Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 40


    "మాది పక్కన పల్లె నేను తెలుసుగా?" వంశీ అడిగాడు.
    
    "తెలుసు ఏం కావాలి?"
    
    "వీడియో కేసెట్ ప్లేయర్ - విసిపి" అని అటూ యిటూ చూసి "దాంతోపాటు ఓ మంచి క్యాసెట్టు కూడా" అన్నాడు.
    
    కింద అరలోంచి విసిపి తీసి పైన పెట్టాడు అతను.
    
    "క్యాసెట్టు కూడా కావాలన్నారుగా"
    
    వంశీకి అన్నీ సక్రమంగా అమరుతుండడంతో శోభనం సగం అయి పోయినట్లు ఉత్సాహం ఉరకలేసింది. దాన్ని దాచుకోవడానికి అతను ఏమీ ప్రయత్నించలేదు. అందుకే మనసంతా ఊగిపోతూ కుడిచేతిని కొద్దిగా లేపి బొటనవేలునూ సున్నాలా కలిపి "అద్భుతమైన క్యాసెట్ - లవకుశ ఇవ్వు" అన్నాడు.
    
    వంశీ ఎగ్జయిట్ మెంట్ ను చూసి ముచ్చటపడుతూ కింద అరలోంచి క్యాసెట్ తీసి ఇచ్చాడు.
    
    దానివైపు తృప్తిగా చూస్తూ అడ్వాన్స్ లు చెల్లించాడు. అతనికి థాంక్స్ చెప్పి, విసిపీ, క్యాసెట్టూ తీసుకుని బయల్దేరాడు.
    
    తిరిగి ఊరికి చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. భోజనం ముగించి, అలా కళ్ళు మూసుకున్నాడు.
    
    ఉట్లుకొట్టే కార్యక్రమం సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని దండోరా వేస్తున్నారు.
    
    జరగబోయే ప్రతి సంఘటనా కళ్ళముందు కదులుతోంది వంశీకి. ఉట్లు ప్రారంభమయ్యేలోగా చేయాల్సిన పని ఒకటుంది. అది గుర్తు రావడంతో ఠక్కున పడకమీద నుంచి లేచాడు.
    
    మరో అరగంటకు ఆ పని కూడా పూర్తి చేశాడు.
    
    మూడుగంటలకల్లా ఉట్లు దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే జనం రావడం ప్రారంభించారు.
    
    మైదానం మధ్యలో పొడుగ్గా వుండే బలమైన గుంజ నాటారు. చివరన గుడ్ల మూట ఒకటి కట్టారు. అందులో అయిదువందలా పదహారు రూపాయలున్నాయి గుంజకు బాగా నూనె పూశారు.
    
    ఉట్లు కొట్టే వ్యక్తి దాన్నుంచి పైకి పాకి, ఆ మూటను అందుకోవాలి. ఎవరయితే అంత నునుపుగా వుండే గుంజను ఎక్కుతారో వారికి ఆ డబ్బు చెందుతుంది. ఈ మధ్యలో గుంజ ఎక్కుతున్నప్పుడు నాలుగువైపులా నీళ్ళ బిందెలతో వున్నవాళ్ళు చెంబులతో నీళ్ళు తీసుకుని ఫోర్స్ గా ముఖం మీదకు విసురుతుంటారు. ఈ నీళ్ళ తాకిడిని భరిస్తూ గుంజను ఎక్కాల్సి వుంటుంది. నూనె రాసిన గుంజను ఎక్కడం కష్ట సాధ్యమైన ఫీట్. అయినా సరే ఉట్లు కొట్టడానికి తను రంగంలో వున్నట్లు వంశీ తన పేరు ఇచ్చేశాడు.
    
    రంగంలో మొత్తం నలుగురున్నారు. వంశీ సీరియల్ నెంబర్ మూడు ఇద్దరు ట్రై చేశాక మూడో ఛాన్స్ ఇతనికొస్తుంది.
    
    ఇతనూ ఫెయిలయితే నాలుగో వ్యక్తికి వస్తుంది.
    
    ఎప్పుడో చిన్నప్పుడు చెట్లు ఎక్కినా అనుభవం తప్ప ఎప్పుడూ అలా గుంజలు ఎక్కిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు 'మేఘమాల' సక్సెస్ కావాలంటే అందులో తను గెలిచి తీరాలి. భారమంతా ఆ శ్రీకృష్ణుడిపైన వేసి నిశ్చింతగా వున్నాడు.
    
    జనం కోలాహలం ఎక్కువయింది. కార్యక్రమం ప్రారంభం కావడానికి మరో పదినిముషాలు వుందనగా సత్యనారాయణ అండ్ ఫామిలీ వచ్చారు. ఉట్లు కొట్టేవాళ్ళలో వంశీ కూడా వున్నాడని తెలిసి అందరూ కట్ట కట్టుకుని వచ్చారు. చివరికి బామ్మ కూడా తయారయి వచ్చింది.
    
    వంశీని చూడగానే సుజన చేయి ఊపింది.
    
    చూసి పలకరించి అవీ ఇవీ మాట్లాడుకుంటూ వుండగా నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చింది.
    
    జనం అంతా చప్పట్లు చరుస్తున్నారు.
    
    సుజనకు వెళ్ళొస్తానని చేతులూపుతూ ఏదో గుర్తొచ్చినట్లు ముఖం మీదకి వంగి "రాత్రి మీ యింట్లో వీడియోషో ఏర్పాటు చేశాను. అందర్నీ ముందు కూర్చోబెట్టి, నువ్వు వెనక కూర్చో మిగిలిన నాటకమంతా నేను నడిపిస్తాను. రాత్రికే మన శోభనం" అని చెవిలో చెప్పి అక్కడి నుంచి మాయమయ్యాడు.
    
    ఇదేదో కొత్త ప్లాన్ లా వుంది అనుకుంది సుజన.

    చెంబులతో నీళ్ళు కొట్టేవాళ్ళు తమ ముందున్న పెద్ద అండాల దగ్గర రెడీగా వున్నారు.
    
    "నెంబర్ వన్ వీరాస్వామి" సర్పంచ్ అరవడంతో గుంపుకు ముందు నిలబడ్డ ఆ వ్యక్తి ఉట్టి దగ్గరికి వచ్చాడు. పోయిన ఏడు విజేత అతనే. గొర్రెలు మేపుకుంటూ వుంటాడు. చెట్లు ఎక్కడంలో మహా అనుభవమున్నవాడు.
    
    నిక్కర్ మాత్రమే వేసుకుని వున్న అతను, గుంజ దగ్గరికి వెళుతుంటే జనం కేకలు, ఈలలు ప్రారంభించారు. అతను గుంజ ఎక్కడం మొదలుపెట్టాడు. నీళ్ళు చల్లేవాళ్ళు తమ చేతులకు పనిపెట్టారు.
    
    ఫోర్స్ గా ముఖాన్ని గుద్దుకుంటున్న నీళ్ళను కూడా లెక్కచేయకుండా వీరాస్వామి ఎక్కుతున్నాడు.
    
    అయిదడుగులు ఎక్కాడో లేదో ఆగిపోయాడు. ఛాతీ దగ్గర్నుంచి తొడలవరకు సడన్ గా దురద ప్రారంభమైంది. దురదలకు పట్టుకోలేక మొత్తం శరీరాన్నంతా గుంజకేసి పామాడు. దురదలు మరింత ఎక్కువయ్యాయి. కత్తితో పైచర్మాన్ని తీసేస్తే తప్ప దురద అణగనట్లు అనిపించింది. కిందకు దిగితే ఓడిపోయినట్లేనని తెలిసిన అతను ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కలేకపోతున్నాడు. దురద శరీరాన్నిపీక్కు తింటున్నట్లుంది.
        
    ఇక ఆ నవ్వులను భరించలేక అతను కిందకు దూకి రెండు చేతులతోనూ గోక్కోవడం మొదలుపెట్టాడు.
    
    జనం అతనివేపు ఎగతాళిగా చూస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
    
    రెండో వ్యక్తి గంగరాజు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో దినకూలి. పోల్స్ ఎక్కడంలో అతనికి అతనే సాటి. ఈసారి గెలుపు తనదేనన్న ధీమా ఆయన ముఖంలో వేయి ఓల్టుల బల్బులా వెలుగుతోంది.
    
    ఆయన ముందుకు వచ్చి తను వేసుకున్న ఖాకీ ప్యాంట్, చొక్కా విప్పాడు. మోకాళ్ళ వరకు వున్న చారల డ్రాయర్ తప్ప మరేం లేదు.
    
    రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఎక్కడం ప్రారంభించాడు. వీరాస్వామి ఎక్కినవరకు ఎక్కి గంగరాజు కూడా షాక్ కొట్టినట్లు ఆగిపోయాడు. ఒకచేత్తో గుంజను పట్టుకుని మరో చేత్తో ఛాతీ భాగాన్ని గోక్కుంటున్నాడు. ఆ పై కిందిభాగం అందక దురద ఎక్కువయి అక్కడి నుంచి దబ్బున కిందపడ్డాడు.
    
    అక్కడ ఏం వుండి దురదలు లేస్తున్నాయో జనానికి అర్ధం కాలేదు.
    
    ఎవరూ చోదోఅకుమ్డా రెండు గంటలప్పుడు దురదగుంట ఆకు అక్కడ పూసిన వంశీ మాత్రం ఏమీ తెలియనివాడిలా రంగం మీదికి వచ్చాడు. లాల్చీ, పైజామాలో వున్న అతను ఏమీ ఒంటిమీద నుంచి తీయలేదు. అవే తనను రక్షిస్తాయని తెలుసు.
    
    మెల్లగా గుంజ ఎక్కడం ప్రారంభించాడు. ఎక్కుతున్నది బాగా చదువుకున్నవాడూ, కొత్త పెళ్ళికొడుకూ కావడంతో జనం ఇంకా ఎక్కువగా చప్పట్లు చరుస్తున్నారు. సుజన కూడా పట్టలేని ఉద్రేకంతో చప్పట్లు చరుస్తుంటే బామ్మ గట్టిగా విజిల్ వేసింది. ఇది చూసి జనం మరింతగా రెచ్చిపోయారు.
    
    వంశీ అంతవరకూ పాకి, తాను దురదగుంటాకు పూసిన దగ్గర బాడీ తగలకుండా పైకెక్కాడు. ఇక అక్కడ నుంచి అతను చకచకా పైకెక్కేసాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS