Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 39


    నేను ఠక్కున ఆగిపోయాను.
    
    మా ఇంటికి కాస్తంత దూరంలో ఓ ఆకారం మెదులుతోంది. రక్తం ఒక్కసారిగా నా ముఖంలోకి చిమ్మింది.
    
    ఆ ఆకారం కిందకు వంగి కుడిచేతిని సాగదీసి, ముందుకు విసిరింది. ఇంటిమీద రాయి పడ్డ చప్పుడు నక్క పళ్ళు కొరుకుతున్నట్లు వినిపించింది.
    
    ఏదో తెలియని మొండి ధైర్యం నాలో ప్రవేశించింది. చీర కుచ్చిళ్ళను ఎత్తి బొడ్లో దోపుకుని పరుగెత్తాను. మరింత దగ్గరగా వెళ్ళి ఆగాను.
    
    మెల్లగా నడవడం మొదలుపెట్టాను.
    
    కుక్కల అరుపులవల్ల నా అడుగుల చప్పుడు అతనికి వినిపించడం లేదు. మరో రాయి విసరడానికి అతను కిందకి వంగాడు.
    
    నేను చటుక్కున ముందు కురికి అతని చేయి పట్టుకున్నాను. చటుక్కున రాయి వదిలేశాడు. తల వంచుకున్నాడు.
    
    చెంపలు పగుల కొడదామా అన్నంత పిచ్చికోపంతో అతని ముఖాన్ని పైకి లేపాను. అప్పటికే అతనిమీద అసహ్యంతో నా నోట్లో నీళ్ళు ఊరాయి.
    
    ముఖంమీద ఉమ్మెయ్యాలని నోరు తెరిచిన నేను అలా బిగదీసుకుపోయాను. అది షాకో, ఆశ్చర్యమో, విస్మయమో ఏదో నేను చెప్పలేను.
    
    అతను.... నా భర్త..... శివరావ్.
    
    అప్పుడు కదిలింది బాధో, నిస్సహాయతో, బేలతనమో.....నాకు తెలియదు. నాకళ్ళలో నీళ్ళు.
    
    అలా ఎంతసేపు ఏడుస్తూ వుండిపోయానో తెలియదు. ఆయన మాత్రం వంచిన తల ఎత్తలేదు.
    
    "ఎందుకిలా?" ఏడుపును కచ్చబోతుతనం మింగేయడంతో అరిచినట్లు అడిగాను.
    
    అంత గట్టిగా అరుస్తానని తెలియని అతను కొరడా దెబ్బ తగిలినట్లు చివుక్కున తల పైకెత్తాడు.
    
    "ఏమిటిదంతా? ఎందుకు?" రెండు భుజాలు పట్టుకుని ఊపేశాను.
    
    ఆయన ఒక్కో మాటను అప్పుడే ఉచ్చరిస్తున్నట్లు చెప్పాడు..... "ఏం చేయను? నువ్వు మనింట్లో కాకుండా వేరే ఇంట్లో పడుకోవాలని నిన్ను భయపెట్టడానికి నేనే రాళ్ళు వేయడం మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడే పడుకుంటే నాకు ఇబ్బంది.
    
    శోభనం కావాలని అడుగుతానని భయం.
    
    బట్టలన్నీ విప్పుతావేమోననే టెన్షన్.
    
    నేను అందుకు పనికి రాను. పుట్టడమే అలా పుట్టాను."
    
    నాకాళ్ళ కింద భూమి చీరుకుపోతున్నట్లనిపించింది. మిన్ను విరిగి మీద పడిందంటారే అలాంటి స్థితి మరలాంటివాడివి ఎందుకు పెళ్ళి చేసుకున్నావని కూడా నాకు అడగాలనిపించలేదు.
    
    ఏదో వైరాగ్యం లాంటిది నన్నావహించింది.
    
    ఏడుపు కూడా రాని పరిస్థితి.
    
    ఆయన చేతులు పట్టుకుని ఇంటికి నడిపించుకొచ్చాను.
    
    "మీరు ఇకనుంచీ పెంకుటింట్లో పడుకోండి నేను గుడిసింట్లో పడుకుంటాను. ఇక మీరు మీ ఇంటిమీదే రాళ్ళు వేసుకోనవసరం లేదు" అన్నాను.
    
    మహిత చెప్పడం పూర్తిచేసి "అలా మా శోభనం జరక్కుండానే పోయింది" అంది ముక్తాయింపుగా.
    
    అప్పటికి బాగా పొద్దుపోయింది. చీకటి నల్లటి పొడిలాగా రాలుతోంది.
    
    "మరి నీకు ఇద్దరు పిల్లలు కదా" అంది సుజన ప్లాట్ గా ఆమె వైపు చూస్తూ.    
    
    "నా భర్తతో శోభనం జరగలేదన్నాను గానీ మరెవరితోనూ జరగలేదని చెప్పలేదుగా" అని నవ్వింది మహిత.
    
    మళ్ళీ ఆమే "ఎన్నిరోజుల తరువాత నువ్వు ఆ దుఃఖంలోంచి తేరుకున్నావ్? ఆ ఊరొదిలి భర్తతో పాటు ఎందుకిక్కడికి వచ్చేశావ్?
    
    నీ శోభనం ఎవరితో జరిగింది? వారానికో మారు ఎందుకు పుట్టింటికెళతావ్? అక్కడ ఎవరున్నారు? లాంటి ప్రశ్నలు వేయకు అవన్నీ అడక్కు ఊహించు" అంటూ పైకి లేచింది.
    
    ఆమె ఫస్ట్ నైట్ అంతా విన్నాక సుజనకూ దిగులుగా అనిపించింది.
    
    మహిత మీద జాలిలాంటిది కలిగింది అయితే ఆమె దాన్ని ప్రకటించలేదు.
    
    "రేయ్ లేవరా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి" తల్లి లేపడంతో మెలకువ వచ్చింది వంశీకి. హడావుడిగా అక్కడినుండి దొడ్లోకి దారి తీశాడు.
    
    అతను అంత హడావుడి పడిపోవడానికి కారణం శ్రీకృష్ణజన్మాష్టమి కాదు. ఆ రోజు ప్లాన్ నెంబర్ త్రీ అమలు చేయబోతున్నాడు. దానికి 'మేఘమాల' అని కోడ్ నేమ్ కూడా పెట్టుకున్నాడు.
    
    'మేఘమాల' సక్సెస్ అయి శోభనం జరగాలంటే చేయాల్సిన పనులు చాలా వున్నాయి. అందుకే మరో అరగంటకల్లా తయారయ్యాడు.
    
    అప్పటికే దేవాలయం దగ్గర కోలాహలంగా వుంది. లౌడ్ స్పీకర్ లోంచి ఈ మధ్యే రిలీజైన సినిమాల్లోని పాటలు ఊరినంతా బ్రేక్ డాన్స్ వేయిస్తున్నాయి.
    
    గర్భగుడి అంతా శ్రీరామచంద్రుడు ఆక్రమించుకోవడంతో భజన మందిరంలో శ్రీకృష్ణుని పటం పెట్టారు. దానినిండా పూలమాలలు వేయడంవల్ల పూల మధ్యలోంచి శ్రీకృష్ణుడు ముఖాన్ని మాత్రం బయటపెట్టి తొంగి చూస్తున్నట్లుంది. మందిరం పైన కట్టిన మామిడాకు తోరణాలు గాలికి అటూ ఇటూ ఊగుతూ, గోపికలు వయ్యారాలు పోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఓ మూల చేరిన భజన బృందం హార్మోనియాన్ని ముందేసుకుని పాటలు పాడుతోంది. అయితే పాడుతున్న వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళు కూడా స్పీకర్ లోంచి వస్తున్న సినిమా పాటలనే వింటున్నారు. గుడి పూజారి తనలో తనే గొణుక్కుంటూ కిందపడి దొర్లుతున్న పిల్లనగ్రోవిలా తిరుగుతున్నాడు.
    
    దేవాలయం ముందు చేరిన పిల్లలు పట్టలేని ఉత్సాహంతో ఆటలు ఆడుకుంటున్నారు. వరండాలో ఓ పెద్ద అండాలో పానకం కలిపి, వచ్చిన వాళ్ళందరికీ ఓ గ్లాసు పానకం ఇస్తున్నాడు ఓ పూజారి. ఊరికి తూర్పున వున్న ఖాళీస్థలంలో ఉట్లు కొట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు యువకులు.
    
    వంశీ ముందు దేవాలయం దగ్గరికి వెళ్లి ఆ తరువాత ఇంటికి వచ్చాడు. అప్పటికే టైమ్ పదిగంటలై పోయింది. ఇక త్వరపడకపోతే మొత్తం ప్లాన్ అంతా పాడయిపోతుందని స్కూలు దగ్గరికి వెళ్ళాడు. స్కూలంతే అక్కడ పెద్ద భవంతులు ఏమీ లేవు. ఓ పెద్ద గది మాత్రమే వుంటుంది. దానిని టీచర్ మధ్యాహ్నం విశ్రమించడానికి, రిజిష్టర్లు గట్రా పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. తరగతులన్నీ అక్కడే వున్న పెద్ద చింతచెట్టు కింద జరుగుతాయి.
    
    జన్మాష్టమి సందర్భంగా ఆరోజు స్కూలుకి సెలవు. అంతకు ముందు రోజు సాయంకాలం టీచర్ ఊరుకి వెళ్ళేప్పుడు వంశీ ఆయన్ను అడిగి తాళం చెవి తీసుకున్నాడు. ఆ రాత్రే తన శోభనానికి కావాల్సిన మంచం, పరుపు, రెండు దిండ్లు, ఓ దుప్పటినీ అక్కడికి చేర్చాడు.
    
    తాళం తీసి గదిలో ఒద్దికగా అమరిన మంచాన్ని తనివితీరా చూసుకుని, అక్కడి నుంచి వచ్చాడు వంశీ.
    
    ఇంటికొచ్చి ప్యాంటూ షర్టూ వేసుకుని టౌన్ కి బయల్దేరాడు. అదృష్టం కొద్దీ వెంటనే బస్సు దొరికింది.
    
    బస్టాండ్ నుంచి పదడుగుల దూరంలో కిరణ్ వీడియోషాపు ఆ షాప్ ఓనర్ కి కిరణ్ తో స్నేహం లేదుగానీ ముఖపరిచయం మాత్రం వుంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS