ఆ చర్య తనక్కావలసిన ఎఫెక్ట్ ఇచ్చింది. తనస్పర్శకు అతను కొద్దిక్షణాలవరకూ మాట్లాడలేకపోయాడు. కర్చీఫ్ తీసి మొఖం తుడుచుకున్నాడు.
ఇదే తను అతనిని అడగాల్సిన సమయం.
"ఇది మొదటిసారి- మీ అంత దయగలవారిని చూడటం" అభినందిస్తూ అంది.
"భలేవారే! నేనేం చేశానని? మీ అవసరం మా ఆఫీస్ కుంది. అందుకని తీసుకున్నాం! ఒకవేళ ఆ సీట్లో ఇంకెవరినయినా సెలక్ట్ చేసుకున్నామనుకోండి! అప్పుడు మీకు ఇవ్వటం కుదరదుకదా!"
"మీరు మరోలా అనుకోనంటే మిమ్మల్నో సహాయం అడగాలనుకుంటున్నాను" అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మయూరి.
అతను ఆనందంతోపొంగిపోయాడు. తను ఊహించిన విధంగానే ఆమె తన ట్రాప్ లో కొస్తోంది. ఇంకెన్నోరోజులు అవసరంలేదు ఆమెను సొంతం చేసుకోడానికి.
"అదేమిటి అలా అంటారు? నాకు చేతనయితే తప్పక చేస్తాను! మీరు అడిగిన తర్వాత కాదనటమా?"
"మా ఫామిలీ గురించి మీకు చెప్పానుకదా! ఎవరిదారివాళ్ళు చూసుకోవాల్సివచ్చింది. మీ మంచితనంవల్లనే నేనిక్కడ సెటిలయాను. కానీ మా బ్రదర్ ది ఓ ప్రాబ్లెమ్ వచ్చింది!"
"ఏమిటది?" ఆతృతగా అడిగాడు.
మయూరి వచ్చి కుర్చీలో కూర్చుంది.
"అతను ఏదో సినిమా పత్రికలో సినీ జర్నలిస్ట్ గా ఉండేవాడు. ఆ పత్రిక సడెన్ గా మూతపడింది. ఈ పరిస్థితిలో అతనిని ఎవరయినా సినిమా స్టార్ దగ్గర పి.ఆర్. వో. గా పెట్టగలిగితే అతనికెంతో సహాయంచేసినావారవుతారు. అతని జీవితం సెటిలయితే నాకూ వర్రీ ఉండదు. మనాఫీస్ ఫ్యూన్ చెప్పాడు. మీరు సినీస్టార్ చంద్రిక గారి ఫైనాన్స్ మేటర్స్ అన్నీ చూస్తుంటారని!"
అతని మొఖంలో ఆశ్చర్యం కనిపించింది.
తన గురించి ఇంత త్వరగా ఆమె తెలుసుకోవటంవిచిత్రంగా ఉంది.
"అందులో పెద్ద ఇదేముందీ? రేపే ఆమెతో మాట్లాడతాను. ఆమెకు ప్రస్తుతం పి.ఆర్.వో. అంటూ ఎవరూ లేరనుకుంటాను. సాధారణంగా స్టార్స్ కందరికీ ఉంటారుగానీ ఆమె ప్రస్తుతం అంత డిమాండ్ లోలేదు కాబట్టి బహుశా ఏర్పాటు చేసుకుని వుండదు."
"థాంక్యూ వెరీమచ్! పెద్ద బరువు దించేశారు" అతనివంక క్రీగంట చూస్తూ అంది.
"ఇటీజ్ ప్లెజర్!"
"నాకేమైనా వర్క్ ఇస్తే చూసుకుంటాను" లేచి నిలబడుతూ అందామె.
రమేష్ నిరుత్సాహపడ్డాడు. అంత త్వరగా ఆమె వెళ్ళిపోవటం అతనికిష్టం లేకపోయింది. కానీ ఆమెను ఆపటం కూడా సాధ్యం కాలేదు. చంద్రిక ఎవరిమాటా తేలిగ్గా వినేరకంకాదు. అదీ డబ్బుఖర్చు చేసే విషయంలో మరీ పిసినారి తనంగా ప్రవర్తిస్తుంది.
అలాంటిది ఓ వ్యక్తికిజీవితం యిచ్చి పి.ఆర్.వో.గా పెట్టుకుంటుందా?
ఏదేమైనా ఆ రోజు సాయంత్రం నాలుగింటికి తనామెను కలుసుకోవాల్సివుంది.
అప్పుడు మాటల్లో ఎలాగోలా మభ్యపెట్టి తన పని జరిగేలా చూడాలి. లేకపోతే మయూరిని ఇంప్రెస్ చేయటం కష్టమైపోతుంది.
సాయంత్రం వరకూ రకరకాలుగా ఆల్కహిస్తూనే వున్నాడతను. ఏం చేయాలో తోచనిస్థితిలోనే ఆమె ఇంటికి చేరుకున్నాడు.
"ఏమిటిది? నాలుగింటికి అపాయింట్ మెంటయితే నాలుగుంబావుకా వచ్చేది! టైమ్ మెయింటెయిన్ చేయకపోతే ఎలా? నాకవతల వేరే పనులుండవా?" తనను చూస్తూనే ఆమె దులిపెయ్యటం మొదలుపెట్టేసరికి రమేష్ కంగారుపడ్డాడు.
ముందామె 'మూడ్' ని మార్చాలి. లేకపోతే మయూరి విషయం మాట్లాడటంకుదరదు.
"అదే మీరు కావాలన్నా షేర్స్ కోసం వెళ్ళివచ్చేసరికి ఆలస్యం అయిపోయింది".
అతనూహించినట్లే చంద్రిక శాంతించింది. హీరోలిద్దరూ తన జీవితంతో ఆదుకుని వదిలేశాక ఆమెలో పూర్తి మార్పువచ్చింది. మగాళ్ళందరినీ కావాలనే అవమానపరచటం ఆమెకు హాబీ అయిపోయింది.
అలాగే డబ్బు విషయంతోకూడా ఎన్నో జాగ్ర్రత్తలు తీసుకుంది. అదివరలాడబ్బు పోగొట్టుకోవటం ఇంకోసారి జరగకూడదని నిశ్చయించుకుంది. ఎంత తక్కువ డబ్బు సంపాదించగలుగుతే అంత సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకుంది. రాన్రాను తనకిక సినిమాలే వుండవన్న విషయం ఆమెకు అర్ధమైంది.
"అంటే - షేర్స్ దొరికినట్లేనా?" ఆశగా అడిగింది.
"రేపు ఉదయం చెప్తానన్నాడు బ్రోకర్."
"ఎంతకిస్తానంటున్నాడు?"
"నూటపది!"
"గుడ్! వచ్చే నెలలో అవి నూట యాభయ్ వరకూ వెళతాయట!"
"అవును మేడమ్! వెళ్ళే అవకాశం వుంది."
"ఈసారి ఇన్ కమ్ టాక్స్ సంగతేమిటి?"
"ప్రయత్నిస్తున్నాను మేడమ్ ఎట్ ఎనీకాస్ట్ ....నలభైవేలకు దాటకుండా చూస్తాను"
"దాటితే వేరే చార్టర్డ్ ఎకౌంటెంట్ ని చూసుకుంటాను తెలుసా?"
"తెలుసు మేడమ్!"
"నాకు ఒక పి.ఆర్.వో. అర్జంటుగా కావాలి!"
రమేష్ ఉలిక్కిపడ్డాడు. మొహంలో అమితానందం బయటకు కనబడకుండా జాగ్రత్తపడ్డాడు.
"పి.ఆర్.వో.కావాలా మేడమ్?'
"అవును! చాలా అర్జెంట్! మంచి నమ్మకస్తుడు, సినిమా ఫీల్డ్ విషయాలు తెలిసినవాడు. హానెస్ట్ ఫెలో అయుండాలి! అతని అవసరమేమిటంటే చాలామంది పాతప్రొడ్యూసర్లు నన్ను సినిమాల్లో బుక్ చేయడానికి వస్తున్నారు తెలుసా? వచ్చినప్పుడు నేను పాత విషయాలు గుర్తు తెచ్చుకుని వాళ్ళతో పేచీ పెట్టుకుంటున్నాను. దానివల్ల నాకొచ్చిన అవకాశాలన్నీ పోతున్నాయ్. అందుకే పి.ఆర్.వో.ని పెట్టుకుంటే అతనితోనే నా సినిమా భవిష్యత్తుని ప్లాన్ చేయించుకోవచ్చు! ఏమంటావ్?"
"చాలా మంచి ఆలోచన మేడమ్! అసలు నేనే ఈ విషయం మీకు చెప్దామని వచ్చాను. మీరే ఆ మాటచెప్పారు"
"అంటే?"
"మీకు ముందే చెప్పానుకదా మేడమ్! మీరు మా అభిమానతార! కాలేజీలో చదివేరోజుల్లో మొత్తం మా స్టూడెంట్స్ అందరూ మీరంటే పడి చచ్చేవాళ్ళం! మా రూమ్ మేటొకడు మిమ్మల్ని తప్ప యింకో అమ్మాయిని పెళ్ళిచేసుకోననీ, ఒకవేళ మీరు దొరక్కపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే వుండిపోతాననీ అన్నాడు. చివరకు మేమంతా కలిసి అచ్చం మీలాగే కనిపించే ఓ అమ్మాయిని వెదికించి పెళ్ళి చేశాం వాడికి."
చంద్రిక ఆనందంతో పొంగిపోయింది.
సినీ తారలను, రచయితలను, డైరెక్టర్లను పడగొట్టాలంటే పొగడ్త ఒక్కటే రాజమార్గం అని అతనికి తెలుసు.
"మీ అభిమానులందరికీ ఎంతో డిప్రెస్ డ్ గా వుంటుంది. మీరు తరచుగా సినిమాల్లో కనిపించకపోవటం! హీరోయిన్ గా వేయకపోయినా ఫర్లేదు. కనీసం హీరోయిన్ అక్కగానో, వదినగానో అయినా కనబడుతూంటే మాకు ఎంతో ఆనందంగా వుంటుంది. మీలో ఉన్నంత టాలెంట్ ఇంకెవరిలోనూ లేదని అందరికీ తెలుసు! కానీ ఏవో కారణాల వల్ల మీరు ఎక్కువ సినిమాలు ఒప్పుకోకపోవటం మాకు ఎంతో బాధగా వుంటుంది! ఇవన్నీ ఆలోచించే మీకో మంచి పి. ఆర్.ఓ. వుంటే బావుండుననిపించి ఒకతనిని వెతికి పట్టుకొచ్చాను."
