
46
బలరామయ్యకు పథ్యం పెట్టారు. మంచి ముహూర్తాన పద్మ పుట్టింటికి వెళ్ళింది. అసలామె వెళ్ళనని పట్టుబట్టింది. కాని శ్రీహరి, లక్ష్మీదేవీ బలవంతంచేసి పంపించారు.
వెళ్ళేముందు పద్మ, శాంతికి ప్రత్యేకంగా అనేకం చెప్పింది. "కాస్త అమ్మగార్నీ, నాన్నగార్నీ కనిపెట్టి చూస్తూండు. పెద్దగా ఆలోచనలేం పెట్టుకుని బాధపడకు. తరుచు ఉత్తరాలు వ్రాస్తూండు."
శాంతి మౌనంగా తల ఊపింది.
"శాంతీ, మనవి పూర్తిగా పరాధీన జన్మలు. మానవమాత్రులం. భగవదాధీనంలోని మట్టి బొమ్మలం. ఆశ నిరాశల మధ్య ఊగే ఉయ్యాల మన జీవితం. ఇక బాధ దేనికి, చెప్పు? ఇవ్వాళ ఆశించిన ఆశయం అందకపోవచ్చు. రేపు అనుకోని అదృష్టం వరించవచ్చు. అంతమాత్రాన కృంగిపోకూడదు. పొంగిపోకూడదు. ఇంతకంటే ఏం చెప్పను? నువ్వు చదువుకున్నదానవు. నాకంటే తెలివైనదానవు."
జాలిగా కళ్ళెత్తింది శాంతి. "అమ్మకు కూడ నాపై అసహ్యంగా ఉంది. నువ్వుమాత్రం నన్ను అతి ప్రేమగా ఆదరిస్తున్నావ్, వదినా. మొదట్లో నిన్ను నే నర్దం జేసుకోలేకపోయినందుకు క్షమాపణ వేడుకుంటున్నాను."
"లేదు, శాంతీ. నేనటువంటివేమీ మనస్సులో ఉంచుకోను. మొదట్లో నేనూ నీ సుకుమార స్వభావాన్నర్ధం జేసుకోలేక నిన్ను నొప్పించి వుంటాను. మళ్ళీ కలుసుకుంటామో, లేదో? నామీద కోపం పెట్టుకోకు" అంది పద్మ కన్నీళ్ళాపుకుంటూ.
"అలా మాట్లాడకు, వదినా." పద్మ రెండు చేతులూ పట్టుకుంది శాంతి. "నువ్వు సుఖంగా వుంటావ్. మళ్ళీ త్వరగానే వచ్చెయ్యాలి సుమా?మూడో నెల, అయిదో నెల అంటూ కూర్చోకూడదు. పాపని ఎప్పుడు ఎత్తుకుందామా అని వుంది నాకు."
ఇద్దరూ కళ్ళు తుడుచుకుని నవ్వారు.
పద్మ వెళ్ళిన సాయంత్రం శ్రీహరి ఒక్కడూ గదిలో ఉదాసీనంగా కూర్చుని ఉన్నాడు. కాఫీ ఇవ్వడానికి వెళ్ళిన శాంతి మెల్లగా పలుకరించింది. "చిన్నన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరమేమైనా వచ్చిందా, అన్నయ్యా?"
"వచ్చింది. ఎల్లుండి వస్తున్నారట." ఎటోచూస్తూ అన్యమనస్కంగా చెప్పాడు.
"అన్నయ్యా!"
"ఏమిటి?" దృష్టి యిటు త్రిప్పాడు.
"పూర్తిగా మాట్లాడడమే మానేశావ్. అంత అసహ్యంగా వుందా, అన్నయ్యా, నామీద?"
శ్రీహరి పరీక్షగా చూచాడు చెల్లెల్ని. నవనవలాడుతూండే శాంతి చిక్కిపోయి ఉంది. విషాదం గూడుకట్టుకున్న ఆ విశాల నేత్రాలు, నిత్యసంతోష ప్రఫుల్లమై ఉండవలసిన వదనం భారంగా, గంభీరంగా ఉండటం చూచిన శ్రీహరి గుండె తరుక్కుపోయింది. లేచి చెల్లెలి దగ్గరగా వెళ్ళి ఓదార్పుగా తల నిమిరాడు. "నిన్ను చిన్నప్పుడు నా భుజాలపై ఆడించాను, శాంతీ. నువ్వంటే నాకు ప్రాణం. నీపై అసహ్యమా?"
"నీవే కాదు. ఇంట్లో అందరూ నాపై అయిష్టంగానే ఉన్నారు." నెల్లాళ్ళుగా అణిచి ఉంచిన వేదన అశ్రురూపంలో బయల్పడింది. ఇద్దరూ చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ హృదయ ఘోషలో కాలగమనమే నిలిచిపోయింది.
కడకు శ్రీహరి మెల్లగా అన్నాడు, శాంతి చెక్కిళ్ళు ఒత్తుతూ: "ప్రేమించటం నేరం కాదు, శాంతీ. అందుకు నేను కోపగించలేదు. కాని అయోగ్యుడిని ఉన్నతస్థానం అధివసింపజేసి తెలివితక్కువ వాళ్ళమయ్యామని నా బాధ. అసలే బాధపడుతున్న నిన్ను నా ఉదాసీనత ఎంత కలవరపరిచిందో!"
శాంతి వెక్కివెక్కి ఏడ్చింది. "నీవంటి యోగ్యుడికి చెల్లెల్ననిపించుకొనే యోగ్యత లేదు నాకు."
"అంత మాట వద్దు, శాంతీ." చెల్లెల్ని దగ్గరగా తీసుకున్నాడు శ్రీహరి. "తాత్కాలికంగా ఆవేశపడ్డాను. లోకమూ, మంచీ, చెడూ తెలియని పసిదానవు-ఇందులో నీతప్పే ముంది? ఎవరెలా వున్నా, నేను నిన్ను ద్వేషించలేను. ఇక ఎప్పుడూ యిలా నీ మనస్సుకు కష్టం కలిగించను."
"అన్నయ్యా!"
"అవును, శాంతీ. నిశ్చింతగా వుండు. కాని, ఒకటి. ఎండమావుల వెంట వెంట పరుగులెత్తి నంతమాత్రాన నిస్పృహ కూడదు. తిరిగి ఆత్మ స్థైర్యంతో మరొక మంచి అవకాశానికి ప్రయత్నించాలి. ఎండమావులను చూచి భ్రమించడం సహజం. మన తప్పు లేదుగా?"
చాలాసేపు మౌనంగా ఉన్న శాంతి మెల్లగా "ఇంట్లో పని వుందన్నయ్యా. వస్తాను" అంటూ వెళ్ళిపోయింది.
శ్రీహరి దీర్ఘంగా నిట్టూర్చాడు. 'శాంతి ఎప్పటికైనా సాధారణ స్త్రీ కాగలదా? ఇటువంటి అపూర్వ పుష్పాలను సృజించి ఆడించటం, ఆడుకోవడం భగవంతుడికి వినోదం కాబోలు! గులాబి వెనుక ముళ్ళు. సంపంగిలో విషం. పద్మం చుట్టూ పంకం. సుకుమార శిరీషానికి అల్పాయుష్షు. మొగిలిలో మొరటుదనం! భగవద్విలాసం!'
47
నారాయణా, శ్యామలా వచ్చారు కాని బలరామయ్య విషయంలో ఏమీ ఆందోళన వ్యక్తం చేయలేదు; జబ్బు విషయం తెలియగానే రానందుకు క్షమాపణలు చెప్పుకోలేదు. ముక్తసరిగా పరామర్శించారు. అంతే.
"అంతే. వాడెప్పుడూ బాధ్యత లేనివాడే. ఇప్పుడు మరీ మారిపోయ్నట్లన్పిస్తూంది" అన్నాడు శ్రీహరి చాటుగా తల్లితో.
"పోనీలే. ఎవరెలా ఉంటే ఏంచేస్తాం?" అంది తల్లి నిర్లిప్తంగా.
"ఇంటి బాధ్యత లేనివాళ్ళకు ఇంటి విషయాలు చెప్పడమూ అనవసరమే. శాంతి విషయం వాళ్ళకు తెలియనివ్వకు. సౌమ్యత తెలియని వాళ్ళు. ఏమైనా అంటే శాంతి బాధపడుతుంది."
"నేనూ అలాగే అనుకున్నాను."
"అమ్మా, ఒక్కమాట."
"ఏమిటి?"
"శాంతితో నువ్వు చాలా ముభావంగా ఉంటున్నావు. అసలే దాని మనస్సులో బాధ రేగింది. మనం ఆదరించి మనస్సు మరల్చకపోతే కృంగిపోతుంది."
"......."
"మాట్లాడవేమిటమ్మా?"
"ఏం మాట్లాడను, నాయనా? మీకు చూస్తే అతి గారాబాలు. నాకుమాత్రం ప్రేమ లేదా? నాకూతురు కాదా? దాని బ్రతుకేమైపోతుందో నాకు తెలియటం లేదు."
"తల్లివి. నీకాబాద ఉండడం సహజమే. కాని పిలల్లు తెలిసో తెలియకో తప్పుచేసినా పెద్దవాళ్ళు క్షమించవద్దా, అమ్మా? పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు శ్రీరామరక్ష. మీరే ఆగ్రహిస్తే చిన్నవాళ్ళమేమైపోవాలి? సరసంగా దానికేమైనా నచ్చజెప్పాలి కాని, అసహ్యించు కుంటే ఏమైపోతుంది?"
లక్ష్మీదేవి నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంది.
"దానికి స్నేహితులు లేరు. ఎవరితోనూ స్నేహం చెయ్యదు. పద్మ ఇక్కడలేదు. సరే, నేను పగలంతా ఆఫీసుకు పోతున్నాను. నాన్నగారు దాన్ని ద్వేషించకపోయినా బలహీన స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకే ఒకరి ఆదరణా, సపర్యా అవసరం. ఇక మిగిలింది నువ్వు. నువ్వు దానిపై కోపం పెట్టుకున్నావు. ఇక శాంతిని ఎవరు ఊరడిస్తారు? బాధతో, అవమానంతో ఏకాకిగా అదెంత కుళ్ళిపోతోందో గ్రహించలేవా, అమ్మా?"
