"కూచో చెప్తా ..........ఈ మధ్యన మనకి పల్లె కబుర్లు ఏం తెలియలేదు. అన్నయ్య కీ, శేషయ్య కీ మధ్య తగాదా చాలాదూరం వచ్చిందట !...ఇద్దరూ పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు కి పోటీ చేసి తలో పది పదిహేను వేలూ ఖర్చు పెట్టుకున్నారట.......ఎందువల్లో అన్నయ్య హటాత్తుగా పోటీ నుంచి విరమించు కున్నాడట. అందువల్ల అన్నయ్య పరిస్థితి ఊళ్ళో హేళనగా మారిందట?....ఈ మధ్యన ప్రాక్టీస్ అంతా పూర్తిగా పోయి డబ్బు కి చాలా ఇబ్బంది పడుతున్నాడట అన్నయ్య. డానికి తోడు ఎలక్షన్ల కై పంతులు దగ్గర తెచ్చిన పది పదిహేను వేల రూపాయల బాకీ ఒకటి!.....ఇవాళ పొద్దుట ఆ పంతులుకి అన్నయ్య ఏదో మందు ఇస్తే అది తాగి వెంటనే ఆ పంతులు చనిపోయాట్ట. బాకీ ఎగ్గగోట్టవచ్చు కదా అని పంతులికి అన్నయ్య విషప్రయోగం చేశాడని ఊళ్ళో జనం అనుమానించి, కర్ర లేసుకుని అన్నయ్య మీదకి వెళుతున్నారట-- ఇది జరిగి రెండు మూడు గంటల కంటే ఎక్కువ కాలేదని, నగరం బస్సు దిగి ఇక్కడికి కోర్టు పని మీద వచ్చిన రైతు ఒకడు చెప్పాడు ఇదంతా" అంటూ చెప్పాడు గోపాలం సంగ్రహంగా...
విజయ మ్రాన్పడి అలా వింటూ ఉండిపోయింది.
"ఇప్పుడు నేను వెంటనే పల్లె వెళ్ళాలి......అవతల ఏం జరుగుతుందో ఏమో ?....ఊళ్ళో జనం పోలీసు రిపోర్టు ఇస్తే ప్రమాదం. అన్నయ్య ను జైలు కి తీసుకు పోతారు....ఆ తర్వాత జామీనులు గొడవలు....నేను వెళితే అవెం అక్కర్లేకుండా మొదటే పోలీసుల తో మాట్లాడి జాగ్రత్త పడవచ్చు........సేఫ్ లోంచి డబ్బు తీసి వెయ్యో, రెండు వేలో నా కోటు జేబులో పెట్టు-- నేను అర్జంటుగా టాక్సీ చేయించుకుని వెళుతున్నా "
"సరే కాని మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా ఎందుకండి ఇయ్యడం?"
"విజయా....నీ తెలివి తక్కువ ప్రశ్నలతో నన్ను విసిగించకు........పోలీసులు ఈ కేసు రికార్డు చేసి, పెషన్సు కి తీసుకు వస్తే రేపు ప్రొద్దుట కోర్టులో అన్నయ్య కి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున నేనే వాదించవలసి ఉంటుంది. వాదించి అన్నయ్య ని జైలు కో, ఉరి కంబానికో పంపించనా నేను ఈ ఉద్యోగంలో ఉండి?.....నాతోడబుట్టిన అన్నను నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చిన వాడిని.....వాడిని ఉరికంబం ఎక్కించనా నేను నా ఉద్యోగం ధర్మమా అని!..నా వల్ల కాదు.....అది నా వల్ల కాదు విజయా?" అని గట్టిగా అరిచాడు గోపాలం.
"అది కాదండీ! మీరా ఉద్యోగం లో ఉండడం వల్లే ఆయనకి ఎక్కువ సహాయం చెయ్యవచ్చు కదా.....ఏదో వాదించీ వాదించనట్టు వాదించి ఆయనకి ఉపకారం జరిగేటట్టు కేసు నడిపితే ........"
"ఏవిటీ ! నాటకమా.....అది నా నియమానికి విరుద్దం....నేనలా మోసమ్గా పని చేయలేను కూడా...అన్నయ్యేది తమ్ముడయేది నేను కేసు పెట్టానంటే మనస్పూర్తిగా చెయ్యవలసిందే....ఇంక అందులో వెనుకంజ అనేది ఉండదు........అందువల్ల నేనీ ఉద్యోగంలో ఉంటె అన్నయ్య కి అపకారమే జరుగుతుంది.....నేను తప్ప ఎవరు ఉన్నా ఫరవాలేదు...ఏమంటే ప్రభుత్వ న్యాయవాది వృత్తి కి రాజీనామా ఇచ్చిన నేను ఇటు స్వచ్చంద న్యాయవాదిగా అన్నయ్య తరపున వాదించి శిక్ష తప్పించగలను.
"అసలు -- ఆయనా , మీరు సోదరులని చెప్పి ఆ కేసు అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఇస్తుందేమో ప్రభుత్వం..."
"అవును....అదీ సంభవమే?....అలా అయినా నేను రాజీనామా చేసి ఈ సంకెళ్ళ లోంచి విడిపోయి ఉండాలి.....లేకపోతె అన్నయ్య కి సహాయం చెయ్యలేను.........."
"ఏమో...దీని కోసం మీరు రాజీనామా చెయ్యడం నాకేం సమంజసం గా తోచడం లేదు .....పదవి లోనే ఉండి ఆయనకి సహాయం చెయ్యడం సులభం..........నియమాలు అని పట్టుకొని వ్రేలాడితే ఎలాగండి.......నియమాలు , నిబంధన లూ ఇవన్నీ మనం బాట చూపడానికి కాని బంధించడానికా
గోపాలం ఆమె మాటలేవీ వినిపించుకునే స్థితిలో లేడు.
"పోనీ అలాగే రిజైన్ చేద్దురు గాని లెండి.....ముందు పల్లెకి వెళ్లి పరిస్తితు లేవిటో చూసి వద్దాం నేనూ వస్తాను.......అక్కడ అక్కయ్య గారూ వాళ్ళు ఏం అవస్త్జ లో ఉన్నారో........ఎలాగా టాక్సీ లోనే కదా మీరు వెళుతున్నారు?"
"ఊ -- అయితే అయిదు నిమిషాల్లో బయలుదేరాలి"
ఆలస్యం ఏముంది ? డబ్బు తీసుకోవడం......
కంగారుగా టాక్సీ దిగారు గోపాలం , విజయా ను, ఇవతల గుంపులు గుంపులుగా వలసలు కొద్ది జనం నిశ్శబ్దంగా, గంబీరంగా నిలబడి ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో ఏమో .....తడబడే కాళ్ళ తోటి ముందు గోపాలం, అతని వెనకాల విజయా నడవసాగారు. గోపాలాన్ని చూసి జనం దారి ఇచ్చి పక్కకి తప్పుకుంటున్నారు....అలా అందర్నీ తప్పించుకొని వెళ్ళారు గోపాలం విజయాను.
పిడుగు పడినట్లు ఆగిపోయాడు గోపాలం.
నేలమీద వెల్లకిలా పడి వుంది వదిన.
పక్కనే నిర్జీవ ప్రతిమలా అన్నయ్య!
దగ్గరలో పంతులు శవం.
చేతుల్లో ఉన్న సీసాని టేబిల్ మీద పెడుతూ 'చాలా ఘోరం జరిగిపోయింది.......ఈ సీసాల్లో "క్లోరల్ హైద్రాస్ " ఏ మాత్రమో మిగిలి ఉంది...అదే ఈ ఇద్దరి ప్రాణాల్ని తీసింది " అంటున్నాడు వాసు.
గోపాలం చాప చుట్టగా నెల మీద పడిపోయాడు......
విజయ ఏకధారగా కన్నీళ్లు కారుస్తూ నిలబడింది.....
చుట్టూ ఉన్న జనం కండువాలతో కళ్ళు ఒత్తుకుంటూ రకరకాలుగా సానుభూతి ప్రకటిస్తున్నారు.......
ఆ మారాజు ఎంతమంది ప్రాణాల్ని రక్షించ లేదూ/..ఏదో కర్మం కాలి ఈనాటికి ఈ పంతులు ఇలా అయ్యాడు కాని"
"ఇంతకీ గ్రహచారం , డాక్టర్ ఏం చేస్తాడు?"
"నిష్కారణంగా ఆ మహా తల్లి నిండు ప్రాణం పోగొట్టుకుంది కదా?"
"ఇన్నేళ్ళ యి ఎవ్వరికీ కనిపించని ఆ ఇల్లాలు భర్త మీద వచ్చిన అపవాదు భరించలేక ఇలా పది మంది లోకి వచ్చింది........"
"భర్త కోసం, నా భర్త అలా చెయ్యడు సుమా అని నిరూపించడం కోసం ఆ మహాసాద్వి చివరికి ఆత్మ బలిదానం చేయవలసి వచ్చింది ."
"పాపం డాక్టరు గారు ఎలా కొయ్య బారి పోయాడో?"
"ఈ దెబ్బ నుంచి అయన కోలుకోలేడు ఇంక -- ఆ తల్లి వెళ్ళిపోవడం ఆ ఇంటికే కాదు ఈ ఊరికి పెద్ద నష్టం ..."
ఇలా తలోకరు తలొక విధంగా అంటూ వుంటే కొందరు "తల్లీ .....ఇంకా లేవూ...వెళ్ళిపోయావా? అంటూ బావురు మన్నారు. ఎక్కెక్కి పాత కంపౌండరు ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటూ నేలమీద పొర్లి రోదిస్తున్నాడు సుబ్బడు........
అప్పటిదాకా దూరంగా నిలబడ్డ శేషయ్య కూడా దగ్గిరగా వచ్చి వాసు పక్కని నిలబడి గుండెల్లోంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కనీళ్ళ తో శంకరం కేసి చూస్తున్నాడు.
శంకరం ఈ లోకంలో లేడు. అతనిలో ఏ చలనమూ లేదు. సర్వమూ పోగొట్టుకున్న ఒక అనాదుడిలా, జాలిగా మౌనంగా అలా నిలబడి ఉండిపోయాడు........
"వదినా...వదినా నేను గోపాలాన్ని వచ్చాను వదినా.....ఒక్క మాటు మాట్లాడు వదినా .....వదినా?" అంటూ సావిత్రి రెండు కాళ్ళ మీద పడి తల ఆ కాళ్ళ కేసి కొట్టుకుంటున్నాడు గోపాలం.
విజయ ఆ దుఃఖాన్ని చూడలేక పోతోంది.......
"చిన్నప్పటి నుంచీ అమ్మ లేని లోటు లేకుండా చూశావు. కొడుకులా చూచుకొన్న నాతొ ఒక మాటయినా చెప్పకుండా వెళ్ళిపోయావు......... నామీద ఎంత ప్రేమ?....అన్నం తిన్నావా గోపాలం అంటూ అడిగే దానివి.....ఇంకెప్పుడెవరు అడుగుతారు నన్ను?....ఎందుకిలా చేశావు .......ఎంత పని చేశావు" ఇలా ఏడ్చి ఏడ్చి గోపాలం అన్నయ్య కేసి తిరిగి 'అన్నయ్యా!" అని బావురుమన్నాడు.
శంకరం అలాగే స్థాణువు లా నిలబడి ఉన్నాడు.
శంకరాన్ని కుదుపుతూ ఏం జరిగింది ?..వదిన ఎందుకిలా చనిపోయింది ?.......చెప్పు అన్నయ్యా..నాకు చెప్పు" అంటూ ఏడుస్తూ గోపాలం శంకరం కళ్ళలోకి చూశాడు......
శంకరం కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఎండిపోయాయి. ఆ కళ్ళల్లో జీవం లేదు. చైతన్యం లేదు. కేవలం శూన్యంగా చూస్తున్న గాజు కళ్ళు అవి. గోపాలం ఎంత కుదుపినా శంకరం లో కదలిక లేదు. ఒరాతి బొమ్మనో కర్ర బొమ్మనో కదిపినట్లుంది.......
బరువైన హృదయంతో 'చివరికి ఇలా జరిగిందేవిటి? అనే పశ్చాత్తాపంతో దహించుకు పోతున్న మనస్సులతో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోసాగారు....ఊరి అశేష జనానికి పూజనీయురాలైన సావిత్రి ఇలా చనిపోవడం, డాక్టరు విద్యుద్ఘాతం తగిలినట్లు అలా మ్రాన్పడి ఉండిపోవడం చూసి, మునసబు మనసంతా వికలం అయిపోయి కరణం తోటి, నలుగురైదుగురు ఊరి పెద్దల తోటి సంప్రదించి, మూడో కంటి వాడికి తెలియకుండా, మళ్ళీ పోలీసులూ గొడవా అదీ ఏం లేకుండా పంతులు శవానికి దహన సంస్కారాలు వెంటనే చేయించడానికి నిర్ణయం చేశాడు.
ఒక్కొక్కరుగా అలా అంతా వెళ్ళిపోయారు. చీకటి పడే సమయాని కి శేషయ్య, వాసూ మాత్రం ఆఖరి దాకా ఆగారు. శేషయ్య గోపాలాన్ని ఓదార్చి "నువ్వు అలా బెంబేలు పడితే ఎలాగ?....అవతల అన్నయ్య పరిస్థితి ఒకటి చూడాలి -- ఆయన్ని చూస్తె భయంగా ఉంది. ఎమౌతాడో?....కొంచెం ఓదార్చు నేను మళ్ళీ వస్తాను.....ముందు ఆవిడ శవాన్ని తీసుకు వెళ్లి పోతేనే కాని శంకరం గారు ఆ దుఃఖం లోంచి తెరుకోలేరు. నేను వెళ్లి ఆ ప్రయత్నమేదో చూస్తాను...అమమి....నువ్వెళ్ళి ఇంట్లో ఏమున్నాయో ఎం లేవో చూడు.........నేను వస్తాను గోపాలం ధైర్యంగా ఉండు. అన్నయ్య ని కనిపెట్టుకొ" ఇలా చెప్పి ఉత్సాహం నశించి హృదయం క్రుంగి పోయి బరువైన భావాలతో బాధగా అక్కడ నుండి వాసుని తీసుకుని కదిలాడు శేషయ్య.
శ్మశానం నుంచి ఇంటికి వచ్చి ఒక్క మాటు బావురుమన్నాడు గోపాలం- తమ్ముణ్ణి చూస్తూ -- అలా కూర్చుని ఉన్నాడు శంకరం-- శ్మశానం లో కూడా శంకరం అలాగే స్థాణువు లా కూర్చుని అగ్ని కీలల కి ఆహుతి అవుతూన్న సావిత్రి బౌతిక దేహాన్ని శూన్యంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళ వెంబడి నీళ్ళు లేవు మాట్లాడడు. యాంత్రికంగా ప్రవర్తిస్తున్న అన్నయ్య ని చూసేసరికి గోపాలానికి పట్టలేనంత దుఃఖం రాసాగింది. ఈ స్థితిలో ఉన్న అన్నయ్య ఏం అవుతాడో !....శిలా ప్రతిమలా అయిపోతున్నాడు . నిన్నూ చూస్తె నాకు భయంగా ఉంది అన్నయ్యా అంటూ అతని గుండెల మీద తల పెట్టుకుని ఏడ్చాడు గోపాలం-- ఏం లాభం లేకపోయింది.........
మణి ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసింది గోపాలానికి వివరాలు ఎన్ని అడిగినా , ఎంత ఆదుర్దా కనబరిచినా పెదవి విరవడం తప్ప జవాబెం లేదు. ఇంక అన్నయ్య కు ఎవరున్నారు తను తప్ప! ...విజయతో అలోచించి తనతో అన్నయ్య ను రాజమండ్రి తీసుకు వెళ్ళిపోవడానికి , ఆ యిల్లు అమ్మేసి పంతులు భార్య కి బాకీ కింద జమ కట్టడాని కి నిర్ణయించాడు గోపాలం. ఆ సంగతి శేషయ్య కి చెప్పాడు. శేషయ్య కూడా 'అలాగే చెయ్యి అని పైకి అన్నాడే కాని శంకరం ఆ ఇల్లు అమ్మేయడం, ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అని తలుచుకుంటేనే శేషయ్య ప్రాణం ఎందుకో విలవిలా కొట్టుకో సాగింది.రోజుకోమారో రెండు రోజులకో మారో శేషయ్య వచ్చి చూసి వెళుతున్నాడు.
ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా శంకరం మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. ఎవరితో మాట్లాడం లేదు. మధ్య గడప లో కూర్చుని ఎదురుగుండా పాగా కొయ్య నున్న సావిత్రి పట్టు చీరనే చూస్తూ రోజల్లా మౌనంగా కాలక్షేపం చేస్తున్నాడు కనిపించిన తల్లి కంటే ఎక్కువగా, కన్న కూతురు కంటే మిన్నగా విజయ శంకరానికి కావలసిన సదుపాయాలనీ చూసి పెడుతోంది.
పది రోజులు గడిచింది.
నెల్లాళ్ళు కావచ్చింది. రాజమండ్రి వెళదాం అంటే రానంటాడు అన్నయ్య. ఎన్నాళ్ళ ని తను అక్కడ పనులు మానుకుని ఇక్కడ ఉంటాడు? అలాగని ఆ స్థితిలో ఉన్న అన్నని వదిలి ఎలా వెళతాడు. రకరకాలుగా చెప్పాడు....ఉహు!.........శంకరం వినలేదు.....అయితే విజయ ని అక్కడ వదిలేసి తను మధ్య మధ్య రాజమండ్రి వెళ్లి వస్తుండడానికి నిర్ణయించు కున్నాడు గోపాలం. బాగా స్థిమిత పడ్డాక శంకరమే చెప్పాడు "నాకింకేవరు మిగిలారురా నువ్వు తప్ప అలాగే వచ్చి నీ దగ్గరే ఉంటాను లే కాని ఇప్పుడు కాదు. నేను ఒక్కడ్నే ఈ యింట్లో కొన్నాళ్ళు ప్రశాంత జీవితం గడపాలి. ఆ తర్వాతే ఎక్కడికి వచ్చినా. అందువల్ల ప్రస్తుతం మీ ఇద్దరూ వెళ్ళండి అన్నాడు. "మరి ఒక్కడివీ ఉంటావా -- భోజనం ?" అన్నాడు గోపాలం. "అదంతా నే చూసుకుంటాగా" అంటూ విసుకున్నాడు శంకరం.
