"బహుశా ........రే......పు......సాయం.....త్రం.......రావచ్చు.' ఎక్కువ సంతోషం వల్ల వారి మాటలు తడబడ్డాయి.
రెండు సంవత్సరాల తర్వాత తమ కుమారుని చూడబోతున్న వారి కడుపు తీపి హృదయారాటం చూసిన శారద మానస్సు వెన్నెలా కరిగి పోయింది. వారు బయటికి వెళ్ళిపోగానే బాధతో కన్నీరు కార్చింది.
'ఎందుకమ్మా కన్నీరు?' అడిగాడు రామం.
'ఏం లేదన్నయ్యా!' కన్నీరు తుడుచుకుంటూ ముఖంలో సంతోషాన్ని నింపుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ అంది.
'లేదమ్మా! నానుండి ఏదో దాస్తున్నావు.'
'ఎముందన్నయ్యా......? ప్రపంచం లో నా కోసం తాపత్రయ పడే ప్రాణి వుంటే ఎలా ఉండేదో నన్న ఆలోచన వచ్చేసరికి ఆప్రయత్నంగా కన్నీరు వచ్చింది.' రాని చిరునవ్వు ను ముఖాన తెచ్చి పెట్టుకుంటూ అంది శారద.
'బాధపడకమ్మా! అందరికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నాకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చి పెంచి పెద్ద చేసిన అత్తమామలకు నేను దూరమయ్యే రోజు వచ్చింది. ఏం చేస్తాం...? విషమ పరిస్థితులు' శారదను అనునయిస్తున్నట్లుగా అన్నాడు రామం.
అతని మాటలకు ఉలికిపడింది శారద ---
'అటువంటి పరిస్తితు లేమొచ్చాయన్నయ్యా?' గభారాపడుతూ ప్రశ్నించింది.
విషయమంతా పూస గ్రుచ్చినట్లు శారదకు చెప్పాడు. అన్నీ విన్న ఆమె హతాశురాలైంది.
'గోరు చుట్టూ పై రోకలి పోటన్నట్లు, ఇదేమిటన్నయ్యా? శాంత సృష్టించిన సమస్య కే మార్గం తోచక తికమకపడుతూ ఉంటె, నీ అంతట నీవు మరొక సమస్యను సృష్టించు కుంటున్నావా? నీదెంతటి త్యాగ బుద్ది...? నాకంతా అయోమయంగా ఉంది. ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచడం లేదు. ఇటువంటి స్థితి ఏర్పడుతుందని నేను కలలో కూడా తలచలేదు. ఏది ఎలా ఉన్నా పెద్ద ప్రాణాలకు మాత్రం ఎటువంటి ప్రమాదమూ రాకుండా చూడాలి.' ఆమె ముఖంలో ఆందోళన, ఆదుర్దా స్పష్టంగా కనుపిస్తూ ఉన్నాయి.
'నా తాపత్రయం అదేనమ్మా! వారి కోసమే నా ఈ ప్రయత్నాలన్నీ!'
'ఏమో అన్నయ్యా........శాంతి యిలా మారిపోయి యిటువంటి సమస్యలను సృష్టిస్తుందనుకోలేదు నేను.' విచారంతో అంది శారద.
'మంచిదమ్మా నే వెళ్లొస్తాను. మళ్ళీ సన్మాన సభలో కలుస్తాను. ప్రభాకరం గారితో పరిచయం చేయించు.' అంటూ శారద వెంట రాగా హాలు వైపు నడిచాడు రామం.
'వెళ్ళొస్తానండి!' ఆనాటి పేపరు చదవడం లో లీనమైపోయిన శ్రీపతి గారితో అన్నాడు రామం.
రామం మాటలు విన్న శ్రీపతి గారు పేపరు మడిచి ఎదురుగా ఉన్న స్కూలు పై ఉంచుతూ 'అదేమిటి బాబూ! ఎక్కడికి వెడతావు? ఈ రెండురోజులూ యిక్కడే ఉండు మా అబ్బాయి కూడా వస్తున్నాడు. నలుగురితో ఈ యిల్లు కళకళ లాడుతుంది.' ఆప్యాయంగా రామాన్ని చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
'ఎందుకండీ ....? మీకు యిబ్బంది కలుగుతుందేమో?' నసుగుతూ అన్నాడు రామం.
'భలేవాడివయ్యా......! మాకు యిబ్బంది ఏమిటి? అన్నీ సౌకర్యాలు చూసుకోవడానికి మీ చెల్లెలే ఉంటేనూ?' చిరునవ్వుతో అన్నారు శ్రీపతి గారు.
'అయినా.......?' సందేహిస్తూనే నిలుచున్నాడు.
'ఎటువంటి సంకోచమూ పెట్టుకోకు బాబూ! ఇది నీ యిల్లే అనుకో.....! మా శారద కు ఆప్తుడవై, ఆశ్రయమిచ్చి ఆదుకున్నావు. ఆకారణంగా మాకూ ఆప్తుడవె! నీవెంత మంచి వాడవు బాబూ......?'
'నన్ను అనవసరంగా పోగిడేస్తున్నారు. ఇందులో నేను గొప్పగా చేసిందేమీ లేదు. అదంతా ఆమె మంచితనం. శ్రమపడి, ఫలితాన్ని పొందింది. ఒక మనిషిగా తోటి మనిషికి చేయవలసిన దాని కన్న ఎక్కువ ఏమీ చేయలేదు. తన తెలివి తేటలతో రాణింపు కు వచ్చింది. అంతే..........!' శారద వైపు ఆప్యాయంగా చూస్తూ అన్నాడు రామం.
'నీ మాటలే నీ మంచితనాన్ని రుజువు చేస్తున్నాయి బాబూ! అన్నమంతా పట్టి చూడాలా? నీ విషయమంతా అమ్మాయి శారద చెప్పింది. మీ ఊరికి ఆదర్శ వ్యక్తీ వని......' అన్నారు శ్రీపతి గారు.
'అన్నీ ఉత్త కబుర్లే! మా చెల్లెలు శారద కు నాపై ఎనలేని అభిమానం. అందుకని అలా చెప్పి వుంటుంది.' చిరుకోపం నటిస్తూ , శారదను చూస్తూ అన్నాడు రామం.
'శారద ఎప్పుడూ అబద్దం ఆడదు బాబూ.......! ఆ నమ్మకం నాకుంది' అని శ్రీపతి గారు అంటూ ఉండగానే వంటింట్లో నుండి అన్నపూర్ణమ్మ గారి కేక వినిపించింది.
కబుర్లు ఆపి అంతా భోజనాల కుపక్రమించారు-------
16
ఆనాటి సాయంత్రమే ప్రభాకరం వస్తున్నాడు. శ్రీపతి గారి, అన్నపూర్ణమ్మ గారి హడావుడి అంతా యింతా కాదు. శారద సాయంతో ప్రభాకరానికి యిష్టమైన పిండి వంటలన్నీ సిద్దం చేశారు అన్నపూర్ణమ్మ గారు.
'అమ్మా శారదా! నీవు, రామం, నీరజ మీరు ముగ్గురూ స్టేషను కు వెళ్లి రండి.' ఆదుర్దాతో అన్నారు శ్రీపతి గారు.
'అదేమిటి మామయ్యా? ఇంతగా ఆదుర్దా పడుతున్నావు. నీవు రాకుండా నేనా.......? అంది నీరజ చిలిపిగా.
'నేను రాలేనమ్మా! మీరు వెళ్ళండి.'
'చూశావా అక్కా! బావ వస్తున్నాడన్న సంతోషంతో మామయ్యకు కాలు, చెయ్యి ఆడడం లేదు. ఉక్కిరిబిక్కిరౌతున్నాడు. అటువంటి దుడుకు బావంటేనే అంత ప్రేమ ఒలక పోస్తున్నాడే..........! బావ మంచివాడై నట్లైతే మామయ్యా ను అసలు మందలించ లేమేమో?'
'ఊరుకో నీరజా! పెద్దవారితో ఏమిటా ఎగతాళి' నీరజను మందలించింది శారద.
'పోనీలే అమ్మా.....అంటే అంది.' తన మేనకోడలి ని ఆప్యాయంగా చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
'అక్కా! మరి మనం వెడదామా? మామయ్య రానంతున్నారు కద!" అని శ్రీపతి గారి వైపు తిరిగి.
'మామయ్యా! టైమౌతుంది . మేము వెళ్లి వస్తాం' అంది నీరజ.
'అలాగే వెళ్లి రండమ్మా' అంటూ శ్రీపతి గారు డ్రైవరును కేకవేశారు.
అరగంట లేటుగా వస్తూన్న రైలు కోసం ప్ల్గాటు ఫారం పై గల సిమెంటు బల్ల పై కూర్చొని నిరీక్షిస్తున్నారు నీరజ, శారద రామం లు.
'అక్కయ్యా.....! రామం గారి దేవూరు?' ప్రశ్నించింది నీరజ.
జవాబు చెప్పింది శారద ఆ ఊరి పేరు విన్న నీరజ ;అలాగా!' అని రామాన్ని ఆదుర్దాగా చూస్తూ 'అవుతే మీకు డాక్టరు సుందరం తెలుసా...?' ఉత్సాహంతో ప్రశ్నించింది నీరజ.
'వాడు తెలియక పోవడ మేమిటి? నా బాల్య స్నేహితుడు .' అన్నాడు రామం.
ఇంతలో రైలు వస్తున్న అలజడి ఫ్లాటు ఫారం పై కలిగింది. కూలీల కేకలు ప్రయానికుల అలజడి, చాయ్ వాళ్ళ అరుపులు అంతా గందరగోళంగా ఉంది.
రైలు వచ్చి ఫ్లాటు ఫారం పై ఆగిన తర్వాత ముగ్గురూ రైలు ఆ చివరి నుండి ఈ చివరి వరకు రెండు సార్లు తిరిగారు. ఎక్కడా ప్రభాకరం జాడ కనుపించలేదు. నీరజ ప్రత్యేకంగా ఫస్టు క్లాసు , సెకండు క్లాసు కంపార్టు మెంట్లు వెదికింది. లాభం లేక పోయింది.
"ప్రసాద్ ......! నాన్నగారికి టెలిగ్రాం అందలేదా........? మాకారు డ్రైవరు కనుపించడం లేదు' విసుగుతో కూడిన చిరుకోపం అతని మాటలలో సూక్ష్మంగా ధ్వనించింది.
అక్కడికి దగ్గరలో ప్రభాకరానికి వెనుక ప్రక్కగా నిల్చుని అతనికోసమే వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న శారదకు ఆ మాటలు వినిపించాయి.
ఆప్రయత్నంగా ఆమె నోటి నుండి 'చినబాబు గారూ......!' అనే మాటలు వెలువడ్డాయి.'
'ఎవరూ.....?" అని వెను తిరిగి చూసిన ప్రభాకరం కళ్ళు ఆనందంతో మెరిశాయి. 'శారద' అతని పెదవులు కదిలి ఆ పదాన్ని ఉచ్చరించాయి.
'మీరా చినబాబు గారూ.......? మిమ్ములను యిందాకటి నుండి చూస్తూనే ఉన్నాము. గుర్తు పట్టలేక పోయాము. మీలో ఎంత మార్పు వచ్చింది....' ఆశ్చర్యంగా ప్రభాకరం ముఖంలో కి చూస్తూ అంది శారద.
అంతలో నీరజ, రామం శారద ఉన్న చోటికి వచ్చారు. రామానికి ప్రభాకరం కొత్త కాబట్టి , నీరజ వెంట వెళ్ళాడు.
"ఏం బావా......? కాశీ నీరు బాగా ఒంటబట్టినట్లుందే.........దిట్టంగా ఊరావు' అని పైకి క్రిందికి ప్రభాకరాన్ని ఎగాదిగా చూస్తూ, అచ్చమైన భారతీయ పౌరుని లా మారావు. నిన్ను రెండు మూడు సార్లు చూసి కూడా గుర్తు పట్టలేక పోయాను.' ప్రభాకరాన్ని ఆ వేషంతో చూసిన నీరజ ముసిముసి నవ్వులు నవ్వసాగింది.
ఇస్త్రీ చేసిన తెల్లని ఖద్దరు ధోవతి ఖద్దరు లాల్చీ, పల్చని చెప్పులు, కళ్ళకు చలవజోడు . ఇదీ ప్రభాకరం వేషం.
'నీరజా..........! నీవు కూడా వచ్చావా? వీరెవరు?' ప్రశ్నార్ధకంగా రామాన్ని చూస్తూ ప్రశ్నించాడు ప్రభాకరం.
ప్రభాకరాన్ని చూసిన రామానికి, శారద వర్ణించి చెప్పిన ప్రభాకరం యితనేనా అన్న అనుమానం వచ్చింది. ఆ ప్రభాకరానికి , ఈ ప్రభాకరాన్ని ఎక్కడా పోలికలు లేవు.
'తీరికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక్క మాటలో వీరిని పరిచయం చేయడానికి వీలుపడదు. అసలే రైలు ఆలస్యంగా వచ్చింది. నిన్ను గుర్తుపట్టే సరికి మరి కొంత ఆలస్యం జరిగింది. ఇంటి వద్ద మామయ్య నీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు. పద బావా త్వరగా వెడదాం' చిలిపిగా ప్రభాకరాన్ని చూస్తూ అంది నీరజ.
'మాటలు బాగా నేర్చినట్లున్నావే! పద వెడదాం!' అని ప్రసాద్ వైపు తిరిగి 'కమాన్ ప్రసాద్' అని నీరజ వైపు చూపిస్తూ 'నా మేనగోడలు నీరజ. చూస్తున్నావుగా చాలా చిలిపి. ఈమె శారద. ఈమె విషయం నీతో ఒకరోజు చెప్పాను గుర్తుందా....?' అని ప్రసాదు కు నీరజను, శారద ను పరిచయం చేసి, 'ఇతను ప్రసాద్! నా స్నేహితుడు' అంటూ వారిద్దరికీ పరిచయం చేశాడు ప్రభాకరం .
ఫ్లాటు ఫారం పై నడుస్తూనే పరస్పరం నమస్కారాలు చేసుకున్నారు. బయటికివచ్చి కారేక్కారు.
బయట కారాగిన శబ్దం వినిపింఛి హాలులో కూర్చున్న శ్రీపతి గారు, అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ గారు గుమ్మం వైపు నాలుగడుగులు వేశారు. కారు దిగి లోపలికి వచ్చిన ప్రభాకరం శ్రీపతి గారికీ, అన్నపూర్ణమ్మ గారికీ పాదాలనంటి నమస్కారం చేశాడు. ఒక్క క్షణం వారిద్దరూ ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయారు. తేరుకున్న తర్వాత కుమారుని క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు. కుమారుని లోని మార్పుకు, అతను ప్రదర్శిస్తున్న వినయ విధేయతల కు ఆ దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు పాడరంసం లా మెరుస్తూ క్రిందికి జారాయి.
త్వరగా స్నానం చేసి తెములు నాయనా......! ఎప్పుడనగా భోం చేశావో? మరీ అంతగా చిక్కిపోయావెం బాబూ....? అక్కడ హాస్టలు భోజనం సరీగా పడలేదు కాబోలు' కుమారుని పై గల వాత్సల్యంతో అతని ముఖం లోకి ఆప్యాయంగా చూస్తూ అన్నారు అన్నపూర్ణ మ్మగారు.
'నీరజ నన్ను చూడగానే బాగా ఊరానని అంది. నీవేమో చిక్కానని అంటున్నావు' నవ్వుతూ అన్నాడు ప్రభాకరం.
'అదంతేలే బావా....! నీకు దిష్టి తగులుతుందని అత్తయ్య అలా అంది.' నీరజ మాటలలో చిలిపితనం నిండి ఉంది.
'ఊరుకోవే! నీవు మరీనూ!' నవ్వుతూ నీరజను మందలించారు అన్నపూర్ణమ్మ గారు.
అంతా బిగ్గరగా నవ్వాడు. ప్రభాకరం, ప్రసాద్ లు స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. వడ్డన ప్రయత్నాలు చేయడానికి అన్నపూర్ణమ్మగారు వంటింట్లో కి వెళ్ళారు. వారికి సాయంగా శారద, నీరజ లు వెళ్ళారు. హాలులో శ్రీపతి గారు, రామం మిగిలిపోయారు. శ్రీపతి గారి ముఖంలో కనుపిస్తున్న ఆనందాన్ని చూస్తూ కూర్చున్నాడు రామం.
* * * *

ఒక్కరోజులోనే ప్రసాదు రామం లకు చక్కని స్నేహం కలిసింది. ఇద్దరూ కలిసి ఎటో వెళ్ళారు. ప్రభాకరం తనకు అలసటగా -- ఉందన్న నెపంతో వారి నుండి తప్పించుకున్నాడు. అతను వచ్చినప్పటి నుండీ శారద తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కాని వీలు చిక్కడం లేదు. ప్రసాద్ రామం లు బయటికి వెళ్ళిన కొద్ది సేపటికి శ్రీపతి గారు వారి పని మీద వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవడం గమనించిన ప్రభాకరం శారద ఏం చేస్తుందో చూడాలని ఆమె గది వైపు నడిచాడు. ఆమె తన గదిలో కూర్చుని ఏదో వ్రాసుకుంటూ ఉంది.
