Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 38


    "శారదా.........!' అని గది గుమ్మం ముందు నిలబడి పిలిచాడు.
    'ఎవరు?' అని గుమ్మం వైపు చూసిన శారద "మీరా చినబాబు గారూ! అని బయటికి వచ్చింది.'    
    "శారదా ....! నీతో ఏకాంతంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎటైనా వెడదామా?'
    'అలాగే'
    'ఎక్కడికి వెడదాం?'
    'మీ యిష్టం!'
    'మన ద్రాక్ష తోటకు వెడదాం. అక్కడైతే ఏకాంతంగా ఉంటుంది.'
    'పదండి వెడదాం.'
    శారదతో తమ కారులో ద్రాక్ష తోటకు బయలుదేరాడు ప్రభాకరం. సాయంత్రం నాలుగు దాటింది.
    ద్రాక్ష తోటలో పచ్చిక పై యిద్దరూ కూర్చున్నారు. తోట కాబట్టి , బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ అక్కడ చల్లగా ఉంది; కొన్ని క్షణాలు యిద్దరూ మౌనంగా గడిపారు.
    ప్రభాకరం మౌన భంగం చేస్తూ "నీవు నన్ను క్షమించగలవా శారదా?' ఎంతో మృదువుగా ప్రశ్నించాడు.
    ఆ మాటలలోని మృదుత్వానికి శారద ఎంతో ఆశ్చర్యపడింది "ఏమిటిది? చినబాబు గారిలో యింత మార్పు వచ్చిందేమిటి? మాటతీరు, కట్టు బొట్టు, వినయ విధేయతలు....పూర్తీ మార్పు...ఊహించలేనటువంటిది. అసలు వీరు ప్రభాకరం గారేనా అన్న అనుమానం కలుగుతూ ఉంది.'
    'నీవు క్షమించలేవు . ఎలా క్షమిస్తావు? మనిషై పుట్టిన వారెవరూ చేయకూడని అపరాధం చేశాను. అనాధవైన నీ పట్ల కరుణ, ఆదరణ చూపవలసింది పోయి, చేయని నేరాన్ని నీ గంట గట్టి యింటి నుండి తరిమేశాను. ఆ తర్వాత ఎన్ని బాధలు పడ్డావో.......?'
    పై మాటల వల్ల శారద ఆలోచనలకు అంతరాయం కలిగి బాహ్య స్మృతి ఏర్పడింది.
    'చినబాబు గారూ! అటువంటి మాటలనకండి. మిమ్ములను క్షమించడానికి నేనెంతటి డాన్ని> ఆ భగవంతుడి దయ వల్ల ఎవ్వరూ ఊహించలేని మార్పు మీలో వచ్చింది. అంతేచాలు. నా ప్రాణానికి ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఎన్నోసార్లు మీరు గుర్తుకు వచ్చేవారు. అలా గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ బాధ ఈనాటితో తీరిపోయింది.' చూపులు దించుకొని వణుకుతున్న కంఠస్వరంతో ఎంతో వినయంగా అంది శారద.
    'శారదా! నిన్ను నేను సరిగా అర్ధం చేసుకోలేక పోయాను. నీవు నా బాగోగుల గురించి పడిన తాపత్రయం నా తలపుకు వచ్చినప్పుడల్లా నేను నీ పట్ల చూపిన కాఠిన్యత కూడా గుర్తుకు వచ్చి నన్ను పిచ్చి వాణ్ణిగా చేస్తుంది. ఆరోజులలో అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో? నా ప్రవర్తన నాన్నగారిని, అమ్మను ఎంతో బాధించింది. ముఖ్యంగా నిన్ను ఆనాడు కొట్టిన దెబ్బ స్పురణ కు వచ్చినప్పుడల్లా సిగ్గుతో ఎంతో బాధను వ్యక్తం చేస్తూ అన్నాడు ప్రభాకరం.
    'బాధపడకండి . చేసిన తప్పులు తెలుసుకున్నారు. పశ్చాత్తాప పడుతున్నారు. పశ్చాత్తాపం ఎటువంటి పాపాలనైనా ప్రక్షాళనం చేస్తుంది. అంతకన్న కావలసిందేముంది?'
    'శారదా నీవు నన్ను క్షమించాననాలి అలా అంటేనే నాకు తృప్తి.'
    'అదేమిటి చినబాబు గారూ! నేను....నేను ....మిమ్ములను క్షమించడమేమిటి? అంతటి అర్హత నాకుందా?'
    'అలా అనకు నీవు క్షమించక పొతే జీవితాంతం నేను బాధ పడవలసి వస్తుంది. అలా బాధపడడం నీకిష్టమా?'
    'ఎంతమాట ! క్షమించాను. అని సిగ్గుతో తల దించుకుంది శారద.
    'హమ్మయ్య! నా ప్రాణం యిప్పుడు కుదుట పడింది. నిన్ను మళ్ళీ చూడగలనని కలలో కూడా ఊహించలేదు. నా దురుసు ప్రవర్తన వల్ల బాధపడిన నీవు మళ్లీ మా యింటి గడప త్రోక్కుతావని ఊహించలేదు నేను. మా యింటికి మళ్లీ ఎప్పుడు వచ్చావు? మా యింటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నావు? ఇప్పుడెం చేస్తున్నావు? నీకు ఎటువంటి అభ్యంతరమూ లేకపోతె ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు!' శారద కళ్ళల్లోకి ప్రేమ నిండిన చూపులతో చూస్తూ అడిగాడు ప్రభాకరం.
    తను ఆరోజు శ్రీపతి గారి ఇల్లు ఒదిలి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే నెమ్మదిగా , వినయంగా వివరించింది శారద. వోపికతో అంతా విన్నాడు ప్రభాకరం.
    'శారదా1 నిన్ను నేను పోగుడుతున్నానని మాత్రం అనుకోవద్దు. నీకు అంత అవమానం జరిగిన తర్వాత కూడా మళ్లీ మా యింటికి వచ్చావు. అమ్మకు సేవలు చేశావు, నీ సంస్కార హృదయాన్ని ఎంతగా శ్లాఘించినా తక్కువే! అమ్మ జబ్బు పడినపుడు నీవు ఆమెను అదుకోక పొతే ఎంతో యిబ్బంది కలిగి ఉండేది. నాన్నగారు ఈ విషయాలేవీ నాకు తెలుపలేదు. తెలిపితే నేను ఎక్కడ చదువు ఒదిలి పెట్టి వస్తానో నన్న భయం .' శారదను కృతజ్ఞత నిండిన చూపులతో చూస్తూ అన్నాడు ప్రభాకరం.
    'నన్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. నేను మీ యింటి నుండి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని మీరు ఊహించే ఉంటారు ఈపాటికి. నేను ఉంది మిమ్ములను దోషిగా నిరూపించడం నాకు యిష్టం లేక పోయింది. దోషిగా నిరూపించబడి, తిన్న యింటి వాసాలు లేక్కబెట్టే ద్రోహి గా చలామణి అవుతూ మీ యింట్లో ఉండడం సాధ్యపడదని తేలిపోయింది. మీ యింట్లోనే ఉంటూ మీ కుటుంబం లో కలతలు కల్గించడం యిష్టం లేక అలా వెళ్ళిపోయాను. మీరలా చేశారని మీ పై కోపాన్ని ద్వేషాన్ని గాని ఎన్నడూ పెంచుకోలేదు. అహర్నిశలూ మీలో రా తగిన మార్పు ఆ భగవంతుడి దయ వల్ల కలగాలని ఎంతగానో పరితపించాను. నా తపస్సు ఫలించింది. మీలో మార్పు కలిగింది. నాకు అంతే చాలు' నిర్మలంగా ఉన్న ప్రభాకరం ముఖం లోకి ఆప్యాయంగా చూస్తూ అంది శారద.
    'శారూ....నీవు మనిషివి కావు. దేవతవు. ఇంతకాలం నిన్ను సరీగా అర్ధం చేసుకోలేక నీకు దూరమయ్యాను. ఇక నిన్ను దూరం చేసుకోను. ' తన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా శారదకు తెలియజేస్తూ , తను ఆ మాటలు అంటున్నప్పుడు ఆమెలో వస్తున్న మార్పులను ఆదుర్దాగా గమనించ సాగాడు.
    కలవరపాటు వల్ల వణుకుతున్న పెదిమలు వాటిని అదుపులో పెట్టుకోవడానికి ఆమె పడుతున్న వ్యర్ధ ప్రయాస, సిగ్గు వల్ల కెంపులతో పోటీ పడుతున్న బుగ్గలు, హృదయారాటాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం చేత వేగంగా వెలువడుతున్న ఉచ్చ్వాస, నిశ్వాసాలు బెదురు వల్ల మీన నేత్రాలలా చలిస్తున్న ఆ కాటుక కళ్ళు ప్రభాకరాన్ని పిచ్చివాణ్ణి గా చేశాయి. ఆ సిగ్గు వల్ల వచ్చిన ఆమె ముఖం లోని మెరుపును కొన్ని నిముషాలు మాత్రమే చూడగలిగాడు ప్రభాకరం. విచ్చిన గులాబీల ఉన్న ఆమె ముఖం మరుక్షణం లో అకస్మాత్తుగా వాడి క్రింద రాలిన మందారం లా మారింది. అందుకు కారణం ఊహించుకోలేక తికమక పడ్డారు ప్రభాకరం.
    'చినబాబు గారూ మీ ఉద్దేశం నా కర్ధమైంది. మీరు నాకు ఆరాధ్య దైవం. మిమ్ములను ఎంతకాలం నుండో ప్రేమిస్తున్నాను. కాని ఆ ప్రేమ అజ్ఞాతంగా ఉండవలసి వచ్చింది. అందుకు మొదటి కారణం మీరు నన్ను ఆరోజులలో అసహ్యించు కోవడం . రెండవది నేను పేదరాలినవడం. మూడవది పేదరాలినైనా నా తండ్రేవరో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉండడం. ఈ కారణాల వల్ల నా ప్రేమ యింతకాలంగా నాలోనే అజ్ఞాత వాసం చేసింది. ఒక్క శాంత కు తప్ప ఈ విషయం మరెవ్వరికీ తెలియదు. ఈ మధ్య నీరజ ఊహించింది. ఇంతకాలానికి నా ఆశయం ఫలించి మీరు నన్ను ప్రేమిస్తున్నారు. మొదటి సమస్య మాత్రం తీరింది. మిగతా రెండు సమస్యలూ బలీయమైనవి. మీ యింటి కోడలిగా మనగలిగే అర్హత నాకు లేదు. మీది గొప్ప వంశము. నాన్నగారూ బాగా పేరు ప్రతిష్టలు సంపాదించు కున్నవారు. నా కారణంగా కుటుంబానికి ఎటువంటి మచ్చా రాకూడదు.'
    'అదేమిటి శారదా......! నీవు నన్ను ద్వేషిస్తున్నావని యింతకాలం ఉపేక్ష చేశాను. అసలు నా ముఖం చూడడానికి యిష్టపడతావో లేదోనని భయపడ్డాను. తీరా నేను నా నిర్ణయాన్ని తెలిపెసరికి అలా లేనిపోని అనుమానాలు సృష్టించుకొని బాధపదుతున్నావా?' శారద లోని మంచితనానికి హృదయ పూర్వకంగా తన మనసులో అభినందిస్తూ అన్నాడు ప్రభాకరం.
    'మీకు తెలియదు చినబాబు గారూ! మీరు ఉత్త అమాయకులు. ఈ పేదరాలి కోరికలు అంత తేలికగా నెరవేరవు. తండ్రెవరో తెలియని నన్ను చేసుకొని మీరు జీవితాంతం అపహాస్యాల పాలు కాకూడదు. ఆవేశంతో త్వరపడి చేసుకోవలసిన నిర్ణయం కాదిది. పెళ్ళంటే నూరేళ్ళ పంట. మీ నాన్నగారు నన్ను ఎంతో అపేక్షతో చూస్తున్నా ఈ విషయ మసలు వారి వరకు వెళ్ళడానికి నేనంగీకరించను. వెంటనే నన్ను అపార్ధం చేసుకుంటారు.' ఆందోళన వ్యక్తం చేస్తున్న చూపులతో ప్రభాకరాన్ని చూస్తూ అంది శారద.
    'శారదా ! నీవు లేనిపోని వన్నీ వూహించుకొని అనవసరంగా బాధ పడుతున్నావు శారదా! నిన్ను అంతగా ప్రేమిస్తున్ననాన్న గారు తమ కోడలిగా స్వీకరించడానికి వెనుకాడుతారా?'
    'అందుకే మీరు ఉత్త అమాయకులని మొదటే అన్నాను. మీ నాన్నగారు ధర్మాత్ములు. జాలి గుండె కలవారు. దిక్కులేని దానననే భావంతో నన్ను చేరదీశారు. చురుకుగా చదువుతున్నానని చదివించారు. అంత వరకే! అసలు నేను మిమ్మలను ప్రేమిస్తున్నానన్న సంగతి వారికి సూచన ప్రాయంగా కూడా తెలియదు. తెలియకూడదు. అలా తెలిసిన రోజు కనీసం మీ యింటి గడప త్రొక్కడానికైనా నేను నోచుకోను.' విచారంతో అంది శారద.
    'నీకోసం ఎంత కాలమైనా నిరీక్షిస్తాను. తీవ్రంగా ప్రయత్నిస్తాను. నీలాంటి నిష్కల్మష, అమృతహృదయుల విషయంలో పుట్టు పూర్వోత్తరాలను విచారించవలసిన పని లేదు. నిన్ను యధాతధంగా స్వీకరిస్తాను. అలా జరగని నాడు జీవితాంతం బ్రహ్మచారిగా గడుపుతాను.' దృడంగా అన్నాడు ప్రభాకరం.
    ధన్యురాలను చినబాబు గారూ! ఈ మాటలే చాలు' అరమోడ్పు కనులతో తన్మయత్వం తో అంది శారద.
    'అంటే నీ ఉద్దేశ్యం....?' ఆత్రంగా ఆమె ముఖం లోకి చూస్తూ ప్రశ్నించాడు.
    'ఏముంది? మీ పాద దాసిగా మిమ్ములనొక  వరం ప్రసాదించమని వేడుకుంటున్నాను. మీరు ప్రసాదిస్తా నంటే కోరుకుంటాను. ఆ తర్వాత తప్పకూడదు' తన చేతిని ముందు చాస్తూ 'నాకు మాట యివ్వండి ' అంది శారద.
    సందిగ్ధావస్తలో పడ్డాడు ప్రభాకరం. ఏం వరం కోరుకుంటుందబ్బా? తీరా మాట యిచ్చాక నాకు సాధ్యపడని వరం కోరుకుంటే ఎలా తీర్చగలను?' అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా 'కొన్ని షరతులు మొదటిది. అవసరం నాకు సాధ్యమయ్యేదిగా ఉండాలి రెండవది మన యిద్దరికీ ఎడబాటు కలిగించకూడనిదిగా ఉండాలి. అవరం ప్రసాదించిన తర్వాత నే చెప్పినట్లు వినాలి.' చిరునవ్వుతో అన్నాడు ప్రభాకరం.
    'మీరు ప్రసాదించబోయే ఒక్కవరానికి యిన్ని అంక్షలైతే ఎలా ? నేను వీటన్నింటి కీ ఒప్పుకోను. మీ మొదటి అంక్ష మాత్రం  పాటిస్తూ మీకు సాధ్యపడేవరాన్ని మాత్రం కోరుకుంటాను.' చిలిపిగా ప్రభాకరాన్ని చూస్తూ అంది శారద.
    ఆ చూపులకు ముగ్ధుడయ్యాడు ప్రభాకరం --
    'అలా వీల్లేదు ' మొండి కేత్తాడు.
    'అవుతే నాకూ ఏ వరకూ అక్కరలేదు' మూతి ముడుచుకుంది శారద.
    'సరే! కానివ్వు ఎంతైనా ఆడవాళ్ళు చాలా గడుసు వాళ్ళు. తమ పంతాన్నే నెగ్గించుకుంటారు. కోరుకో శారదా! నాకు సాధ్యమయ్యేదైతే తప్పకుండా తీరుస్తాను.'
    'మాటివ్వండి' చేయి ముందుకు చాచింది శారద.
    ఆమె చేతిలో తన చేతిని కలుపుతూ మృదువుగా నొక్కాడు---
    ఇద్దరి శరీరాలు జలదరించాయి విద్యుత్తు ప్రవహించడం వల్ల. సిగ్గుతో మొగ్గైంది శారద. మెల్లిగా ప్రభాకరం చేతి నుండి తన చేతిని విడ తీసుకొని తల ఒంచుకొని కూర్చుంది.
    'ఇప్పుడైనా మమ్ము కరుణించి వరం కోరుకుంటారా?' అర్ధ నిమీలిత నేత్రాలతో శారద ను చూస్తూ అన్నాడు ప్రభాకరం. 'దేవర వారిదే ఆలస్యం, వరం తీర్చే విషయంలో.' అని మృదువుగా సన్నగా నవ్వింది శారద. ఆ నవ్వులో శృతి కలిపాడు ప్రభాకరం--
    'నవ్వులాట కాదు చినబాబు గారూ! మీరు కలవారి యింటి అమ్మాయిని వివాహం చేసుకోని మీ సంసారాన్ని మూడు పువ్వులూ ఆరు కాయలుగా తీర్చి దిద్దుకోవాలి. కలవారి అమ్మాయి కట్న కానుకలతో ఘనమైన సారెతో మీ యింటికి వస్తుంది. బంధువుల రాకపోకలు ఆడంబరాలు వీటి నన్నింటి నీ ఈ పేదరాలి కోసం వదులు కోవద్దు. ఆవిధంగా నాకు మాట యివ్వండి. అదే నాకు ప్రసాదించవలసిన వరం' ముఖాన్ని గంబీరంగా మార్చుకొని సీరియస్ గా అంది శారద.    
    'శారూ! ఎంత మాతన్నావ్? అది మాత్రం సాధ్యపడదు' ప్రభాకరం కూడా సీరియస్ గానే అన్నాడు.
    'మీరు నాకు మాట యిచ్చారు. మాట యిచ్చి తప్పుతారా?' నీరు నిండిన కళ్ళతో ప్రభాకరాన్ని దైన్యంగా చూస్తూ అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS