లక్ష్మీదేవి హృదయం కరిగిపోయింది. "రామన్నా, శాంతి ఎక్కడుందో ఇలా పిలు" అంటూ అశ్రుధారలను ఒత్తుకుంటూ కిటికీతెర, తొలగించి బయటకు చూస్తూ నిల్చుంది. ఆ కన్నీటి తెరలనుండి మసకగా తోటలో దూరాన కూర్చున్న శాంతి కన్పించింది. పువ్వుల మొక్కలకు వెళ్ళే నీటి కాలువలలో మట్టి తీసి నీళ్ళు సరిగా వెళ్ళేటట్టు బాగుచేస్తూంది.
తల్లి వెనుకనుంచి శ్రీహరి అన్నాడు: "చూశావా, అమ్మా? అవన్నీ పాలేళ్ళు చేసే పనులు. కాని శాంతి తనని తాను మరిచిపోవటానికి అలాంటి పనులలో లీనమైపోతోంది. ఎలా చిక్కిపోయిందో, చూశావా? దాన్నలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే అదెంత భయంకరపరిణామం తేగలదో ఆలోచించావా? శాంతిని దైవం అందరి మాదిరిగా సృష్టించలేదు. ఆ హృదయం నవనీతం. అందుకే ఏవో ఒడిదుడుకులొచ్చాయి. అందుకు అయిన వాళ్ళం మనం ఆదుకోవాలిగాని అసహ్యించుకోకూడదు. క్రమంగా మన ఆదరణలో దాని మనస్సు మారగలదు."
అంతలోనే శాంతి గదిలో ప్రవేశించింది.
"ఏమన్నయ్యా?" అంటూ వచ్చిన ఆమె తల్లినిచూచి బెదిరి గుమ్మంలోనే ఆగిపోయింది. అప్పటికి లక్ష్మీదేవి కూతురుతో మాట్లాడి నెలా పదిహేను రోజులుపైన అయ్యింది.
"శాంతీ, నేను నీతో మాట్లా
డ్డం లేదు కదూ?" అడిగింది లక్ష్మీదేవి.
శాంతి నేత్రాలు విపరీతంగా చలించాయి. అన్ననూ, తల్లినీ మార్సిమార్చి చూచింది.
"నేనలా చెప్పలేదే, ఎవరితోనూ?" అంది అయోమయంగా. ఇదివరలో గంభీరంగా, హుందాగా, నిర్భయంగా యువరాణిలా తిరిగే శాంతి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా, ఏపని చెయ్యాలన్నా విపరీతంగా భయపడిపోతూంది. అది గమనించిన శ్రీహరి, లక్ష్మీదేవి కూడ జాలి పడ్డారు.
"పిచ్చిపిల్లా! అనేకమైన కలతలతో మనస్సు బాగుండక కాని నీమీద నాకు కోపంలేదమ్మా. ఎందుకలా భయపడతావ్?" అన్నది కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ. శ్రీహరి మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు.
మేఘావృతమై ఉన్న ఆకాశం వాయువు సోకగానే వర్షించి నదీనదాలను ఏకం చేయసాగింది. అందుకు కారణమైన వాయుదేవుడు మాత్రం ఎక్కడా జాడలేడు.
48
బహుశః ఆరోజు-సూట్ కేసు, చిత్రాల విషయంలో ఘర్షణ పడినరోజు- తనలాగే శ్యామలకూడ మరిచిపోలేదనీ, తనతో మాట్లాడదనీ అనుకుంది శాంతి. కాని కొద్ది రోజులకే శాంతి గ్రహించింది, శ్యామలకు అభిమానం తక్కువ అని. తొందరపడి ఒకర్ని అనేస్తుంది. మళ్ళీ అనిపించుకుంటుంది. కాని ఆ పట్టింపులు అట్టేకాలం మనస్సులో ఉంచుకోదు. మళ్ళీ మాట్లాడుతుంది; మళ్ళీ ఘర్షణ పడుతుంది. 'సౌకుమార్యం, సరళత్వం తెలియని మనిషి. ముళ్ళకంపవంటి స్వభావం' అనుకుంది శాంతి.
శ్యామల స్వభావమూ, ప్రవర్తనా యింట్లో అందరికీ బాదాకరంగానే ఉన్నాయి. ఇదివరలో ఆమె ఇక్కడ ఉన్నది పదిరోజులే. అప్పుడు క్రొత్త గనుక ఎవరూ పట్టించుకోలేదు. కాని, ఇప్పుడామె శాశ్వతంగా యిక్కడ ఉండడానికి వచ్చిన వ్యక్తి సమష్టి కుటుంబంలో వ్యక్తులమధ్య సద్భావసామరస్యాలు ఉంటేనే కాని సుఖ శాంతులు నెలకొనవు.
లక్ష్మీదేవిది ఎంత సరళ స్వభావమో అందరికీ తెలుసు. ఆమె సంతానాన్ని కాని, పైవారిని కాని, నౌకర్లనుకాని ఎన్నడూ దూషించదు; బాధించదు. అంతగా ఆగ్రహం వస్తే మాట్లాడకుండ మౌనం పాటిస్తుంది. సాక్షాత్తూ లక్ష్మీదేవిలాగే తిరుగాడుతూ ఇంటి ఆధ్వర్యం వహించి నడుపుతుంది. ఆమె కఠిణంగా శాసించక పోయినా అందరూ ఆమె కనుసన్నలనే భక్తి శ్రద్దలతో శిరసావహించి మెలగుతారు. భర్త ప్రతి విషయంలోనూ ఆమె సలహా పాటిస్తాడు. ఇంటికి పెద్ద కుమారుడైన శ్రీహరి అన్ని పనులలోను అమ్మ ఆజ్ఞను అర్దిస్తాడు. ఎంత గారాబమైనా, ఎంత స్వేచ్చగా మెలగినా శాంతీ, నారాయణలు అమ్మ ఎదుట నిలబడి మాటకు మాట చెప్పరు. నౌకర్లందరూ లక్ష్మీదేవిని సాక్షాత్తూ లక్ష్మీదేవిగా, కన్నతల్లిగా భావించి వినయ విధేయతలతో మెలగుతారు. అటువంటి కరుణామూర్తితోకూడ శ్యామల పెద్దా, చిన్నా తారతమ్య సంకోచాలు లేకుండా ఘర్షణ పడసాగింది.
ఒక ఉదయం లక్ష్మీదేవి స్నానంచేసి వచ్చే సరికి పూజగదిలో కాలికి స్లిప్పర్లతో నడుస్తూ నౌకర్లకు ఏవో ఫర్మాయిస్తూంది, శ్యామల. అదిచూచిన లక్ష్మీదేవి నిర్ఘాంతపోయింది. పూజా మందిరం ముందుకు భర్తైనా సరే, కుమారుడైనా సరే కాలికి జోడూ, కళ్ళకుజోడూ, శిరసున టోపీ ధరించి రావడానికి లక్ష్మీదేవి ఎన్నడూ అనుమతించలేదు. ఆమె ఒకసారి మాట అన్నదంటే అదే శాసనం. ఎవ్వరూ ఎదురు చెప్పరు. విద్యావతీ, తగిన వయస్సూగల శ్యామలకు ఈ విషయం తెలియదనడానికి ఆస్కారంలేదు. 'బహుశః మరచిపోయి ఉండవచ్చు' అని సరి పెట్టుకున్న లక్ష్మీదేవి "అమ్మాయ్, శ్యామల! బయట విడిచేసిరా ఆ జోళ్ళు" అంది, సౌమ్యంగానే.
"ఏం? ఏమొచ్చింది?" తీక్షణంగానే అడిగింది శ్యామల.
నౌకర్లూ, లక్ష్మీదేవీ కూడ విస్తుపోయారు.
"పూజగది కదమ్మా....." వంటమనిషి చెప్పబోయాడు.
"షటప్!" అరిచింది శ్యామల. "పూజా, దేవుడూను-అర్ధంలేక. ఎక్కడున్నాడు దేవుడు? ఆ మట్టి బొమ్మల ముందు జోడు వేసుకుంటే అపరాధమట- వేసుకున్నానుగా? ఏదీ, ఏం జరిగిందీ? ఎప్పుడూ నాకెవళ్ళూ యిటువంటి వెధవసలహా లివ్వకండి." ఇంతకుముందు యిటు వంటి వ్యక్తిని ఆ గృహంలో చూచి ఎరుగని నౌకర్లంతా ఆశ్చర్యంగానే సినిమా చూడసాగారు.
"బ్రూట్స్, ఇడియట్స్!" అని గొణుక్కుమ్తూ నిష్క్రమించింది శ్యామల.
లక్ష్మీదేవి మారు మాట్లాడలేదు. నౌకర్ల ఎదుట అత్తగారిపట్ల కోడలు అవిధేయత ప్రదర్శించటం! ఛీ, ఛీ ఇంతకంటే అవమాన కరమైన విషయముందా? అని కుంచించుకు పోయింది లక్ష్మీదేవి. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ తనకు తానై కోడలితో మాట్లాడేది కాదు. ఏమీ సలహాలు చెప్పేది కాదు. అవసరానికి మాత్రం శ్యామల పలుకరిస్తే ముక్తసరిగా మాట్లాడేది. తూచి తూచి మాట్లాడేది. పెద్దరికం నిలబెట్టని వాళ్ళతో, సలహాను పాటించని వాళ్ళతో అతిగా మాట్లాడటం అవివేకం. వెన్నపూసవంటి హృదయంగల పెద్దకోడలు పద్మను ఒక్కసారి తలుచుకొని నిట్టూర్చింది.
"అయితే ఉద్యోగాని కెప్పుడు వెళ్తావ్?" అడిగాడు శ్రీహరి, నారాయణను ఒకనాడు.
"వెళ్ళను. రాజీనామా యిచ్చారు."
"నిజమా?" ఆశ్చర్యానికతీతమైన అనుభవం కలిగింది శ్రీహరికి.
"అవును. మూడు నాలుగు వందల జీతం కోసం అంతదూరాన పడి వుండటమేమిటి? మన పొలాలూ, వ్యాపారమూ చూచుకొంటూ ఇక్కడే ఉండిపోవాలని."
"మంచిదే. కాని, వెనుక నాన్నగారొకసారి ఆమాట అంటే నువ్వు చెవిని పెట్టలేదు. అదీ గాక చదువుకున్నాం గనుక చేస్తున్నాం కాని మనం డబ్బుకోసమే ఉద్యోగాలు చేయటంలేదు."
"సరే తర్కందేనికి? నాకలా తోచింది." ముఖం చిట్లించాడు నారాయణ,
శ్రీహరి గ్రహించగలిగాడు. బహుశః భార్యా అత్తవార్ల ఆలోచన కావచ్చు, అది! దూరంగా ఉంటే ఈ ఆస్తి ఎవరు తినేస్తారో అని కాబోలు! నీచపు ఊహలు!'
"అయితే, తమ్ముడూ?" మెల్లగా సంబోధించాడు శ్రీహరి. "నువ్వెంత తొందర మనిషి నైనా ఆత్మీయులతో యిలా అంటీఅంటనట్లు ప్రవర్తించలేదు, ఎప్పుడూ. ఎందుకిలా దూరమై పోతున్నావ్? అటువంటి పనిచేసే ముందుమాతో చెప్పక్కర్లేదా?"
"ఏమంత విశేషమనీ?" విసుగ్గా అక్కడి నుంచి లేచిపోయాడు నారాయణ.
శ్రీహరి హృదయం రోదించింది. 'మనుష్యులలో ఏమిటింత స్వార్ధబుద్ధి? ఎందుకిలా మారిపోతారు? స్త్రీ హృదయం కుసుమపేశలం. ఒక్కో స్త్రీ మనస్సు వజ్రసదృశంకూడ. ఆమృతాంతరంగిణి స్త్రీ, కాని హాలాహల నిలయం కూడ ఒక్కొక్క స్త్రీ హృదయం. ఒక స్త్రీ పాదంపెట్టిన గృహం వైజయంతంగా మారుతుంది. ఒక్కో స్త్రీ అడుగుపెట్టిన యిల్లు నరకం. మనిషి మనిషికీ మధ్య బాంధవ్యాలే తెగిపోతాయి.' అతి సౌమ్యురాలైన భార్య పద్మను తలుచుకొని నిట్టూర్చాడు శ్రీహరి.
బలరామయ్య చేతికర్ర సాయంతో రామన్న వెంటరాగా తోటలో అటూ యిటూ తిరుగాడగలుగుతున్నాడు. ఒక సాయంత్రం ఆయన చెట్లదగ్గర కూర్చుని ఉండగా ఎదుటినుంచే నారాయణా, శ్యామలా స్కూటరెక్కి వెళ్ళి పోయారు. బలరామయ్య పెద్ధరికపు హోదా దెబ్బతిన్నది. సాధారణంగా తన ఎదుటపడని, పడినా అతి వినయ విధేయతలతో ప్రవర్తించే పెద్ద కోడలికీ, శ్యామలకూ అంతరాలు ఊహించకుండా ఉండలేకపోయాడు. తర్వాత రాత్రి మెల్లగా నారాయణను చేరబిలిచి అన్నాడు: "ఇది మహానగరం కాదు, ఒకరి గొడవ ఒకరికి అక్కర్లేకుండా స్వేచ్చగా తిరగడానికి. ఇక్కడ అటువంటి విహారాలు బాగుండవు" అని. సాధారణంగా అతడు ఎవరి విషయమూ పట్టించుకోడు. కాని, తన కళ్ళముందే జరిగిన దానికి చెప్పకుండా ఉండలేకపోయాడు.
"ఏమిటది, మాకు? అడుగడుగునా ఆంక్షలు. కుర్రాళ్ళు ముసలాళ్ళమాదిరిగా పడివుండలేరు." పెడసరంగా అన్నాడు నారాయణ.
సంసారం ఏస్థితికి దిగజార బోతూందో గ్రహించాడు బలరామయ్య. కాని నిస్సహాయుడు. ఏం చేయగలడు?
ఇక, శాంతి. ఆమెకు అసలు ఎవరితోనూ స్నేహంచేసే అలవాటులేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్ళతో మాట్లాడే అలవాటు అసలే లేదు. ఇటువంటి కుటుంబంలో వ్యక్తి, పైగా అంత చదువుకున్నది యింత నిర్మొహమాటంగా ఎలా ఉండగలుగుతూందా-అన్నదే ఆమె ఆశ్చర్యం. శాంతి మాట్లాడకపోయినా శ్యామల తనంత తాను కవ్వించేది.
'మీ రాజా ఏమంటున్నాడు?' అనేది ఒక్కోసారి శ్యామల, శాంతితో.
శాంతి ఒకటి రెండు సార్లు నవ్వేసి ఊరుకున్నా ఎప్పుడూ అలా మౌనం దాల్చలేక పోయింది. "నీకీ డిగ్రీ ఎలా వచ్చిందో కాని-ఇటువంటి వాళ్ళొకళ్ళుంటే చాలు; చదువుకున్న అందరికీ తలవంపే" అంది.
"డిగ్రీలేని మృగాలన్నిటికీ గ్రాడ్యుయేట్లని చూస్తే దుగ్ధ" అంది శ్యామల.
"అవును. మృగంలా ప్రవర్తించడంలో బహుశః నువ్వు గ్రాడ్యుయేట్ వయ్యుంటావు" అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది శాంతి.
అత్తాకోడండ్రు, వదినా ఆడపడుచుల మధ్య భారతీయ కుటుంబాలలో సాధాణంగా ఉండే కలహాలు, కలతలు అంతవరకు ఆ యింట్లోలేవు. ఇప్పుడు ఉన్నాయీ అంటే కారణమేమిటి? రెండు చేతులూ చేర్చనిదే చప్పట్లు రావన్నది అబద్ధం. ఒకచెయ్యి వెళ్ళి కదలకుండా ఉన్న మరొక చేతిమీద పడ్డా శబ్దం వస్తుంది! ఏ చదువులూ, డిగ్రీలూ లేకపోయినా తనచుట్టూ, తనవారి చుట్టూ సమగ్ర సుందర వాతావరణాన్నేర్పరచగల అమృత హృదయుని పెద్దవదిన పద్మను తలుచుకొని అంజలి ఘటించింది. ఈ గడ్డి పువ్వుకూ, ఆ పరిమళ ప్రసూనానికీ పోలికా?
శ్యామలతో ఘర్షణపడి వెళ్ళిపోతున్న శాంతికి ఆఫీసునుంచి అప్పుడే యిల్లు జేరుకున్న శ్రీహరి ఎదురుపడ్డాడు. కాఫీ ఫలహారాలు తెమ్మని వంటమనిషితో చెప్పి తాను అన్నయ్యను అనుసరించింది.
"ఇవ్వాళ అన్నీ జంట ఉత్తరాలు వచ్చాయే, శాంతీ!" అన్నాడు కోటు విప్పి హేంగర్ కు తగిలించుతూ.
"జంట ఉత్తరాలా? అంటే?"
"ఇవిగో." జేబులోనుంచి తీసియిచ్చాడు. ఒకటి రాజా శ్రీహరికి వ్రాసిన ఉత్తరం. అందులోనే శాంతికి మరో కవరు ఉంది. శ్రీహరికి అభ్యంతరం లేకుంటేనే శాంతి ఆ ఉత్తరం చదవాలని అతడి అభిప్రాయమన్నమాట! మరొకటి పద్మ వ్రాసింది. అదికూడా అలాగే కవరులో కవరు. ఒకటి శ్రీహరికీ; ఒకటి శాంతికీ. మరొక ఉత్తరం మనోరమ దగ్గర్నుంచి. "నయం - దానికి కూడా జంట లేదు" అంది హాస్యంగా మూడో ఉత్తరాన్నిచూసి. వదిన ఉత్తరం, మనోరమ ఉత్తరం చనువుగా తీసుకుంది. రాజా ఉత్తరం మాత్రం అక్కడే టేబుల్ పై వదిలేసి వెనుదిరిగింది వెళ్ళిపోవటానికి.
"ఏం, అది తీసుకోవేం?" అడిగాడు శ్రీహరి.
శాంతి మాట్లాడలేదు.
వెనుక రాజాకు ఉత్తరాలు వ్రాయవద్దని కోప్పడటం శాంతి మరిచిపోలేదని గ్రహించాడు శ్రీహరి. కాని, మమతలు మరుగుపరిచినంత మాత్రాన మాయమవుతాయా? కవరు తానే స్వయంగా చేత్తో తచ్చి శాంతి చేతిలో పెట్టబోయాడు. "తీసుకో, శాంతీ. గతం మరిచిపో. గతం అంటే అంతా. అన్నీ" అన్నాడు ఏదో భావం ధ్వనింపజేస్తూ.
