Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 38


    "క్షమించండి" అంటూ అర్జున్ జడ్జి వైపు తిరిగాడు. "యువరానర్! ఈ విషయం ఇకముందు కేసుతో ప్రధాన పాత్ర వహించ బోతుంది. అందువల్ల ఈ ప్రశ్నలకు నిరూపణ కు తమరు తగిన అవకాశాలు కల్పించాలి."
    "యస్. ప్రొసీడ్" న్యాయమిత్ర అనుమతి ఇచ్చేశాడు.
    "ఇందులో ఏదో మోసం ఉంది" అంటూ లేచిన సుయోధన్. "ఆర్డర్! మేము అనుమతించాము" అని న్యాయమిత్ర తీక్షణంగా తెలియబరిచే సరికి చేసేది లేక నోరు మూసుకు కూర్చున్నాడు.
    విజయ గర్వంతో సత్య దెస తిరిగాడు అర్జున్. "ఇప్పుడు చెప్పండి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారూ! మీ టేప్ రికార్డరు ఎప్పుడు , ఎలా పోయింది?"
    "రాత్రి పదకొండు గంటలకు. ఈనాడు కోర్టు లో నేను చెప్పబోయే విషయాలన్నీ నిన్న ఒక్కసారి రిహార్సల్స్ గా రికార్డు చేసి చూసుకున్నాను, ఏమైనా లోపాలు ఉంటె తెలుస్తాయని."
    "అలా ప్రతి కేసులోనూ రికార్డు చేసుకొనే అలవాటుందామీకు?"
    ఈసారి సత్యాదేవి కొంచెం ఓర్పుగానే సమాధానం చెప్పింది. "ఒక వివాదం లో వాదన అంటే సామాన్యమైన విషయం కాదు నా దృష్టి లో. నీతి, న్యాయం, ధర్మం ; అటూ, ఇటు కొందరి ప్రాణాలు ఈ విషయం లో అల్లుకు పోయి ఉంటాయి. అందుకే నా శక్తి మేరకు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఆలోచించిన మీదట వాదనను తయారు చేసుకుంటాను. మరీ క్లిష్ట మైన కేసులో, ఎలా ఉందొ చూచుకోవడానికి ఇలా రికార్డు చేసి చూచుకొనే అలవాటు కూడా ఉంది."
    "థాంక్స్." మనస్పూర్తిగా అన్నాడు అర్జున్. "చూడండి , ఇదంతా మీదే, మీరు తయారు చేసుకున్నదే అని అంగీకరించారుగా? ఏమీ సందేహం లేదా?"
    "సందేహం లేదు. అయితే ఏమిటి ఇదంతా?" విసుగుగా ప్రశ్నించింది సత్య.
    "ఓర్పు వహించండి. అదే చెప్పబోతున్నాను" అంటూ జడ్జీ వైపు తిరిగాడు అర్జున్. "విన్నారు కదా/ ఇదిగో, ఈ స్త్రీ రాజ్యలక్ష్మీ  గౌతమ్ భార్య" అన్నాడు పోలీసు కాపలా లో ఉన్న స్త్రీని చూపి. అతడలా చెబుతుండగానే ఆ స్త్రీ ముసుగు తోలిగించింది అందరికీ తన వదనం స్పష్టంగా కనిపించేటట్లు.
    అందరూ ఒక్కసారి లేచారు. ఏదో గొప్ప వింత చూస్తున్నట్లు. కాని ఎక్కడి కక్కడ నిల్చున్న పోలీసులు వెంటనే పరిస్థితి ని అదుపులోకి తెచ్చారు. అంతవరకూ శిలా ప్రతిమలా నిశ్చలంగా ఉన్న ధర్మారావు కూడా "అమ్మా!" అని ఆశ్చర్యంగా అరిచాడు.
    మిత్రా తన ఆశ్చర్యాన్ని పైకి ప్రదర్శితం కానివ్వలేదు. "సరే. ఆమె నిర్భయంగా , చెప్పదలిచినది చెప్పవచ్చు" అన్నాడు. ఆమె రాజ్యలక్ష్మీ అని తెలియగానే పోలీసులు చాలా జాగ్రత్తగా సర్దుకుని నిల్చున్నారు.
    "ఈమెను వెంటనే అరెస్టు చేయాలి" అంటూ లేచాడు సుయోధన్.
    "అది మా పని, పోలీసు వారి పని. ఎవరి సలహాలు అవసరం లేదు." మిత్ర నిష్కర్షగా అనేశాడు.
    సుయోధన్ చతికిల బడ్డాడు.
    "ధర్మరావ్, ఈమె నీకు తెలుసా?' అర్జున్ ప్రశ్నించాడు.
    "తెలుసు." ధర్మారావు తలెత్త కుండానే చెప్పాడు ముక్తసరిగా.
    "ఎలాగ?"
    "మంద గంబీర విషాద స్వరం లో వచ్చింది ధర్మారావు జవాబు. "నేను జ్ఞానం వచ్చిన నాటి నుండి ఒక అనాధ శ్రమం లో పెరిగాను. అక్కడ ఈమె ఒక పరిచారిక."
    "మీరేమంటారు, రాజ్యలక్ష్మీదేవి?"
    "అవును. అతడికి తెలిసింది అంతే. నన్ను తల్లి రాజ్యలక్ష్మీ గా కాక, ఆశ్రమ దాది దయామయిగానే అతడేరుగును."
    "అబద్దం.' సత్య లేచింది.' ఆమె తల్లి అని తెలుసు. అందుకే ఆమెను 'అమ్మా' అని పిలుస్తాడితడు. అందుకే ఆమె ఆశ్రమం వదిలి, ధర్మారావు తో వచ్చేసి అతడిని విడవకుండా ఉంటున్నది!"
    "ఔనా, ధర్మారావ్?"
    "నాకేమీ తెలియదు. ఆశ్రమం లోని పిల్లలందరూ ఆమెను 'అమ్మా' అనీ, నారాయణ స్వామి గారిని 'బాబుగారూ' అనీ పిలుస్తారు.  అంతకు మించి నాకేమీ తెలియదు."
    "అదే అబద్దం. గౌతమ్ తండ్రి అని తెలుసు. రాజ్యలక్ష్మీ తల్లి అనీ తెలుసు ఇతడికి. అందుకే -- తండ్రి కోసమే -- ఖైదీలకు ముష్టాన్నల ఏర్పాట్లు, అనుకూలాలు అధికం చేయడం కోసం శ్రమ పడేవాడు."
    "ఈ విషయాలన్నీ ఇదివర కొకసారి అడగడమయింది. నాకేమీ తెలియదని నేను చెప్పడమూ అయింది. ప్లీజ్! ఇక నన్ను అవమానించ కండి. దేశ ద్రోహి గా పదేపదే నిందించకండి. ఉరి కంబమో, కారాగారమో ఏదో ఒకటి -- నన్నీ ప్రజల దృష్టి నుండి, అవమానాల నుండి మరుగు పరిచే ప్రదేశానికి త్వరగా పంపి వేయండి. మిమ్మల్ని అర్ధిస్తున్నాను!"
    ధర్మారావు వేడికోలు అధిక సంఖ్యాకులను కదిల్చి వేసింది.
    "శాంతించు , ధర్మరావ్!' గంబీరంగా అన్నాడు న్యాయమిత్ర. ఆ స్వరంలో ఏమూలనో సానుభూతి ధ్వనించింది.
    "నీవు చెప్పేది చెప్పమ్మా" అన్నాడు రాజ్యలక్ష్మీ ని.

 

                                
    రాజ్యలక్ష్మీ చెప్పసాగింది.
    "నేను చాలా అలసి ఉన్నాను. ఎక్కువగా మాట్లాడలేను. క్లుప్తంగా చెబుతున్నాను. నాకు చిన్ననాటి నుంచీ ధైర్య సాహసాలెక్కువ. కర్ర, కత్తి సాములూ, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం, వంటి విద్యలన్నీ ఆసక్తి తో అవలీలగా నేర్చాను. ఈ నా ధైర్య సాహసాలకు ఆకర్షితులై శ్రీ గౌతమ్ నన్ను వివాహం చేసుకున్నారు. అరణ్యాల లో వేటలకు, యుద్ద భూములకు వారితో పాటే పురుష వేషం లో తిరిగేదాన్ని. నాకు యుద్ద తంత్రాలు కూడా కొన్ని తెలుసు. ఇటు సంసారం లోనే కాదు, అటు ఉద్యోగం విషయం లో కూడా మాకేమీ రహస్యాలు ఉండేవి కావు. అన్నిటా ఆయనకు అమూల్యమైన సలహా;లిచ్చేదాన్ని. ఈ విషయం అప్పుడు సైన్యం లో పనిచేసిన అందరికీ తెలుసు; సుయోధన్ కు కూడా తెలుసు."
    అంతకంతకు ఈకేసు తిరుగుతున్న మెలికలు చూచి న్యాయమిత్ర తో పాటు అందరూ అమితాశ్చర్యం ప్రదర్శిస్తూ వింటున్నారు.
    "జాగ్రత్తగా గతాన్ని ఆచూకీ తీయగల వారు ఉంటె ఈ విషయాలన్నీ విశదంగా తెలియగలవు."
    "ఇదంతా కట్టు కధ!' అరిచాడు సుయోధన్.
    "ఇది కోర్టు!" గుర్తు చేశాడు మిత్రా.
    రాజ్యలక్ష్మీ తిరిగి చెప్పసాగింది. "ఈ విషయాలన్నీ సుయోధన్ కు తెలుసు, అందరికీ తెలుసు. అందుకే సుయోధన్ గౌతమ్ తో పాటు నన్నూ అంతం చేయాలను కున్నాడు. గౌతమ్ నిజంగా నేరస్తుడు కాదు. సుయోధన్ నేరం చేసి, అంతా అతడి పైకి తిప్పి చెప్పాడు."
    సుయోధన్ తారాజువ్వలా లేవబోయాడు కాని, ఇంతలో మిత్రా హెచ్చరించ గలడని గుర్తు వచ్చి తిరిగి మౌనం దాల్చి కూర్చున్నాడు.
    రాజ్యలక్ష్మీ ఒక విధమైన ఉద్రేకంతో, ఆవేశంతో చెప్పుకు పోసాగింది. "ధర్మారావు ను రహస్యంగా పెంచింది నేను, నారాయణ్ శర్మే నని అంగీకరిస్తున్నాను. అయితే ఇందులో కుట్ర, ప్రభుత్వ విద్రోహం ఏమీ లేవు. గౌతమ్ జైలులో మగ్గుతున్నా, నేనూ, నారాయణ్ శర్మా అనాధ శ్రమం లో అజ్ఞాతంగా కాలం గడుపుతున్నా ఇన్ని ఏళ్ళ నుండి మేము నిత్యం మా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని స్వేచ్చ పొందుదామనే ప్రయత్నిస్తూన్నాము. కాని దైవం పగబట్టినట్లు ఏ ఆధారాలూ లభించలేదు. కాలం గడిచిపోయింది. చేయని నేరానికి కఠిన వియోగ శిక్షలు అనుభవించడం తోనే మా జీవితాలు వార్ధక్యం వరించింది. కాని నాలో పట్టుదల సడలలేదు. ధర్మారావు ను ఈ జైలు కే ఉద్యోగి గా అతి ప్రయత్నం పై రప్పించాడు నారాయణ్ శర్మ. అయితే ధర్మారావు కు ఈ విషయాలేవీ తెలియవు. అతడిది చాలా నిక్కచ్చి అయిన తీక్షణ స్వభావం. అందువల్ల అతడి కేవిధంగా చెప్పాలా అని ఇంకా ఆలోచిస్తుండగానే పరిస్థితులు చేయి దాటి పోయి విషమించాయి.
    "ధర్మారావు కు-- తనకు తల్లీ, తండ్రీ అంటూ ఉన్నారనే తెలియదు. ఏమీ తెలియని ఎనిమిది పదేళ్ళ పసి వయసు లో అనాధ శ్రమానికి చేర్చబడ్డాడు. అప్పటికీ, ఇప్పటికీ తానొక అనాధ బాలుడి ననే అతడి భావం. బహుశా ఇప్పుడింత జరిగాక నైనా, నమ్ముతున్నాడో, లేదో నాకు తెలియదు. నేను, తల్లిని, పుత్రుడి పై ప్రమాణం చేసి చెబుతున్నాను. ధర్మారావు మనసులో గాని, చేతలో గాని ఏ మాలిన్యమూ లేదు. అతడు నిర్దోషి. ఇంకా విషయ వివరణ జరగాలంటే గౌతమే రావాలి."
    "ఇదంతా ఏదో కట్టుకధ. ఇంతకూ ఆ రికార్డర్ సంగతేమిటి?" అసహనంగా ప్రశ్నించింది సత్య.
    "తొందర పడకండి. నెమ్మది మీద చెబుతున్నారు." తన క్లయింటు తరపున ఆర్జున్ కలగజేసుకున్నాడు.
    రాజ్యలక్ష్మీ మౌనంగా టేప్ రికార్డర్ బటన్ నొక్కింది. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
    రెండు  గంబీర పురుష కంఠలు వాగ్వివాదం వినవస్తుంది. అది గతరాత్రి గౌతమ్, సుయోధన్ ల మధ్య జరిగిన ఘర్షణ! వారిలో వారి సంబోధనలను బట్టే ఆ ఇద్దరూ గౌతమ్, సుయోధన్ అని గ్రహింపు అవుతున్నది.
    "గుర్తు పట్టారా? ఒకటి సుయోధన్ కంఠం. రెండవది గౌతమ్ ది" అన్నాడు ఆర్జున్.
    మిత్రా తల తిరిగి పోయింది.
    సత్య వెర్రి దానిలా చూస్తూ ఉండిపోయింది.
    'అబద్దం , మోసం , దగా! ఇదెవరో ఉన్మాదిని లాగుంది!' సుయోధన్ వెర్రి గంతు లేస్తున్నాడు.
    "ఆర్డర్!" న్యాయమిత్ర ఉరిమాడు.
    అర్జున్ తన మాటల కుపక్రమించాడు. "యువరానర్! ఈ విషయం విపులంగా వినండి. మీ ఇంట కొత్తగా నౌకరీ కి కుదిరిన వ్యక్తులు మరెవరో కాదు-- రాజ్యలక్ష్మీ , గౌతమ్ . ఒక గొప్ప ప్రయోజనం ఆశించి ఈ పని చేశారు. కాని అక్కడ కూడా దైవం ఎదురు తిరిగాడు. ఫలితమే రాత్రి జరిగిన ఈ వాగ్వివాదం.
    "ఇటీవల స్వర్ణ గంగానది ఇసక మెటల తవ్వకాలలో రెండవ ప్రపంచ యుద్ద కాలం నాటి పుల్ ఫ్రూఫ్ రికార్డ్ సూట్ కేసు ఒకటి దొరికిందని అన్ని పత్రికలూ ప్రకటించాయి. అంతేకాదు. దానిని ప్రభుత్వం వారికి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా రాత్రికి రాత్రి ఇంజనీర్ ఆఫీసులో ఉంచ బడిన ఆ సూట్ కేస్ మాయమయిందని కూడా పత్రికలలో వార్త వచ్చింది.  ఇది చూచే, జైలు లో ఉన్న గౌతమ్ కలవర పడిపోయాడు. ఆనాడు, దేశ ద్రోహం మోపబడి ఘర్షణ జరిగిన నాడు, గౌతమ్ ఆ విషయాన్ని నిరూపించే ఆ రికార్డు ఉన్న సూట్ కేసు ను పరవళ్ళు తొక్కుతున్న నదిలోకి విసిరి వేశాడని ఆరోపించారు. ఇప్పుడు దొరికింది అదే కావచ్చు నని అందరి అనుమానమూ. మరి, అది ఎందుకు, ఎవరు మాయం చేసినట్టు? దానితో సంబంధం ఉన్న ఇద్దరిలో ఒకడైన గౌతమ్ అప్పటికి కారాగారం లోనే ఉన్నాడు కదా? కోర్టు వారు ఈ విషయాన్ని గమనించాలి!"
    "అది రాజ్యలక్ష్మీ , నారాయణ్ శర్మ-- వారే అపహరించారేమో?' సత్య ఎదురు ప్రశ్న. పాయింట్స్ నోట్ చేసుకున్నాడు మిత్రా.
    అర్జున్ చెప్పుకుపోతున్నాడు. "అందుకే గౌతమ్ జైయిలు నుండి పారిపోయాడు. ఆ రికార్డు కేసు విషయమై అరా తీసి పట్టుకుంటే తనకు విమోచనే కాక దేశం కూడా రక్షింతమవుతుందని మద్రాసు లో సుయోధన్ ఇంట ఒక అర్ధరాత్రి ప్రవేశించి వెతికాడు. కాని లాభం లేకపోయింది. పట్టుదల విడవక సుయోధన్ నే వెన్నంటి ఉంటె ఫలితం ప్రయోజనకరంగా ఉండగలదనే ఆశతో ఇక్కడ సుయోధన్ ఉన్న ఇంటనే కుంటి పరిచారకుడుగా కుదిరాడు. ధర్మారావు ను అనుమానించిన ప్రత్యెక డిటెక్టివ్ లు అతడి పూర్వాపరాలను అరా తీసి అరెస్టు చేశారు. అదివరకే తమ పై అరెస్టు వారంటు ఉన్న రాజ్యలక్ష్మీ, నారాయణ్ శర్మ ముందు జాగ్రత్త కై పరారయ్యారు. ముగ్గురూ కలుసుకున్నారు. నారాయణ్ శర్మ వేరే పని మీద తిరుగుతున్నాడు. గౌతమ్ కు అండగా రాజ్యలక్ష్మీ గారు కూడా ఆ ఇంట్లోనే పరిచారిక గా  కుదిరారు. పాత పని మనుషులను మంచి చేసుకొని ఈ కార్యం లో సఫలీకృతులయ్యారు."
    మిత్రా కళ్ళు మిటకరించాడు. సత్య విస్తుపోతూ చూడసాగింది. సుయోధన్ అవస్థ దైవానికే తెలియాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS