Previous Page Next Page 
దీప శిఖ పేజి 37


    ఈ మునసబు, పంతులు ఎక్కించిన ఆవేశం లో పడి ఇన్నాళ్ళ నుంచి ఉంటూన్న శేషయ్య తో పోటీయా?.....
    అయినా ఈ ప్రెసిడెంటు గోల ఏదో నాకెందుకు?....'    
    పది పన్నెండు వేల ఖర్చూ , అయిందేదో అయింది......
    ఇంకో నాలుగైదు వేలు కూడా ఖర్చు ఎందుకు?........
    పైగా నా పిల్లని నాకు దూరం చేసిన ఈ దౌర్భాగ్యపు ప్రెసిడెంటు గిరీ నాకు వద్దు.
    దీపం లాంటి పిల్ల నట్టింటి నుంచి వెళ్ళిపోయాక ఈ బోడి పదవి నాకెందుకు? ......అసలీ పోటీయే తన బ్రతుకుని ఇంత వరకూ తెచ్చింది.
    ఈదరిద్రగొట్టు పోటీ నుంచి విరమించు కోవాలి.
    అవును విరమించు కోవాలి ఇప్పుడే విరమించు కోవాలి.
    ఇలా ఓ నిర్ణయానికి వచ్చి, వెంటనే ఎవర్నీ సంప్రదించకుండా తిన్నగా ఆఫీసరు దగ్గరికి వెళ్లి తన ఉపసంహరణ కాగితాన్ని నిశ్చలంగా అందించి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చి కూచున్నాడు శంకరం.
    కొంచెం సేపటికి ఊరంతా గుప్ మంది.
    శంకరం అలా ఎందుకు చేశాడో అర్ధం కాక రెండు పార్టీల వారూ తెల్లబోయారు. అప్పటి దాకా ఉన్న ఉత్సాహం కాస్తా నశించి చప్పగా నీళ్ళు కారిపోయారు అంతా.
    ఈ వార్తా తెలిసిన మరుక్షణం, మునసబూ, పంతులూ శంకరం ఇంటి దగ్గర కొచ్చి వాలారు. ఎందుకిలా చేశారు? ఏం జరిగింది ?..... మాతో మాట మాత్రం గానైనా సంప్రదించలేదేం?....ఇప్పుడేలాగ ?......... ఊళ్ళో తల ఎత్తుకుని ఎలా తిరగడం ? ఎంతపని చేశారు ?....ఇలా విసిగించేస్తున్న వాళ్ళిద్దరికీ ఒక్కటే సమాధానం చెప్పాడు. "ఇప్పుడు నన్నేం విసిగించకండి వెళ్ళండి..ఇంకా నా నిర్ణయానికి తిరుగు లేదు, నన్ను ప్రశ్నలతో వేధించకండి . మీకు పుణ్యం ఉంటుంది వెళ్ళండి " అని.
    "ఆయనకి నిశ్చయంగా మతిపోయింది " అనుకున్నాడు మునసబు.
    "ఆ.....పిరికివాడు . ఆ శేషయ్య కి భయపడి ఇలా చేశాడు" అనుకున్నాడు పంతులు.
    ప్రయత్నం చేసిచేసి. ఏమీ పలక్కుండా స్థాణువు లా బిగుసుకు పోయి కూర్చున్న శంకరం మీద లోపల్లోపల విసుక్కుని, పైకి గట్టిగా నిట్టూర్చి సరే....కానియ్యండి ' అంటూ నిష్టూరంగా అని, లేచారు మునసబూ , పంతులూ ను.
    శంకరం తనమీద పోటీ చెయ్యకుండా విరమించాడని తెలిసి, మొదట శేషయ్య నమ్మలేదు. ఆ తర్వాత తెల్లబోయాడు. కారణం తెలియలేదు. కాని ఉపసంహరించు కొన్నది ,మాత్రం నిజం. ఇలా పోటీ నుంచి తప్పుకొని ఏకగ్రీవంగా తను ఎన్నిక కావడానికి మాత్రం దోహదం చేశాడు శంకరం. ఆ పాత స్నేహం జ్ఞాపకం వచ్చి ఇలా చేశాడేమో , ఏమో -- శంకరం చూపించిన ఈ ఔదార్యానికి ప్రతిగా తను కూడా అంతటి ఔదార్యాన్నే చూపిద్దాం అనుకున్నాడు శేషయ్య. వెంటనే వైస్ ప్రెసిడెంటు పదవి అతనికి ఆఫర్ చేస్తూ కబురు చేశాడు. కాని శంకరం దగ్గర్నుంచి "నాకు అవసరం లేదు" అని సమాధానం వచ్చింది. సరే అని ఊరుకున్నాడు శేషయ్య . శంకరం అంత ఖచ్చితంగా పంపిన సమాధానానికి లోపల్లోపల నొచ్చుకుంటూ.
    ఎన్నికల సంరంభం అంతటితో ఆగిపోయింది.
    ప్రెసిడెంటు గా పెద్ద కాపు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాడు.
    మన అడుగున ఇంకా ఒకటి రెండు నిప్పు రవ్వలు మిగిలి పోయినా, మొత్తం మీద అకాశాన్నంటుతూ లేచిన పౌరుషాగ్నిజ్వాలలు చప్పగా చల్లారి ఊరు అంతా ఒకటిగా ప్రశాంతంగా ఉంది. ఊళ్ళో పెద్ద కాపు శేషయ్య ప్రతిష్ట బాగా పెరిగింది. మునసబూ పంతులూ చేసే దెం లేక . ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాత్రం శంకరం తెలివి తక్కువతనాన్ని నిందించు కుంటూ తృప్తి పడుతున్నారు. అందరితో పాటు వాళ్ళిద్దరూ కూడా శంకరం హాస్పిటల్ కి రావడం పూర్తిగా మానుకున్నారు.     సాయంత్రం నాలుగు మొదలు రాత్రి ఎనిమిదేంటి దాకానూ ఎవరి సమాధిలో వాళ్ళు నిశ్శబ్దంగా కాలం వెళ్ళ బుచ్చ సాగారు.
    టేబిల్ మీద ఉన్న ఇంక్ స్టాండు లో ఇంకు ఆరిపోయి గద్దగట్టి పోయింది--
    మందు సీసాలు చాలా మట్టుకి కాళీ అయిపోయి దుమ్ము కొట్టుకు పోయి పడి ఉన్నాయి.
    వరండా లోని "ఫైర్ బకెట్' లో నీరు ఏనాడో ఎండిపోయింది -- దాని ప్రక్కనే ఉన్న రెండు క్రోటన్స్ కుండిలలోనూ నీళ్ళు లేక ఎండి పోయిన కోటన్స్ కొమ్మలు-- ఎక్కడ వస్తువులక్కడ అస్తవ్యస్తంగా పీడ బట్టిన ప్రదేశం లా భయంకరంగా ఉంది హాస్పిటలంతా --
    ఓ రోజున ఉన్నట్టుండి కంపౌండరు ని పిలిచి "పరిస్థితులు చూస్తున్నావు కదా!....నువ్వు వేరే చోటికి ఎక్కడ కెనా వెళ్లి పని చూసుకో కూడదూ! అన్నాడు శంకరం. అతని మాటలోని అంతర్యం కంపౌండరు కి అర్ధం అయింది. అసలా ఆలోచన ఈ మధ్య తనకు చాలా సార్లు వచ్చింది, కాని ఇన్నాళ్ళూ తండ్రిలా చూసి సాకిన డాక్టరు ని వదిలి వెళ్ళటం అంటే మనస్సు ఒప్పక ఆ ఆలోచన ని అలా సాగానియ్యక అంతటితో అపు చేశాడు. అందుకే ఆ మధ్య సేవాసదనం లో రెండో కాంపౌండరు కావాలని తెలిసినప్పుడు కూడా ఆ ఉద్యోగం కోసం ప్ర్తయత్నించ కుండా ఊరుకున్నాడు. ఎప్పటికేనా పరిస్థితులు తిరగబడవా, మళ్ళా పూర్వం లా డాక్టరు గారికి మరో దశ ఎత్తుకోదా అనే ఆశతో -- ఆ ఆశ నానాటికీ క్షీణించడం తో , ఇంక చేసేదేం లేక , వెళ్లి పోవడానికే నిర్ణయించు కుని కూర్చున్నాడు. అయితే ఆ మాట డాక్టరు గారి దగ్గర ఎలా ఎత్తడమా అని ఇన్నాళ్ళూ సందేహిస్తూ వచ్చాడు. ఇప్పుడా బాధ లేకుండా ఆయనే ఆ ప్రస్తావన ఎత్తారు. అందుకే ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టం లేక " మీ ఇష్టం " అన్నాడు కంపౌండరు.
    ఇన్నాళ్ళూ పనిచేసి, ఒక తోడ బుట్ట్టిన వాడిలా అటు హాస్పిటల్ లోనూ ఇటు ఇంట్లో నూ మసిలిన కంపౌండరు , వెళ్లి పోతున్నాడనీ, అందులోనూ తన భర్తే వెళ్ళమని చెప్పాడనీ విని నిర్విణురాలయింది సావిత్రి. క్రమక్రమంగా పరిస్థితులు అర్ధం చేసుకొని చేసేదేం లేక నిట్టూర్చింది . సెలవు తీసుకోడాని కని వచ్చిన కంపౌండరు తో "సరే బాబూ .........మంచిది.......... ఆయనకి కావలసిన వాళ్ళంతా ఒక్కొక్కల్లె దూరం అయారు. ఇక నువ్వు కూడా వెళ్ళవలసిన సమయం వచ్చింది. సరే-- ఏం చేస్తాం ?...ఊళ్ళో ఉంటె అప్పుడప్పుడు వచ్చి బాబుగారిని చూసి పోతూ ఉండు , ఆయనా  పెద్దవారు అవుతున్నారు , సుఖంగా వెళ్లిరా బాబూ" అంది.
    ఇన్నాళ్ళూ సావిత్రి చూపించిన వాత్సల్యానికి ఇప్పుడు ఆమె మాటలలో తొణికిసలాడిన మాత్రుత్వానికీ కృతజ్ఞతా సూచకంగా అంజలి ఘటించి అడుగు కదిపాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచిన కంపౌండరు , వెళ్ళిపోతున్న కంపౌండరు వెనకాల నుంచి గోపాలం లాగ అనడంతో సావిత్రి అదిరిపడింది...........
    "అవును"
    మహా తేజస్సు తో వెలుగుతూన్న అయన వేడికి తట్టుకోలేక ఆ రోజున గోపాలం వెళ్ళిపోయాడు.
    భగభగ మండుతూన్న మంటల కి ఆగలేక పెద్ద కాపు తప్పుకున్నాడు .
    కాలుతూన్న అయన కోపాగ్ని ని సహించలేక అమ్మాయి అదృశ్యం అయింది.
    అయిన వాళ్ళంతా ఇలా ఒక్కొక్కళ్ళె తమని వదిలి వెళ్లిపోతుంటే తను ఏం చేయ గలిగింది కనక?...... నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంది.
    ఇవాళ అలాగే ఈ కంపౌండరు కూడా వెళ్ళిపోతున్నాడు.
    ఆవును.
    జాజ్వల్య మానంగా వెలిగి నన్నాళ్ళూ దీపకాంతి అందరికీ కావలసిందే !......తను బ్రతుకు ప్రమిదల్ని ఆ కాంతి పుంజం తోటే వెలిగించు కుంటారు. కాని ఆదీపం కొంచెం కోడి గడుతోందని తెలిశాక దాన్నే నమ్ముకుని ఎవరేనా ఉంటారా?.......అలాగే ఈ కంపౌండరూను.........ఇతని తప్పేం ఉంది?......ఇది లోక ధర్మం.
    ఇలా ఆలోచిస్తు నిలబడిన సావిత్రి కి అవతల వైపు హాస్పిటల్ హాల్లోంచి కేకలు వినిపించాయి. ఎవరి మీదో ఆయనే గట్టిగా కేకలు వేస్తున్నారు.
    "నువ్వెక్కడో మూర్ఖుడివి దొరికావేమిటి రా నాకు. చెబితే అర్ధం చేసుకోవు. అరిగి అరిగి విరిగిపోయిన ఆ ఇరుసు ఇంక లాభం లేదు అంటే వినవేం?....కొత్త  ఇరుసు కొనే ఓపికా అవసరమూ నాకు లేదు నువ్వు ఇంకో చోటుకి ఎక్కడికేనా పోయి పనికి కుదురుకో....లేదా ఆ గుర్రాన్నీ బండిని నువ్వే తీసుకుపోయి, బండి బాగు చేయించుకొని ఏ బాడుగ కో బండి తోలుకుంటూ బతుకు. అంతేకాని నన్ను విసిగించి చంపకు -- ఫో........"
    సావిత్రికి అంతా అర్ధం అయింది .
    ఎక్కెక్కి ఏడుస్తూన్న సుబ్బడి ఏడుపు కూడా వినిపించింది . ఇంట్లో కి హాస్పిటల్ హాల్ కి మధ్య నున్న తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు ఓరగిల వేసి " అంది.
    ఇన్నాళ్ళ యి, తను ఆ తలుపు తీసుకుని, హాస్పిటల్ లోకి అటు ఒక్క మాటయినా అడుగు పెట్టలేదు. అందుకే తటపాటాయించి తలుపు దగ్గరే ఆగిపోయింది. తలుపు ఇవతల నుంచే "సుబ్బడూ! ఇటు చూడు!......ఆయన్ని అట్టే వేదించకు - ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి పని చెయ్యడం ఇష్టం లేకపోతె, అయన చెప్పినట్టు గుర్రాన్ని బండి ని తీసుకుని వెళ్లి బండి తోలుకొని బతుకు -- గొడవ పెట్టి అయన మనస్సు పాడు చెయ్యకు' అంది సావిత్రి.
    శబ్దం వచ్చిన తలుపు కేసి చూసి  ఏడుస్తూ "అమ్మా మీరు అలాగే అంటారా?....ఇన్నేళ్ళు మీ పంచని బతికినా నన్నూ పొమ్మంటారా?.....తండ్రి లాంటి మా డాక్టరు బాబు ని వదిలి నేను ఎక్కడికి పోను?.....ఈ పంచనే రెండు మెతుకులు తింటూ ఇలా ఉండనియ్యండమ్మా -- నన్ను తరిమేయ్యకండి" అంటూ బతిమాలసాగాడు సుబ్బడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS