"ఈమె మీ ఇంట్లో ఇటీవల పనిచేసిన పరిచారిక" దృడంగా అన్నాడు అర్జున్.
పరీక్షగా చూడనవసరం లేకుండానే మిత్రాకు ధ్రువ పడింది. ఆశ్చర్యపోతూ విషయాన్ని వ్రాసుకున్నాడు రికార్డు లో.
అర్జున్ మాటలు సాగాయి. "గత రాత్రి రాజ్యలక్ష్మీగారికి గౌతమ్ నివసిస్తున్న షెడ్ లో నుండి ఘర్షణ వినవచ్చింది. కుంటి వాడు గౌతమ్ అని పసి గట్టిన సుయోధన్ ఆ అపరాత్రి వేళ అతడిని పిస్టల్ తో బెదిరిస్తున్నాడు. దిక్కుతోచని రాజ్యలక్ష్మీ గారికి సత్యాదేవి గారు తోటలో రికార్డర్ తో కనిపించారు. అంతే. ఆవేశం లో ఉన్న ఆమె తాత్కాలికంగా సత్యాదేవి ని అడ్డు తొలగించు కోవడానికి స్పృహ తప్పేవరకూ గొంతు నొక్కి, ఆ రికార్డర్ చేజిక్కించు కొని తిరిగి ఘర్షణ జరుగుతున్న షెడ్ లోకి వచ్చారు. అంతా ఇందులో రికార్డు అయింది. ఇదే ఇంతకూ ముందు తమరు విన్న సంభాషణ.
"ఘర్షణానంతరం గౌతమ్ కు మత్తు మందుతో స్పృహ తప్పించి , తన కారులో ఎక్కడికో తీసుకు పోయాడు సుయోధన్. ఆ స్థలం కూడా రాజ్యలక్ష్మీ గారికి తెలుసు. ఆమె కారు లగేజ్ కారియర్ లో రహస్యంగా ఎక్కి ఆ స్థలం చూచారు. అక్కడ గౌతమ్ ను, నారాయణ్ శర్మను సుయోధన్ ఒక పాడుపడ్డ భవంతి లో బంధించాడు. ఈ వార్త మనకు చేరవేయడానికి అతి ప్రయాస తో అక్కడి నుండి , ఇప్పటికి తిరిగి రావడం మినహా , స్త్రీ అయిన రాజ్యలక్ష్మీ గారు మరేమీ చేయలేక పోయారు."
"ఏది ఆ ప్రదేశం? ఆ భవనం ఎక్కడున్నది?" న్యాయమిత్ర ప్రశ్నించాడు.
రాజ్యలక్ష్మీ పెదవి మెదుపుతుండగానే పిస్తోలు గుళ్ళు వచ్చి ఆమెకు, ఆమెను పరివేష్టించి ఉన్న పోలీసు బృందం లోని వారికీ ఇద్దరికీ తగిలాయి. అసలే నీరసస్తితిలో ఉన్న రాజ్యలక్ష్మీ పిస్టలు గుండు చేతికి తగలగానే స్పృహ తప్పిపోయింది.
అనుకోని ఆ సంఘటనకు అధికారులతో సహా అందరూ నివ్వెర పోయారు. ప్రేక్షకులందరూ భయంతో కలగదోక్కుకోసాగారు. ఈ సందడి లో సుయోధన్ అందరికీ పిస్టల్ చూపి బెదిరిస్తూ , సత్యను మరొక చేత్తో లాక్కుపోయి వేగంగా కారులో పడేసి,స్టార్టు చేశాడు.
"సుయోధన్! పేల్చి పారిపోతున్నాడు! పారిపోతున్నాడు!' అని అందరూ గగ్గోలు గా అరవసాగారు.
చూస్తుండగానే క్షణాలలో అంతా జరిగిపోయింది. సుయోధన్ కారు అతి వేగంతో కనుమరుగయింది.
పోలీసులు, పోలీసు అధికారులూ అందరూ తలలు వాల్చారు.
ఇంత జరిగినా ధైర్యంగా అదురు బెదురూ లేకుండా ఉన్నవారు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు. ఒకరు బోనులో నేరస్తుడు గా నిలబడిన ధర్మారావు, మరొకరు న్యాయ పీఠాదిధిపతి న్యాయ మిత్ర.
అర్జున్ అభ్యర్ధన పై అప్పటికప్పుడు ఏంబులేన్సు వచ్చింది. అచేతనంగా పడి ఉన్న రాజ్యలక్ష్మీ ని పోలీసు బందిబస్తూ తో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు , చికిత్స కోసం.
సుయోధన్ ను వెంటాడడానికి వెంటనే ఒక పోలీస్ జీపు బయలుదేరింది.
ఆ సందడి అలా ఉండగానే కోర్టు వారికి ప్రత్యేకంగా అర్జంటు వైరు ద్వారా ప్రభుత్వాదేశం తెలియ వచ్చింది-- కేసు నిలుపుచేసి ధర్మారావు ను వదిలి వేయమని.
ధర్మారావు , అర్జున్ , న్యాయమిత్ర అందరూ తమ చెవులను తామే నమ్మలేక పోయారు. కలో, నిజమో అన్న సందిగ్ధావస్థ నుండి తేరుకోక ముందే మరో వింత సంఘటన!
కోర్టు ఆవరణ లో దిగిన హెలికాప్టర్ నుండి స్పెషల్ పోలీసు బలగం తో వస్తున్న బలరాం ను చూచి అర్జున్ సైతం క్షణ కాలం బిర్ర బిగుసుకు పోయాడు. ఇంతకాలం జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చిన ఖైదీ బలరాం! ధర్మారావు పై హత్యాప్రయత్నం జరిపిన వారిని గతరాత్రే గాయపరిచి పరారైన బలరాం! పల్లెటూరి అమాయకపు మోటు రైతు కాదు. హుందాగా ఆఫీసర్ దుస్తుల్లో ఉన్న అతడు ఆ హెలికాప్టర్ నుండి దిగిన పోలీసు బలగాని కంతకూ నాయకుడు!
వస్తూనే న్యాయ మిత్రాకు గౌరవ ప్రణామం చేసి, సమీపించి, తన ఐడెంటిటీ కార్డు తీసి చూపాడు బలరాం.
"ఓ" సెంట్రల్ ఇంటలిజెన్స్ దిపార్టు మెంటు లో పేరు మోసిన డిటెక్టివ్ బలరాం మీరేనా!' అపార సంతోషంతో ఆప్యాయంగా కరచాలనం చేశాడు న్యాయమిత్రా.
అర్జున్ నూ, ధర్మారావు నూ, కొత్త పోలీసు సూపరింటెండెంట్ నూ స్నేహ పూర్వకంగా చిరునవ్వుతో పలకరించాడు బలరాం.
"ఆస్పత్రిలో చేర్చిన భుజంగం ఇంతకూ అరగంట ముందు మరణించాడు. ఇదిగో, అతడి మరణ వాజ్మూలం" అంటూ బలరాం ఇచ్చిన పత్రాన్ని అందుకుని బిగ్గరగా చదివారు న్యాయమిత్ర.
"సుయోధన్ తో నాకు చిరకాలంగా పరిచయం. స్నేహం ఉన్నాయి. దొంగనోట్లు, బంగారం స్మగ్ లింగు లలో ఆయనకు రహస్య అనుచరులలో నేనూ, రాధాయ్ ముఖ్యులం. అందుకే ఆయన మాకు చాలా సాయాలు చేస్తారు. అయన గంగలో దూకమన్నా మేము దూకుతాము.
గతరాత్రి పన్నెండు , ఒంటిగంట ప్రాంతంలో అయన హటాత్తుగా నన్నూ, రాధాయ్ నీ కలుసుకొని, జైలు లో ఉన్న ధర్మారావు ను అపహరించి ఊరి చివర ఉన్న పాడుబడ్డ భవనం లోకి తీసుకు రమ్మన్నారు. గౌతమ్, నారాయణ్ శర్మ అదివరకే అక్కడ బంధింప బడ్డారు. వారి సమక్షం లో ధర్మారావు ను చిత్ర హింసలు పెట్టి, తనకు కావలసిన రహస్యం గౌతమ్ చేత పలికించాలని అయన ప్రయత్నం. అందుకు ఈ రాత్రి నేనూ, రాదాయ్ జైలు లో ధర్మారావు ను హటాత్తుగా అపహరించడానికి ప్రయత్నించాము. కాని మా ప్రయత్నం ఫలించలేదు. ఎవడో బలమైన వ్యక్తీ వచ్చి మాతో కలియ బడ్డాడు. రాధాయ్ పారిపోయాడు. నేను, ఇదుగో నా పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను. ఈ అక్రమ సంపాదన నంతనూ అనుభవించే యోగం లేకుండా చచ్చిపోతున్నాను."
"ఎంత చిత్రంగా బయటపడింది, అసలు రహస్యం!" ప్రతివారి నోటి నుండీ అదేమాట!
న్యాయమిత్ర ముఖం కత్తి వాటుకు నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది లజ్జా భారంతో.
బలరాం అన్నాడు: "ధర్మారావు గారు తలపెట్టిన ఈ కారాగారాల సంస్కరనోధ్యమం పై అధికారులు, అనధికారులు -- అనేకుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో హెచ్చరికలు వచ్చాయి. కొన్ని ఆకాశ రామన్న ఉత్తరాలు కూడా వచ్చాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో ఈ రాదాయ్, భుజంగం, సుయోధన్ కూడా ఉన్నారు. దానితో ప్రభుత్వం వారు అలజడి చెంది, ధర్మారావు గారి అసలు సంగతులూ, అంతర్యమూ కనుక్కొనే బృహత్కార్యాన్ని మా దిపార్టు మెంటు కు ఒప్పచేప్పారు. ఫలితంగా నేనొక నేరస్తుడు లాగా సెంట్రల్ జైలు లో ప్రవేశించాను. ధర్మారావు గారి ప్రవర్తన జాగ్రత్తగా పసి కడుతూనే గౌతమ్ తో బాగా స్నేహం చేశాను. నా స్నేహం , సానుభూతు లకు లొంగి పోయిన గౌతమ్ ఎన్నో రహస్యాలూ, తనపై మోపబడిన నేరం గూర్చి అసలు కధనూ నాకెన్నో సార్లు చెప్పాడు. ధర్మారావు తన పుత్రుడని కూడా చెప్పాడు. కాని ధర్మారావు కేమీ తెలియవనే చెప్పాడు. నేను ఈ విషయాన్ని ఎప్పటి కప్పుడు ప్రభుత్వం వారికీ తెలియజేస్తున్నాను. నాకు సాయంగా మా దిపార్టు మెంటు వారే మరికొందరు వచ్చి చిన్నచిన్న నేరస్తుల లాగా జైలు లో ప్రవేశించారు. చిన్న చిన్న శిక్షలు గనక రెండేసి మూడేసి నెలలకే వారు జైలు నుంచి పోతారు. కొందరు కొద్ది వారాలే ఉంటారు. ఈ విధంగా వస్తూ పోతున్న వారి ద్వారా నేనూ, మా డిపార్టు మెంటు వారూ, ప్రభుత్వం వారూ వార్తలు అందజేసుకునే వాళ్ళం. గౌతమ్ చెప్పిన విషయాలన్నింటి ని బట్టి ప్రభుత్వం ధర్మారావు గారు పెరిగిన అనాధ శ్రమం విషయాలన్నీ అరా తీశారు. స్వర్ణ గంగా నదిలోని ఇసక మేటలను అత్యవసరంగా అప్పటికప్పుడు తవ్వించింది కూడా ప్రభుత్వమే. గౌతమ్ మాట నిజమయింది. సైనికోద్యోగులు రికార్డు వగైరా ఉంచే పుల్ ఫ్రూఫ్ సూట్ కేసు ఒకటి దొరికింది. అన్ని వార్తా పత్రికలూ ఆ వార్తలను అప్పటికప్పుడు ఘన విశేషంగా ప్రకటించాయి. మా పధకం నెరవేరింది. మేము ఊహించినట్లు గానే ఆ కాగితాలు మన దేశానికి సంబంధించినవి. కాని అది గౌతమ్ పనో, సుయోధన్ పనో నిర్ణయించడ మెలా? అందుకే వాటిని అక్కడే చీఫ్ ఇంజనీర్ కార్యాలయం లో ఉంచేశాము గప్ చిప్ గా. పై అధికారులను దానిని పంపించుతున్నట్లుగా, అంతవరకూ అక్కడే ఇంజనీరు ఆఫీసులో ఉంచినట్లూ మళ్ళీ పత్రికలూ ప్రకటించాయి. అప్పుడే సుయోధన్ ను ప్రభుత్వం ఈ ఆత్యయిక స్థితిలో దేశ రక్షణ కోసం ఉన్నత పదవికి ఆహ్వానించింది. వార్తా పత్రికలలో ఈ వార్తలు రెంటినీ చూచి జైలు లో గౌతమ్ విపరీతంగా చలించి పోయాడు. అప్పటి నుంచీ అతడు జైలు నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను గమనించాను.
"కాని అతడింకా జైలు లో ఉండగానే ఆ సూట్ కేస్ ఇంజనీర్ ఆఫీసు నుండి మాయమయింది. అలా జరుగుతుందని కూడా మాకు తెలుసు. అసలు అందుకే దానినలా ఇంజనీరు ఆఫీసులో ఉంచింది. ఆ ఆఫీసు చుట్టూ వలపన్ని సిద్దంగానే ఉన్న మా దిపార్టు మెంటు వారు ఆ మాయం చేసిన వ్యక్తిని చూస్తూనే ఉన్నారు; వెన్నంటారు. అతడు మరెవరో కాదు. సుయోధన్ ! అతడు వాటిని భద్రంగా తన ఇంట్లో దాచి, ఏమీ తెలియనట్లు ఇక్కడికి వచ్చాడు. ఆ తరువాత మా సి.ఐ.డీ. లు అతడి ఇంట్లో ప్రవేశించి, తిరిగి ఆ పెట్టెను దొంగిలించి అధికారులకు చేరవేశారు.
'అసలు రహస్యం తెలిసింది. ఈలోగానే ఇక్కడ గౌతమ్ పారిపోవడం, రాజ్యలక్ష్మీ , నారాయణ్ శర్మ గారలు పారిపోవడం జరిగింది.
"సుయోధన్ కు దొంగ బంగారం, దొంగ నోట్ల వంటి అక్తమ వ్యాపారాలతో కూడా సంబంధం ఉంది. వీటన్నిటికీ ప్రత్యక్షాధారాలు, సాక్ష్యాల కోసం అతడినలా స్వేచ్చగా వదిలేసి ఒక కన్ను వేసి ఉంచాము. ఇటువంటి పరిస్థితులలో అనుభవం లేని, లౌక్యం తెలియని ధర్మారావు జైలు లో ఉండడమే అతడికి రక్షగా భావించి, ప్రభుత్వం మౌనంగా ఉండి పోయింది. ధర్మారావు గారికి కాపలాగా నేను కూడా జైలు లో ఉండిపోయాను. సుయోధన్ వేస్తున్న పదకాలన్నీ మాకు ముందే తెలుసు. సరే. మిగిలిన విషయాలన్నీ మీకే తెలుసు!"
శ్రోత లందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. "అయ్యో, జడ్జీ గారూ! ఇకనైనా మా ధర్మారావు ను వదిలేస్తారా?' హాస్యంగా అడిగాడు అర్జున్. అప్పటికప్పుడే ధర్మారావు కు స్వేచ్చ ప్రాప్తించింది.
"ప్రస్తుతం మనం సుయోధన్ ను వెంటాడాలి, నడవండి.' అన్నాడు బలరాం ఆత్రంగా.
"పోలీస్ జీపు వెళ్ళింది." అన్నాడు అర్జున్.
"కాదు. సుయోధన్ ఎంతటి వాడు! అతడు పోలీసులనూ, పోలీసు జీపుల నూ సాధారణంగా దొరికేరకమా? నడవండి, మనం అతడిని వెంటాడుతున్నట్లు తెలియకుండా ఉండడానికే ఇలా తాత్సారం చేశాను. రండి. పై నుంచి హెలికాప్టర్ లో అతడిని వెంటాడాలి. అతడి కారూ, అతడి తీరు అన్నీ నాకు సుపరిచితాలే. అతడిని వీలైనంత వరకూ ప్రాణాలతో నే పట్టుకోవాలని ప్రభుత్వం అజ్ఞ."
ఆ మాటలు వింటూనే పోలీసు అఫీసర్లందరూ మాటలుడిగి, చేష్టలు దక్కి, వెర్రిగా మిత్రానూ , బలరాం నూ మార్చి మార్చి చూస్తూ ఉండి పోయారు.
అయితే, అందరికీ ఆశ్చర్యం కొలిపే టట్లు, మిత్రా అతి తేలికగా, సున్నితంగా, ఒక గంబీర మందహాసం చేస్తూ అన్నాడు: "సుయోధన్ నా అగ్రజుడని మీరు సంశాయిస్తున్నట్లున్నారు. కావచ్చు. కాని నీతి, న్యాయం, ధర్మాల ముందు వ్యక్తీ సుఖాలనూ, రక్త బందాలనూ , పెమాను రాగాలను తృణ ప్రాయంగా చూస్తాను నేను. నడవండి. మనమందరం ప్రభుత్వం వారి నమ్మిన సేవకులం. మనకు విధ్యుక్త ధర్మ నిర్వహణే ప్రధానం."
అప్పటికప్పుడు కోర్టు వాయిదా పడింది. బలరాం ధర్మారావు, మిత్రా, అర్జున్ ప్రభ్రుతులు అనుసరించారు.
* * * *
