నాకయితే వూపిరి పీల్చడం కూడా కష్టమైపోయింది.
వేసిన చేతులు అలాగే వున్నాయి. అవి కదలడం లేదు. మల్లెపూల తోటలో నడుస్తుంటే టక్కున మిన్నాగు కనిపించినట్లు అవాక్కయి పోయాను.
ఆయన నుండి విడివడి కళ్ళల్లోకి చూసాను అవి నిరాసక్తంగా వున్నాయి.
"ఏమైంది?' కఠినంగా ప్రశ్నించాను.
"తలనొప్పి భరించలేనంత"
చప్పున చీర కట్టుకున్నాను. బ్రా వేసుకుని జాకెట్ ధరించాను.
"అయితే అలా పడుకోండి"
ఆయన పడుకున్నారు. తొందరపడి అలా రెచ్చగొట్టడం బావోలేదనిపించింది. ఎంత తలనొప్పి లేకుంటే అంత నిస్తేజంగా వుండిపోతారు?
నేను కింద చాప వేసి పడుకున్నాను.
మూడోరోజు మా అమ్మావాళ్ళు వెళ్ళిపోయారు.
నేనూ, నా భర్తా, మా అత్తమ్మా మాత్రమే మిగిలాం. నేను వంట చేయడం ప్రారంభించాను.
ఆరోజు రాత్రి పడుకోవడానికి ఉపక్రమింస్తుండగా మా ఇంటిమీద రాళ్ళు పడ్డాయి. నేను హడలిపోయాను. శివరామ్ కోసం చూస్తే కనపడలేదు.
"ఏమండీ" అంటూ అరిచాను.
అప్పుడే ఆయన వీధిలోంచి వచ్చారు.
"మన ఇంటిమీద ఎవరో రాళ్ళేస్తున్నారండీ"
"అవునా?"
"వూఁ"
"నేనెళ్ళి చూస్తానుండు" అని ఆయన ఇంటి వెనకున్న మైదానంలోకి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చాడు.
"ఎవరో దొంగలు" ఆయన చెప్పాడు.
నాకు భయం వేసింది. ఆ ఇల్లు వూరికి దూరంగా, కాస్తంత విసిరేసినట్లుండడం వల్ల ఆ ప్రాంతమంతా చీకటిగా, భయంకరంగా వుంది.
"భయంగా వుందండీ"
"మా ఇంటికి దొంగల బెడద ఎక్కువ. మన పెళ్ళికి ముందు ఓ గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళారు"
"నిజమా!"
"ఆఁ నువ్వో పని చెయ్ ఇక్కడ వద్దు భానూ వాళ్ళింటికి వెళ్ళి పడుకో. అక్కడ చుట్టుపక్కల ఇళ్లుంటాయి. కాబట్టి భయముండదు."
"మరి మీరో?"
"నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ ఎవరూ లేకపోతే దొంగలుపడే అవకాశముంది"
"అలాగేనండీ"
గబగబా ఓ చాపా దిండూ పట్టుకుని భానూ వాళ్ళింటికి పరుగెత్తాను జరిగిందంతా ఆమెతో చెప్పాను.
"ఇద్దరం వరండాలో పడుకుందాంలే" అంది.
ఆ రాత్రి అక్కడే పడుకుని ఉదయం లేచొచ్చేశాను.
రెండో రోజూ, మూడోరోజూ కూడా రాళ్ళు పడ్డాయి. రాళ్ళు పడడం, చాపా దిండూ పట్టుకుని భానూ వాళ్ళింటికి పరుగెత్తడం సాధారణమైపోయింది. ఈ గొడవలో పడి ఫస్ట్ నైట్ గురించి మరిచేపోయాను.
పల్లెటూళ్ళలో మనకు గిట్టనివాళ్ళు మన ఇళ్ళపై రాళ్ళు వేయడం లాంటివి చేస్తుంటారు. అందువల్ల మాకు శత్రువులెవరయినా వున్నారా అని ఆరా తీశాను. ఒక్క ఇల్లే వుంది. నా భర్తకు చిన్నాన్న అవుతాడు. దాయాదులన్న మాట. అయినా వాళ్ళు మాత్రం రోజూ రాత్రిళ్ళు మేలుకుని ఇంటిపై రాళ్ళు వేస్తుంటారా? ఏమో? ద్వేషం అలాంటిది.
సాయంకాలమైతే చాలు రాళ్ళు పడతాయేమో నన్న భయం నన్ను చుట్టుకునేది. గుడిసెకూ, వరండాకూ మధ్యనున్న ఖాళీ స్థలంలో వంట. అందువల్ల పొద్దు గుంకేటప్పటికి వంట పూర్తిచేసి ఇంట్లోకి వచ్చేసేదాన్ని.
ఎన్ని రోజులిలా? ఆ రాళ్ళు వేసేది ఎవరో కనుక్కుని వాళ్ళ అంతు చూడాలని నిర్ణయించుకున్నాను.
మరుసటి రోజు వంటంతా పూర్తిచేసి, అలా భానూ వాళ్ళింటికి వెళ్ళాను. కాసేపు పిచ్చాపాటీ వేసి వచ్చాను. నా భర్త కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఇద్దరం భోజనాలు ముగించాం.
"రేపు ఎగవమళ్ళో మడకలు కట్టాలి. ఎవరయినా మడక కట్టడానికి వస్తారేమో కనుక్కుని వస్తాను" అని నా భర్త తిరిగి ఊర్లోకి వెళ్ళాడు.
భయంగా వున్నా, నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను తొమ్మిది గంటలై వుంటుంది. జోరీగ శరీరంలాగా చీకటి మెరుస్తోంది. ఊరులో అక్కడక్కడా వెలుగుతున్న దీపాలు చీకటిని నాకుతున్న వెలుతురు పురుగుల్లా వున్నాయి. గాలి గూర్ఖాలాఊరంతా తిరుగుతోంది. పెంకుటింట్లో కూర్చుని, ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నాను. రాళ్ళు పడుతుండడంతో నా మొదటి రాత్రి కాస్తా కొండెక్కింది.
రాళ్ళు పడుతుండగా శోభనం ఎలా జరుగుతుంది? అందుకే రాళ్ళు వేస్తున్న వాళ్ళ మీద పీకలదాకా కోపం వుంది. అందుకే ఒంటరిగా వాళ్ళను పట్టుకోవాలని అన్నింటికీ ముందుగానే ప్రిపేర్ అయి కాచుక్కూర్చున్నాను.
మరో అరగంట గడిచింది.
రాకెట్ లా ఓ రాయి దూసుకొచ్చి ఇంటి మీద పడింది. పెంకుల శబ్దం ఎముకలు విరిగినట్లు వినిపించింది. కళ్ళు మూసుకున్నాను. అంతలోనే మరో రాయి వచ్చి ఇళ్ళ మధ్య పడింది.
రోజూ ఇలా భయంతో బిగదీసుకుపోవడం కన్నా అటో ఇటో తేల్చేసుకోవడం ఉత్తమమైన పని అనుకుంటూ మంచం మీద నుంచి లేచి నిలుచున్నాను. లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఏదో తెలియని కసి నన్ను ఊపేస్తోంది.
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చాను. ఇంటి చూరుకింద నక్కాను. ఈసారి వచ్చిన రాయి గుడిసె మీద పడింది. అది వచ్చిన డైరెక్షన్ గమనిస్తే పెంకుటిల్లు వెనక నుంచి వేసారన్నది అర్ధమయింది.
నా భర్త వస్తే మరింత ఈజీగా ఆ దుండగుల్ని పట్టుకోవచ్చని చూశాను.
కానీ ఆయన వస్తున్న జాడ కూడా లేదు.
అంతలోనే మరో రాయి వచ్చి కిందపడి చిట్లింది.
నేనిక ఆలస్యం చేయదలుచుకోలేదు.
చూరు కిందనుంచే నడిచి మా ఇంటికి కాస్తంత దూరం వెళ్ళి, అక్కడి నుంచి వెనుకవైపు మలుపు తిరిగాను.
ఓ ముల్లు కసుక్కున కాలిలో దిగింది. రక్తం కారుతున్న స్పర్శ తెలుస్తోంది. వంగి ముళ్ళు లాగేశాను. కసి మరింత ఎక్కువయింది.
ముందుకు చాలా దూరం వెళ్లి అటునుంచి మా ఇంటి వెనుక వైపుకి రావడం ప్రారంభించాను.
కళ్ళు పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి దూరంగా నక్క ఆకలితో కాబోలు ఏడుస్తోంది.
వడివడిగా అడుగులు వేశాను.
రాళ్ళు పడుతుండడం గమనించి కాబోలు, మా యింటి ముందు పచార్లు చేస్తున్న కుక్క మొరుగుతోంది.
