధునాన్ని శాంతి ఏ అద్బుత శక్తివల్లనో తనతో తెచ్చేసుకొందా అనిపించే టట్లుంది. వెనక్కూ, ముందుకూ నడుస్తూ వివిధకోణాల్లో పరికించుతూంది శాంతి, ఇంకా స్టాండు బోర్డుమీదే ఉన్న స్వహస్త లిఖిత రూపాన్ని. మళ్ళీ మళ్ళీ రంగులు మిళితంచేసి కుంచెతో షేడ్సు మారుస్తూంది. ఆ ప్రశాంత సమయంలో తన పనిలోనే తల్లీనమై పోయిన శాంతి అన్న రాకను గమనించనేలేదు.


Next Page 

WRITERS
PUBLICATIONS