'శారూ! నన్ను నీ మాటలతో వేధించకు. నా హృదయం లో నీకు తప్ప మరెవ్వరికీ స్థానం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. లేకపోతె జీవితాం....' ప్రభాకరం తన మాటలు పూర్తీ చేయకుండా శారద తన ముని వ్రేళ్ళతో అతని నోటిని సున్నితంగా మూసింది.
'అంత మాతనకండి! మీ కోరిక చెల్లిస్తే మీ నాన్నగారి పట్ల కృతఘ్నత చూపిన దాన్నవుతాను. చెల్లించక పొతే మీరు జీవితాంతం బాధపడతానంటున్నారు. నన్నేం చేయమంటారు? నేను ఆలోచించు కోవాలి. నాకు కాస్త టైమివ్వండి' అంది శారద.
'అలాగే తొందరేమీ లేదు. నా అభిప్రాయం మాత్రం మారదు. ఆ విషయం మనసులో పెట్టుకొని ఎంత కాలమైనా ఆలోచించు. అంతకన్నా నేను ఏమీ చెప్పలేను' పట్టుదలతో అన్నాడు ప్రభాకరం.
'చినబాబు గారూ! ఆదిలో నన్ను ఎంత అసహ్యించు కున్నారో యిప్పుడు నన్ను అంత కన్న రెట్టింపు గా ప్రేమిస్తున్నారు. ఈ జన్మకు యిప్పుడు మీతో గడిపిన ఈ మధుర క్షణాలు చాలు. వీటిని పదిలంగా గుండెల్లో దాచుకుంటూ జీవితాంతం గడిపేస్తాను. మత్తుగా కళ్ళు మూసుకుంటూ అంది శారద.
'వీల్లేదు -- నీకు అలా గడిపి వేయగల నిబ్బర ముండవచ్చు. కాని నేను అందుకు సిద్దంగా లేను. నిన్ను ఒదిలి ఉండలేనేమో? అలా ఉండాలని బలవంతంగా ప్రయత్నిస్తే నేనేమౌతానో నాకే తెలియదు. మళ్లీ నా పాత అలవాట్లన్నీ ముందుకు వచ్చి నన్ను తమకు బానిసలుగా మార్చుకుంటే మాత్రం అందుకు నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాను.'
ప్రభాకరం మాటలకు శారద నిలువెల్లా కంపించి పోయింది. భయంతో వణుకుతు 'చినబాబు గారూ! మీరు మాత్రం అటువంటి మాటలనకండి. నన్ను నేను ఏనాడో మీకు భగవంతుని కర్పించే పూజా పుష్పం లా అర్పించు కున్నాను. కాని మిమ్ములను జీవిత భాగస్వాములుగా చేసుకొనే విషయం లో ధైర్యం చాలడం లేదు. ఆ అర్హత నాకు లేదేమో నన్న భయం కలుగుతూ ఉంది. అయినా నిష్కర్ష గా కాదని అనలేదు కదా! ఆలోచించు కోవడానికి అవకాశ మివ్వవలసినది గా వేడుకుంటున్నాను. నా కారణంగా మీరు పాత అలవాట్ల కు బానిస కాకూడదు. ఆ విధంగా జరిగితే నేను జీవించలేను కూడా' నాభి నుండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని వెక్కిళ్ళ మధ్య ఆపివేయడానికి విఫల ప్రయత్నం చేస్తూ అంది శారద.
'బాధపడకు శారదా! నాపై అంత గాడనురాగాన్ని నింపుకున్న నీ హృదయం నన్ను విడిచి ఎలా మనగలుగుతుంది? పోనీ నీ హృదయాని కైనా నీవు సమాధానం చెప్పుకోవాలి గద!' శారద ను అనునయిస్తూ అన్నాడు.
'మీ క్షేమం కోసం, మీ సుఖ సంతోషాల కోసం నా హృదయాన్నే కాదు చినబాబు గారూ....జీవితాన్నే త్వజిస్తాను. ' ఆవేశంతో అంది శారద.
'ఆమాట మీదే నిలబడు. నీవు లేని నాకు జీవితం లేదు. సుఖం లేదు. సంతోషం లేదు. అటువంటప్పుడు నీవు నన్ను వివాహ మాడడానికి నిరాకరించడం లో అర్ధమేమిటి?' నీవే వోదిపోయావు అన్నట్లుగా ఆమె ముఖం లోకి చూస్తూ అన్నాడు ప్రభాకరం.
నిరుత్తరు లైంది శారద ---
కొద్ది సేపు యిద్దరూ మౌనంగా గడిపారు---
'చినబాబు గారూ! మీరు మాటలు బాగా నేర్చారు. పూర్తిగా మారిపోయారు. ఈ మార్పుకు కారణాలు తెలుసుకోవచ్చా?' మాటలు తప్పించే ప్రయత్నం చేసింది శారద.
'మాటలు తప్పించాలని చూస్తున్నావు . దొంగా......!' అని చిరునవ్వు నవ్వి 'శారూ..నిజం చెప్పాలంటే 'జ్యోత్స్న' రచనలు నన్ను పూర్తిగా మార్చాయి. ప్రసాద్ స్నేహం నన్ను తీర్చి దిద్దింది. ముఖ్యంగా 'జ్యోత్స్న' రచనలే నాలో నవ చైతన్యాన్ని కలిగించాయి.' జ్యోత్స్న పై తనకు గల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు ప్రభాకరం.
'ఆ రచయిత్రి ధన్యురాలు. ఆమెకు ఈ విషయం తెలుస్తే సంతోషంతో ఎంతో పొంగి పోతుంది?' ఆనందంతో అంది శారద.
'అలాగా! ఆమె నీకు తెలుసా?' అని ప్రశ్నించి తన చేతి గడియారాన్ని చూసుకుంటూ 'చాలా ప్రొద్దు పోయింది. ఇక వెడదాం .' అన్నాడు లేస్తూ.
'అబ్బే! తెలియదు.' అంటూ తనూ లేచింది.
ఇద్దరూ లేచి మెల్లిగా కారు వైపు నడిచారు---
17
సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతి లో జ్యోత్స్న గారి సన్మాన సభ జరుగుతుంది. రామం, ప్రసాద్ , ప్రభాకరం లు సాయంత్రం నాలుగు గంటల నుండే హడావుడి ప్రారంభించారు.
'నాన్నారూ! త్వరగా తెమలాలి.' ప్రభాకరం తన తండ్రిని త్వర పెడుతూ తల్లికి కూడా త్వరగా తేమల వలసిందిగా చెప్పడానికి వంట యింట్లోకి వెళ్ళాడు.
అన్నపూర్ణమ్మ గారు రాత్రి పూట వంట పనిలో నిమగ్నులై ఉన్నారు. శారద వారికి సాయం చేస్తూ వుంది.
హడావుడి గా లోపలికి వచ్చిన ప్రభాకరం 'అమ్మా త్వరగా తెమలాలి. టైము కావస్తోంది.' ఆత్రుతతో అన్నాడు.
ప్రభాకరం అత్ర పడడం చూసిన శారదకు నవ్వు ఆగింది కాదు----
శారద నవ్వడం గమనించి ప్రభాకరం 'ఎందుకు శారదా నవ్వుతావ్?' ఆమె నవ్వుతూన్న కారణం ఊహించలేక తెల్లబోతూ అడిగాడు ప్రభాకరం.
'చినబాబు గారూ! ఇప్పుడు టైమెంతైంది?' ఉబికి వస్తూన్న నవ్వును ఆపుకుంటూ అడిగింది శారద.
'నాలుగు గంటల ఐదునిమిషాల -- ముప్పై సెకండ్లు' జాగ్రత్తగా తన చేతి గడియారాన్ని చూసుకుంటూ సెకండ్ల తో సహా శారదకు టైము చెప్పాడు.
'సన్మాన సభ ఎన్ని గంటలకు ప్రారంభమౌతుంది?'
'ఆరుగంటలకు!'
'చినబాబు గారూ! ఆ సభకు వెళ్ళడానికి యింకా రెండు గంటల టైముంది. ఇప్పుడే వెళ్లి ఏం చేస్తారు?' చిరునవ్వుతో అడిగింది శారద.
'వోస్ యిందుకేనా నీవు నవ్వుతున్నది . ఎందుకో అనుకున్నాను. నీకు సాహిత్యమంటే పెద్ద ఉత్సాహం లేనట్టుంది? అందుకే అలా మాట్లాడుతున్నావు. 'జ్యోత్స్న ' సామాన్య రచయిత్రి కాదు. చాలా పేరు సంపాదించుకున్న ఆమె సన్మాన సభ ఎంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారి భార్య గారు ఆ రచయిత్రి కి సన్మానం జరుపుతున్నారు. ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు సభకు హాజరవుతారు. త్వరగా వెళ్లక పొతే అసలు కూర్చోవడాని కైనా స్థలం దొరుకుతుందో లేదోనని అనుమానంగా ఉంది. అటువంటప్పుడు త్వరగా వెళ్లక పొతే ఎలా మరి?' అని తన తల్లి నుద్దేశించి 'అమ్మా! త్వరగా తెములమ్మా. ఐదు వరకు వెళ్ళిపోదాం'
'నేనెందుకు నాయనా......? ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన దాన్ని కాదు.'
'అదేమిటమ్మా........! ఎక్కడి కీ వెళ్లక పోయినా యిక్కడికి మాత్రం తప్పకుండా రావాలి. ఆ రచయిత్రి పై నాకు ఎంతో గౌరభిమానాలున్నాయి. నీ కుమారుని మార్చి చక్కదిద్దిన ఆమెను చూడాలని నీ కనుపించడం లేదా?'
'తప్పకుండా చూడాలని ఉంది బాబూ! అంతేకాదు . ఈ విషయం తెలియగానే మనసులో ఆమెకు కోటి దండాలు పెట్టుకున్నాను. నీకు పునర్జన్మ ప్రసాదించిన ఆమె మనకు ఇలవేల్పు తో సమానం. కాని ఎంతో మంది మగవాళ్లు, పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్న ఆ సభకు రావాలంటే నాకెందుకో బిడియంగా ఉంది బాబూ! ఆమెనే మన యింటికి తీసుకు వస్తే యధాశక్తి తో ఆమెను మనం గౌరవిద్దాం.......'
'అమ్మగారూ......! ఆమె అంతటి గౌరవానికి అర్హురాలు కాకపొతే?'
'అదేమిటి శారదా.....? నీకు తెలియని విషయాలలో నీవు జోక్యం కలుగ జేసుకుంటావెం? ఇందాకటి నుండీ చూస్తున్నాను ఆ రచయిత్రి అంటే నీకెందుకో అసూయగా ఉంది. రచయితలు, రచయిత్రులు తమలో తాము ఒకరి పై వేరొకరు అసూయను ప్రదర్శించడం సహజం. ఆ కోవకు చెందని నీవు ఆమె పై అసూయను ఎందుకు పెంచు కుంటున్నావో నాకర్ధం కావడం లేదు. ఎప్పుడైనా నీవు ఆమె వ్రాసిన కధలు, వ్యాసాలు చదివావా? చదివితే యిలా మాట్లాడి ఉండవు. ఎంత సేపటికీ పాఠ్యగ్రంధాలు చదువుతూ ఫస్టు క్లాసులో ప్యాసవడం తప్ప మరొక విషయం తెలియదు నీకు. నానాటికీ పతనమై పోతున్న మన నాగరికతలోని విశిష్టతను పతితులకు గుర్తింప చేయించి పాశ్చాత్య నాగరికత ను మన దేశ వాసులు అనుకరించడం న్యాయం కాదని, ఒకవేళ మనకే శక్తి సామర్ధ్యాలు ఉన్నట్లయితే మన నాగరికతను ఆచార వ్యవహారాలను యితర దేశాస్తులు అనుకరించేట్లుగా ప్రయత్నించడం లో గొప్పతన ముందనీ, అలా ప్రయత్నిస్తున్న విశ్వ హిందూ పరిషత్ కు తమ శక్తి వంచన లేకుండా భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడూ ప్రయత్నించాలనీ ప్రతి పఠిత హృదయాన్ని కదిలించేలా వ్రాసిన ఆ వ్యాసాలు పఠితలకు విసుగు కలగకుండా , సరళంగా , సౌమ్యంగా ఉన్నాయి. ఆ వ్యాసాలను చదవక పోవడం నీ దురదృష్టం. ఇప్పటి కైనా మించి పోయిందేమీ లేదు. వారి వ్యాసాలు ప్రచిరించబడిన పత్రికలన్నీ నా దగ్గర ఎంతో జాగ్రత్తగా భద్రపరచ బడి ఉన్నాయి. నీవు వాటిని శ్రద్దగా చదువు . అప్పుడు వారి గొప్పతనం నీకు అర్ధమౌతుంది.' ఒక చిన్న ఉపన్యాసమిచ్చాడు ప్రభాకరం.
'చినబాబుగారూ.....మీరు బాగా అలసిపోయారు. దయచేసి మళ్లీ ఒకసారి టైము చెబుతారా?' చిలిపిగా అడిగింది శారద.
'నాలుగూ యిరవై......అరెరే! మాటల సందడి లో టైము గడిచిపోతూ ఉంది. అమ్మా ఐదు వరకు తయారవ్వాలి' అని శారద ను చూస్తూ 'నీవు కూడా తప్పకుండా రావాలి. ఆ రచయిత్రి గారి వ్యాసాలు చదవక పోయినా కనీసం వారినైనా చూద్దువు గాని.'
'ఆ.......వారిని చూసేదేముంది? వారూ మనలాంటి మనిషే కదా......?' తేలికగా తీసి పారవేసింది శారద.

'అదేమిటమ్మా.......! ఎవ్వరినీ ఎన్నడూ కించ పరుస్తూ మాట్లాడని నీవు ఈరోజు వింతగా మాట్లాడుతున్నా వేమిటి?' అని ప్రభాకరం వైపు తిరిగి 'నాయనా వారిని మన యింటికి తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యి. ఆ మీటింగు కు నేనెందుకు బాబూ?' అని ప్రభాకరానికి నచ్చ జెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేయసాగారు అన్నపూర్ణమ్మ గారు.
'అంత గొప్పవారు మన యింటికి వస్తారో రారో? ఈ అవకాశం తప్పిపోతే మళ్ళీ నీకు చూడడానికి వీలుపడుతుందో లేదో? రామ్మా....! వేల్లివద్దాం' తల్లిని బ్రతిమాలసాగాడు.
