Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 40


                                                         49

    క్రమంగా శాంతి పూర్వపు శాంతి కాసాగింది. గోవిందరావు విషయం కలలా మరిచిపోయింది. అతడిప్పుడు ఇదివరలోలాగా అనునిత్యం గుర్తు రావడంలేదు. వచ్చినా రోజుకు ఏ రెండు మూడు సార్లో శాంతినికేతన్ కారణంగా, మనోరమ కారణంగా గుర్తు వస్తాడు. ఆ క్షణాలు మనస్సులో మెదిలి హృదయమంతా జుగుప్స ఆవరించేస్తుంది. తిరిగి ఏపనో కల్పించు కోవడంలో ఆ స్మృతి మరుపు తగులుతుంది. ఈ మార్పు ఇంత త్వరలో సాధ్యమనీ, యిలా జరుగుతుందనీ ఎవరూ అనుకోలేదు. శాంతి కూడా అనుకోలేదు. ఆమెకే చాలా ఆశ్చర్యంగా ఉండేది - 'ఇంత సంతోషంగా ఎలా వుండగలుగుతున్నానా!' అని.

                              
    'అవును. రాజా చెప్పినట్లు ఇత్తడిని బంగారమని భ్రమపడ్డాను. గడ్డిపువ్వును పూజా పుష్ప మని అపోహపడ్డాను. భ్రాంతి చెదిరిపోయింది' అనుకొంది. స్వచ్చమైన సూర్యకాంతి తాత్కాలికంగా మేఘాలచాటున మరుగుపడ్డా మబ్బు తెరలు విడిపోయిన పిమ్మట యథావిధి ప్రకాశించినట్లే శాంతి ఎప్పటిమాదిరిగా శాంతి నిలయంలో ప్రశాంతంగా గడపజొచ్చింది. కాని, ఒక బలమిఅన గాయం తగిలిన పిమ్మట, గాయం మానినా ఆ మచ్చ స్థిరంగా ఉండిపోయినట్లు ఆమెలో పూర్వపు చలాకీతనం స్థానే గాంభీర్యం పేరుకొంది.
    తరుచూ గోవిందరావులోని మాలిన్యాన్ని, రాజాలోని స్వచ్చతను పోల్చుకోవడంలో ఆమె మనస్సులో రాజ ఎక్కువగా మెదలసాగాడు.
    ఒకరోజున శ్రీహరి అడిగాడు - "శాంతీ, రాజాకు జవాబు వ్రాశావా?" అని.
    "లేదన్నయ్యా."
    "ఏం?"
    "........"
    "ఏం వ్రాశాడసలు?"
    "చూస్తావా?"
    "వద్దు. చెప్పు."
    "ధైర్యంగా వుండమనీ, విచారం వద్దనీ. చాలా ఓపికగా బాగా వ్రాశారు. అసలు మీ యిద్దరికీ చాలా పోలికలున్నాయి, అన్నయ్యా, స్వభావంలో" అంటూ నవ్వింది, ఎలాగైనా సంభాషణ మరోమార్గం త్రొక్కించాలని.
    శ్రీహరికూడ నవ్వాడు. "జవాబు వ్రాయి. నేను వ్రాశాను."
    "........"
    "ఏం, మాట్లాడవ్?"
    "తప్పక వ్రాయాలంటావా?"
    "అనే నా అభిప్రాయం. ఆపైన నీయిష్టం."
    "సరేలే. వదిన దగ్గర్నుంచి మళ్ళీ ఏమైనా ఉత్తరాలొచ్చాయా? ఒక్కసారి చూడాలనుందన్నయ్యా. చాలా రోజులైపోయింది. ఒకసారి వెళ్ళివద్దామా?"
    నవ్వాడు శ్రీహరి. "ఇవ్వాళో, రేపో శుభవార్తతో టెలిగ్రాం వస్తుంది. అప్పుడు వెళ్దాంలే."
    "అంతవరకూ ఆగలేను."
    మళ్ళీ నవ్వులు ఒలికించాడు శ్రీహరి. "ఎలాగైనా నువ్వు చాలా మారావ్, శాంతీ. ఇదివరకు ఎవరిపైనా నీకింత అభిమానం ఉండేదికాదు. శాంతినికేతన్ లో వున్నప్పుడు పూర్తిగా మమ్మల్ని మరిచిపోయావనుకున్నాను."
    "అవునన్నయ్యా. అసలేమిటో అలా ఎలా వుండగలిగేదాన్నో! మొన్నమొన్నటి వరకూ దేన్ని గురించీ, ఎవరిగురించీ ఏ ఆలోచనా వుండేది కాదు. ఎంతసేపూ పుస్తకాలూ, చిత్రాలూ మినహా యిన్ని ఆలోచనలూ, సమస్యలూ వుండేవి కావు" అంది మందస్వరంలో.
    ఆమె ముఖం - బహుశః గోవిందరావు జ్ఞాపకంతో కావచ్చు - మలినం కావడం చూచిన శ్రీహరి బాధ పడ్డాడు.
    "ఊరికే అన్నాను, శాంతీ. చిన్నతనం కదమ్మా మరప్పుడు? ఇప్పుడు మాత్రం? ఇప్పుడూ చిన్నదానవే. నీకు లోకం ఏం తెలుసు?" అన్నాడు ఓదార్పుగా.
    "టేబిల్ టెన్నిస్ ఆడదామా?" అన్నాడు తిరిగి వాతావరణం తేలిక చెయ్యడానికి.
    "ఓ." వెంటనే ఒప్పుకున్న శాంతి గబగబా టేబుల్ కు నెట్ కట్టి బాట్లూ, బంతీ తెచ్చింది.
    కొద్దిసేపు ఆడారో లేదో బయట ఏదో కలకలం విని ఆట మాని కిటికీ దగ్గరగా వెళ్ళి తోటలోకి చూచారు.
    శ్యామల ఏదో అరుస్తూంది కోపంగా. రామన్న చేతులు నలుపుకుంటూ ప్రాధేయపడుతూ ఏదో నచ్చజెప్పబోతున్నాడు.
    "ఏమిటో చూస్తానుండు నేను వెళ్ళి" అంటూ శాంతి బయటకు పోబోయింది.
    "వద్దు, శాంతీ. వెళ్ళకు" అన్నాడు శ్రీహరి.
    గడపదాటుతున్న శాంతి వెనక్కు తిరిగి ఒక్క నవ్వు నవ్వింది. "ఏం, భయపడమంటావా? ఈవిడ ఆగడం మరీ ఎక్కువగా వుంది. ఉండు, చూడనీ" అంటూ వెళ్ళిపోయింది.
    "ఏమిటి, వదినా?" అడిగింది శాంతి సౌమ్యం గానే.
    శ్యామల కొరకొరా చూచింది. "ఏం, అప్పుడే వచ్చేశావ్? ఈ ఇంట్లో ఏపని చెయ్యాలన్నా చీమా, దోమా ఆర్డరు కావాలేమిటి? దిక్కు మాలిన కొంప."
    ఆ విసురుకు నిర్ఘాంతపోయిన శాంతి తట్టుకొని మామూలు స్థితికి రావడానికి కనీసం నాలుగు నిమిషాలు పట్టింది.
    అంతలో శ్యామల మళ్ళీ రామన్నను కసరడం ప్రారంభించింది. "ఏం, అలా నిల్చుని చూస్తావేం దయ్యంలాగ?"
    ఇక శాంతి ఉండలేకపోయింది. "ఏమిటి, రామన్నా, సంగతి?" అని అడిగింది.
    "ఏముందమ్మా? కొబ్బరి బొండాలన్నీ నిన్నన్నే దింపించేసి వర్తకులకు లెక్కగట్టి యిచ్చేశాం. ఇక తోటలో తీద్దామన్నా ఒక్క చెట్టుకూ మదురు బొండాలు లేవు. అయ్యగారూ, పెద్ధబాబూ అయితే ఇంట్లో కొంత సరుకు ఉంచి మరీ బేరగాళ్ళ కిచ్చేవారు. చిన్నబాబు అలా కాదు. ఇంట్లో ఒక్క కాయకూడా ఉంచలేదు. చిన్న కోడలిగారికి ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలనుందట."
    శ్యామల ఉగ్రమూర్తి అయిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS