Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 41


    "ఇంతకూ నీకు జీతం ఎంతివ్వాలి?"
    "అది మీ ఇష్టం మేడమ్! నేను మీ దగ్గర డబ్బుకోసం పని చేయడం లేదు. నేను చిన్నప్పటినుంచీ కన్న కల ఇది!"
    "ఓకే! నీకు ప్రస్తుతం రెండువేలు జీతం ఇస్తాను"
    "చెప్పాను కదా మేడమ్! మీరేమీ ఇవ్వకపోయినా పని చేస్తాను-"
    "ఎప్పటి నుంచీ జాయినవుతావ్?"
    "ఇందాకటి నుంచీ జాయినయ్యాననే అనుకుంటున్నాను"
    "వెల్ కమ్ - పద! నాడేట్స్ రాసిన డయిరీ చూద్దువుగాని....." అంటూ హాలునానుకునే ఉన్న మరో గదిలోకి దారి తీసింది. వెనుకే ఆ గదిలోకి నడిచాడు నూతన్.
    ఆఫీస్ రూమ్ ఎంతో ఆధునికమైన ఫర్నిచర్ తోనూ, అలంకరణతోనూ కళ్ళు మిరిమిట్లుగొలుపుతోంది.
    "ఇదిగో! ఆ టేబుల్ నీది దానిమీదే ఫోన్ వుంది. అది నీకు ప్రత్యేకం"
    "ఓ కే మేడమ్! ఇంత అందమయిన చాంబర్ లో పనిచేయటం నిజంగా అదృష్టం"
    ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. అభిరుచిని మెచ్చుకున్నప్పుడు కలిగే ఆనందం గురించి తను బాగా స్టడీ చేశాడు. అందుకేదానిని ఎక్కువగా ఉపయోగంలోకి తెస్తుంటాడు.
    ఆమె తన టేబుల్ సొరుగులో వున్న డయిరీ ఒకటి తీసి అతనికిచ్చింది "ముందునాక్కావలసింది వేషాలు! డబ్బుకన్నా కూడా సర్క్యులేషన్ తో వుండటం ముఖ్యం. అది నువ్వెలా మానేజ్ చేస్తావో తెలీదు. నాకు వీలయినంత త్వరగా రిజల్ట్స్ కావాలి"
    "ఓకే మేడమ్"
    "నేనింక వెళతాను షూటింగ్ వుంది"
    ఆమె వెళ్ళిపోతూంటే తనూ వెనుక హాల్లోకినడిచాడు.
    "అన్నట్లు నీకు కాఫీలూ, ఫలహారాలూ, భోజనం అన్నీ ఇక్కడే ఎలాంటి మొఖవాటం లేకుండా వంటమనిషి నడిగి తెప్పించుకో ఇప్పుడే సుజాతకు కూడా చెప్పేస్తాను, సుజాతా" అంటూ పిలిచిందామె.
    "వస్తున్నానమ్మా!" కిచెన్ లోనుంచి హాల్లోకొచ్చింది ఓ యువతి.
    ఆమెను చూస్తూనే స్టన్ అయిపోయాడు నూతన్. చాలా అందంగా వుంది. ఆమెను చూసిన ప్రతిమగాడికీ వయసుతో సంబంధంలేకుండా ఒకే ఆలోచన కలుగుతుంది --
    ఆమెను ఎలాగయినా పొందాలని, సర్రున కోరిక శరీరమంతాకాల్చేస్తూ పాకింది.
    సుజాత కూడా తనవేపుఓసారి చూసి కళ్ళు దించుకుంది.
    "ఇతను ఇవాల్టినుంచీ నా పి.ఆర్.ఓ. మన ఆఫీస్ రూమ్ లో ఉంటాడు. అతనికేం కావాలన్నా నువ్వే చూడాలి సరేనా?"
    "సరేనమ్మా!"
    "నేను వెళుతున్నాను నూతన్"
    "ఓకే. మేడమ్"
    ఆమె వెళ్ళిపోయింది. సుజాత మళ్ళీ తన వంక చూడటం గమనించి చిరునవ్వు నవ్వాడు అతను.
    ఆమె నవ్వలేదు.
    "మీకేమైనా కావాలంటే ఇంటర్ కమ్ ఫోన్ లో కిచెన్ నెంబర్ డయల్ చేస్తే సరిపోతుంది" అంది సీరియస్ గా.
    ఆమె వెళ్ళిపోతూంటే లయబద్దంగా కదులుతున్న ఆమె నడుంవంకే కన్నార్పకుండా చూశాడతను. తను ఢిల్లీలో సుఖాలనుభవించిన మీరానాయర్, గోపికారాణి ఈమెముందు బలాదూరే. సోయగం అంటే అది! ఒళ్ళంతా వేడెక్కిపోయింది.
    ఇన్ని వంపుసొంపులున్న పిల్ల సినిమాల్లో ఎందుకు వెళ్ళలేదు?
    అదీ ఓ సినిమాతార ఇంట్లోవుంది. తను ఇక్కడికొచ్చింది చంద్రికకు వున్న డబ్బు కాజేయటంకోసం.
    కానీ ఇప్పుడనిపిస్తోంది! డబ్బు సంగతెలా వున్నా సుజాత తనకి దక్కితే చాలని!
    ఆమె వివరాలు వెంటనే తెలుసుకోవాలి. ఆమెతో పరిచయం పెంచుకోవాలి. ఆమెను అర్జంట్ గా అనుభవించాలి.
    అంతవరకూ మనశ్శాంతివుండదు.
    తననింతవరకూ ఇలా కోరికతో రాక్షసుడిని చేసినవారెవరూ లేరు.
    ఇల్లంతా ఓసారి తిరిగి పరీక్షగా చూశాడతను.
    మేడమీద గదులన్నీ తాళాలువేసి ఉన్నాయి. ఇంటిలో వున్న ముసలి నౌకరు వీరయ్యతాళాలు తీసి చూపిస్తున్నాడు.
    ప్రతి గదీ లక్షలఖరీదు చేస్తుంది.
    ఓ అద్భుతమయిన సినిమా సెట్టింగులా వుంది. కానీ యిల్లులాలేదు. నిజంగానే చాలా గొప్ప టేస్ట్ వున్న వ్యక్తి.
    తనకూ చిన్నప్పటినుంచీ కోరిక! అలాంటి భవనంలో చాలా ఖరీదయిన జీవితం గడపాలని. కానీ కటిక దరిద్రం అనుభవించాడు.
    చివరకు ఆ దరిద్రంభరించలేకే తల్లీ తండ్రీ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. తనబ్రతుకు వీధులపాలయింది. ఇంట్లో వున్న వస్తువులన్నీ అమ్మి జీవితం ప్రారంభించాడు.
    నీతిగా, నిజాయితీగా వుంటే తను ఆత్మహత్య చేసుకోవటం తప్ప గత్యంతరంలేదు అని తనకు తెలుసు.
    అందుకే రెండో మార్గాన్ని ఎంచుకున్నాను.
    కిచెన్ లోకి చేరుకున్నారిద్దరూ సుజాత వంటపనిలో వుంది. తనను ఓసారి క్రీగంట చూసి తనపని తను చేసుకోసాగింది.
    "సుజాతా!" కావాలని పిలిచాడు.
    ఆమె తలెత్తిచూసింది. "ఏమిటండీ?"
    "నాకు కాఫీ కావాలి"
    "ఇప్పుడే తెస్తానండీ"
    వీరయ్యతో పాటు ఆఫీసు రూంలోకి నడిచాడతను. చాలా పెద్ద అద్దాలతో రెండు అల్మారాలు నిండిపోయివున్నాయ్ ఆమెకి బహుకరించిన షీల్డులు, మెమెంటోలు! అర్ధ చంద్రాకారంగా వున్న చంద్రిక టేబుల్ దగ్గరకెళ్ళి సొరుగులు తెరవడానికి ప్రయత్నించాడు. అన్నీ లాక్ చేసి వున్నాయ్. ఆఖరి సోరుగుకి మాత్రం తాళం వేయలేదు.
    తెరచి చూశాడతను.
    పాత బాంక్ పాస్ బుక్ లున్నాయి అందులో.
    "ఏ బుక్ లోనూ ముఫ్ఫయ్, నలభయ్ లక్షలు తక్కువ బేలన్స్ లేదు. అడుగుల చప్పుడు వినిపించేసరికి చప్పున సొరుగు మూసేసి తన టేబుల్ దగ్గరకెళ్ళి కూర్చున్నాడు.
    సుజాత ట్రేలో కాఫీ తీసుకొచ్చి అతని ముందుంచింది.
    "థాంక్యూ సుజాతా! నాకు ప్రతిరెండు గంటలకూ కాఫీ అలవాటు. అందుకని నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టాల్సివస్తుంది"
    "ఫరవాలేదండీ!" నేలకు చూస్తూనే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
    కాఫీ కప్ అందుకుని స్థిమితంగా తాగసాగాడు. నిజంగానే కాఫీ చాలా అద్భుతంగా వుంది. అంతా తనూహించినవిధంగానే వర్కవుట్ అవుతోంది.
    ఎటు చూసినా డబ్బే ఎంత తెలివిగా ఆ డబ్బుని తన కైవశం చేసుకుంటాడనేది తన తెలివితేటలమీద ఆధారపడివుంది.
    కాఫీ తాగి కప్పు తనే కావాలని కిచెన్ లోకి తీసుకెళ్ళాడు.
    సుజాత తనను చూసి పైట సరిచేసుకుంది.
    "వీరయ్యను పిలిస్తే తీసుకొచ్చేవాడుకదండీ!" అంది నొచ్చుకుని కాఫీ కప్పు అందుకుంటూ.
    "ఫరవాలేదు మనలో మనకి ఎవరయితేనేం?" నవ్వుతూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS