Previous Page
దీప శిఖ పేజి 41

                          
                                   17    
    చెలల్లోని వన్య లక్ష్మీ ని చూసి , తమ సంపదలన్నీ సద్వినియోగం అయ్యాయి కదా అని ఆనందించే ఉదార వృద్ద మూర్తులులా నిర్మలంగా తెల్ల పువ్వులు నవ్వుతూ , నీల మేఘ శ్యాముని మెడలోని ముత్యాల హారాల వలె అందంగా ఆకాశం లో అటూ ఇటూ కదలాడు తున్నాయి . శరన్మేఘాలు , అజ్ఞానం లా పొగమంచు, లోకం అంతా వ్యాపిస్తోంది. దురదృష్టవంతుని కష్టాల లాగ రాత్రిళ్ళు అతి దీర్ఘాలవుతున్నాయి . లోకంలో పెరిగిపోతున్న అన్యాయాన్ని, చూడలేక ప్రకృతి మాత కళ్ళల్లో నిలిచినా భాష్ప కణాల వలె ఆకుల్లో, పూదోనెల్లో , ఇంటి చూరుల్లో , ఆఖరికి గరిక  మొలకల అగ్ర భాగాలలో కూడా మంచు బిందువులు తొణికిసలాడుతున్నాయి.
    నీరు కురుస్తోంది.
    దీప్తివంతం కడానికి నిప్పు వేరుస్తోంది.
    ప్రతి ముంగిటి లోనూ చలి మంటలూ, పండగ ముగ్గులూ, బంతి చామంతి కిరీటాలు ధరించిన గిబ్బెమ్మ లూ కనిపిస్తున్నాయి.
    ప్రతిభావి చేవులకీ పొలాల్లో ని కుప్ప నూర్పుల కేకలూ, ఊళ్ళో ని సాతాని జియ్యరు పాటలూ దేవాలయం లోని ధనుర్మాసపు గంటలూ వినిపిస్తున్నాయి.
    ఎక్కడా చూసినా ఆనందం నర్తిస్తోంది.
    శంకరం హృదయం లో మాత్రం మంచు కురుస్తోంది.
    దాదాపు రెండు దశాబ్దాల క్రితం!
    క్రొత్తగా నాట్లు వేసి ఊడ్చిన వరిచేల మధ్య నుంచి నడిచి బతుకు పంటని పండించు కుందాం అని తానీ ఊరు వచ్చాడు భార్యనీ, తమ్ముడ్నీ, మణి ని వెంట బెట్టుకుని.
    ఆరోజు వచ్చింది నలుగురు.
    ఈ రోజున తనకి మిగిలింది తను ఒక్కడే.
    ఎన్ని ఆశలు మనస్సు లో పోదుపుకొని , ఎన్ని కోరికలు హృదయంలో రంగరించు కొని ఆ రోజున తానీ ఊరు వచ్చాడో.
    కాని...కాని?.......జరిగిందేమిటి?
    కాలం తనని కాటేసింది.
    విశిష్టంగా ఉండవలసిన తన బ్రతుకు నిండా అహంకార విషం పాకి విషాదం గా మారిపోయింది.
    తన జీవితమే కాలిపోయింది.
    అవును సావిత్రి దేహంతో పాటే అది కూడా కాలిపోయింది.
    ఈ ఆలోచనతో గుండెల్లో ముళ్ళ గుత్తులు కదిలినట్ల యి శంకరం "అమ్మా?" అని బాధగా మూలిగాడు.
    కడుపులో ఏదో ఆవేదన .
    మెదడు లో భరించలేని మంట.
    గుండెల్లో ఆరని ఒక తీవ్ర జ్వాల!?
    తనని నిలువెల్లా ఎవరో మేలి పెట్టి పిండేస్తున్నట్లు నరక యాతన .
    ఈ బాధా, ఆవేదనా భరించలేకే, రోజూ ఇది ఆకలి బాధ ఏమో అనుకొనేవాడు.
    అవును-- ఆకలి కాదు మరీ-
    తను ముగ్గురి అన్నం తినాలి- సావిత్రి ది మణి డి తనదీను.
    వాళ్ళిద్దర్నీ మింగేసినా ఇంకా తనకి ఆకలి తీరలేదు.
    ఇలా అనుకుంటూనే రోజూ బియ్యం కడిగి కుంపటి మీద పెడుతున్నాడు. ఓ రోజున అగ్గిపెట్టి అంతా అయిపోయినా కుంపటి అంటుకోక విసుగొచ్చి ఆ మట్టునే ఉత్త కుంపటి మీద గిన్నె పెట్టి బయటి కొచ్చాడు. ఇంకో రోజున అన్నం ఉడికి మాడి బొగ్గులయ్యాక కాని జ్ఞాపకం రాలేదు కుంపటి మీద అన్నం పడేశామన్న సంగతి -- ఓరోజున అన్నం వండుకు నీ తినడం మరిచి పోయాడు. అలా మరిచి పోకుండా జ్ఞాపకం ఉన్న రోజున తీరా కంచం ముందు కూచుంటే , పట్టుచీర కట్టుకుని వడ్డించే సావిత్రీ , పరికిణీ కుచ్చెళ్లు పట్టుకొని ఇంట్లో అటూ ఇటూ పరిగెట్టే మణీ జ్ఞాపకం వచ్చి ముద్ద నోటికి ఎక్కలేదు. అన్నం వడ్డించు కొన్న కంచం లోనే చెయ్యి కడుక్కుని వచ్చేశాడు.
    అలా వచ్చేస్తే మాత్రం జ్ఞాపకాలు తనని తరుముకు రాకుండా మానుతున్నాయా?.......
    ఇటు ఇంట్లోకి చూస్తె- లంకంత కొంప -- ఇందులో తను ఒక్కడు?
    తనని చూసి పగలబడి నవ్వుతున్నట్లు ప్రతి గదీ విశాలంగా-- ఖాళీగా.
    ఇంట్లో ప్రతి వస్తువూ ఓ మారు సావిత్రి నో, ఓమారు మణి నో జ్ఞాపకం చేస్తూ తనని హింసిస్తూ.
    అందుకే ఇల్లు పెడుతూన్న చిత్ర హింసని భరించలేక రెండో వీధిలో వున్న గుమ్మం తెరిచి అరుగు మీద కూచుంటూ ఉంటాడు.అప్పుడప్పుడు.
    అదీ దుర్బారమే కాసాగింది రోజు రోజుకీ.
    దారిని పోయే ప్రతి వాడూ ఆగడం కులాసాగా ఉన్నారా బాబూ?' అని పలకరించడం.
    "కులాసా-- హు!"
    ఎంత పలకరించినా సమాధానం ఏం చెప్పకుండా కేవలం గుడ్లప్పగించి చూస్తూ ఊరుకొన్న శంకరాన్ని చూసి జనం కదిలి ముందుకి నడిచేవారు.
    శంకరం ఆలోచన మాత్రం రోజు రోజుకి వెనక్కే నడవ సాగాయి.
    తను ఈ ఊరు వచ్చి సాధించింది ఏవిటి ?
    శేషయ్య తో విరోదాన్నా?
    తోడబుట్టిన వాడితో తగాదానా?
    కన్న కూతురు అసహ్యాన్నా?
    కట్టుకున్న దాని మరణం తో సంపూర్ణం అయిన సర్వనశానాన్నా? దేన్నీ? ..దేన్నీ తాను సాధించింది?
    ఈ ఇరవై ఏళ్ళ పాటూ అదృష్ట దురదృష్టాలు రెండూ తనని పణంగా పెట్టుకుని తెల్లని నల్లని గళ్ళలో చదరంగం ఆడుకున్నాయి. చివరికి అదృష్టం అలిసిపోయి తనని దురదృష్టానికి అప్పగించి చల్లగా తప్పుకుంది.
    తను గట్టిదనుకున్న ప్రతి కొమ్మా జారిపోయింది.
    మొదట తమ్ముడు -- తర్వాత శేషయ్య. చివరికి మణి. ఆఖరికి సావిత్రి కూడా. తన బ్రతుకులో సావిత్రి అయినా మిగులుతుందని ఆశించాడు . ఉహు!....అంత అదృష్టం కూడానా తనకి?
    ఇలా అరుగు మీద కూర్చుని ఆలోచిస్తున్న శంకరం చేతి కేదో తగిలినట్లయి ఉలిక్కిపడి చూశాడు!
    నల్లగా బలిసిన ఆంబోతు!
    రెండేళ్ళ క్రితం పెళ్ళంట హడావుడి చేసి అచ్చేసి శేషయ్య ఊళ్ళో వదిలి పెట్టిన ఆంబోతు అది.
    రోజూ ఈ పాటి వేళ రావడం, సావిత్రి పెట్టిన తెలగ పిండో, తవుడో కంది పొట్టో ఏదో ఒకటి తిని నెమ్మదిగా అక్కడ నుంచి కదలడం డానికి అలవాటు.
    సావిత్రిని జ్ఞాపకం చేస్తూ రోజూ ఇదొకటి తన ప్రాణానికి!
    "వెళ్ళు...వెళ్ళు అ దయామయి వెళ్ళిపోయింది " అన్నాడు డగ్గుత్తికతో శంకరం.
    కాని అది కదలలేదు.
    "నీ స్థితి, నా స్థితీ ఒక్కలాగే ఉంది. కానయితే నీకు ఇల్లోకటి లేదు. నిత్యమూ జ్ఞాపకాలతో ఏడిపించడానికి-- నాకంటే నువ్వే నయం -- ఎందుకూ?....నేను కూడా మిగిలిన ఈ ఒక్క అనుబంధాన్ని తెంపేసుకుంటా -- బాకీ కింద ఈ ఇల్లు తీసేసుకోమని , పంతులు భార్యకి ఈ ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరి.
    వెళ్ళడం ...ఎక్కడికి ?.......తమ్ముడి దగ్గరికా?......ఉహు !.....వాడినేనా హాయిగా బ్రతక నియ్యకుండా ఈ దురదృష్ట జాతకుడు అక్కడికి కూడా ఎందుకు? ...మరి ఎక్కడికి?.....అనంతంగా ఉన్న ఈ లోకం లోకి.....ఈ ఊరుని వదిలి వెళ్లి పోవడమే ?....ఇన్నేళ్ళు గా తన జీవితంతో రకరకాలుగా ముడిపడి ఉన్న ఈ ఊరిని వదిలెయ్యడమే.....
    ఏం వదిలెయ్యక?....ప్రాణం తో సమానంగా ఉన్న సావిత్రి ని ఒదిలెయ్యలేదూ తను? అగ్ని జ్వాలలకి కూడా అప్పగించేశాడే! అంతకంటే ఎక్కువా ఈ ఊరు తనకి?.....ఇలా తర్కించి తర్కించి ఒక్క శేషయ్య ని తప్ప తక్కిన ఆ ఊరి చిత్రాన్నంతా తన మనః ఫలకం మీంచి చరిపెసుకో గలిగాడు శంకరం ..ఇంక చెయ్యవలసిందల్లా తన నిర్ణయం ప్రకారం ఈ ఇల్లు పంతులు భార్యకి అప్పగించేసి తనీ ఊరు వదిలి వెళ్ళిపోవడం -- అవును -- అలా చేసేయాలి.
    అనుకుంటూ లేచి శంకరం ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు చూసి, శంకరం లోని అహంకారం లాగ ఆ ఆంబోతు కూడా అడుగు కదిపింది నెమ్మదిగా.......
    పంతులు భార్యకి సామాను తో సహా ఇల్లంతా స్వాధీనం చేసేసి, ఆ సాయంత్రమే ఊరు కూడా వదిలి శంకరం వెళ్లి పోతున్నాడని విని శేషయ్య నిర్విడై పోయాడు.
    ఏవిటి?
    శంకరం వెళ్ళిపోతున్నాడా?
    ఎక్కడికి?....ఎందుకు?....
    ఒక్కసారిగా శేషయ్య హృదయం అంతా కల్లోల తరంగితం అయిపొయింది. అతనికి ఏ ఆలోచన తోచలేదు. అస్థిమితంగా ఇటూ అటూ వసారా లోంచి పడమటింట్లో కి, పడమటింట్లో నుంచి వసారా లోకి ఏకధాటిగా కాలుగాలిన పిల్లిలా తిరగసాగాడు. గుండెల్లో కొండంత బెంగ. ఏదో చెప్పలేని ఆవేదన. ఆ పూట అన్నం సయించ లేదు. జీవిత పరమార్ధాన్ని పోగొట్టుకున్న జిజ్ఞానువు లాగ, కకావికలైన మనస్సు తో అశాంతి గా బాధ పడసాగాడు.
    ఏవిటి?....రేపటి నుంచి ఇంక శంకరం కనిపించడూ?....ఆ ఆలోచనతో తీవ్రమైన సంచలనం రేగింది. అతని మనస్సులో -- శంకరం లేని పల్లెని ఊహించలేక పోతున్నాడు.
    మాట్లాడినా మాట్లాడక పోయినా ఊళ్ళో ఉన్నాడంటే అ సంతృప్తి వేరు -- ఇప్పుడేమిటి ? ఇంక శంకరం తనకి కనిపించడు. శేషయ్య కి ఏడుపు వచ్చినంత పని అయింది -- శంకరాన్ని తను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడర్ధమైంది తనకి.
    పోనీ వెళ్ళవద్దని అపు చేస్తే ?....వింటాడా . తన చాదస్తం కాని?..... ఎంత పౌరుషం ఎంత పట్టుదలా ?..అతనికి తోచాలే కాని ఒకళ్ళు చెబితే వింటాడా , అందులో తను చెబితే..........
    అయినా, పాపం ఏం చూసుకుని ఉంటాడీ ఊళ్ళో?
    జీవితం లో అతనికి ఏం మిగిలింది కనక ఇక్కడ?
    తమ్ముడు తన దోవ ఏదో తను చూసుకున్నాడు కదా?
    భార్యా అలా అన్యాయంగా బలి అయిపొయింది.
    ఇంక మిగిలింది ఆ మణి ఒక్కత్తే!
    అది కూడా ఈ మధ్యన కనిపించడం లేదు. శంకరమే ఎక్కడి కెనా పంపించేశాడో లేదా అదే వెళ్లి పోయిందో?
    శంకరం వెళ్లి పోతాడన్న సంగతి ఉండుండి జ్ఞాపకం వచ్చి మనస్సు కలుక్కు మంటోంది శేషయ్య కి..వెళ్లి అపు చేద్దాం అంటే తన మాట వినదు. ఆ మహా సాద్వి చనిపోయాక పాత కక్షలన్నీ మరిచిపోయి తనకు తానై ఎన్నిమార్లు పలకరించాడు కాదు? ఒక్కమారు ఒక్క మారంటే ఒక్క మారు శంకరం పలికాడా? మాట్లాడాడా?...ఉహు......లాభం లేదు . తను చెబితే వినడు-- ఆపితే ఆగడు......ప్చ్........సరే ఓ డబ్బా నిండా మినప సున్ని ఉండలూ, ఓ అత్తా పెట్టె నిండా పూత రేకులూ కుక్కి పెట్టి కంచు మర చెంబు నిండా చిక్కని పాలు పోయించి , రంగయ్య కి కబురు చేశాడు శేషయ్య. "శంకరం గారు ఏదో ఊరు వెళుతున్నారు. ఒత్తుగా గడ్డి వేసి జంబుకానా పరిచి సవారీ బండి సిద్దం చేసి తీసుకెళ్ళు. అయన ఎక్కడికి వెళతా నంటే అక్కడి దాకా తీసుకెళ్ళి దిగబెట్టు. ఇదిగో ఈ డబ్బా, ఈ పూత రేకుల పెట్టె , మరచెంబూ కూడా బండిలో పెట్టుకో-- ఆయనకివి చాలా ఇష్టం -- ముందు బండి తోలుకుని నడు. వెనకాల నేనూ వస్తాను" అన్నాడు శేషయ్య.
    అలా రంగయ్య ని బండి ఇచ్చి ముందు పంపించి, ఒక్క అరగంట లో తను కూడా బట్టలు వేసుకుని బయలుదేరాడు శంకరాన్ని చూడ్డానికి-- ఆఖరి సారిగా కళ్ళ నిండుగా చూడ్డానికి -- మళ్ళీ ఈ జన్మకి శంకరం కన్పించడు కనుక కరువు తీరా చూడ్డానికి.
    కాని ఇంకా వీధి మొగ తిరక్కుండా నే. బండి వెనక్కి తోలుకు వచ్చేస్తూ రంగయ్య కనిపించాడు.
    "ఏం?....వచ్చేస్తున్నా వెం?" అని ఆదుర్దాగా అడిగాడు శేషయ్య.
    "మీరు ఇయన్నీ పంపారనీ, అరెక్కడి కేళతా నంటే అక్కడికి బండిలో తీసికెళ్ళి దిగబెడతాననీ సెప్పానండి. ఎగాదిగా ఓ పాలి చూసి "ఏం ఒద్దులే! ఆరోజున నువ్వే తీసుకు వొచ్చెవు బండి లో ఈ ఊరు......మళ్ళీ ఈ బండి లోనే పంపుతావా అన్నారండి. నాకు కళ్ళంట నీళ్ళు తిరిగాయండి ఆరు ఆ మాటలంటుంటే.ఎంత బతిమాలినా యినిపించు కోకుండా నడిసి సెరువు గట్టంట ఎల్లి పోయినారండి" అన్నాడు రంగయ్య.
    అది విని "ఆ...వెళ్ళిపోయాడా" అంటూ గబగబా నాలుగు అంగల్లో చెరువు గట్టు దగ్గరికి పరిగెట్టాడు శేషయ్య. గట్టుని ఉన్న పెద్ద మఱ్ఱి చెట్టు మొదట్లో నుంచుని కాలి బొటన వ్రేళ్ళ మీద నిలబడి పశ్చిమ దిక్కుగా చూశాడు.
    అస్తమిస్తున్న ఎర్రని సూర్యుడి కి అభిముఖంగా నడుస్తూ అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు శంకరం.
    గట్టిగా కేకవేసి శంకరాన్ని పిలవబోయాడు శేషయ్య. కాని దుఃఖం వల్ల ఆ శబ్దం కంఠం దాటి బయటికి రాలేదు. హృదయం అంతా శూన్యంగా అయిపొయింది శేషయ్య కి. గొంతుక లో ఉండలా ఏదో నెప్పిగా ఉంది.
    పంట కోసేయ్యగా వెలవెల బోతున్న చేలల్లోంచి బరువుగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నాడు శంకరం.
    నిమిష నిమిషానికి పొడుగవుతూన్న శంకరం నీడ. అతని ఔన్నత్యాన్ని స్పురింప జేస్తుంది శేషయ్య కి. గత స్మృతుల్ని తలుచుకుంటూ చేష్టలు దక్కి నిలబడి ఉన్నాడు శేషయ్య.
    చిరిగిన పంచె, వెలిసిన కొటూ, పింజలు పెట్టి కండువా లాగ భుజం మీద వేసుకున్న సావిత్రి పట్టుచీర -- ఇవి మూడూ తప్ప తక్కిన తన సర్వస్వాన్నీ ఆ ఊరుకే అర్పించే జీవితసర్వస్వాన్నీ కోల్పోయిన దురద్ర్తుష్ట కర్షకుని లా ఊరికే క్రమక్రమంగా దూరం అయిపోతూ , ఒక్కమారు వెనక్కి తిరిగి ఊరు కేసి చూశాడు శంకరం.
    దూరంగా పెద్ద మఱ్ఱి చెట్టు నీడని కండువా తో కళ్ళు ఒత్తుకుంటూన్న శేషయ్య రూపం స్పష్టా స్పష్టంగా కనిపించింది శంకరానికి.
    వెంటనే తడబడుతున్న కాళ్ళతో గబగబా అడుగు కదిపాడు శంకరం గుండెలో కొండంత డుఖాన్నీ , మనస్సులో ఆకాశం అంత వేలితినీ అధిగమించడానికి ప్రయత్నిస్తూ.
    సూర్యుడు క్రమంగా అస్తంగతుడౌతున్నాడు.
    ఆ సూర్యుని ఎర్రని కాంతి లో , నిలువెల్లా తడిసిపోతూ సలకలా అనుతూన్న శంకరం, ఎర్రగా గాలికి, రెపరెప లాడుతూన్న సన్నని "దీప శిఖ" లా కనిపించాడు శేషయ్య కళ్ళకి.
    అవును! అయన "దీపశిఖే"
    తన బతుకు కాలి, నాశనం అవుతూన్న ఈ ఊరి జనానికి మాత్రం ప్రాణ ప్రదమైన వెలుగు నిచ్చాడు.
    సమీపిస్తే ఎక్కడ సంతాపం కలిగిస్తాడో అని అంతా ఆయనకి దూరం అయారు. అవును -- అయన "ప్రాతః స్మరుడైన జ్యోతిర్మయుడు " ఇలా ఆలోచిస్తూ చుట్టూ ముసురు కుంటూన్న చీకట్ల లో నిలబడి శేషయ్య అలా దిగ్బక్రమ దిక్కుగా కదిలిపోతున్న "దీప శిఖ నే నిశ్చలంగా చూస్తుండి పోయాడు.

                                                (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS