"ఎలా వ్రాస్తారండీ?" అన్నది పార్వతి కవిత చిరునవ్వు నవ్వి ఊరుకుంది.
"నాకు కధలు వ్రాయాలనుంది. " పార్వతి ఎలాగైతేనేం ప్రయత్నించి ప్రయత్నించి , కోరిక వెల్లడించింది.
"ఉహూ.! అదా ప్లాను? పిలిచిన కారణం ఏమిటో అనుకున్నాను! వ్రాయండి!"
"నేర్పించక పొతే ఎలా వస్తుంది, కవిత గారూ?"
"నేర్పిస్తే వచ్చేదా అని! రావచ్చు నెమో- ప్రయత్నిద్దాం లెండి. ఆ మధ్య ఓ వ్యాసం ఏదో పత్రికలో చూశాను -- ఆ పార్వతి మీరు కాదేమిటి?"
పార్వతి సిగ్గుపడుతూ అంది : "నేనే గానీ, అదేదో భావల హరిలాగా వ్రాశాను. మరి కధలు వ్రాయటం చేతకాకుండా ఉంది."
"అయితే నేం? 'మృత్యువు' అని పెద్ద వ్యాసం వ్రాసి, ఎడిటర్ గార్ని హడల గొట్టేశారుగా మొదటే!"
ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. అప్పుడే సాయంకాల స్నానం పూర్తీ చేసి మేడ మీదకు పోతున్న రాజు, కొత్త వ్యక్తీ గొంతుక విని వెనక్కు తిరిగి చూశాడు. కవిత అతన్ని చూచి, తక్షణం పార్వతి ని చూచింది. పార్వతి కవితను అడగవలసిన వాటి కోసం ఉబలాట పడుతూ ఇదంతా గుర్తించ లేదు.
హటాత్తుగా -- "మా వంటి వాళ్ళు.......మీ వారికి వచ్చరాను కుంటాను." అంది కవిత.
కంగారు పడి , "ఏం?' అంది దారి తోచక పార్వతి.
సాధారణంగా కవిత గ్రహించలేనిదంటూ ఉండదు. ఏకసందా గ్రాహికి ఉండే శక్తి లాటి దేదో ఉంది కనుకనే మనుషుల్ని నిలువునా చదివేస్తుంది.
"ఏమో! భారత స్త్రీ లక్షణాల్ని పాటించినట్టు లేదు ఇవాళ. బొట్టు కూడా పెట్టుకోలేదేమో!" అంది నవ్వేస్తూ.
అప్పుడు చూచింది పార్వతి. నిజమే! మొన్న క్లబ్బుకు వచ్చినప్పుడు కనిపించిన కాస్త అడంబరమూ ఇప్పుడు పూర్తీ గా లేదు. నుదుట బొట్టు లేదు. సాదా చీర కట్టుకుంది. జడలో ఒక లిల్లీ పువ్వుంది.
అంతా మరిచిపోయి , "మీకు నీలం చీర లిష్టం కదూ? తెల్లది కట్టుకున్నారేం?" అంది పార్వతి కవితనే చూస్తూ.
"మీకెలా తెలుసు?" కవిత విస్తుపోయింది.
"మీరంటే ణా కిష్టం కనుక."
"ఊ! అలాగా!" నవ్వింది కవిత సున్నితంగా.
33
"శాఖాగ్రముల్లోని ఆకులతో కొన్ని వడిలి నేల వ్రాలినాయి. మిగిలిన పర్లాంతరాంతరముల నుండి రెండు మూడు అస్తంగత దివాకరుడి నులువేచ్చని కిరణము లు ప్రసరిస్తున్నవి. జీవిత యానం చేసి చేసి, ఆశయాములు నశింప చేసుకొని అలసి నిలచినట్టి స్త్రీ వలె ఉంది ఆ వృక్షం."
సిగ్గుపడుతూ నవ్వాపుకుంటూ కవిత ముఖాన్ని చూచింది పార్వతి.
"ఇంకా పూర్వంలో ఉన్నారు కొద్దిగా. ఆ ఫక్కి వదిలే వరకు మీ వ్రాతల్నీ ఇప్పటి పాఠకులు అభిమానిస్తారని గట్టిగా చెప్పలేను."
"పోనీ లెండి!" అంది పార్వతి అలిగినట్టు.
వాళ్ళిద్దరూ కూర్చున్న సిమెంటు బెంచీ కెదురుగా మోడు లాటి చెట్టు వొకటుంది. కవిత ఇంటి వెనుక భాగం అది.
'అలగకండి !" అంది కవిత నవ్వి.
"శిష్యురాల్ని ఎక్కడైనా మర్యాద చేసి పిలుస్తారేమిటి?"
"అట్లే కానిమ్ము!సుస్థిర ధైర్యమ్ము తో నుండుము, శిష్యురాలా! ణా యావత్పండిత్యమును నీకు ధార పోసేద."
పార్వతి కిలకిలా నవ్వింది.
"ఉండు -- వీడేందుకో నామీద కొచ్చి పడుతున్నాడు." అంది కొడుకును చూస్తూ.
"అమ్మా! భూమి గుండ్రంగా ఉంటుందా, నలుపలకలుగా ఉంటుందే?' అన్నాడు పిడుగు, కాగితం సరంజామాతో సహా వాళ్ళ అమ్మ ముఖం చూస్తూ.
"పార్వతీ! అదేదో కాస్త నువ్వు గీసి చూపించగలవా? నాకు బొత్తిగా డ్రాయింగు రాదు." కవిత అర్ధన.
"అబ్బే- ణా కసలు రాదు. ఓ స్ట్రెయిట్ లైన్ కూడా గీయ్యలేను....."
"నమ్మను. ఒక స్ట్రెయిట్ లైన్ కూడా గియ్యలేని వాళ్లుంటారా? ఉంటె వాళ్ళ జీవితాలు కూడా బహుశా స్ట్రెయిట్ గా ఉండవేమో?"
పార్వతి కవిత మాటకు ఏమో అనుకుంది. 'అంతేలెండి!" అంది.
కవిత చప్పున మాట మార్చి , "మీ నాన్నగారిని అడగరా , నాన్నా!" అంది.
"అడిగానమ్మా! గుండ్రంగా ఉంటుందన్నారు."
"మరేం ఫర్వాలేదు-- కోడిగుడ్డు ఆకారం లో ఉంటుందని వ్రాసేయ్యి.
పార్వతి నవ్వింది ఫక్కున కవిత మాటలకు.
"నేను వ్రాసుకుంటాలే" అంటూ తుర్రుమన్నాడు సుపుత్రుడు.
"మా ఇద్దరి అభిప్రాయాలూ తెలుసుకుని గానీ, ఒక అభిప్రాయానికి రారు మా పసివాళ్ళిద్దరూ" అంది కవిత.
పార్వతి ఆమెను చూస్తూ , "మీ ఇద్దరి అభిప్రాయాలూ ఎకీభావించినట్టుకనిపించలేదు నాకు" అంది.
"అదే నేను చెప్పేది! నేటి స్త్రీ స్థితి సమాజంలో ఎలా ఉన్నా గానీ, అదును దొరికినప్పుడు ఈ మాత్రం వ్యతిరేఖ భావం ప్రకటిస్తుండాలి. అప్పుడు గానీ మగవాడు ఆడదాని విలువనీ గ్రహించి, గౌరవించడానికి ప్రయత్నించాలను కోడు. సగటు మనుషుల్లో స్త్రీకి తామెంత అవసరమో మాత్రమే అలోచించేవార్ని లెక్క కట్టలేము."
పార్వతి వెనక్కు వాలి కవిత కొంగు వెలికి చుట్టుకుంటూ అంది : "అయితే -- భర్తని ప్రతిఘటించి మాట్లాడితే లోకం ఊరుకోదు: భర్త గారు కాస్త కూడా సహించ లేరు, కవిత గారూ!"
"అవును! పొద్దు తెలీకుండా ప్రతిఘటిస్తూ కూర్చుంటే అంతే మరి! పైగా చేతులారా బతుకు అశాంతికి నిలయంగా చేసుకున్నట్టవుతుంది. అందుకే ఏదైనా పరిమితంగా ఉండాలనే అంటాను. కొన్ని ధర్మాలు అవేటు వంటివైనా తప్పనిసరిగా శిరోధార్యాలై పోయాయి స్త్రీకి.
నిర్ణేతలు దివికి పోయుంటారు గనక దిగి రారు. ఇక నెత్తి కెక్కిన వాటిని దించుకునే శక్తి ఇప్పట్లో మనకు రాదు. ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉండదు కానీ, సంఘ జేవితంలో ఎవ్వరికీ తెలియకుండానే వెలి వేయబడతాము!"
పార్వతి శ్రద్దగా వినటం చూచి నవ్వి, "స్త్రీ ఎటువంటి మర్మ వేదనలను దాచుకుంటున్నధన్నా, మనో నిర్ణయాల్ని మార్చుకుంటున్నధన్నా ఇదే కారణం!" అంది కవిత నిట్టూర్చి బాధగా.
పార్వతి హుషారు గానే ఇంటికి వచ్చింది. తండ్రి, సరస్వతి పోయిన తర్వాత తిరిగి పార్వతి లో ఉల్లాసం కలగడం ఇదే మొదలు. ఎందుకో , ఏమో ఆలోచించలేదు ఆ పిల్ల.
పార్వతి రావటాన్ని చూచాడు రాజు.
అతని దగ్గరికీ విద్యార్ధులు అప్పుడప్పుడు వస్తుంటారు క్లాసులో పాఠం బుర్ర కేక్కక పొతే. ఒక్కొక్కర్నీ చూస్తె -- ముఖ్యంగా వాళ్ళ చూపులు చూస్తె చీపురు పట్టుకోవాలనిపిస్తుంది పార్వతికి. కానీ, కొందరి అమాయకత్వాన్ని గుర్తుస్తే జాలి కూడా కలుగుతుంది. ఎటుతిరిగి శేఖరం మాత్రం జ్ఞప్తి కి రాకతప్పదు.
కొందరి చిరునవ్వులలో విషం ఉంటుంది. అది తెలుసుకుని దూరంగా వైదొలగిపోయినా ఆ విషపు గాలి ప్రభావం కొద్ది కాలం వెన్నాడుతుందని చెప్పవచ్చు.
దుస్తులు మార్చుకొని వచ్చి హల్లో కూర్చుంది. పై నుంచి మాటలు వినిపిస్తున్నాయి.
"అదేమిటోయ్! ఇండస్త్రియల్ లేబర్ గురించి చెప్పమని ఈ బొమ్మలేస్తూ కూర్చున్నావు? చిత్రాలు వెయ్యడం వచ్చేమిటి నీకు?" రాజు కంఠం అది.
"ఏదో మాస్టారూ!" అబ్బాయి గొంతుక.
"ఏదీ చూడనియ్యి. బాగా వేశావే! ప్రఖ్యాత చిత్రకారుడి వౌతావేమో? మనుషుల్లాగే ఉన్నాయి నీ బొమ్మలు."
"కొందరు మనుషులు కదిలే బొమ్మలతో సమానం అంటాడు వీడు."
"ఎవరు?"
"ఇదిగో -- ఈ కాబోయే ప్రసిద్ద రచయిత."
రాజు నవ్వుతూ , "మరింకేం! ఇద్దరూ కళాకారులె! విశ్వం, కధలు వ్రాస్తున్నావా నిజంగా?" అని అడిగాడు.
"ఏదో.....మాస్టారూ....." విశ్వం బాగా సిగ్గు పడ్డట్టున్నాడు.
పార్వతి కి నవ్వు వచ్చింది. 'తనలాటి వాడే!"
వాళ్ళు వెళ్ళాక రాజు అడిగాడు పార్వతిని.' "నువ్వు కలిసి తిరుగుతున్న ఆవిడ ఎవరు?" సమాధాన్ని కోరాడు.
"ఆవిడ పేరు కవిత. ఒక రచయిత్రి." ఏ భావాన్నీ ప్రకటించకుండా చెప్పింది.
"మంచిదాన్లా కనిపిస్తోంది."అన్నాడు.
'అవును." బల్ల మీది పేపరు చేతిలోకి తీసుకుంటూ అంది పార్వతి.
అతనికి కవితను గురించి అడిగే అవసరమేమిటో ఆశ్చర్య పెట్టింది ఆమెను. అంతకంటే అద్భుతంగా , విచిత్రమైన గర్వరేఖ విద్యుద్వేగంతో శరీరాన్ని ఆవేశించింది.
