"శత్రువుల తాలుకూ గూడ చారులు కూడా స్వదేశ సైనికులంత జాగ్రత్త గానూ వంతెన ను కాపలా కాస్తూనే ఉంటారు. ఎవరి అవసరం వారిది! డాన్ని పేల్చితే అప్పట్లో వారికీ సులభ సాధ్యమైన మరో మార్గం లేదు, దేశం లో ప్రవేశించడానికి. కనక, ఎవరు దానిని విధ్వంసం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా, వెంటనే ఆ వ్యక్తిని కాల్చి వేసి, ధ్వంసం జరగకుండా కాపాడు కుంటారు. అందువల్ల ఈ గురుతుర భారాన్ని సాధారణ వ్యక్తులేవరికీ విశ్వసించి, ఒప్ప జెప్ప కూడదు. శత్రువులు పసిగట్ట కుండా అతి చతురతతో ఆ పనిని నిర్వహించ గల సమర్ధుడూ, నమ్మకస్తుడూ కావాలి. పైన వానకూ, కింద ఇంచుమించు వంతెన ను తాకుతున్నట్లున్న భయంకర నదీ ప్రవాహానికి తట్టుకొని, వంతెన అడుగు భాగం లో ప్రవేశించి డైనమైట్ అమర్చి వచ్చి, సురక్షిత దూరానికి పోయి వైరుకు నిప్పు పెట్టాలి, ఆ నిశీధి వేళ! అతి ప్రమాద భరితమైన ఈ కార్య నిర్వహణ లో ఆ నిర్వాహకుని ప్రాణాలు సైతం పోవచ్చు. ఇటువంటి పనికి ముందుకు వచ్చే సాహసికుడెవరు? ఎవ్వరూ ముందుకు రాలేదు. వచ్చినా సామాన్యు లేవ్వరినీ నమ్మడానికి వీలులేదు. ఎవరినీ విశ్వసించ లేని స్థితిలో ఉన్నారు అధికారులు. పరిస్థితులు అటువంటివి! రణ నీతిజ్ఞత అటువంటిది! అటువంటి క్లిష్ట సమయం లో అతి అత్మేయులనే స్వజనాన్నే నమ్మరాదు, మరి! ఇక ఎవరున్నారు? గౌతమ్ , సుయోధన్ -- ఆ ఇద్దరే ఆ పనికి యోగ్యులు! గౌతమ్ గజ ఈతగాడు. అతి సాహసికుడు. సాహస కార్యాచరణ లో సుయోధన్ ను మించిన వాడనడం దుస్సాహసమే అయినా, యదార్ధ దూరం మాత్రం కాదు. అందువల్ల ఆ భారాన్ని గౌతమ్ పైన వేసుకున్నాడు. నలుగురి చేతా 'సేభాష్' అన్పించుకున్నాడు!"
కోర్టు అంతటా ఒక్కసారి అలజడి రేగింది.
"ఆర్డర్! ఆర్డర్! " న్యాయమూర్తి హెచ్చరించడంతో తిరిగి నిశ్శబ్దం ఏర్పడింది.
"కాని, గౌతమ్ తన ధర్మాన్ని నెరవేర్చలేదు. నెరవేర్చితే ఇంత కధే లేదు. తర్వాత? గూడ చారి వార్తా చాలా ఆలస్యంగా అందింది. ఇక అట్టే వ్యవధి లేదు. సైన్యాన్ని నడిపే బాధ్యత ను పూర్తిగా సుయోధన్ వహిస్తారు. గౌతమ్ తన నూతన బాధ్యతా నిర్వహణ కు ఉపక్రమిస్తాడు. అంతా అతి రహస్యం!
"మేజర్ సుయోధన్ మంచి యుద్ద తంత్ర నిపుణులు. రాజనీతిజ్ఞాతలో అపర చాణక్యూలు; రెండవ యుగంధరులు! అందుకే అయన గౌతమ్ ను కూడా నమ్మలేదు. నిర్ణీత సమయం లో, నిర్ణీత ప్రదేశం లో గౌతమ్ ఉన్నాడో, లేదో చూడడానికి స్వయంగా వెళ్ళారు సుయోధన్ . అయన అనుమానమే నిజమయింది. నియమిత స్థలం లో , నిర్ణీత కార్యక్రమం లో మునిగి లేదు గౌతమ్! పైగా మరో ఘోరం కూడా కంట పడింది! నదికిఎగువన , బాగా దూరంగా, ఆ చిమ్మ చీకటిలో దేశ రహస్యాలకు సంబంధించిన రికార్డును శత్రు సైన్యాదికారికి అందిస్తున్నాడు! అతడికి విష్ణు నారాయణ్ శర్మ అండ! ఎంతో నీతీ, నిజాయితీ కలవాడనీ, అహింసా ప్రతి రూపమనీ పేరొందిన గౌతమ్ --దేశ రక్షణ శాఖ లోని బాధ్యతా యుత వ్యక్తీ ----ఉన్నతాధికారి చేయరాని ఘోరం చేస్తున్నాడు ఒక వ్యక్తికీ హాని కాదు, ఒక కుటుంబానికి అపకారం కాదు. దేశం మొత్తాన్నే నాశనం చేయ సమకట్టాడు! వయోముఖ విష కుంభం! కోపం పట్టలేని సుయోధన్ వెంటనే రైఫిల్ పేల్చారు. అది నైట్ పెట్రోల్ విష్ణు నారాయణ్ శర్మ ఎడమ భుజం నుండి దూసుకు పోయింది. శత్రువు అయిపూ, ఆజా లేకుండా పారిపోయాడు. గౌతమ్ , సుయోధన్ . ముఖాముఖి తలపడ్డారు. ఇద్దరూ సమానులే. ఎవరూ లొంగలేదు. ఈ అదనులో విష్ణు నారయణ్ శర్మ నదిలో దూకి, ఈది పారిపోయాడు. అంతలో కాల్పులు విని అందరూ చేరారు. గౌతమ్ ను రెక్కలు విరిచి కట్టారు. కాని అప్పటికే కాలతీతమై పోయింది. ఆధారాలూ, ప్రత్యక్ష సాక్ష్యాలూ దొరకలేదు. శత్రువు నుండి పొందిన లభ్దిని గౌతమ్ అప్పటికే ఆ పరవళ్ళు తొక్కుతున్న నదిలోకి విసిరేశాడు!
"ప్రత్యక్షాధారాలు లేనందువల్ల అధికారులు ఎటూ నిర్ణయించ లేకపోయారు. గౌతమ్ నేరాన్ని అంగీకరించలేదు. పూర్తీ వ్యతిరేకంగా వాదించాడు. సుయోధన్ దుర్మార్గుడనీ, అతడు శత్రు సైన్యాధి కారితో మంతనాలు చేస్తుంటే తానూ, విష్ణు నారాయణ్ శర్మ పసికట్టి, ఎదిరించామని, సుయోధన్ నేరాన్ని తమ పైకీ తోశాడనీ గౌతమ్ వాదన. అయితే, నేరస్తుడు కాకుంటే శర్మ ఎందుకు పారిపోతాడనేది అధికారుల ప్రశ్న. సైనిక న్యాయస్థానం లో విచారణ జరుగుతూనే ఉంది. ఇంకా న్యాయాధికారులు సందిగ్ధావస్థలోనే ఉన్నారు. ఎటూ తేలలేదు కేసు. ఇక్కడే చాలా తెలివి తక్కువ పనిచేసి తన నేరాన్ని ధ్రువ పరుచు కున్నాడు గౌతమ్. ఒకనాడు సైనిక న్యాయ స్థానం నుండే పారిపోయాడు! దానితోనే అతడి పై అనుమానాలూ, నేరాలూ ధ్రువ పడ్డాయి. అతడిని తిరిగిపట్టుకోవడానికి తీవ్ర కృష్టి జరిగింది.
"స్వర్ణ గంగా డాం వద్ద యుద్ధం తీవ్ర తరమయింది. నాలుగు రోజుల అనంతరం , శత్రుపటాలమంతా డాం మీద ఉండగా డైనమైట్ పేలి డాం తో పాటు శత్రువులందరూ నామరూపాలు లేకుండా పోయారు. ఆ మరునాడు ఆ ప్రాంతాలలోనే పట్టుబడిన గౌతమ్ , ఆ డైన మైట్ తానె పెల్చాననీ , అందుకే పారిపోయి వచ్చాననీ , తానె లేకపోతె దుర్మార్గుడు సుయోధన్ ఆ పాటికి దేశాన్ని శత్రువుల కైవసం చేసి ఉండేవాడ నీ వ్యర్ధ వాదనలు చేశాడు. కాని చంటి పిల్లలు చెప్పినట్లున్న ఆ బుకాయింపు ను ఎవరూ నమ్మలేదు. అప్పటి కప్పుడు సైనిక న్యాయస్థానం అతడిని విచారించి శిక్షించింది. సైనిక కారాగారం లో గాక సెంట్రల్ జైలు లో సాధారణ ఖైదీలాగా జన్మాంతం కఠిన మైన ఖైదు అనుభవించ మన్నారు. యుద్ధం ఆఖరి నిమిషాలలో కూడా శత్రువులకు సాయపడాలని ప్రయత్నించిన గౌతమ్ నిజంగా మరణ శిక్షకు పాత్రుడు. కాని, అతడి అదృష్టం కొద్ది ప్రత్యక్ష నిదర్శనాలు దొరకక, ఎప్పటికప్పుడు ఆ శిక్ష అతడికి దూరంగా ఉండిపోతూ వచ్చింది . పోలీసులు ఎన్ని మార్గాలు అవలంబించినా అతడి చేత నిజం చెప్పించలేకపోయారు. సుయోధన్ దేశ ద్రోహి అనీ, ఆ డైన మైట్ పేల్చింది తానే అనీ అంటాడు. కాని అందుకు నిదర్శనం? తోడూ దొంగ శర్మ, భార్య రాజ్యలక్ష్మీ అప్పటికీ, ఇప్పటికీ పట్టుబడలేదు. కాని ఇటీవల వారి రహస్యాలు బయల్పడడం కోర్టు వారికి విదితమే. వారిలో దేశద్రోహి బుద్ది అధికమయిందే కాని, నశించలేదు. గౌతమ్ పుత్రుడు ధర్మారావు ను రహస్యంగా పెంచి, తండ్రి ఉన్న జైలుకే ఉద్యోగి గా చేసి ఆ తండ్రిని విడుదల చేయించారు. వీరిని రహస్యంగా కలుసుకోవడానికే గౌతమ్ మధ్య మధ్య కారాగారం నుండి పారిపోయే వాడని ఇందువల్ల విశదమవుతున్నది.
"డేహడూన్ లో సైనిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ కుమారుడు జూన్ పద్నాలుగు రాత్రి హటాత్తుగా మాయమయ్యాడు. ఎవరు ప్రయత్నించినా అతడి ఆచూకీ తెలియలేదు. గౌతమ్ భార్య రాజ్యలక్ష్మీ కూడా ఉన్నట్లుంది అంతర్ధాన మయింది. కారణం ? ఈ రాజ్యలక్ష్మీ బాగా విద్యావతి. సైనిక శిక్షణ లో గట్టి తర్ఫీదు పొంది, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడు గా ఉండేది. భర్త నేరంలో ఆమెకూ భాగం ఉంది. అందుకే భయపడి పారిపోయింది.
"అప్పటినుంచి, ఇప్పటి వరకూ వారెవరూ అయిపూ, ఆజా లేరు. ప్రభుత్వం కన్ను కప్పి ఒక మారు మూల పట్నం లో అనాధ శ్రమం స్థాపించి, విష్ణు నారాయణ్ శర్మ నారాయణ స్వామి అయ్యాడు. రాజ్యలక్ష్మీ కరుణా మయిగా ఆ ఆశ్రమ ముఖ్యసేవిక అయ్యింది. ఆ ఆశ్రమం లో మొదట చేరిన బాలుడు -- అక్కడ పెరిగి పెద్ద అయి సెంట్రల్ జెయిలు సూపరింటెండెంట్ గా వచ్చి , ప్రస్తుతం నేరస్తుడు గా నిలబడినది ఆ గౌతమ్ పుత్రుడు ధర్మారావు!"
విపరీతమైన కోలాహలం రేగింది ప్రేక్షకులలో.
ఆ అలజడి తగ్గిన తర్వాత సత్య కధనం కొనసాగించింది. "రాజ్యలక్ష్మీ , నారాయణ స్వామి ఆరితేరిన గడసరులు, కుతంత్ర జ్ఞులు అందుకే పెద్ద పధకం మీద ధర్మారావు ను అనాధ శరణాలయం లో పెంచి, అతడి తండ్రి ఉన్న జైలుకే అతడిని సూపరింటెండెంట్ గా చేశారు. దీని వెనక ఉన్న సత్యాన్ని కోర్టు వారు గమనించాలి. గౌతమ్, నారాయణ స్వామి , రాజ్యలక్ష్మీ-- అందరూ కుతంత్రంతో ఆరితేరిన వారే. వారి అడుగు జాదలలోనే ధర్మరావూ నడుస్తున్నాడు. అందుకే ధర్మారావు ఆదర్శ పురుషుడు లాగా నటించాడు. తండ్రి పారిపోవడానికి అవకాశం కల్పించాడు.
"యువరానర్! దేశం ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితి లో ఉంది. శత్రువులు కుతంత్రాలు పన్నుతున్నారు. ఇటువంటి సమయం లో గౌతమ్ వంటి దేశ ద్రోహి కి స్వేచ్చ ప్రాప్తించిందంటే, ఇది చిన్న విషయం కాదు. దీని వెనక ఏదో పెద్ద పన్నాగమే ఉండి ఉండాలి. ఈ పరిస్థితులలో బహుశః విదేశీయులతో చేతులు కలపడానికే ఆ ముగ్గురూ పారిపోయి ఉంటారు."
ప్రేక్షక సమూహం లో రేగిన తీవ్రమైన అలజడి న్యాయాధిపతి హెచ్చరికతో సద్దుమణిగింది.
సత్య ఆఖరి మాటలు చెప్పింది: "ఆనాటి యుద్దంలో శ్రీ సుయోధన్ సమయోచిత ప్రజ్ఞ వల్ల దేశ రక్షణ జరిగిందని అప్పటి ప్రభుత్వం శ్రీ సుయోధన్ ను మంచి ఉద్యోగంతో , బిరుదులతో సత్కరించింది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అయన ప్రజ్ఞా విశేషాలనూ, సేవా నిరతిని గుర్తించింది. తన అక్రమ మార్గాలకు అడ్డు వచ్చిన సుయోధన్ ఇంత ఔన్నత్యాస్థితిలో ఉండడం గౌతమ్ కు అయిష్టంగా ఉన్నది. అందుకే మారు వేషాలతో అయన ఇంట్లో ప్రవేశించి, కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నారు అతడూ, రాజ్యలక్ష్మీ కలిసి. అందుకు నిదర్శనంగా గతరాత్రి శ్రీ సుయోధన్ సోదరులైన న్యాయాధికారి న్యాయమిత్ర గారి ఇంట్లో జరిగిన విశేషాలు కోర్టు వారికి నివేదించడమైనది. గౌరవనీయులైన కోర్టు వారికి సర్వం నివేదించడమైనది. విద్యావంతుడు, యువకుడు, మేధావి తన సేవలతో మాతృ దేశ రక్షణకు శాయశక్తు లా తోడ్పడటం అటుంచి ఇంతటి ద్రోహం తలపెట్టిన ఈ ధర్మారావు కు సరయిన సన్మానం ఉరితాడే; సరయిన సత్కారం ఉరి కంబం వద్దనే!"
వాదన ముగించి చలన రహితంగా , ఏ భావాన్నీ వ్యక్తీకరించ కుండా కూర్చున్న సత్య స్పృహ తప్పిపోతున్న విషయం గ్రహించిన సుయోధన్ వెంటనే ఆమెను ప్రైవేట్ రూమ్ లోకి తీసుకుపోయాడు. కోర్టు లంచికి లేచింది. ఈలోగా సత్య కోలుకుంది. కాని, ఎవరితో నూ మాట్లాడలేదు. సుయోధన్ మాత్రం మహా మురిసి పోతున్నాడు లోలోపల.
కోర్టు వారు మధ్యాహ్న సమావేశానికి సిద్దం కాగానే , ధర్మారావు తరపున వాదిస్తున్న ప్లీడరు అర్జున్ కూడా సిద్దమయ్యాడు. అందరూ తననే చూస్తుండగా , తాపీగా లేచాడు అర్జున్.
"యువరానర్! లోగడ నిర్ణయించి నట్లు ఈ రోజు -- వాదనలకు తుది రోజు కాజాలదని మనవి చేస్తున్నాను. ఈ కేసు విషయం లో మరి కొన్ని నిదర్శనాల నూ, ముఖ్య వ్యక్తుల నూ ప్రవేశ పెట్ట దలిచాను."
"వీలుపడదు. తమ తుది వాదనను చెప్పండి." ఖండితంగా అన్నాడు మిత్రా.
అర్జున్ చలించలేదు. "తప్పనిసరిగా తమరు అనుమతించాలి. ఈ నిదర్శనాలతో , సాక్షులతో కేసు స్వరూపమే మారిపోబోతున్నది."
"సరే, అనుమతించాము. ఏమిటో చెప్పండి."
సత్య రోషంగా లేచింది. "యువరానర్! అది వీలుపడదు. ఈ రోజుతో వాదనలు ముగియ వలసిందే."
"మేము అనుమతించడమయింది."కఠినంగా అన్నాడు మిత్రా.
సత్య మౌనం వహించ వలసి వచ్చింది.
అర్జున్ విన్నపం మరొకటి. "నేను ప్రవేశ పెట్టుతున్నవ్యక్తులకు తమరు తత్ క్షణం పోలీసు రక్షణ కల్పించాలని కోరుతున్నాను.
న్యాయమిత్ర కనుబొమలు ముడి పడ్డాయి. ప్రేక్షకులందరూ , ఉత్కంట తో ఎదురు చూడసాగారు. ఎటువంటి పరిస్థితుల లోనైనా , ఏ కేసులో నైనా చక్కటి తీర్పును ప్రసాదించే న్యాయమిత్ర నేడు దిక్కుతోచక సతమత మవుతున్నాడు. కడకు పది నిమిషాల అనంతరం అర్జున్ కోరిన ఏర్పాట్లు చేశాడు మిత్రా. సుయోధన్ కు ముళ్ళ మీద కూర్చున్నట్లుంది.
అర్జున్ సైగ చేయగానే ఒక పక్కన కూర్చున్న ఒక స్త్రీ మెల్లగా చేతిలో ఏదో వస్తువుతో ప్రవేశించింది. ఆమె మేలి ముసుగు ధరించి ఉండడం వల్ల ఎవ్వరికీ ఆమె ఎవరో తెలియడం లేదు. వెంటనే రక్షక భటులు సాయుధులై ఆమెకు రక్షగా నిల్చున్నారు చుట్టూ.
అర్జున్ సత్య వైపు తిరిగాడు. "సత్యాదేవీ! రాత్రి మీ టేప్ రికార్డర్ పోయింది కదూ?"
"అవును. గతరాత్రి మా ఇంట్లోనే పనిచేసే ఒక స్త్రీ పదకొండు గంటల ప్రాంతం లో దొంగిలించింది. ఆ సంగతి పోలీసు రిపోర్టు ఇవ్వడం కూడా జరిగింది."
"ఇది చూడండి. మీదేనా?' ఆ నూతన స్త్రీ చేతిలో నుండి రికార్డర్ తీసి బల్ల మీద అందరి ఎదటా పెట్టాడు అర్జున్.
"అవును, నాదే!" పరీక్షగా చూచి గుర్తు పట్టింది సత్య.
"నీపనే అననుకున్నానులే.' ఈసడింపు గా అన్నాడు సుయోదన్. వెంటనే అది కోర్టు అని గుర్తు వచ్చి బలవంతంగా అదుపులో పెట్టుకున్నాడు నోటిని.
రికార్డర్ బటన్ నొక్కాడు అర్జున్. ఉత్సుకత తో వేచి ఉన్న అందరూ కొద్దిసేపు అమితాశ్చర్యంలో మునిగి పోయారు.
అంతకుముందు సత్యాదేవి ఏవిధంగా ఏమేమి చెప్పిందో అవే తుచ తప్పకుండా వినవస్తున్నాయి.
"ఇదంతా మీరు స్వయంగా రికార్డు చేసుకున్న మీ వాదనే కదూ, సత్యాదేవీ?" అర్జున్ ప్రశ్న."
"అవును.' చాలా అసహనంగా చెప్పింది సత్య. "ఇంతకూ దీనికీ, మీ కేసుకూ సంబంధ మేమిటి? ముద్దాయి నో, ప్రతి వాదినో ప్రశ్నించి నట్టు నన్ను ప్రశ్నిస్తున్న మీ ధైర్యం ఏమిటి?" తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది.
