అతనిలో బలమయిన కోరిక కదలాడటం ఆనందంగా గమనించింది మయూరి. అదే తనక్కావలసింది. నూతన్ ప్లాన్ ప్రకారమే జరుగుతోందంతా!
పూర్తిగా లొంగకుండా రమేష్ ని కవ్విస్తూ అతని ద్వారా కొన్నిపనులు చేయించాలి.
"నేనింక వెళతాను."
"అప్పుడేనా? కాసేపు కూర్చోండి! మీ గురించి వివరాలేమీ చెప్పలేదునాకు!"
"మాది మిడిల్ క్లాస్ ఫామిలీ! ఇల్లు గడవటంకష్టంగా వుంది అందుకని ఎవరిదారి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది."
"అలాగా"
"మంచి జాబ్ దొరికితే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుండాలనుకుంటున్నాను."
"వండర్ ఫుల్ ఐడియా!"
"ఒకవేళ అక్కడ దొరకకపోతేనే ప్రాబ్లెమ్."
అతను చప్పున "డోంట్ వర్రీ' అనేసి మళ్ళీ మాటలుకంట్రోల్ చేసుకున్నాడు.
"డోంట్ వర్రీ! ఏమయినా ప్రాబ్లెమ్ వుంటే నేనూ మీకు సహాయం చేస్తాను -"
"వెరీ కైండాఫ్ యూ!"
ఆమె బయటకు వచ్చేసింది.
నూతన్ కొద్దిదూరంలో ఆటోలో కూర్చునివున్నాడు. మయూరి కూర్చోగానే ఆటో బయల్దేరింది.
"ఏమయింది!"
"సక్సెస్"
"నాకు తెలుసు! నీలోవున్న సెక్స్ ఆపీల్ ఎవరికయినా మతి పోగొడుతుంది."
మయూరి నవ్వింది.
"ఐనా మీ మతి పోగొట్టటానికి చాలాకాలం పట్టింది!" టీజింగ్ గా అంది.
ఇద్దరూ పాష్ హోటల్లోకి నడిచారు.
భోజనం చేస్తూండగా చెప్పాడతను.
"రమేష్ ని ఎంత కవ్విస్తే అంత మంచిది. అతనికి లొంగకుండానే మనపనులన్నీ పూర్తి చేసుకోవాలి!"
"అయ్ విల్ ట్రై"
"రేపు కొంచెం అతనికి చనువుని! ఇవ్వగానే అతను కరిగిపోతాడు. అప్పుడు చెప్పు! మాబ్రదర్ సినిమా పత్రికలో జర్నలిస్ట్. ఈ మధ్య ఆ పత్రిక మూసేశారు. ప్రస్తుతం జాబ్ లేకుండా ఉన్నాడు గనుక అతనికి తెలిసిన సినిమా స్టార్స్ ఎవరయినా వుంటే వాళ్ళ దగ్గర పి.ఆర్.ఓ గా ఉద్యోగం ఇప్పించమని! అతను అది ప్రిస్టేజ్ ఇష్యూగా ఫీలవుతాడు. నీ అభిమానం సంపాదించడానికయినా చంద్రికకు నన్నురికమెండ్ చేస్తాడు. దాంతో మన పర్పస్ నెరవేరుతుంది."
ఆమె తలూపింది.
ఆ రాత్రి రమేష్ కి చాలాసేపు నిద్రపట్టలేదు. మయూరి అంధమయిన రూపం ఇంకా కళ్ళల్లోనే కదులుతోంది. ఆమెపైట జార్చిన దృశ్యం మర్చిపోలేకపోతున్నాడు.
ఆమె తప్పకుండా తనకు దక్కుతుందనే అనిపిస్తోంది. కానీ కొంచెం సమయం కావాలి...ఆమెను అనేక విధాలుగా ఇంప్రెస్ చేయగలగాలి. అనేక విధాలుగా సహాయపడాలి. అప్పుడే తనమీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది.
మర్నాడు ఉదయం ఎప్పుడూ లేనిది అయిదుగంటలకే మెలకువవచ్చేసిందతనికి.
పది గంటలకు ఆఫీస్ కెళ్ళేవాడల్లా తొమ్మిది గంటలకే చేరుకున్నాడు. ఫ్యూన్ ని పిలిచి మయూరి కోసం ప్రత్యేకంగా ఓ కాబిన్ ఏర్పాటు చేశాడు. అందులోకి తన దగ్గరున్న కంప్యూటర్ ని షిఫ్ట్ చేశాడు.
ఆమెను తను ఎందుకు అపాయింట్ చేశాడా అని అనుమానంరాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం! కంప్యూటర్ ఆపరేషన్ లో తనకు సాయంగా ఉండటానికి ఆమెను అపాయింట్ చేసుకున్నానని చెప్పవచ్చు.
సరిగ్గా పదిగంటలకు స్టాఫంతా వచ్చేశారు.
తన పార్ట్నర్ శ్రీకాంత్ ఆ సంస్థలో కేవలం ఓ పార్టనరే గనుక ఆ విషయాలు సాధారణంగా పట్టించుకోడు.
ఆఫీస్ కీ, సిబ్బందికీ సంబంధించిన విషయాలన్నీ తనేచూసుకుంటూంటాడు. అప్పుడే మయూరి లోపలికొచ్చింది. చాలా మోడ్రన్ గా ఉన్న డ్రస్ లో ఆమెరూపం మరింత మనోహరంగా కనబడుతోందతనికి. ఆ డ్రస్ చాలా ఖరీదని తెలుస్తూనే ఉంది.
"గుడ్ మాణింగ్ నర్స్" అంది ఇద్దరికీ చిరునవ్వుతో విష్ చేస్తూ.
"గుడ్ మాణింగ్ మయూరీ! హి ఈజ్ మిస్టర్ శ్రీకాంత్! పార్ట్ నర్ షీ ఈజ్ మయూరీ! డేటా ఎంట్రీ ఆపరేటర్"
"నైస్ మీటింగ్ యూ" అంది మయూరి.
శ్రీకాంత్ వెళ్ళిపోయాక ఆమెను కాబిన్ లోకి తీసుకెళ్ళాడతను.
"మీ ఆఫీస్ ఇదే! మీకిచ్చే మేటరంతా ఇందులోకి పంపటమే మీరు చేయాల్సింది. నాకెప్పుడయినా ఏమయినా స్టేట్ మెంట్స్ వగైరాలు కావాలంటే ప్లాపీల నుంచి తీసివ్వాలి"
"యస్సర్" కేబిన్ అంతా కలియచూస్తూ అందామె. ఓ పక్క కంప్యూటర్, మరోపక్క టైప్ మిషన్! కొంచెం విశాలంగానే ఉంది కాబిన్.
ఎ.సి. అవటంవల్ల చలి వేస్తున్నట్లుంది.
"చాలా బాగుంది ఆఫీస్" అంది మయూరి.
అతను ఆనందంగా చూశాడు.
"మీకిక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉండేట్లు చూసే బాధ్యత నాది!"
"థాంక్యూ"
అతను వెళ్ళిపోయాడు.
వెళ్ళిన పావుగంటకే ఫోన్ లో మాట్లాడాడు మళ్ళీ.
"మయూరీ! ఓసారిలా రండి!"
మయూరి షార్ట్ హాండ్ బుక్, పెన్సిల్ తీసుకుని అతని గదిలోకి నడిచింది.
అంతవరకూ స్టెనో గా ఉన్న రాజేశ్వరి ఆమెవేపు ఈర్ష్యగా చూసింది.
రాజేశ్వరి అందంగా లేదు. పైగా మధ్య వయస్కురాలు. ఈ రెండూకాక ఆమె శ్రీకాంత్ రికమండేషన్ తోవచ్చింది. కనుక తనకు ఆమెమీద ఆసక్తిలేదు. అందుకే వీలయినంత తక్కువగా డిక్టేషన్స్ ఇస్తూండేవాడు.
మయూరి పెన్సిల్ పట్టుకుని డిక్టేషన్ తీసుకోడానికి సిద్దంగా కూర్చునేసరికి అతను చప్పునమాట్లాడాడు.
"నోనోనో! డిక్టేషన్ కోసం కాదు మయూరీ! మీరు బోర్ ఫీలవుతున్నారుమో అని పిలిచాను"
"వర్క్ లేకపోతే నాకు చాలా అనీజీగా ఉంటుంది" చిరునవ్వుతో అందామె.
"ఇవాళ మొదటిరోజుకదా! అందుకని మీరు ఎక్కువపని చేయకూడదని నా కోరిక! రేపట్నుంచీ చూసుకోండి! ఎంతపని చెప్తానో" టీజింగ్ గా అన్నాడు.
మయూరి లేచి కిటికీ దగ్గరకెళ్ళి కర్టెన్ తొలగించిచూసింది.
ఆ ఎత్తునుంచీ నగరమంతా అందంగా కనబడుతోంది. ఆమె ఊహించినట్లే అతను వెనుకే వచ్చినిలబడ్డాడు.
"వ్యూ బావుందికదూ?" అడిగాడతను.
"ఎప్పుడూ ఇక్కడే నిలబడిచూస్తుంటే బావుండుననిపిస్తోంది!"
"నాకూ ఈ 'వ్యూ' చాలా ఇష్టం! ఒకోసారి గంటల తరబడి చూస్తూండిపోతాను"
అతని ఊపిరి తన మెడకు వెచ్చగా తగులుతోంది.
పొరబాటున వెనక్కుజరిగినట్లు జరిగి అతని గుండెలకు ఆనుకుని "ఓ సారీ! మీరు వెనుకే ఉన్నారనుకోలేదు" అంది పక్కకు జరిగిపోతూ.
