Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 39


    అప్పటికీ శాంతి అందుకోలేదు. "నువ్వే చదివి చెప్పన్నయ్యా. వింటాను" అంది అతిమెల్లగా, సౌమ్యంగా.
    శ్రీహరి ఒక్కక్షణం ఆగి మెల్లగా అన్నాడు: "చూడు, శాంతీ. నేను ఒకప్పుడు నిన్ను అతడితో మాట్లాడవద్దనీ, ఉత్తరాలు వ్రాయవద్దనీ అన్నాను. అందుకేగా నీకీ కోపం?
    "......."
    "నేను ఏవిధమైన అపోహలతోనూ అలా అనలేధంమా. నాకు మీ యిద్ధరిపై నా సమాన గౌరవముంది. అలాగే సమానమైన ప్రేమ కూడా ఉంది. మీ యిద్దరిలో ఏ ఒక్కరిపైనా కోపం తెచ్చుకోలేను. రాజకూ, మనకూ బహుశః ఈ జన్మ స్నేహంకాదు, జన్మ జన్మాంతర సంబంధమేధో ఉండి ఉండాలి. అందుకే అప్పుడు మనస్సులో ఒక అభిప్రాయం పెట్టుకుని అలాగన్నాను. కాని, నేనిప్పుడు తెలుసుకొన్న దేమంటే ఇటువంటి అనుబంధమూ, ప్రేమా అణుచుకుందామన్నా, తెంపుదామన్నా తెగేవి కావు అంతకంటే మాత్రం ప్రస్తుతం నీతో ఏమీ చెప్పలేను..... బహుశః అభిమానంతో ఏమైనా స్నేహపూర్వకంగా సలహా యిచ్చి ఉంటాడు అందులో. నువ్వా ఉత్తరం తీసుకుంటే సంతోషిస్తాను."
    ఒక్కసారి శ్రీహరి నేత్రాలలోకి గంభీరంగా చూచి, మౌనంగా ఆ జాబుకూడా తీసుకుని వెళ్ళిపోయింది శాంతి. తన గదిలోకి పోయిముందుగా మనోరమ ఉత్తరం తీసింది శాంతి. ఆశ్చర్యం! అందులోకూడ మరో ఉత్తరం ఉంది.
    "శాంతీ. డియర్!
    "నీ అభినందనలకూ, నీవు పంపిన బహుమతులకూ కృతజ్ఞురాలీని. కాని, వివాహమైన మూడు నెలలకు- చాలా చాలా ఆలస్యంగా వ్రాస్తున్నాను కదూ? ఏమనుకోకు. నీకూ పెళ్ళయితే తెలుస్తుందిలే.
    "ఎంతో సంతోషంగా ఎన్నో విశేషాలు వ్రాద్దామనుకున్నాను. కాని, శాంతీ, నా ఉత్సాహమంతా చచ్చిపోయింది. నీనుంచి వివాహాహ్వాన పత్రిక అందుకోగలనని ఆశించిన నాకు నిరాశాపూరితమైన వార్త తెలిసింది. శ్రీ రాజశేఖరంగారు బావకు ఉత్తరం వ్రాశారు. అది కూడా దీనితో పంపిస్తున్నాను. చూడు. రాజా ఎంతమంచివారో నీకర్ధం కాగలదు.
    "శాంతీ, ఇప్పటికైనా లోకంపోకడనూ, మానవ స్వభావాలనూ అర్ధంచేసుకో. నేను కాని, ఈ బావగారుకాని నీకు యిచ్చే సలహా ఒకటే. రాజశేఖరంవంటి వ్యక్తి హృదయంలో స్థానం పొందగలగడం సామాన్య విషయం కాదు. అతడిని చేపట్టగల యువతి చాలా ధన్యురాలు. ఆ అదృష్టవంతురాలివి నీవే ఎందుకు కాకూడదు? సలహాలిస్తున్నానని చికాకు వద్దు. రాజాను వివాహమాడితే నీ జీవితం నందనవనమే. బాగా ఆలోచించుకో.
                                                                                          నీ
                                                                                      మనోరమ."
    ఆశ్చర్యంతో అందులోనే ఉన్న రాజా ఉత్తరం తీసింది శాంతి.
    "డియర్ శేఖర్,
    "శుభాకాంక్షలు. హనీమూన్ సరదాగా, సంతోషంగా గడిచిందనుకుంటాను. అయినా యిప్పుడు హనీమూన్ ఏమిటి? అప్పుడే మీ పెళ్ళయి మూడు నాలుగు నెలలు కావస్తోందనుకుంటాను. మీ వివహ జీవితం ఎప్పుడూ 'హనీమూన్' గానే గడవాలని భగవంతుని ప్రార్ధిస్తాను. ఢిల్లీ జీవితం ఎలా ఉంది? ఉద్యోగం ఎలా ఉంది? మనోరమగారిని అడిగినట్లు చెప్పగలవు.
    "శేఖర్, దగ్గర స్నేహితుడవు గనుకా, నీకు అన్నీ తెలుసును గనుకా చనువుగా ఒక విషయం వ్రాస్తున్నాను. సహృదయంతో స్వీకరించగలవు. మనోరమగారి స్నేహితురాలు శాంతి నీకు తెలుసు. ఆ రోజు కలకత్తాలో చూచావు. ఆమెను గురించి కూడ మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్య ఆమె వివాహం గోవిందరావుతో జరుగగలదని ఆశించాను. కాని, చాలా విచారకరమైన విషయం- గోవిందరావు చాలా మోసగాడనీ, అతడి కిదివరకే వివాహం జరిగిందనీ తెలిసింది. శాంతి నిరాశా వదనం చూచిన నాకు గుండె కలగిపోయింది. ఇటువంటి స్థితిలో స్నేహితుల ఓదార్పు ఎంతైనా అవసరం. శాంతిది చాలా సుకుమార హృదయం. సాంత్వన వచనాలతో మనోరమ గారు ఆమెకు ఉత్తరం వ్రాయాలని అర్ధిస్తున్నాను. కలిగించుతున్న శ్రమకు క్షంతవ్యుణ్ణి.
    "ఇది శాంతి వ్యక్తిగత విషయం. ఆమె అనుమతి లేనిదే ఆమె స్వవిషయాన్ని నేను మీకు తెలియపరచడం అపరాధమే. కాని, చాలా ఆలోచించి, ఇది శాంతికి 'శాంతి' కలిగించడానికే గనుక, మీరిరువురూ సహృదయులు గనుక యిలా వ్రాయడంలో తప్పు లేదనుకున్నాను. మనోరమగారు నా అభ్యర్ధన మన్నిస్తారని ఆశిస్తాను.
                                                                                         రాజా."
    శాంతి మనస్సు కరిగిపోయింది. 'ఎంతటి ఉదార హృదయుడు, రాజా! ప్రతి అక్షరం లోనూ ఎంత సౌమ్యత! ఎంతసేపూ శాంతి, శాంతి! తన స్వంత గొడవ ఏమీలేదు. తాను అతడిని లెక్కజేయకపోయినా అతడి కెందుకో తనపై అంత శ్రద్ధ!'
    ఇంతవరకూ ఎన్నడూ అతడిని గురించి ఆలోచించటానికింత కాలం వ్యర్ధపుచ్చలేదు శాంతి. ఆలోచిస్తూ రాజా తనకు ప్రత్యేకంగా వ్రాసిన ఉత్తరం విప్పింది.
    "చిరంజీవి శాంతిని ఆశీర్వదించి -
    "మనం కలుసుకున్న పరిస్థితులలో ఆనాడు, అధికంగా మాట్లాడే అవకాశం లేకపోయింది. ఈపాటికి మీ మనస్సు సర్దుకొని ఉంటుందని ఆశిస్తున్నాను.
    "నాపై గౌరవంతో ఆనాడు నాకొక వాగ్ధానం చేశారు. ఆ దైర్యంతోనే నేనిక్కడ నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. నేనీ విధంగా ఉత్తరం వ్రాయడం గురించి మీరేవిధంగా భావిస్తున్నారో నాకు తెలియదు. కాని, స్నేహితుడుగా యిది నా బాధ్యతగా భావిస్తున్నాను. జరిగినది మరిచిపోయి సంతోషంగా ఉండగలందులకు ప్రయత్నించండి. మీ వ్యక్తిగత విషయాలలో నేను జోక్యం కలిగించుకోవడం తప్పేకావచ్చు. కాని స్నేహాన - సాహసించి నేను చెప్పేదేమిటంటే - పరిస్థితుల ప్రభావమో, విధిబలీయమో - ఎందువల్లనో ఇత్తడిని బంగారంగా భ్రమించి ఉండవచ్చు. అది నిజంగా స్వర్ణమే అయి మనకందకపోతే బాధ పడాలి కాని, అది భ్రమ అని తెలిపోయాక విచారం దేనికి? జీవితం అటువంటి గోతిలో పడనందుకు సంతోషించాలి. దైవం రక్షించదువు. అయితే, ఆ ప్రభావం కొంతకాలం ఉండటం సహజం. కాని, వివేకంగా ప్రవర్తించండి. పరిస్థితులకు వివశులు గాకండి. చిత్ర లేఖనంలో బాగా కృషి చేయండి. మంచి గ్రంథాలు చదవండి. మానసికారోగ్యం చేకూరగలదు. ఇందులో హద్దుమీరి అధికంగా వ్రాసిన దేమైనా ఉంటే క్షమించండి.
                                                                                              రాజా."
    పద్మ ఉత్తరం మామూలే. క్షేమసమాచారాలూ, కొన్ని హితబోధలూ ఉన్నాయి. ఆ ఉత్తరాలన్నీ సాంత్వన కలిగించటానికి బదులు తీరని అశాంతిని రేకెత్తించాయి శాంతి హృదయంలో. "ఏమిటీ రాజా కింత శ్రద్ధ నాపైన? ఏం చేయడం? దానికి జవాబు వ్రాయాలా, అక్కర్లేదా?'
    ఆ రాత్రంతా శాంతికి నిద్రలేదు. లేచి తోటలో తిరుగుతూంటే ఆ పండువెన్నెల కొంత ఆహ్లాదం కలిగించింది. 'రాజా స్వభావం ఈ వెన్నెల వంటిది!' అనిపించింది. 'ఇది మన్ను, కలుషితమైన భూమి- అని ఆలోచించదు మింటినుండి మంటి పైకి ప్రసరించే ఆ వెన్నెల. బీదా, గొప్పా, హైన్యం, ఔన్నత్యం అనే భేధభావం లేకుండా అందరినీ సమాదరంతో గౌరవిస్తుంది. ఆహ్లాదం కలిగిస్తుంది. అలాగే రాజాకూడ. అతడి మంచితనమే అతడిది కాని, ఎదుటివారి గుణగణాలతో అతడికి నిమిత్తం లేదు.
    చిత్రం! వదినతో రాజా విషయంలోనే ఘర్షణ పడటమేమిటి? ఆ వెంటనే రాజా ఉత్తరం రావడమేమిటి?' ఆలోచనలలో మునిగి ఉన్న ఆమె కుడిచేతి ప్రక్కగా పాలపిట్ట అరుస్తూ ఎగిరిపోవడంతో ఉలిక్కిపడింది. ఆ వేణుగోపాలుని మనసారా తలుచుకొంది. ఆరోజు గోవిందరావు విషయమై తీవ్రంగా చర్చించుకుని శ్రీహరీ, తానూ శాంతినిలయానికి తిరిగి    వస్తూంటే యిలాగే తీతువు అరుస్తూ తన కెడమ ప్రక్కగా యిద్దరి మధ్యనుండీ ఎగిరి పోయింది. అయినా యిప్పుడెందుకీవిషయం గుర్తుకు వచ్చినట్టు? బలహీనంగా నవ్వుకుంటూ తనగదిలోకి వెళ్ళిపోయింది!
    ఇంత కాలానికి తిరిగి చిత్రలేఖనం ప్రారంభించుదామనే తలపు కలిగింది; కాదు- రాజా గుర్తు చేయగా గుర్తు వచ్చింది. మూలపడ్డ రంగులూ, కుంచెలూ అన్నీ పైకి తీసింది. 'ఏం వెయ్యాలి?' ఆలోచిస్తూండగా ఆలోచనా స్రవంతి అధీనం తప్పిపోయి అటూ, యిటూ పరుగులెట్టి కల్మషాన్ని చెత్తా చెదారాలనూ పోగు చేసి బురద పులుముకున్న వరద నదిలా తయారైంది. 'కళాతపస్వి' చిత్రం! దానిపై మనోరమకూ, తనకూ జరిగిన సంభాషణ. అన్నీ వరుసగా గుర్తు వచ్చాయి. ఆగకుండా అశ్రు ధారలు ప్రవహించి కన్నీరు మున్నీరుగా విలపించింది. 'ప్రశాంత హృదయంతో శాంతి నికేతన్ లో అడుగుపెట్టాను. చిత్రకళ వృద్ది చేసుకోవాలనుకున్నాను. చేసుకొన్నమాట నిజమే. కాని పూర్తిగా చేయలేదు. అనవసరమైన గొడవ లలో పడి నాధ్యేయాన్ని విస్మరించాను. లేని అశాంతిని రేపుకున్నాను. అందర్నీ ఆవేదనపాలు కావించాను' అని తనలో తానే నిశ్శబ్దంగా రోదించింది. ఆశోకంలోనే అలసి నిద్రించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS