Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 40


    చంద్రిక ఆశ్చర్యపోయింది.
    "నిజంగానా?"
    "అవును! మీరు సరేనంటే రేపే మీ దగ్గరకు పంపిస్తానతనిని-"
    "ఎవరతను? మీకు అతను ఎంత కాలం నుంచి తెలుసు?"
    "పదేళ్ళనుంచీ!"
    "ఇంతకుముందు సినిమాపత్రికలో జర్నలిస్ట్ గా చేసేవాడు. మీరంటే వెర్రి అభిమానం! ఎప్పటికయినా మీ దగ్గర పి. ఆర్. ఓ. గా చేస్తే తనజన్మ ధన్యమయినట్లు భావిస్తానని అంటూండేవాడు. అప్పుడే నాకు ఐడియావచ్చింది. అలాంటి అభిమానం వున్నవాడిని అపాయింట్ చేసుకుంటే వాళ్ళు కేవలం జీతం కోసం కాక మీ మీదున్న అభిమానంతో డెడికేటెడ్ గా పనిచేస్తారు -"
    "ఆ మాట నిజమే! నాక్కావలసింది కూడా అలాంటివాడే! ప్రొఫెషనల్ పి.ఆర్.ఓ లతో విసిగిపోయాను. ఒకసారేమయింది? ఒకడు నన్ను ఓ కస్టమర్ కి అమ్మేయడానికి ప్రయత్నించాడు."
    "మైగాడ్! ఎవడు వాడు?"
    "పేరెందుకులెండి! అలాంటి రకాలుంటారు!" అంటూ టైం చూసుకుందామె.
    "ఓ....కే! నాకు టైమయింది. బైటికి వెళ్ళాలి!" లేచి నిలబడుతూ అంది.
    "అయితే మరి అతన్ని రేపు మాణింగ్ పంపించమంటారా?"
    "పంపంచండి! నాక్కూడా నచ్చితే రేపటినుంచే జాయిన్ అవుతాడు"
    "థాంక్యూ మేడమ్, వస్తాను"
    అతను వచ్చేశాడు.
    మర్నాడు మయూరికి ఈ విషయం చెప్పాక ఆమెతో తను కొంచెం చనువుతీసుకోవడానికి ప్రయత్నించవచ్చు! ఒకవేళ ఆమెకూడా ఫాస్ట్ గా ఉంటే రేపు రాత్రే మొదటి రాత్రి అవుతుంది.
    అతనూహించినట్లే ఆ వార్త చెప్పగానే మయూరిమొహంలో ఆనందం, కృతజ్ఞతా రెండూ కనిపించినయ్.
    "నిజంగా ఇది మీరు నాకు చేసిన చాలా గొప్ప సహాయం! మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను. మీవల్ల మా ఫామిలీ ప్రాబ్లెమ్స్ అన్నీ సెటిలయిపోయినయ్" ఎగ్జయిట్ మెంట్ తో అంది.
    "వెంటనే అతన్ని పిలిపిస్తే నేను మాట్లాడిచంద్రికగారి దగ్గరకు పంపిస్తాను"
    "ఓ! నేను ఇప్పుడే ఇంటికెళ్ళితీసుకొస్తాను"
    "సరే"
    మయూరి ఆటోలో నూతన్ వుంటున్న హోటల్ కొచ్చింది.
    ఆమెను చూసి ఆశ్చర్యపోయాడతను.
    "ఏమిటి? సడెన్ గా వచ్చావ్?"
    "మన ప్లాన్ సక్సెస్ అయింది"
    నూతన్ అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు.
    "యూ ఆర్ వండర్ ఫుల్ గాళ్! ఎప్పుడు వెళ్ళాలి?"
    "ఇప్పుడే! ముందు ఆ రమేష్ దగ్గరకెళ్తే అతను నీతో మాట్లాడి అక్కడకు పంపిస్తాడు"
    ఇద్దరూ ఆఫీస్ కి చేరుకున్నారు. నూతన్ ని చూడగానే ఇంప్రెస్ అయ్యాడు రమేష్.
    "నువ్ తప్పకుండా చంద్రికగారికి నచ్చుతావ్!" కాన్ఫిడెన్స్ తో అన్నాడు.
    "థాంక్యూ సర్"
    "ఐతే ఆమెకు నేనో అబద్దం చెప్పాను నీ గురించి"
    "ఏమిటండీ అది?"
    "నువ్ చంద్రికగారి అభిమానివనీ, ఆమె దగ్గర పి. ఆర్.ఓ. గా పనిచేయడమే నీ జీవిత ధ్యేయమనీ చెప్పాను. కనుక నువ్ కూడా అదే చెప్పాలి. అదీగాక నువ్ నాకు పదేళ్ళనుంచీ తెలుసనికూడా కమిట్ అయ్యాను"
    "మీకు తెలీదనుకుంటాను నేను నిజంగా ఆమె ఫాన్ నే"
    రమేష్ నవ్వేశాడు "వెరీగుడ్! ఐతే ఇంక సమస్యేలేదు"
    నూతన్ వెళ్ళిపోయాడు.
    "మయూరీ! మీతో కొంచెంమాట్లాడాలి! సాయంత్రం మాట్లాడతాను"
    ఆ సాయంత్రం ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోయాక మయూరి కాబిన్ లోకొచ్చాడతను.
    అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. అతనికి ఎక్కడలేని నిరుత్సాహం కలిగింది. తను ఉండమని చెప్పినా ఆమె వెళ్ళిపోవటం కొంచెం కోపంకూడా కలిగించింది.
    నూతన్ ని పరీక్షగా చూసింది చంద్రిక. అలాంటి స్మార్ట్ యువకులను చాలామందిని సినిమాఫీల్డులో చూసింది తను.
    సినిమాలో హీరోలవాలని రావటం, ఫెయిలయి ఆ ఫీల్డులోనే ఇంకేదయినా డిపార్ట్ మెంట్ లో సెటిలవడంమామూలే!
    బహుశా ఇతనూ అదే కేటగిరీ అయుంటాడు అనుకుందామె.
    "నీ క్వాలిఫికేషన్ ఏమిటి?" అడిగిందామె.
    "బి.కామ్. అండి"
    "జర్నలిస్ట్ గా ఎందుకొచ్చావ్?"
    "సినిమాలంటే చిన్నప్పట్నుంచీ బాగా క్రేజ్ మేడమ్! ముఖ్యంగా మీ సినిమాలంటే ప్రాణం! ఒకో సినిమా ఆరుసార్లు తక్కువ కాకుండా చూసేవాడిని! ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయిమద్రాస్ వచ్చాను కానీ వాచ్ మెన్ నన్నులోపలకు రానీలేదు. చివరకు మిమ్మల్ని స్టూడియో బయటకల్సుకున్నాను. అప్పటికేజనం! అందరినీ తోసుకుని నేను మీ కారు దగ్గరకొచ్చాను. మీరు నా బుక్ మీద ఆటోగ్రాఫ్ చేశారు. ఆ ఆటోగ్రాఫ్ ఎప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను.....ఇదిగో....." అంటూ జేబులోనుంచి పాత కాగితం ఒకటి తీసి మడతలు విప్పి ఆమెకు చూపించాడు.
    అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
    "ఇంతకాలం చిరిగిపోకుండా దాచావా?"
    "మీకు చూపించాలని ఇలా తెచ్చాను మేడమ్! లేకపోతే ప్లాస్టిక్ కవర్లో ఉంచుతాను"
    ఆమెకు అతని మీద విపరీతమైన అభిమానం ఏర్పడిపోయింది.
    "ఇప్పుడు నువ్ చేయాల్సినపని ఏమిటో తెల్సా?"
    "తెల్సు మేడమ్! మీ డేట్స్ చూస్తుండాలి! అన్ని పత్రికల ద్వారా మీ ఇమేజ్ బిల్దప్ చేస్తూండాలి! మీ ఇంటర్ వ్యూలు, ఫోటోలు అన్ని చోట్లాకనబడాలి."
    "ఇంకో విషయం కూడా ముఖ్యమే! నేను తీసుకునే రెమ్యునరేషన్ బాగా పెరిగేటట్లు చూడాలి! పెరగాలంటే మనంకొంచెం మానిప్యులేషన్సు చేయాల్సివుంటుంది! నీకు అర్ధమయిందనుకుంటాను. ప్రస్తుతం నాకు లక్షరూపాయలకంటే ఎక్కువ ఇవ్వటంలేదు ఎవరూ!"
    "అయింది మేడమ్! ఆ విషయాలన్నీ నాకొదిలేయండి! ఆరు నెలల్లో ఫలితాలు మీరే చూస్తారు"
    "నువ్ ఉండటం ఎక్కడ?"
    "అదే ప్రాబ్లెమ్ మేడమ్! ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలసి ఒక రూమ్ లో వుంటున్నాను. ఇప్పుడు వుద్యోగం దొరికింది గనుక ఇంకో మంచి రూమ్ చూసుకోవాలి!"
    అంత త్వరగా తనమీద సదభిప్రాయం కలుగుతుందని అనుకోలేదు.
    అన్నిటికన్నా అతనిని ఆనందం కలిగించినవిషయం ఆమె ఆటోగ్రాఫ్ అన్న వంకతో తను ఆమె సంతకం ఫోర్జరీ చేసి చూపించాక- అది ఫోర్జరీ అని గ్రహించకపోవటం-
    అది తన ఫస్ట్ ఎక్స్ పెరిమెంట్- తన ప్లాన్ లో చాలా ముఖ్యమైన భాగం! ఓ సినిమా వారపత్రికలో ఆమె ఆటోగ్రాఫ్ చూసివారం రోజులు రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేశాడు. ఆమె సంతకం ఫర్ ఫెక్ట్ గా పెట్టగలిగాడని ఇప్పుడు ఋజువయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS