32
గడియారం సరిగ్గా మూడు గంటలు కొట్టి ఆగింది. 'క్లబ్బు కు వెళుతుంది కాబోలు' అనుకున్నాడు పార్వతి ని గమనిస్తూ రాజు. కొత్తగా చెవులకు ఆమెగారు పెట్టుకున్న బంగారు రింగుల కాంతి కిరణాలు సూటిగా రాజు కళ్ళను తాకాయి. కళ్ళు చికిలించు కున్నాడు. చేతికి వాచ్ బిగించుకుంటూ మెట్లేక్కబోతున్న పార్వతి . రాజు వెంటనే వెనక్కు వచ్చి ఎంతో అవసరమైన పనులేవో చూస్తున్నట్టు నిలబడ్డాడు బల్ల ముందు.

"నేను క్లబ్బుకి వెళ్తున్నాను. మీరు ఇంట్లో ఉంటారు కదూ? రెండు గంటల్లోగా వచ్చేస్తాను."
ఆ సంబోధనకు ఉలిక్కిపడి రాజు తన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మరిచిపోయాడు పార్వతి ముఖం చూస్తూ.
ఈలోగా ఆమె ఏ విధంగా ప్రశ్నించిందో తను దానికి సమాధానంగా ఔననాలో, అలాగేననాలో అన్న సంగతి మెదడు లోంచి దాటిపోయింది.
"ఏం?" అని తమాయించుకుని , 'అలాగే" అనేశాడు చూపు తప్పిస్తూ.
ఎందుకట్లా పిలిచిందా? అన్న సంశయం అతన్నంత తేలిగ్గా వదల్లేదు. సిగ్గునో, గర్వాన్నో పుట్టించి వదిలింది.
మెట్లు దిగుతూ సన్నగా పేలవంగా నవ్వుకొని చరచరా తటిల్లతలా వీధిలోకి నడిచిపోయింది పార్వతి నిరాటంకంగా.
* * * *
క్లబ్బు భవనం ఎదుటి గేటులోంచి చాలా మంది లోపలకు వస్తున్నారు. రంగు రంగుల చీరలు కట్టుకున్న అంగనా మణులు ఎక్కడుంటే అక్కడ సందడి.
విచిత్ర శోభను సంప్రోక్షిస్తూ తోటలో తిరుగుతున్నారందరూ.
పార్వతి స్తంభాన్నానుకోని చూస్తున్నది.
అక్కడ ఆఫీసర్ల భార్యలు కాలేజీ అమ్మాయిలూ, సామాన్య స్త్రీలు అంతా కలిసి ఉన్నారు.
వరండా అంచుల చుట్టూ రకరకాల పూల చెట్లు అమర్చి ఉన్నాయి. లాల్ కమల్ , స్థల కమల్ మొదలైన పూలు గులాభీ, పసుపు పచ్చ రంగుల్లో దాలియాలు విరజిమ్మినట్టు విరబూసి కళ్ళను చెదర గొడుతున్నాయి.
గేటు పైన అమరిక కోసం ఏర్పాటు చేసిన ఇనుప తీగకు అల్లుకున్న లేత జాజితీగే ఎండలో మెరుస్తూ చిరుగాలికి చలిస్తుంటే దాన్నే తదేకంగా చూస్తుంది పార్వతి. ఆర్ధికంగా పురుషుడి పై ఆధారపడి భయపడే స్త్రీ మాదిరి కంపిస్తున్నదా అనిపించింది.
'స్త్రీ గా పుట్టింది కనుక పురుషుణ్ణి గురించి తర్కించు కోవలసిన అవసరం లేదు తనకు. కానీ, స్త్రీ అంటే ఏమిటి? ఏయే పదార్ధాలను ఆకర్షణీయంగా సమీకరించి, ఎటువంటి సున్నిత రూపాల్ని తయారు చేశాడు సృష్టి కర్త? కాని ఒక్కటి నిజం!' అనుకుంది పార్వతి. 'అనాదిగా స్త్రీ, పురుషుడి పై ఆధారపడుతున్నది. అతని ఆలంబన లేకపోతె పడిపోయే ప్రమాద స్థితిని కూడా ఒక సమయంలో స్త్రీ అనుభవించిందని అనుకోవచ్చు. స్త్రీ పురుషుడి పై ఆధారపడి ఉందా అన్నదే సృష్టి కర్త ఉద్దేశంగా తోస్తుంది. దీన్ని అవలోకించగా కొన్ని విషయాల్లో మాత్రం తన జీవితం అందుకు విరుద్దంగా ఉంది.....
'అందుకే తన హృదయార్పణ ఇంకో విధంగా జరగకూడదా ?' గాలికి పూల రెమ్మలు ఊగులాడాయి పార్వతి ఊహల్లాగే.
'అమూల్యమైన ఈ స్త్రీ హృదయం ఎవరికో ఒక్కరికే అంకితం కావాలి. అదే భగవంతుడి కైతే? హృదయ రంజకమైన భావనే! కాని ఎలా సమర్పించు కోవడం? ఆధునిక సామాన్య మానవ మాత్రురాలికి అది ఎల్లా సాధ్యమవ గలదు? నేటి సాంఘిక, ఆర్ధిక జీవనాల్నీ బట్టి తాపత్రయ మనేది ఉన్నా లేకపోయినా స్త్రీ ఒడిదుడుకుల జీవిత నావలో ప్రయాణిస్తూ మునకలు వేస్తున్నది. ఆవిడ చచ్చినా తపస్విని అవజాలదు. ఆ మాట పై కంటే హాస్యాస్పదం కూడా. స్పందించే హృదయ స్థితులు ,మ అంతరంగిక క్షోభల్ని గురించి పనిగట్టుకు ఆలోచించే తీరిక పైవారి కేక్కడుటుంది?'
గాలి తెరల్లాగా తన మనసును తాకుతున్న ఊహల్ని గురించి తెలుసుకునే బాహ్య జ్ఞానంలో లేదు పార్వతి. పరిసరాల్లోని వారందర్నీ ఆమె శూన్యంగా చూస్తున్నది. వారందర్లో వెలుగుతున్న కాంతి పుంజాలకు కారకమైన ఏ దివ్య జ్యోతినో వెదుకుతున్న దామే మనసు. ఆ చూపు అందుకే సరియైన విధిలో పనిచెయ్యటం మానుకుంది. అన్వేషణ భగవంతుని గూర్చే ఐనప్పుడు మధ్యమ దశ వంటిదా స్థితి.
తనువు నిశ్చల సమాధిలో ఉంది. మనసు నిర్మల వికాస పదంలో సంచరిస్తుంది.
'తన జీవితం ఇలా నడిపిస్తున్నవాడు సర్వేశ్వరుడైతే -- అర్ధం ఒక్కటని పిస్తుంది. తనను పలువురిలో నుంచి ప్రత్యేకించి పరీక్షిస్తున్నవాడు దైవమె. అలా ఈ మనసును ఏకాగ్రం చెయ్యడానికే అందరి ధర్మాలకు, అన్ని అనుబంధాలకు వ్యతిరిక్టురాల్ని చేశాడు!'
పార్వతి కళ్ళు రెపరెప లాడాయి. ఒళ్ళంతా పులకించింది.
పూల మొక్కల్లో కలకల వినాదాలు చీల్చుకుంటూ క్లబ్బు గదుల్లోని హాస ప్రతిహసాల మధ్యగా పవిత్ర గీతం-- ఎన్నడూ విననిది పార్వతి వీనుల్ని సోకుతున్నది వినూత్నంగా.
'ణా జీవితాన్ని నీకే అర్పణ చేసుకుంటాను-----ఆ ఆనందాన్నుంచి దూరం చెయ్యాలని ఎందరు ఆటంకించినా సరే. బలవంత పెట్టి కానీ, తిరస్కరించి కాని నీ నుంచి నన్ను మరిలించలేరు , దేవా! అలాగనే నన్ను ఆశీర్వదించు........"
గగనానిల సమన్విత శూన్య ప్రదేశం లోకి నిగిడ్చి ఉన్నాయి పార్వతి చూపులు.
'స్వల్పమైన సంకేతాలుగా తన అస్తిత్వాన్ని నిరూపించుకొని, ఇక మీ యిష్టం -- అన్న ధోరణి లో మౌనం వహిస్తాడీ భగవానుడు!'
సెక్రటరీ పద్మావతి ఎప్పుడు వచ్చిందో -- "ఏమిటా లోచిస్తున్నావు, పార్వతీ!" అని నవ్వుతూ అడిగి, చెయ్యి పట్టుకుని బరబరా లాక్కు వెళ్లి పోయింది.
పార్వతి బాహ్యడంబరానికీ, అంతః ప్రవృత్తి కీ మధ్య ఉన్న తేడా ప్రతి వాళ్ళకూ చిత్రంగా కనిపిస్తుంది. వింతగా చూచి ఏమీ అనుకోలేక పోయిన వారు కూడా ఉన్నారు.
పార్వతి , టైమయింది కనుక ఇంటికి పోదామను కుంది. కానీ పద్మావతి బలవంతంగా బాతాఖానీ వేయించి వదిలింది కాదు.
ఎల్లాగో ఆవిణ్ణి తప్పించుకొని ఆఫీసు రూము లోంచి ఇవతలకు అడుగుపెట్టిన మరుక్షణం లో హల్లో నుంచి నవ్వులు వినవచ్చాయి. అటు చూచింది పార్వతి కళ్ళు తిప్పి.
"ఏమండీ కవిత గారూ! బహుకాల దర్శనం!" అంది సత్య గొంతుక.
"కవితా?' అనుకుని ఆశ్చర్యపడింది పార్వతి.
"ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కి? ఇవ్వాళ్ళ కి మళ్ళీ మేం సుకృతం చేసుకున్నాం!" హేమకుమారి వగలు.
"హల్లో, కవితా! వస్తే వచ్చావు కానీ, ఈ రెండు నెలలూ డిల్లీ లో ఏం చూశావో అవన్నీ చెప్పకుంటే నిన్నోదిలేది లేదు" అంది తెలుగు వచ్చిన అరవ క్రిస్టియన్ పిల్ల ఫ్లోరా.
అమ్మాయిల గడబిడే కానీ, ఆ కవితగారేవరో? ఆ వ్యక్తీ సరిగ్గా కనిపించడం లేదు; ఆవిడ నోటి మాటా వినిపించలేదు. ఆ మధ్య గదిలోని లైట్ల వల్ల కిటికీ ఊచల నీడలు పార్వతి మీద పడుతున్నాయి.
గుమ్మంలోకి వెళ్ళింది చూడాలనే కుతూహలంతో.
పార్వతి కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి.
'ఈ ముఖం ఎక్కడో చూసినట్లుందే! ఉహూ! ఔను . ఆవేళ ట్రెయిన్ లో కనిపించింది. తన కంట్లో నలుసు పడటం, ఆవిడ నవ్వడం-- చాలా రోజులై పోయిందిగా? తలుచుకుంటే నవ్వొస్తుంది. ఈవిడా? కవితా ఈమె పేరు? ఒకవేళ రచయిత్రి కవిత కూడా ఈమె నేమిటి? ఆవిడ గుర్తిస్తుందేమో తనను?'
అంతా కవిత చుట్టూ మూగారు . నవ్వులు.
"ణా అడ్వెంచర్సె క్కడికీ పారిపోవు కానీ ------మన లలితేది?" అంది కవిత చుట్టూ కలియ చూస్తూ.
"లలితకి నెలలు నిండాయి!" మళ్ళీ కిలకిలా నవ్వులు.
సన్నగా నవ్వుతూ నలువైపులా చూస్తున్న కవిత కు గుమ్మం దగ్గర నిలబడ్డ పార్వతి కనిపించింది.
కవిత ముఖం ఒక్క క్షణం సాలోచనగా మారింది. అంతలో నవ్వుతూ , "నేను గుర్తున్నానా?" అని అడిగింది పార్వతిని పలకరిస్తూ.
పార్వతికి ఊపిరాడలేదు. నవ్వొకటి నవ్వేలోపున --
"వీరు నీకు తెలుసా, కవితా? నెలవుతుంది మన క్లబ్బు మెంబరై . ఇలా రండి, పార్వతీ!' అన్నది ఫ్లోరా చలాకీగా.
పార్వతి కవితకు కాస్త దగ్గరగా జరిగేలోగా సెక్రటరీ పద్మావతీ దేవి హడావిడి పడుతూ రానే వచ్చింది.
"ఇదిగో కవితా! ఈవిడ మన క్లబ్బు కొత్త మెంబరు మిసెస్ పార్వతీ రాజ్. బి.ఎ. ప్రస్తుతం ఏ ఉద్యోగం లోనూ లేరు. అసలు నీకు చెప్పడం మరిచిపోయాను పార్వతీ! ఈమె గారు మన క్లబ్బు కంతటి కీ ఒక ప్రత్యెక కళ అనుకో. ఈవిడ వచ్చిన రోజు ఈ క్లబ్బు గోడలు దద్దరిల్లి పోతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటె గాధలు వ్రాస్తుంది , గ్రంధాలు వ్రాస్తుంటుంది మరి! మొన్న మొన్ననే డిల్లీ లో అఖిత భారత రచయితల సమావేశానికి వెళ్ళొచ్చారు ఈమె గారు! పేరు కవిత." పరిచయం ముగించి నవ్వింది పర్మావతి.
"మహా బాగా చెప్పాననుకుని పప్పులో అడుగేశావే , పద్మా! పొడిపొడిగా కవిత అనడమేమిటి?-- కవితా కరుణా కర్ అనాలి కానీ" అందొక నిత్య విమర్శకురాలు.
పద్మావతితో సహా అందరూ నవ్వారు ఒక్క పార్వతి మినహాయించి.
"నేనేం పెళ్లి కూతుర్ని కానులె, చిట్టీ! సిగ్గుపడటానికి టైం లేదు మరి!" కవిత మాటలకు తన నవ్వు మేళవించింది పార్వతి.
పద్మావతి గారు వెళ్ళాక -- "ఏమండీ , పార్వతి మీ కంట్లో నలుసు ఎంత గొడవ చేసింది!" అంది కవిత.
ఇద్దరూ గొంతు విప్పి నవ్వుకున్నారు. ఒక్క సెకను.
ఇంకా ఏమన్నా మాట్లాడుతుందేమోనని ఆశించింది పార్వతి. కానీ, కవిత వెళ్లి పోడానికప్పుడే సిద్దమైంది. పార్వతి ఆమె వ్రాసేవి తనకు అమిత ఇష్టమని చెబుదామను కుంది. "మీరెలా వ్రాస్తారు?' అని అడగాలనుకుంది. తనకు నేర్పమని కోరి చూద్దామను కుంది. ఏదీ కాలేదు. అందుకు కారణం కవిత మళ్ళీ పార్వతి దగ్గర సంభాషణ కదపక పోవడం .
రాత్రి నిద్ర పోయే ముందు కూడా కవిత గూర్చే ఆలోచనలు కమ్ముకున్నాయి. లేత నీలపు రంగు చీర తో కవిత కళ్ళకు కట్టింది. ' ఆమెకు నీలి వర్ణం అభిమానం కాబోలు....అందరికీ తెలుసు కవిత........'
మర్నాడు క్లబ్బులో కవితను చూచేదాకా పార్వతి కి మరో ఆలోచనా, ఆత్రుతా లేవు.
"ణా అసలు పేరు సుమిత్రా దేవి . కవిత పెన్ నేమ్." చెప్పింది కవిత.
ఎంతవరకు పరిచయం సాగినా కేవలం ముక్తసరి మాటలు దొర్లుతున్నాయి ఇద్దరి మధ్యా.
బాడ్మింటన్ కోర్టు వైపు నుంచి ఒక అప్సరస లాంటి పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి కవితను అమాంతం కౌగలించేసుకుంది. "నాకు తెలీకుండా వచ్చేశావూ , ణా కవీ!" అంది గోముగా.
"మరేం చెయ్యను? టెలిగ్రాం కొడితే అసలే సన్నని అమ్మాయివి కదా-- ఏమన్నా అయిపోగలవని భయం వేసింది. సరే కానీ, నన్నిలా కొత్త వాళ్ళ ముందు కవీ అంటూ పిలవద్దని ఎన్ని సార్లు చెప్పాను? మగ మనిషి నేమోనని వాళ్ళు కంగారు పడటానికి!"
"ఏమో బాబూ! నాకు తెలీదదంతా. అయినా మీ పెన్ మెన్ గాళ్ళందరికీ పెన్ నేమ్ పిచ్చొకటి కదా ణా ప్రాణానికి!" బుంగమూతి పెట్టి అందా అమ్మాయి.
'ఇక్కడి గోపికలందరికీ ఈవిడ కృష్ణుడు కాబోలు!' అనుకుంది పార్వతి కవితను పరీక్షగా చూస్తూ.
ఆమె కవితే ఆమెకు కళ. హుందాతనం పెట్టుకొని ఆభరణం. చురుకుదనం ఎక్కువై, గంబీరత సడిలినప్పుడు ఈమెకు అన్ని కళల్లో అభినివేశమున్నదేమో అనిపిస్తుంది.
'మాట వరసకి ఒకసారి ఇంటికి రమ్మనేనా పిలిచింది కాదీవిడ.' కవిత నిర్లక్ష్యానికి , నిర్లిప్తత కూ బాధపడి అక్కడితో ఊరుకోలేదు పార్వతి. "మీరు మా యింటి కొకసారి రండి. ఇక్కడికి దగ్గరే" అని ఆహ్వానించింది ధైర్యం తెచ్చుకొని.
"నేనెందుకు రావాలి? మీరే రండి." తేలిగ్గా అనేసి, పార్వతి కళ్ళలోని అరుణిమ ను చూసిందో లేదో కానీ -- అడ్రస్ చెప్పింది కవిత.
'ఛీ-- నేనెందుకు బయటపడి పోయాను తెలిసి తెలిసీ !' పార్వతి మనసులోనే సిగ్గు పడింది . మారు మాట్లాడలేదు.
మర్నాడు క్లబ్బు వైపు పోకుండా కాళ్ళు ఆగలేదు. కళ్ళు కవితను వెతకడం మానలేదు.
రాలేదో, వచ్చి వెళ్ళిపోయిందో -- ఆమె మాత్రం అగపడలే దేక్కడా.
"అహం ఆవిడ నిలువెత్తునా ఉంది. సౌజన్యం సౌహార్దం రచనల మేరకే. కావాలంటే అలాటి దర్పం తను కూడా చూపించగలదు."
మర్నాడు క్లబ్బు కు వెళ్లాలని పించక ఇంట్లో కూర్చుని ఇవే ఆలోచించు కొంటుంది సాయం కాలం దాకా.
తలుపు చప్పుడైంది. ఎవరా అనుకుంటూ గుమ్మం అవతల నిలబడ్డ వ్యక్తిని చూచి నిర్ఘాంత పోయింది పార్వతి.
కవిత!
పార్వతి అనిమేషత్వం గమనించి చిరునవ్వుతో లోపలకు వచ్చింది కవిత.
"మీ యిల్లు చాలా అందంగా ఉంది, పార్వతి గారూ!"
పార్వతి ఊరుకుంది. ఏమంటే ఏం తంటా వస్తుందో నని భయం!
ఆమె గారికి తగిన మర్యాద చేసి, వేరే కుర్చీలో కూర్చోబోతున్న పార్వతి చేతిని అమాంతంగా పట్టుకుని పక్కన కూర్చో బెట్టుకుంది కవిత మృదువుగా.
"ఇలా వేరుగా చూస్తె నేను వెళ్ళిపోవలసోస్తుంది." అంది.
పార్వతి తెల్లబోయింది మొదట. వెనువెంటనే దేన్నో జయించినట్టు వెన్నెల వెలుగు ప్రసరించింది ముఖం మీదకు.
"మీ కధలు నాకెంతో ఇష్టం" అంది పార్వతి. ఆమె సామీప్యం లోని కొత్త దనాన్ని తట్టుకుంటూ.
"ఉహూ!" అంది కవిత. "ణా నవలలు చదివారా?' ప్రశ్నించింది తన ప్రశ్నగా.
"లేదండీ . నాకు తెలీదు. వ్రాశారా మీరు?"
"ఏవో కొన్నే లెండి! పది వరకు ఉంటాయి."
"అన్ని ఉన్నాయా? నేను చదవలేదు సుమండీ! అసలు మొన్న మొన్నటి దాకా సాహిత్యం పట్ల నాకు అంత శ్రద్ధ లేదండీ!" నొచ్చుకుంటూ -- "ఇంకా వ్రాస్తున్నారా?" అని అడిగింది ఆసక్తి చూపించి.
"వ్రాస్తున్నాను. తిరిగే కాలూ, తిట్టే నోరూ అగవన్నట్టు సాహిత్యపు మెదడూ, సంగీతపు గొంతుకా ఊరికే ఉండవు."
