కౌసల్య
పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి

అలవాటు ప్రకారం ఆరోజు కూడా కొబ్బరి తోట నాలుగు మూలలా ఓమాటు తిరిగి, వెంకట్రామయ్య పల్లపు చెలో అడుగు పెట్టాడు. అంత క్రితం రెండు మూడు రోజులయి కోత కోశారేమో. చేనంతా వెలవెలబోతూ చిన్నబోయి నట్టుంది. ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరగ కుండానే ఏదో ఆలోచిస్తూ 'వీరిగా!' అని పిలిచాడు వెంకట్రామయ్య.
అప్పటిదాకా చేతులు కట్టుకుని వెనకాలే వస్తూన్నే వీరిగాడు 'సిత్తం బాబయ్యా!" అంటూ ఎదరకు వచ్చాడు.
'ఈ గరవ చేలో ఏం చల్లావూ?"
"జనుము చల్ల,మన్నారు కదాండీ!"
"అవునవును . ఆ పక్క చెక్క లో పిల్లి పెసరా, మూడో దాంట్లో ఉలవనూ . అవునా?"
"సిత్తం."
"దీంతో ఇంకీ ఏటికి దూళ్ళ గ్రాసం కోసం తడువుకో. అక్కర్లేదు. ఏమంటావు?'
"అవునండి, కాని...."
వెంకట్రామయ్య వీరిగాడి కేసి చూసి కొంచెంగా నవ్వి అన్నాడు. 'కాని మనకీ ఏడు మినుగులూ, పెసలూ లేవంటావు. అంతేనా?" వీరిగాడు అవునాన్నట్లు తల ఊపాడు.

"మొదట దూడలు తిని సుఖించాలి. వాటి మూతులు కట్టి మనం ఎంత పండించినా లాభం లేదు. అవి ఉసూరుమంటే మనకి జయం కాదు. ఇంక మనకి అంటావా, మినుగులూ, పెసలూ చెరో అర బస్తా సంతలో కొనుక్కుంటే సరి పోతుంది. ఆ! గట్ల మీద కంది మొక్కలు కాపు పట్టాయా?"
"అక్కడక్కడ ఓ కాయ గింజ పట్టినా మొత్తం మీద తప్ప కాయలే శానా ఉన్నాయండి.'
'నెమ్మదిగా అవీ గింజ పడతాయిలే" అంటూ వెంకట్రామయ్య మళ్లీ నడక సాగించాడు. ఆ మసక చీకటి లో చేనంతా పరిశీలిస్తూ గట్టు వరకు నడిచాడు. ఉన్నట్టుండి ఆగి "వీరిగా , ఈ చేలో ఈ మూల పనలేవీ కనిపించవేం?" అన్నాడు.
"అయ్య బాబు! మన కమతం లోనే దొంగ తనం!" అంటూ గబగబా ముందుకు వచ్చి ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద పనలను చూసి "అబ్బే, అది కదండీ. మొన్న సేను కోత కోసినప్పుడు ఈవారని సిన్న మునువు అయిపొయింది. అందుకని కూలోడు ఇక్కడ కోసిన ఓరి కూడా పక్క పనల్లో కలిపేశాడు. అందుకే, సూడండి ........సెలో అన్నింటి కంటే ఈ పక్క పనలే పెద్దవిగా ఉన్నాయి." అన్నాడు వీరిగాడు.
వెంకట్రామయ్య పరిశీలనగా చూసి, తృప్తి పడ్డాడు. "అయినా పనలు అట్టే రోజులు చేలో ఉండటం మంచిది కాదు. పైగా ఈ ఏడు చేను కూడా బాగా పండింది."
"అదీ నిజమే నండి-- ఏ ఓర్వలేనివోదో నాలుగు పనలు పట్టుకుపోయినా పట్టుకు పోవచ్చు.'
"ఏదైనా జరగచ్చు. రోజుల పరిస్థితి ఏం బాగా లేదు.....మొన్న రాత్రి చూశావా? మునసబు గారి చేలోనే నాలుగైదు బస్తాలకయితే కుప్ప నలుపుకొని పోయారు."
"మరేనండి. బొత్తిగా బయం బత్తీ లేకుండా బరి తెగించి పోయారు."
"అందుకని, ఇంక ఆలస్యం చెయ్యడానికి వీలులేదు. రేపే కూలి వాళ్ళని పెట్టు."
"సిత్తం."
"ఎంత రాత్రయినా సరే కట్టేత్తా. బల్ల కొట్టూ అయిపోయి ధాన్యం ఇంటికి చేరాలి."
"సిత్తం...సిత్తం."
"అవసరం అయితే నలుగురు మనుషుల్ని ఎక్కువ పెట్టు."
"అలాగేనండి."
తోటా, చేనూ అంతా పరిశీలించి పాక దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా తెల్లవారింది. తడితడిగా ఉన్న చేలో నుంచీ, మంచు కురిసిన నేల మీద నుంచి నడిచి రావడం మూలాన చల్లగా తడిసి బురద బురదగా అయిన పాదాలను దూడల పక్క నున్న వెచ్చటి వట్టి గడ్డితో తుడుచుకుని, పాక పక్కన వదిలి వెళ్ళిన కిర్రు చెప్పులు తొడుక్కున్నాడు వెంకట్రామయ్య. ఖద్దరు శాలువా చెవుల మీద నుంచి కప్పుకుంటూ, "పాలు తియ్యడం అయిందిరా సత్తేయ్యా?" అన్నాడు.
"అయ్య! ఇంక బట్లావు పాలే తియ్యాలండి" అన్నాడు సత్తెయ్య.
"కోడె దూడ కో పక్క వదిలేస్తున్నావా?"
"మీరు సెప్పిన కాడ నుంచీ అలాగే సేత్తున్నా నండి" అన్నాడు సత్తెయ్య కోడె దూడను బట్లావు దగ్గరికి వదులుతూ. వెంకట్రామయ్య గొంతు విని బట్లావు 'అంబా' అని అరుస్తూ కట్రాట ఊడలాగెయ్యడం ఆరంభించింది. వెంకట్రామయ్య నవ్వుకుని, నాలుగు గరికలు పీకి దాని నోటికి అందించాడు. దానితో దాని ఆగడం కొంత తగ్గింది కాని, మెడ ఎత్తి వెంకట్రామయ్య కు ఇంకా దగ్గరగా వచ్చింది. దాని గంగడోలు గోకుతూ "చిట్టు దాగర దగ్గర పెట్టె పితికావా, బార కొమ్ముల గేదె పాలు?' అన్నాడు వెంకట్రామయ్య.
"దూడ పోయిన కాడ నుంచీ ఏ రోజునా, సిట్టు దాగర చూపించక పొతే , పాలే ఇవ్వడం లేదండి అది" అన్నాడు సత్తెయ్య.
"దీని గంగడోలు నిండా మున్నేల్లె. రోజూ బాగా తోమి కడగడం లేదా దూళ్ళను?"
సత్తెయ్య సమాధానం చెప్పలేదు.
"రేపు దూళ్ళ నన్నింటిని 'కౌశిక' కు తోలు కెళ్లి శుభ్రంగా గడ్డి పెట్టి తోము" అన్నాడు వెంకట్రామయ్య.
'అయ్య" అన్నాడు సత్తెయ్య.
వెనక్కు తిరిగి వెంకట్రామయ్య "వీరిగా!" అని పిలిచాడు. కోడె దూడను బట్లావు ముందు కట్టేస్తూ "మావ కొబ్బరి మట్టలూ, కాయలూ ఏరుకు రాడానికి తోటలో కెళ్లాడండి" అన్నాడు సత్తెయ్య.
"ఆహా!" అని ,వెళ్లి, పాక పక్కనే ఉన్న వేప కొమ్మ విరుచుకుని దంతధావనం ఆరంభించాడు వెంకట్రామయ్య.
పాకకు పశ్చిమంగా అనుకుని ఉన్న కొబ్బరి తోట లో ఇంకా చీకట్లు దోబూచులాడుతూనే ఉన్నాయి. తూర్పున ఉన్న పల్లపు చేను సంపదలు పోగొట్టుకొన్న ధనావంతుని లా వెలవెల పోతూ వుంది. చితికి పోయిన ఆస్తికి చిహ్నంగా మాత్రమే మిగిలిన కంది మొక్కలు గట్ల పై నుంచి తల లాడిస్తున్నాయి. శరీరాన్ని గడ్డ కట్టించే లాగా వీస్తున్న ఆ చల్లని గాలి తెరలకు పక్క చేలో పాలేళ్ళు వేసుకున్న చలి మంట క్రమేపీ సన్న గిల్లు తూంది. చెట్ల మీద నుంచి అప్పుడే లేచిన పక్షుల కలకల ధ్వనులూ, క్షీర ధారల శబ్దాలూ, దూరపు చేలల్లోంచి ఉండుండి వినిపించే పశువుల అరుపులూ, మనుష్యుల కేకలూ ఆ వాతావరణం నిశ్శబ్దాన్ని కొంతవరకూ భంగ పరుస్తున్నాయి.
పాలు తియ్యడం పూర్తీ చేసి సత్తెయ్య చేదతో, మోట నూతిలో నీళ్ళు తోడి తెచ్చి వెంకట్రామయ్య పక్కన పెట్టాడు.
"ఎంత వెచ్చగా ఉన్నాయిరా !" అంటూ ఆ నీళ్ళతో మొహం కడుక్కోవడం పూర్తీ చేసి "ఒరేయ్! పాక మీద అనప పిందే లెవైనా ముదిరాయా? శాస్త్రి గారింటి కివాళ వియ్యాలారోస్తారుట! రెండు కొయ్యి. దారిలో ఇద్దాం" అని పురమాయించి ఖద్దరి శాలువా ఓ మాటు దులిపి ఒంటి నిండా కప్పుకుని ఊరు వేపు బయలుదేరాడు వెంకట్రామయ్య. ఓ కొమ్ములో పాల తమ్మెలాలు, ఇంకో కొమ్ములో కాళీ చిట్టు దాగరా , అందులో నాలుగు అనపకాయలూ వేసుకొని, ఓ చెయ్యి కావిడి మీదుగా జాపి పరధ్యానంగా వెనకాలే వస్తున్నాడు సత్తెయ్య.
ఉన్నట్టుండి ఆగి "నీ ప్రధానం ఎప్పుడురా!" అన్నాడు వెంకట్రామయ్య.
సత్తెయ్య ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని సిగ్గుతో "రేపేనండి" అన్నాడు.
"ఏవిటి, రేపే? బుధవారం నాడు!" అని గుచ్చి గుచ్చి అడిగిన వెంకట్రామయ్యకు 'అవును' అన్నట్లు తల ఊపి సమాధానం చెప్పాడు సత్తెయ్య.
"ఏడిసినట్టుంది. ఆ సంగతి చెప్పడెం వీరిగాడు, రేపు కట్టెత చేసి బల్ల కొట్టిద్దాం అంటే?"
సత్తెయ్య ఏం మాట్లాడలేదు.
"సరేలే. రేపూ ఎల్లుండీ ఊరుకుని అవతల ఎల్లుండి శుక్రవారం కొట్టిద్దాం. నువ్వేమో పాలిచ్చేసి చద్ది అన్నం తిన్నాక దూళ్ళ ని విప్పడానికి వస్తావు చూశావా, అప్పుడు చెప్పు వీరి గాడితో 'గూడెం లో కూలి వాళ్లకి చెప్ప'దని . ఈ రెండు రోజులూ నువ్వూ, వీరిగాడూ కూడా పొలం రానక్కర్లేదు. పాలు తీసి దూళ్ళ ని మేపడానికి నేనెవరి నేనా పురమాయిస్తాలే!"
పరధ్యానంతో బాటు ఆశ్చర్యాన్ని కూడా జోడించి "ఏవండీ!" అన్నాడు సత్తెయ్య.
"ఏమిటేమిట్రా , నీ మొహం! అవతల కూతురు ప్రధానం అవుతుంటే పొలం ఎలా వస్తాడు వీరిగాడు/ నువ్వు సరేసరి. పెళ్లి కొడుకువు గదా! ఇంక మీ ఇద్దరూ లేకుండా ధాన్యం మూసూలేమిటి? అందుకే శుక్రవారానికి మార్చాను. " ఆన్నాడు వెంకట్రామయ్య. యజామాని ఆప్యాయతకు సత్తెయ్య కళ్ళు చెమర్చాయి.
ఊరి మొదట్లో చెరువు గట్టు దగ్గరకు వచ్చేసరికి మునసబు గారు ఎదురయ్యారు. నోట్లో చుట్ట తీసేసి నమస్కారం పెట్టారు. ఆ నమస్కారాన్ని చిరునవ్వుతో అందుకుని వెంకట్రామయ్య ముందుకు సాగాడు. నీళ్లకని చెరువుకు వస్తున్న ఆడవాళ్ళు వెంకట్రామయ్య ను చూసి గౌరవంగా తప్పుకుని వెళ్లసాగారు. గుమ్మాల్లో ముగ్గులు పెడుతున్న స్త్రీలు తలుపు చాటుకు మర్యాదగా తప్పుకున్నారు.
మొదటి వీధి చివర ఆగి, అప్పుడే దంత ధావనం చేసి అరుగు దిగుతున్న శాస్త్రి గారిని ఉద్దేశించి "శాస్త్రులుగారూ! మా చేలో పాక మీద పెట్టాం అనప పాదు. మొదట కాసిన కాయలు. కూర వండించండి" అని వెంకట్రామయ్య సత్తెయ్య వేపు చూశాడు. ఉన్న వాటిలో రెండు పెద్ద కాయలు తీసి శాస్త్రి గారి అరుగు మీద ఉంచాడు సత్తెయ్య.
శాస్త్రి గారు సంతోషాన్ని ముఖంలో కనబరుస్తున్నందుకు నాయందున్న అభిమానం అలాగే ఏ లోకం లో ఉన్నారో అన్న గారికి నా మీద ఇంత వాత్సల్యం ఉండేది" అన్నారు.
