Previous Page Next Page 
దీప శిఖ పేజి 38


    "అదేం వీల్లేదు . మాతో పాటు పస్తులు పడి అఘోరించడానికి వీల్లేదు ఫో....ఆ బండి నీ గుర్రాన్నీ తీసుకుని మరీ వెళ్ళిపో -- గుండెల మీద కుంపటి లాగ నువ్వొకడివి నాకు" అంటూ అరిచాడు శంకరం - కాస్సేపు బతిమాలి, చేసేదేం లేక "సరేనయ్యా!....సరే...నేను నీకంత బరువైతే పోతాలే-- నాకుతోడు మళ్ళీ ఈ గుర్రం బండీ కూడా ఎందుకు ?....పోతన్నా తల్లీ!.......ఈ రోజుతో మా రాజు కొలువు నాకు రుణం తీరిపోయింది అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు సుబ్బడు.
    "అంతా మనల్ని వదిలి వెళ్ళిపోయారు సావిత్రీ! ఇంక మన ఇద్దరం మిగిలాం" అన్నాడు అవతల నుంచి డగ్గు త్తికతో శంకరం.
    "మీరు అలా మనస్సు పాడు చేసుకోకండి -- కాస్సేపు లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి" అంది తలుపు ఇవతల నుంచి సావిత్రి.
    "సావిత్రి!" అని బేలగా అరిచి కుర్చీ లోంచి లేవబోయాడు శంకరం -- ఇంతలో హాస్పిటల్ లోకి ఎవరో వచ్చిన అలికిడి అయి ఇంట్లోకి వచ్చేసింది సావిత్రి.     
    అవతల హాస్పిటల్ లోంచి మాటలు వినిపిస్తున్నాయి.
    "కంపౌండరు లేడు- ఆ మందు సీసాలు ఏవి ఎక్కడ పడి ఉన్నాయో ఏమో-- నన్నెందుకు చంపుతావు కాని వెళ్లి ఏ వాము కషాయమో తాగి పడుకోకూడదూ? కడుపులో పోట్లు ఎక్కడి వక్కడే పోతాయి "
    "డాక్టర్ గారోయ్ ....మీరిలా అనకండోయ్ !....ఇవేవో సామాన్యమైన పోట్లు గా లేవు.....కషాయాలూ గట్రా లాభం లేదు .......లేవండి బాబోయ్! ..ఇంత మందేదో పోయించండి నేను భరించలేను దేవుడోయ్."
    "నువ్వు నా ప్రాణం తీయడాని కొచ్చావోయ్ పంతులూ......... ఊ......అఘోరించు ......సీసా తెచ్చుకొన్నావా?.....ఉత్త చేతులు ఆడించుకొని.ఏం చేద్దాం అని వచ్చావ్?......ఆ అలమారలో ఏదో కాళీ సీసా ఉంటుంది తీసుకో .....ఈ ఔన్సు గ్లాసు లో మండు ఆ సీసాలో పోసుకుని దయ చెయ్యి బాబూ!.....ఊ......ఇంకా నిలబడ్డా వెం?
    "ఇవి ఎన్ని మోతాదులు?"
    "కనిపించడం లేదూ? ....మూడు"
    "మరి వస్తానండి.....ఇంటి తనఖా బాపతు పన్నెండు వేల మీద వడ్డీ రోజురోజు కి పెరుగుతోంది.... ఈ నేలేనా కొంచెం చెల్లు పెట్టించండి."
    అ మాటతో , అసలే చిరాగ్గా నూ, విసుగ్గా నూ ఉన్న శంకరం ఒళ్ళు మండి దభాల్న తలుపు వేసేసి ఇంటికి హాస్పిటల్ కి మధ్య నున్న తలుపు తోసికొని , ఇంట్లో కి వెళ్ళాడు. సావిత్రి తల ఎత్తి శంకరం ముఖం కేసి చూసింది. శారీరకం గానూ, మానసికం గానూ ఎంతో అలసినట్లు కనిపించాడు శంకరం.
    రేగిన జుట్టు, చెమట పట్టిన ముఖం, నీరసించిన కళ్ళూ, కొద్దిగా మాసిన గడ్డం, భుజాల దగ్గర చిరిగినా షర్టూ, నలిగి పోయిన పాత పంచా ఈ రూపంలో భర్తని చూసేసరికి సావిత్రి కి దుఃఖం పెల్లుబికి వచ్చింది. అమ్మాయి కోసం బెంగ పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం లో , ఈయన ఎలా ఉన్నారో, ఎమౌతున్నారో తను పట్టించు కోలేదు ఇన్నాళ్ళూ -- నాలుగు నెలలో ఇంకా నలభై ఏళ్ళకి గాని రాని ముసలి వాటం వచ్చేసింది మనిషిలో -- పైకి చెప్పడం లేదు కాని మణి వెళ్ళిపోవడం వల్ల తన కంటే ఆయనే ఎక్కువగా కుమిలి పోతున్నారన్న మాట!...అయన మనస్సు ఎంత మెత్తనిదో అందులో మణి అంటే అయన కెంత పంచ ప్రాణాలో తనకి తెలుసు.......లోకానికేం తెలుసు ?...శంకరం కళ్ళలోకి దీనంగా చూస్తూ "ఏవండీ?.....మీరలా వుంటే నేను చూడాలేనండి " అంది.
    "సా....వి...త్రీ!"అన్నాడు బాధగా శంకరం. ఆ కంఠం లోని ఆవేదనకీ కంగారు పడి చట్టున అతని తలని తన గుండెలకి అదుముకుని, జుట్టు లోంచి వేళ్ళు పోనిచ్చి మౌనంగా అతణ్ణి సముదాయించ సాగింది.
    "నువ్వు ఒక్కత్తేవే మిగిలావు నాకు.......అంతా కక్ష కట్టి వెళ్లిపోయారు ...తల్లి ....నా మణి తల్లికి కూడా నా మీద కోపం వచ్చింది -" అన్నాడు బొంగురు పోయిన కంఠం తో --
    సింహం లాగా వుండే మనిషి ఇలా బెంబేలు పడిపోవడం చూస్తె, సావిత్రి కి గుండె ల్లోంచి వరదలా వచ్చేసింది బాధ. ఆ బాధనంతా కంఠం లోనే ఇముడ్చు కుని "మీరవెం తలుచుకోకుండా ఒక్క గంట ఇలా ప్రశాంతంగా పరుపు మీద పడుకోండి -- నేను మీ పక్కనే కూర్చుని తల నిమురుతాను."
    "నీకు నా మీద కోపం లేదా సావిత్రీ?....అయిన వాళ్ళందరి నీ చెండనాడుకుని, ఆఖరికి నీ కూతుర్ని కూడా నీకు దూరం ..........."
    "ఛ......అవెం మాటలండీ!....మణి వెళ్ళిపోయినందుకు మీకు మాత్రం బాధగా లేదూ!....అయినా ఇప్పుడవన్నీ ఎందుకు?.....ఆదమరచి ఒక్క గంట పడుకోక?
    "హు!......నా పడక, నా భోజనం ...ఎప్పుడూ నా సంగతే కాని మీ మాట ఏవిటి?.......నువ్వీ నాలుగైదు నెలల్లో నూ ఒక్క రాత్రయినా కళ్ళు మూసుకుని నిద్ర పోయావా?......మణి కోసం మౌనంగా ఏడుస్తూ కూర్చొని రాత్రి ఉందా?..నువ్వు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళ యింది ?.........చెప్పు సావిత్రీ ....చెప్పు."
    "తినకేం ?......మణి అన్నం కూడా నేనే తింటున్నా......."శోకం తో కంఠం పూడుకుపోయి ఆ పైన మాట్లాడలేక పోయింది సావిత్రి.
    "ఆ.......తింటున్నావు? ...........నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు విన్నా ఇవాళా అసలు అన్నం తిన్నావా?.....ఉన్న ఆ కాసిన్ని గింజలూ నాకు ఉడకేసి నువ్వు పస్తు పడుకోలేదూ?
    సావిత్రి ముఖం అటు పక్కకి తిప్పి "అబ్బబ్బ......చంపేస్తున్నా రండీ.....కాస్సేపు ఆదమరచి నిద్రపోండి అంటే ఏవిటా ప్రశ్నలు?"
    "కాదు .....సావిత్రీ ...నన్ను మభ్య పెట్టాలని చూడకు.....నేనంతా కనిపెడుతూనే ఉన్నా.....అన్నం తినకుండా అలా పస్తులు పడుకుంటే ఎలా?.....లే.....నేను కూడా వస్తాను నీతో వంటింట్లో కి...నేనీ గడప మీద కూర్చుంటాను... నువ్వు అన్నం తిందువు గాని ....ఏం? ...నాకు  మాత్రం ఇంకెవరు న్నారు సావిత్రీ నువ్వు తప్ప.......ఇలా పస్తులుండి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే , ఆ తర్వాత నా బ్రతుకెంత దుర్భరం అయిపోతుందో ఆలోచించు. నువ్వు కూడా లేకపొతే.......నా మాట విను ....ఊ..లే!....నామీద ఒట్టే లేవలేక పొతే!'
    "ఇలా హింసిస్తారెవిటండి నన్ను ?.........." అంటూ లేచింది సావిత్రి.
    ఇంతలో హాస్పిటల్ దగ్గర కలకలం వినిపించింది.    
    గేటు తీసుకొని జనం బిలబిలా వచ్చేస్తున్నారు.
    కొందరు హాస్పపిటల్ తలుపులు బాదేస్తున్నారు.

                          
    కొందరు గట్టిగా కేకలేస్తూ అరుస్తున్నారు. జనం -- హడావిడి అల్లరి సావిత్రి కేం అర్ధం కాలేదు.........
    శంకరం ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తోసుకుని ఇంట్లోంచి హాస్పిటల్ హలో కి వెళ్ళాడు . అతని వెనకాలే తలుపు దాకా వెళ్లి ఆ తలుపు వెనకాల సావిత్రి ఆగిపోయింది. శంకరం హాస్పిటల్ తలుపు తెరిచాడు. ఎదురుగుండా కర్ర లేసుకుని వందా రెండు వందల మంది జనం కళ్ళతో శంకరాన్ని తినేస్తూ నిలబడ్డారు. ఇవతల ఇంట్లో కి వచ్చే తలుపు సందు లోంచి , ఆగ్రహావేశ పూరితమైన వాళ్ళ భయంకర మైన ముఖాలు, సావిత్రికి కనిపించాయి. తలుపు తెరవగానే అంతా ఒక్కమారు కర్ర లేత్తారు శంకరం మీదికి.
    అది చూసి సావిత్రి కెవ్వున అరిచింది. కాని శబ్దం కంఠం పెగిలి రాలేదు. గుండె మహా వేగంగా కొట్టుకుంటూ ఒణికి పోతూ గోడకి జేర్లబడి పోయింది. నిర్జీవంగా- కళ్ళు చీకట్లు కమ్మి చెవులు గడియలు పడి అచేతనంగా పడిపోయిన సావిత్రి చెవుల్లో అవతల నుంచి వినిపిస్తున్న మాటలు పడి రక్త ప్రసరణ ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.
    మునసబు ముందోకొచ్చి అందరినీ ఆగమని సంజ్ఞ చేశాడు. ఇటు శంకరం వేపు తిరిగి "ఏవయ్యా.....విషం యిచ్చి పంతుల్ని ఎందుకు చంపావు?" అన్నాడు కళ్ళ తో హత్య చేసేవాడి లాగ చూస్తూ.
    "విషమా?....పంతులు చనిపోయాడా?' శంకరం తెరిచిన నోరు అలాగే వుండిపోయింది........
    "ఎందుకలా నటిస్తావు ....ఒరేయ్!...ఆ శవాన్నిలా తీసుకు రండి .....ఇదుగో నయ్యా.....నువ్వు చంపిన పంతులి శవం ఇది, నువ్వు ఇచ్చిన విషం సీసా ఇది!....ఈ మాటు చెప్పు"
    శంకరం నోటి వెంట మాట రాలేదు.....
    జనంలోంచి గట్టిగా కేకలు వినిపించసాగాయి , ఎవరికి తోచినట్లు వాళ్ళు అరుస్తున్నారు.......
    "ఏం తెలియనోడి లాగ ఎలా నటిస్తున్నాడో?"
    "అవును మరి .....ఈ పంతుల్ని పంపిస్తే పన్నెండు వేలూ ఎగ్గోట్టొచ్చు"
    "అది కాదు....కడుపులో పొట్ల ని ఆ దేమడోస్తే ఇసం ఇస్తావా ఇసం?.....అది మందనుకుని తాగి ఆమరాజు కాస్తా టామ్మని పేణం వోదిలేశాడు......ఇంత గోరకలి ఎక్కడేనా ఉందా?"
    "ఇసమా అని తెల్లబోతున్నాడు....ఇసం కాకపొతే తన్నో రెండు గుక్కలు తాగమను చూద్దాం"
    "పోలీసోళ్ళ కి తగిలిస్తే సరి ఆళ్ళే కక్కిస్తారు నిజం "
    "పోలీసోళ్ళు ఎందుకురా ...మనం సేప్పించలేవేటి?"
    "కొట్టండేహే?........" అంటూ అంతా కర్ర లేత్తారు. శిలా ప్రతిమలా కొయ్యబారి నిలబడి పోయి ఉన్న శంకరం మీదకి.
    "ఆగండి ?" అంటూ ఇంటి సరిహద్దయిన తలుపు తెరిచి ఎన్నడూ రానిది ఉరికింది సావిత్రి, ఒళ్ళంతా వణికి పోతోంది. కళ్ళు రెండూ నిప్పు కణాల్లా
మండిపోతున్నాయి. నుదుటని వున్న పెద్ద యెర్రని కుంకుమ బొట్టు మూడో కన్ను లాగ కణకణ లాడుతోంది. కోపంతో బుసలు కొడుతూన్న సావిత్రి స్త్రీ రూపం ధరించిన రుద్రుడా అన్నట్లు వుంది ....ఆమె ముఖం లోని తీవ్రతనీ , భయంకర మైన కోపాన్నీ, చూసి జనం అంతా దిగ్రమ చెంది ఎత్తిన కర్రలు ఎట్టినట్లే అలా వుండి పోయారు. మునసబు బిత్తర పోయాడు, జనంతో పాటు వచ్చి దూరంగా నిలబడ్డ శేషయ్య. అతని పక్కనే నుంచున్న వాసూ భయకం పితులయ్యారు.
    అందర్నీ ఒక్కమారు కలయ చూసింది సావిత్రి.
    దూరంగా నిలబడ్డ శేషయ్య కనిపించడంతో సావిత్రి కి దుఃఖం, ఆవేశం కట్టలు తెంచుకుని రాసాగాయి. కోపం వల్ల ఒణికి పోతూన్నకంఠం తో అన్నది -- "హు! ....మీరంతా చివరికి అయన మీద కర్ర లెత్తే స్థితికి దిగజారారన్న మాట?.....ఇంత క్రితం మీరు ఆయన్ని ఎలా గౌరవించారు!...అయన వ్యక్తిత్వాన్ని ఎలా మన్నించారు?" అయన వైద్యాన్ని ఎలా పొగిడారు? ఇటువంటి మీరేనా ఇవాళ అయన మీదకి కర్ర లేసుకుని వచ్చారు?......ఒక రోజునలా నెత్తిమీద పెట్టుకుని పూజించిన మీరే ఇవాళ నెత్తి బద్దలు కొట్టడానికి వస్తారా?
    "ఈ ఊరికి ఊరి ప్రజలకి వైద్యం చేసే నాధుడు లేక ప్రజలు దిక్కుమాలిన చావులు చస్తున్నారంటే మనస్సు కరిగి తన భవిష్యత్తు ని , తమ్ముడి భవిష్యత్తు ని కూడా లెక్క చెయ్యకుండా ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టి మీ కోసం త్యాగం చేశారే!.....
    "రాత్రింబవళ్ళు , ఎండనక, వాననక నిద్రాహారాలు మాని ఎముకలు అరిగేలాగ మీకు సేవ చేశారే!....."అమ్మా" అని బాధపడే ప్రతి రోగి నీ ఆదుకుంటూ మిమ్మల్నందరి నీ కన్న పిల్లల్లాగా చూసుకుంటూ అదే తన జీవిత సాఫల్యంగా ఆనందించారే!
    "మీరిచ్చే లక్షాలకి ఆశించారా?
    "మీ పొగడ్త లు కావాలన్నారా?"
    "వైద్యాన్ని ఒక తపస్సుగాను, ఒక మహా పవిత్ర యజ్ఞం గానూ భావించి మీ సేవలో జీవితాన్ని పండించు కుంటూన్న ఆ దేవుడి మీద కృతజ్ఞత ఉండడం అట్టే పోయి, మీకూ మీకూ మధ్య నున్న కక్ష లలోకి కావేషాలలోకి ఆయన్ని లాగి, మీ రాజకీయపు ఆటలో ఆయన్నొక పావుగా ఉపయోగించుకోవాలని చూశారా.........ఇదేనా? కృతజ్ఞత? లోపల పడుకుంటే అర్ధరాత్రి వచ్చే రోగుల కేక ఎక్కడ అందదో అని ఆ కటకటాల్లో అనాదుడి లాగ ఆ కటకటా లలో పడుకొనే వారే!..మీకోసం తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఆత్మీయత కి దూరం అయిపోయి అశాంతి తో కాలం వెళ్ళబుచ్చుతున్న ఆయన్ని చూసి "అయ్యో " అనడం పోయి ఈ హత్యానేరం ఒకటి మొపుతారా?....అయన ఎటువంటి మనిషి?.....ఆ మహావ్యక్తి ఇలాంటి నీచమైన పని చేస్తారా? అని ఒక్కసారి స్థిమితంగా ఆలోచించారా?..ఛీ .ఛీ...ఈ ఊరుకి , ఊరి మనుష్యులకీ ఉచ్చం నీచం లేదు....హు! ఆ పంతులు చావుకి అయన ఇచ్చిన మందా కారణం ?.....విషం !.విషం కలిపారా అయన?........అదే కదూ మీ అనుమానం?.....అయితే ఆ మందే నేనూ తాగుతాను చూడండి" అంటూ మహో ద్రేకంతో.
    "అత్తయ్యా వద్దు వద్దు' అని దూరం నుంచి వాసు కేకేస్తున్నా, "ఆగండి" అని శేషయ్య హెచ్చరిస్తున్నా వినకుండా, అక్కడే ఉన్న సీసా ఎత్తి మిగిలిన మందు అంతా గడగడా తాగేసింది సావిత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS