Previous Page Next Page 
దీప శిఖ పేజి 39


                                  16
    "ఏవండీ ?" అవ్యక్త మధురంగా మనస్సు నిండా పరివ్యాప్తమైన మమత నీ నిత్య నూతనంగా జీవితాన్నంతా పరిమళింప జేస్తున్న ఆకాంక్ష నీ ఆ మూడు అక్షరాల్లో నూ పొదివి గోముగా పిలిచింది విజయా గోపాలాన్ని.
    "ఏం విజయా!" అన్నాడు గోపాలం ఇంకా ఆమెని తనలోకి తీసుకుని నుదుట మీద పట్టిన చిరు చెమట తో తడిసి చిందర వందరగా ఉన్న ఆమె ముంగురుల్ని సన్నని తన పొడుగైన వ్రేళ్ళతో అలవోకగా సర్దుతూ
    అతని గుండెల మీద తల ఆన్చి అరమోడ్పు కన్నులతో ఏ దివ్య లోకాల సుఖాల్నో అనుభవిస్తున్న విజయ తన నుదుటిని తలనీ సుతారంగా స్పుశిస్తున్న అతని హస్త స్పర్శ కి శృతి సవరించిన వీణలా హృదయం అంతా ఒక్కమారు ఝల్లు మనగా "అబ్బ!" అంది.
    ఏమీ తెలియనట్లు అమాయకంగా "ఏం ? ..ఏం జరిగింది ?" అన్నాడు కంఠం లో తెచ్చి పెట్టుకొన్న కంగారు ని ద్యోతకం చేస్తూ.
    "పొండి !...మీరు ఉత్త చెడ్డవారు" అంది తలయెత్తి అతని కళ్ళలో కి చూస్తూ "ఏమో ?' ఆన్నాడు గోపాలం.
    "మీ మూలాన ఒళ్ళంతా ఎలా పులకాలు దేరిందో చూడండి" అంది విజయ దొంగ కోపంతో బుంగమూతి పెడుతూ.
    "నిజంగా ?........అయ్యో పాపం !" ....అని నొచ్చుకుంటూ "ఏదీ చూడనీ " అన్నాడు ఆమె మెత్తని చేతిని నున్నని మెడనీ స్పృశిస్తూ .
    "మీ చేతులు చాలా మోసం చేస్తాయి. ఇష్టం లేకపోయినా మత్తు మందు చల్లి వశం చేసుకోవటం లో అందే వేసిన చేతులు"
    'అలాగా? పాపం. నీ చేతులకి అలాంటి మోసాలెం తెలియవెం? అవి ఉత్త నంగనాచులు ...అవునా?"
    "ఊ....ఊ......." అంటూ అతని కేసి కొంటెగా చూస్తూ తల ఊపింది విజయ.
    గోపాలం బాహు పంజరం లో విజయా, విజయ సౌందర్యా నంద సమాధిలో గోపాలం ప్రశాంత మధుర గంబీరంగా తమనీ తమ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి కొన్ని క్షణాల పాటు అలా వుండిపోయారు.
    అవి భూత భవిష్యత్తుల సంగతి మనస్సునకు రానియ్యని మధుర క్షణాలు.
    ఆ ఆనందానుభూతిని తాము పొందు తున్నామనే ఆలోచనయినా తావీయని తన్మయ క్షణాలు.
    ఈ అయిదారు సంవత్సరాల నుండి క్షణ క్షణమూ ప్రణయాధి దేవత వారిపై జరిపే దివ్య వీక్షణాలు.
    అవి శాశ్వతాలూ.
    అజరామరాలు
    అనంతాలూను.
    ఇలా ఉత్తాలతాలమైన ఒక దివ్యరస స్థితి ని వారిరువురికి కొంచెం సేపు కలిగించి అతిలోకానంద నిలయాలైన ఆ అమర క్షణాలు క్రమంగా గతంలోకి జారుకోసాగాయి.
    ఎర్రని చిక్కని వెలుగు కిరణం ఒకటి అరమోడ్చిన తన కనురేప్పలకి గుచ్చుకోవడం తో ఉలిక్కిపడి , తన అస్థిత్వాన్నే మరిచి సంపూర్ణంగా అంకితం అయిపోయిన ఆ దివ్య ప్రణయ సమాధి నుంచి లేచింది విజయ. ఆమె కదలడం తో గోపాలం కూడా ఆనందమయ స్థితి నుంచి ఈ లోకం లోకి వచ్చాడు.
    "ఏవిటి విజయా?.......ఏవిటి అలా ఉలిక్కిపడ్డావు?" అన్నాడు గోపాలం.
    విజయ ఏం సమాధానం చెప్పకుండా చూపుడు వేలితో ఆకాశం చివరి అంచుని చూపించింది గోపాలానికి.
    చంద్రుడు అప్పుడే ఎర్రగా ఉదయిస్తున్నాడు.
    ఆ ఎర్రని చంద్రకాంతి లో తడిసి ఆపాద మస్తకమూ అరుణారుశోభతో అందిగిస్తున్న విజయ ని మరింత రాగరంజిత మొనర్చడం కోసం "ఉండు ఇప్పుడే వస్తా" నని చెప్పి డాబా మెట్లన్నీ దిగి హాల్లోకి వచ్చాడు గోపాలం. రామనాధం గారి స్వంత కాగితాలూ అయన రాసుకున్న కేసు నోట్ బుక్కులూ , డైరీలు ఉన్న అలమారు తెరిచాడు. తాను ఎన్నాళ్ళ నుంచో ఆ పుస్తకాల వెనకాల దాచిన ఒక చిన్న నగల పెట్టి తీయబోయాడు. ఆ కంగారు లో ఒక డైరీ కిందపడింది. కాగితాలన్నీ నిండుగా చిందర వందర గా ఉండి అలమారు ఓ మారు కదిపితే మొత్తం కాగితాలూ పుస్తకాలూ అన్నీ కింద పడేలా ఉన్నాయి. దాంతో ఆ డైరీ తిరిగి లోపల పెట్టడానికి ప్రయత్నం చెయ్యకుండా పెట్టినీ డైరీ ని రెండింటి ని తీసుకొని రెండు అంగల్లో తిరిగి డాబా మీదికి వెళ్ళాడు గోపాలం. ఎరుపు రంగులోంచి క్రమంగా స్వచ్చ ధవళ మైన తెల్లని రంగులోకి మారుతూన్న చంద్ర కాంతిని వింతగా చూస్తూ కూర్చుండి విజయ.
    "కళ్ళు మూసుకో విజయా?" అన్నాడు గోపాలం. నగల పెట్టి, డైరీ వున్న చేతులు ఆమెకి కనిపించకుండా వెనకాల దాచుకుంటూ-- నవ్వుతూ అతని కేసి చూసి కళ్ళు మూసుకుంది . పెట్టె తెరిచి తను "లా' చదవడానికి మద్రాస్ వెళ్ళేటప్పుడు విజయ ఇచ్చిన, వాళ్ళ అమ్మ గారి జిగినీ గొలుసు విజయ మెడలో అలంకరించ బోయాడు ఇంతలో చటుక్కున కళ్ళు తెరిచి గోపాలం చేతులు పట్టుకుంటూ "దొంగ దొరికాడు" అంది విజయ. వెంటనే ఆ గొలుసును చూసి ఆశ్చర్య పోయింది.
    "ఏవిటి /....ఇది మీరు అమ్మలేదూ?....ఇబ్బంది పడకుండా దీన్ని ఖర్చు పెట్టుకోమని ఇచ్చాను కదా?"
    "అవుననుకో విజయా!...నువ్వు అప్పట్లో చెప్పినదాన్ని బట్టి ఆలోచించాను. అసలు ఇది మీ అమ్మమ్మ గారిది . ఆవిడ మీ అమ్మగారికి ఇచ్చారు డబ్బులేక నానా అవస్థలూ పడుతూ దారిద్ర్యంలో సతమతమై పోతూన్న మీ అమ్మగారు ఈ జిగిని గొలుసు ని మాత్రం అమ్మకుండా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్ధం దాచుకుని నీకు అందించారంటే మీ కుటుంబంలో దీన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నా రో అర్ధం అవుతుంది. అటువంటిది నువ్వు ఇవ్వగానే నా చదువు కోసం దీనిని అమ్మేయడం భావ్యం కాదని అలోచించి అప్పటి నుంచీ భద్రంగా దాచి, ఎప్పుడు అవకాశం వస్తుందా నీకు ఎప్పుడు తిరిగి ఇద్దామా అని ఇన్నాళ్ళూ వేచి ఉన్నా"
    విజయ నిట్టుర్పు వదిలి "అయితే ఇది అమ్మకుండా -- ఆ పది పదిహేను రోజులూ, మావయ్య డబ్బు పంపించేదాకా ఎలా కాలక్షేపం చేశారు?....పస్తులు పడుకున్నారా?" అంది గద్గదికమైన కంఠం తో.
    "లేదు విజయా!...అప్పుడు నాకు ఇంటర్ కాలేజ్ మెట్ ఎస్సే కంపిటీషన్ లో " గోల్డ్ మెడల్ ఇచ్చారు కదూ?.....ఆ సందర్భంలో నువ్వు కట్టిన పెద్ద మల్లె పువ్వుల దండ ఒకటి మీ మావయ్య నా మెళ్ళో కూడా వేశారు, జ్ఞాపకం ఉందా ఆ మెడల్ అమ్మి కాలక్షేపం చేశా........."
    "ఆ.........ఆ స్వర్ణ పతాకాన్ని అమ్మేశారా?"
    "అయితే ఏం ?.........నాకు స్వర్ణ విగ్రహం లభించింది కదా?" అన్నాడు గోపాలం చిలిపిగా ఆమె కేసి చూస్తూ.
    "ఆహా! .......అలాగా?......" అంది విజయ కొంటెగా .
    నింగి నుండి నేలమీదకి వేలాడ దీసిన జలతారు పరదాలుగా ఉన్న చిక్కని వెన్నెల కెరటాలు, లోకాన్నంతా తళతళ మెరిసే ఒక పెద్ద వెండి కొట్టు లాగ దీవింపచేస్తూ వుంటే ఆ కొట్టులో ఉన్న బంగారు లక్ష్మీ విగ్రహం లాగ, తెల్లని వెన్నెట్లో పచ్చని విజయ , సౌందర్య దీపితులతో అతిలోక సుందరంగా కనిపించ సాగింది గోపాలానికి.
    డాబా మీద చలిగా ఉంది కిందికి పోదాం రండి" అంది విజయ. తన ఆనందాన్ని ఆ వెన్నెట్లో గోపాలం కళ్ళతో తాగుతున్నడనే సంగతి పసిగట్టి.
    "వద్దు.విజయా...కాస్సేపు అలా కూర్చో , క్రొత్త వెలుగులు దిద్దుకుంటూన్న నీ సౌందర్యాన్ని కళ్ళకి తనువూ తీరా చూడనీ.
    ఆ మాటలకి ఆనంద పారవశ్యంతో విజయ అతని చెక్కిళ్ళు నిమురుతూ "అదేవిటి గోపాలం.....ఎప్పుడూ చూడనట్టు?.....ఇవాళ నాలో క్రొత్త అందాలు ఏం వచ్చాయి అని" అంది విజయ.
    గోపాలం ఏం సమాధానం ఇవ్వలేదు. తృప్తిగా ఒళ్ల గుటక వేశాడు ఉత్త నోటినే. అది చూసి అతని జుట్టు లోకి వెళ్ళు పోనిచ్చి తలని తన హృదయం లోకి హత్తుకుంటూ పిచ్చి నాన్నా" అంది విజయ గోపాలాన్ని ఒక పసివాడిలా లాలిస్తూ. పరాకాష్ట చెందిన ప్రళయ సమాధిలో శారీరక మానసిక చేష్టలన్నీ ఉడిగి అలా ఉండి పోయారు ఇద్దరూ చాలాసేపటి వరకూ...
    డాబా దిగివచ్చిన తరువాత విజయ అన్నం వడ్డిస్తుండగా హల్లో కూర్చున్న గోపాలం ఏమీ తోచక ఇప్పటి దాకా తన చేతిలో ఉండిపోయిన రామనాధం గారు డైరీ పేజీలు  యధాలాపం గా తెరగేయ సాగాడు. ఒకచోట "పెద్దకాపు గారు వెంకడి ద్వారా పంపిన వంద రూపాయలు అందాయి" అని ఉంది. పక్క పేజీలోనే గోపాలానికి ఇవాళ వందా మనియార్డర్ చేశాను అని వుంది. ముప్పయి పేజీలు  ముందుకి తిప్పాడు గోపాలం . మళ్ళీ అలాగే వంద రూపాయలు శేషయ్య పంపినవి ముట్టినట్లు, గోపాలానికి పంపినట్లు ఉంది. ఇలా ప్రతి ముప్పయి పేజీలకి ఉంది. ఒకచోట ఏమిటో డబ్బు పంపేది అటు అన్నగారు.....అందుకోనేది ఇటు తమ్ముడు.......మధ్యన శ్రమ శేషయ్య గారికి, మెహర్బానీ నాకు .......చిత్రంగా ఉంటుంది లోకం పద్దతి చూస్తె" అని వుంది.
    గోపాలానికి తల గిర్రున తిరిగినట్లయింది.
    అతనికి ఎన్నెన్నో సంగతులు జ్ఞాపకం రాసాగాయి.
    అసలు సంగతి తెలియక తానా రోజున అన్నయ్య తో ఎంత దురుసుగా అనేశాడు. "కృతజ్ఞత అంటూ చూపించాలంటే నేను ఒక్క రామనాధం గారికే చూపించాలి . ఆయనే నా "లా' చదువు కి సహాయం చేశారు' అని....అన్నయ్య ఎంత బాధ పడ్డాడో.......
    శేషయ్య గారికీ, అన్నయ్య కీ తగాదా వచ్చిందనీ , ఊళ్ళో రెండు పార్టీలుగా చీలిపోయారనీ, ఎలక్షను పోటీలో ఇద్దరూ నిలబడుతున్నారనీ , ఇప్పుడు అన్నయ్య కీ శేషయ్య కీ మధ్యన పచ్చ గడ్డి వేస్తె భగ్గు మంటోందనీ చూచాయగా పల్లె నుంచి వస్తూన్న మనుష్యుల ద్వారా వింటున్నాడు తను.
    వాళ్ళ తగాదాకు ఇది కాదు కదా కారణం ?....ఇదే అయితే అన్నయ్యా, పెద్ద కాపుల వైరానికి ,బాధ్యతా, దోషం కూడా తనదే.....ఎంత అనాలోచితంగా ప్రవర్తించాడు తను......ఏమో!...ఇలా అని ఎప్పుడేనా తను అనుకున్నాడా?...రామనాధం గారు మాట వరస కి అయినా తనతో ఈ సంగతి చెప్పలేదే?.......అయినా అన్నయ్య మాత్రం నెలనెలా ఇలా రామనాధం గారి ద్వారా ఎందుకు పంపించాడు?.......ఏవిటో ........ఆలోచించిన కొద్ది ఒక్కటీ అర్ధం కావడం లేదు.....కాని ఒక్కటి మాత్రం నిజం......రామనాధం గారు కాదు, ఎవ్వరూ కాదు, తనకి మొదటి నుంచి చివరి దాకా సాయం చేసింది అన్నయ్య ఒక్కడే!...తన అస్తిత్వానికి , ప్రస్తుతం ఉన్న తన స్థితికి అన్నయ్యే, అన్నయ్య మాత్రమె కారణం ! ఆ సంగతి తను ఇప్పటి దాకా కనుక్కోలేక పోయాడు!....అసలు సంగతి తెలియక అప్పుడు అన్నయ్య తన దగ్గరికి వస్తే ఏవేవో వాగాడు తను...అన్నయ్య ఎంత బాధపడ్డాడో కదా?.....అయ్యో దౌర్భాగ్యమా?...ఎంత పని చేశాడు తను? పోనీ ఈ జరిగిపోయిన పొరపాటు అంతా చెప్పి క్షమించమని అన్నయ్యని ప్రార్ధిస్తే......హు...ప్రార్ధించడమా........ఏ మొహం పెట్టుకుని?
     విజయ 'అన్నం వడ్డించేశాను" అని కేక వెయ్యడంతో గబగబా ఆ మానసిక స్తితి నుంచి సర్దుకుని చేతిలో ఉన్న డైరీ ని తన పుస్తకాల మధ్యన పదిల పరిచి వంటింట్లోకి వెళ్ళాడు .....
    "ఏవిటలా పరధ్యానంగా ఉన్నారు?.....అయ్యో అదేవిటండీ?.......భోజనం కూడా అలా కచ్చి కచ్చిగా తింటున్నాడు. సయించడం లేదా?......... వంట్లో బాగోలేదా ?....ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కాదుటండీ సరదాగా' అంటూ విజయ ఏక ఆందోళన పడసాగింది. తన ఆలోచనలతో తను ఉంది మౌనంగా కాలం గడపసాగాడు గోపాలం. "ఏవిటి చెప్మా ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అంటూ తెగ మధన పడుతూ అడగడానికి భయపడి ఊరుకుంది విజయ.
    ఆ రాత్రి అలా బరువుగానే గడిచింది.
    మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలు కాకుండానే కోర్టు నుంచి వచ్చేశాడు గోపాలం . ఎప్పుడూ లేంది ఇలా రెండు గంటలకి వచ్చేశారేమిటి చెప్మా అనుకుంది విజయ. గోపాలం ముఖంలో తీవ్రమైన ఆందోళనా, తీక్షమైన వ్యగ్రతా కనిపించాయి. ఏదో బలమైన మానసిక సంచలనంతో బాధపడుతున్నట్లు కనిపించాడు విజయ కి-- బాగా అలసినట్లున్నారని అనుకుని కుంపటి అంటించి కాఫీ తయారు చేసి కప్పులో పోసి హాల్లోకి తీసుకు వెళ్ళింది. అప్పుడే ఏదో కాగితం రాయడం పూర్తీ చేసి సంతకం పెడుతున్నాడు. దగ్గరగా వెళ్లి "బాగా అలసి నట్లున్నారు - కాఫీ తీసుకోండి" అంది విజయ.
    విజయ ముఖం లోకి ఒక్కక్షణం శూన్యంగా చూసి "ఇప్పుడు కాఫీ ఏం వద్దు .నేను అర్జంటుగా పల్లె వెళుతున్నాను........" అన్నాడు.
    పల్లె ! అంత అర్జంటు ఏం వచ్చిందండీ?...మీ అన్నయ్య గారూ, వదినా, వాళ్ళ అమ్మాయీ , అంతా కులాసాయేనా?...ఆ కాగితం ఏవిటి అంత తొందరగా రాశారు?' అంది ఆదుర్దాగా......
    "అదా?.....అదీ....నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా లే" అన్నాడు నెమ్మదిగా నిశ్చలమైన కంఠం తో.
    "అయ్యో...........అదేవిటండీ !........రాజీనామా ఏవిటి ?.......ఏం జరిగింది?" అంది విజయ , చేతిలో ఒణుకుతూన్న కప్పు టేబిల్ మీద పెట్టి, నుదుటి మీద పట్టిన చెమట పైట తో తుడుచు కుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS