Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 38


    ఇలాంటి పరిస్థితుల్లో విశాల నించి ఉత్తరం వచ్చింది. వాళ్ళిద్దరూ జీవితంలో కలుసుకున్నాక తొలిసారి వచ్చిన వుత్తరం అది. అతను ఈ వుత్తరం రాలేదనే యిన్నాళ్ళూ విరాగి కావాలని యిన్ని తాపత్రాయాలు పడ్డాడు. ఎన్నో వేదాంత గ్రంధాలు చదివాడు. యెందరో సంయసుల్ని కలుసుకున్నాడు. ధ్యానం లో పడ్డాడు. ధ్యాస ను వదల్చు కోలేక పోయాడు.
    'మీరు క్షేమంగా చేరానని రాస్తారని ఒక యేడాది యెదురు చూసాను. ఒకనాడు నేను మీతో అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. అవును నేనే మాటాడాలి. నేనే బయట పడాలి!-- ఆవేళ నేను ఉత్తి పిరికి వాణ్ని విశాలా అని ఒప్పుకున్నారు. వయసు హోదా పెరిగిన మీరు యింకా పిరికి వారుగా వున్నారంటే నమ్మలేకపోతున్నాను. మార్పు మంచిని తెస్తుందన్న నమ్మకం నాకుంది.నాకు కష్టం కలిగించి కన్నీరు తెచ్చిన మార్పు పై కూడా అట్టి నమ్మకం పెట్టుకునే నిలవగలిగాను. మీ యీ ప్రదేశం మార్పు మీకు మంచిని తెస్తుందన్న వూహ తోనే ఏకాంతాన్ని అనుభవించడానికి సాహసిస్తున్నాను.

                                                                                               'విశాల'
    ఈ వుత్తరం చదివాక ఆత్మకు వేడుకే కాదు, బ్రహ్మనందాన్ని పొందడమే కాదు-- యిద్దరి ఆత్మలూ అతుక్కుని మంత్రముగ్ధుని చేసినట్లు ఏదో తెలుసుకోలేని దివ్యానుభూతిని పొందాడు. వాళ్ళ ప్రేమ, పుట్టుక ముందే చావలేదు. ప్రాణంతో బయట పడ్డ యీ ప్రేమ పెరిగి యిదివరకు కళ్ళతో చూసి, చెవులతో వినే స్తోమతే కలిగి వుండేది. ఇప్పుడు విచక్షణా జ్ఞానంతో విజ్ఞానం విరజిమ్మే ఆత్మతో వెలిగి పోతోంది.
    అతను యిన్నాళ్ళ వేదాంతం, ధ్యానంతో విశాల ప్రేమ అనే ఆత్మను దరిచేరుతున్నాడు. ఆ ప్రేమాగ్ని లో అనుభవించటం అనే ఆజ్యం పొయ్యకుండా ఆ ప్రేమని ఎన్నాళ్లు వెలిగించగలడు?

                              *    *    *    *
    అతని ధ్యానం లో కూడా ఆమె ప్రతి బింబమే అగు పడటం తో సూర్యం ఒక నెల రోజులు శలవు తీసుకుని విశాల దగ్గరకు బయలుదేరాడు. త్రోవలో కనిపించిన ప్రతి మనిషి చేష్టలలోనూ తాపత్రయ మే అగపడింది. రోగాలతో బాధపడేవాళ్లు, కడుపు బాధతో అలమటించే వాళ్లు, ప్రేమ కోసం పెనుగు లాదేవాళ్ళు , సుఖం కోసం సతమతమయ్యేవాళ్ళు -- యెవరిని తీసుకున్నా ఏదో బాధ అగుపిస్తోంది. 'నేను' అనే అహం నీడలా మనిషిని వదలని వాడు అతడు నిజం తెలుసుకోలేడు. నిజం స్వరూపం ఆత్మలో యిమిడి వుంది. ఆత్మను చూడాలంటే నిజానికి కట్టుబడాలి. తను నిజానికి కట్టుబడేనా యిప్పుడు విశాల దగ్గరకు వెళ్తున్నాడు? ఈ ప్రశ్న గతాన్నంతా తవ్వింది. రైలు కదులుతుంటే ప్రకృతి పరుగెత్తినట్లు యెలా కనిపిస్తుందో తన జీవితం లో ఘట్టాలు కదలసాగినాయ్. విశాల తనది కావలసి వుంటే అది తోలి రోజుల్లోనే కావలసింది. ఇప్పుడు ఆవేశం అప్పుడప్పుడు అతని గత స్మృతులను జ్ఞప్తి కి తెచ్చి కోరికలకు లొంగి పోతుంది గానీ నిజంగా తను విశాలను వాంచిస్తున్నాడా? ఆమెను తలచుకున్నప్పుడు వచ్చే ఆనందంతో పాటు హృదయంతరాళం లో బాధతో కూడిన స్పందన కూడా వినిపిస్తుంది.
    ఇన్ని విధాలుగా అనుకోడానికి కారణం తను యింకా బంధాలను త్రెంచు కోలేకపోతున్నాడు. కట్టు బాట్లపై వుగ్గుపాలతో వచ్చిన విశ్వాసంతో పాటు తల్లి దండ్రులకు తను యిచ్చిన హామీలు కూడా తను త్రోవలో చేసుకున్న నిర్ణయాలకు కారణమయ్యాయ్. తను ఒక గమ్యం చేరడానికి ఒక బాటలో యెలానూ పడ్డాడు. ఆత్మను చేరాలని తను పడ్డ బాట నించి మళ్లీ వెనకకు తిరిగి రావటానికి అతనికి ఇష్టంగా లేదు. ఆత్మను చేరాలన్న తాపత్రయం వున్నవానికి ఐహిక సుఖాలతో పనేముంది? వెలుగు కోసం పరుగెత్తే వాడికి ఈ చీకటి కోణాల్లో కూర్చునే అవసరం యేముంది? అతను తన మనస్సు చేసే ఆలోచనలు, కళ్ళు చూసే కాంతులు, చేవులు వినే శబ్దాలు, నాలికకు తగిలే రుచులు , ముక్కు చూసే వాసనలు-- వీటన్నిటి లోనూ మార్పులను కాంక్షిస్తున్నాడు. సామాన్యమైన శక్తి గల విద్యుచ్చక్తిని మొయ్యగలిగే యీ తీగలను మార్చి అధికమైన శక్తిని మొయ్యగలిగే తీగలను వెయ్యాలని తాపత్రయ పడ్తున్నాడు. అప్పుడు వెలిగించే వెలుగును చూడగలిగే కళ్ళు తనకు ఉంటాయ్. అయితే ఆ శక్తి యెలా వస్తుంది? ధ్యానం ఆత్మ పరమౌతుంది. మనసులో ఆత్మ ధ్యానం తప్పించి ఐహికమైన విషయాలు తిరిగితే మనసు ఆత్మ దరి చేరలేదు.
    ఒక నిర్ణయానికి వచ్చిన మనిషి విశాలను చూడగానే అంతా మరిచి పోయాడు. ఆమె యిది వరకు కంటే చిక్కి పోయింది. ఒంటి మీద అట్టే శ్రద్ధ తీసుకోవటం లేదని ఆమె జుత్తు, వాటం అంతా చెప్తూనే వుంది.
    'ఏం యిలా తయ్యారయ్యావ్?'
    'ఇంకెలా వుండాలి?'
    'తింటున్నావా లేదా?'
    'తినకపోతే యెలా బ్రతికున్నాను?'
    'చదువెలా సాగుతోంది?'
    'సాగవలసినట్లు సాగుతోంది.'
    'ఈ నవలలు కూడా స్కూలు పుస్తకాలేనా?'
    'స్కూలు పుస్తకాలొక్కటే చదివితే విజ్ఞానం యెలా వస్తుంది?'
    ప్రతి ప్రశ్నకూ జవాబు వెంటనే రాగానే సూర్యం కు విశాల మారిపోయిందని తట్టింది. ఆమెలో యిది వరకు వున్న సిగ్గు, బెదురు యిప్పుడు ససేమిరా అగపడలేదు. ఏదో వ్యక్తిత్వం వచ్చిన మనిషిలా కనపడింది. ఆవేళ మధ్యాహ్నం ఆమె వండిన వంటలో క్రొత్త రుచులను చొప్పించ్చింది. సాయంత్రం సరికి ఆమె ఒక నవ నాగరికం తో వుట్టి పడుతున్న స్త్రీలా తయారయింది. చదువు ఆమె నడక లో, మాటల్లో , నడతలో, చూపులో , శరీరం లో కూడా క్రొత్త దనాన్ని తీసుకు వచ్చింది. తపస్సు లో నున్న విశ్వామిత్రుని కంటికి మేనకలా విశాల అగపడింది.
    'సముద్ర పోడ్డనకొత్తగా ఒక పార్కు కట్టారు. పదండి వెళ్దాం' అంది.
    సూర్యం సంశయించాడు. సాయంత్రం కిటకిట లాడే జనం మధ్యకు ఒంటిగా ఆమెతో వెళ్తే వచ్చే గుసగుసలు తల్చుకుని వెంటనే వెళ్దాం అని అనలేక పోయాడు.
    'నాతొ రాడానికి కూడా సంశయమేనా?' అంది.
    'అబ్బే....అబ్బే.'
    'నాతొ మాటాడ్డానికి సంశయం, నావేపు చూడటానికి మరీ భయం మీకు. నేనేం బ్రహ్మ రాక్షసినా, కామినినా? చెప్పండి.'
    'ఎందుకలా అనుకోవాలి?'
    'చూస్తున్నాగా? మీకున్న కోపం అంతా నామీదే చూపిస్తూ వున్నారు?'
    'ఎప్పుడు చూపించాను?'
    'మీ మనసుకు మీరే సాక్షి. నామీద కోపంతోనే మీరు డిల్లీ బదిలీ చేయించు కున్నారుగా!'
    సూర్యం కు విశాల బల్ల గుద్ది చెప్పే వైఖరి నచ్చలేదు. ఇదివరకటి విశాలకు యిప్పటి విశాలకూ యెంతో తేడా కనిపించినట్లయి ' నీకు తెలీదు విశాలా' అన్నాడు.
    'తెలియని మనిషి ననే యిన్నాళ్లు దయ తలచారు.'
    'ఎందుకు లేనిపోనీ అర్ధాలు తీస్తావు?'
    'అయితే నాతొ రోడ్డు మీద మీకు నడవటానికి చిన్నరికమా?'
    'నాకు కాదు-- నీకు చికాకు తెస్తుందని.'
    'నాకేం చికాకు రాదు. నన్నెవరూ యేమీ చెయ్యలేరు== మీరు తప్పించి.'
    'అయితేపద -- ' అన్నాడు కాస్సేపు మౌనం దాల్చాక.
    ఇద్దరూ రోడ్డు వెంబడి పోతుంటే సూర్యనైకి పరిచయం వున్న మిత్రులు పది మందైనా పలుకరించారు. కారు మీద వెళ్లి పోతున్న వ్యక్తీ విశాల వేపు తిరిగి చూస్తూ యింకో మోటారు సైకిలుకు డీ కోనవలసింది. మోటారు సైకిలు మీద వస్తున్న వ్యక్తీ ఆమె జడ లోని పూల వేపు దృష్టి పెట్టు కున్నట్లుంది. ఒక వయసు మళ్ళి నాయన -- అతనికి నెరసిన జుత్తు కు రంగు రాసే అలవాటుంది లెండి-- వాళ్ళ వెంట చాల దూరం నడిచాడు. అతను అప్పుడప్పుడూ వొర చూపులు చూసేవాడు. పదిమంది స్టూడెంట్ల లో మెడిసిన్ చదువుతున్న వాళ్లు ముగ్గురు --- వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగి ఆమె వేపు చూసిన తరవాత శరీర శాస్త్రం గురించి చర్చించుకున్నారు. నలుగురు యూనివర్శిటీ స్టూడెంట్ల తో ఒకాయన ప్రేమ పాట కూని రాగం గా వదిలాడు. ఒక కాలేజీ స్టూడెంటు 'జోక్' విసిరాడు.
    బీచ్ దగ్గర యెవరో పిలిచినట్ల యింది. బాగా పరిచయం వున్న శర్మ ' అరె రాస్కెల్-- మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావురా' అన్నాడు.
    'ఇంకా పెళ్లి కాలేదు భాయ్.'
    'ఐ ఆమ్ సో సారీ ...విష్ యు బెస్ట్ ఆఫ్ లక్.'
    అతనిని తప్పించుకుని వస్తుంటే
    'థాంక్యూ అనలేదేమండి' అంది విశాల.
    'దేనికి?'
    'మర్యాదకు.'
    'ఇదంతా వేషం -- బ్రతుకంతా ఒక నటన విశాలా.'
    'డిల్లీ వెళ్లి పంజాబీ ల ప్రాపంచిక విషయాలు అబ్బుతాయనుకున్నాను వేదాంతం యెలా అబ్బింది?'
    'డిల్లీ లోనే కూర్చోలేదు . హిమాలయాలను గాలించాను.
    'ఆ హిమాలయాలు చూస్తుంటే -- ఆ మంచు పై సూర్యోదయం , నీలి నీటి పై అరుణ కాంతులు -- మన ప్రతి బింబాలు మనలనే ప్రశ్నిస్తాయ్.'
    'సరే రండి కూర్చుందాం!'
    ఇద్దరు పార్కు లో బదులు కాస్త దూరంగా ఒంటిగా యిసక మీద కూర్చున్నారు. పశ్చిమాకాశం లోని అరుణ కాంతులు తూర్పునవున్న పాడి మేఘాల పై పడి యెరుపు చేస్తాయ్. సంధ్య వెలుగులో నురగలు గ్రక్కుతూ పరుగెత్తున్న గుర్రాల్లా కెరటాలున్నాయ్. ఒక ఓడ, రేవు నించి పొగలు గ్రక్కుతూ కదలి పోతుంది. ఇంకో ఓడ, రేవుకు పోడానికి సిద్దంగా వుంది. కొండ మీద కోటి కాంతులతో తిరుగుతున్న దీప స్తంభం వేపు విశాల చూపిస్తూ ,
    'జీవితం అలా వుంటేనే ఆనందం.' అంది చప్పున. మౌనం యిలా భంగ పరచే టప్పటికి ఆకాశం పై చుక్కల దండు దాడి చేసాయ్.
    'ఆనందానికి కొలతలు లేవు, ఉపమానాలు లేవు విశాలా- నీ ఆనందం యింకొకరికి మిధ్య, ఇంకొకరి ఆనందం నివ్వు చూడలేవు అనుభవించలేవు. ఆత్మ పరమైన ఆనందం అనుభవించటం లోనే మనిషి చరితార్దుడౌతాడు.'
    'ఈ ఆత్మ జ్ఞానం యెప్పటి నుంచి నేర్చారు?'
    'ఆత్మను తెలుసుకోడానికి ప్రయత్నిస్తే నీలో అహం పోతుంది.'
    'బాగుంది మీ వరస. ఆ అహం లేకపోతె మనిషెలా బ్రతుకుతాడు? అహం మనిషి ఆహారం కదండీ!'
    'ఆ ఆహారం లా అహం కూడా హరించుక పోతుంది. చివరకు మనిషి హరించుక పోతాడు. హరించుక పోనిది ఆత్మ. దానిని తెలుసుకున్న ,మనిషే.....'
    అతనిని పూర్తీ చెయ్యకుండా విశాల వెంటనే
    'అలా తెలుసుకోడాని కైనా మనిషి లో అహం ఉండొద్దా?'
    'అహం కాదు-- ధ్యానం కావాలి.
    'అంటే ముక్కు మూసి జపం చెయ్యమంటారు-- ఏంటో ఈ జపాలు, తపాలు చెయ్యవలసింది పిరికివాళ్ళు గాని ధైర్య వంతులు కాదు. మనిషి విలువ అతని కున్న ధైర్యం బట్టి కట్టాలి గానీ అతని పలాయనత్వం బట్టి కాదు.'
    'ధ్యానం పలాయనత్వమా?'
    'సంసారి కి ధ్యానం అంతే. ధ్యానం తో అతను నిజానికి దూరంగా పోతున్నాడు. సమస్యలు నిజాలు. అవి పరిష్కరించే తీరే విజ్ఞానం. సమస్యలు సృష్టిస్తాడు, పరిష్కరిస్తాడు కాబట్టే మనిషి జంతు జాలం లో గొప్ప వాడయ్యాడు. ఈ విజ్ఞానం వదలి నిరాకారం లో తెలిపోమంటున్నారు. కోట్ల కొలది పనిచేస్తున్న తీగల్లాంటి యీమేదడు లోని నరాలను త్ర్రెంపి ఆలోచన లేని ధ్యానంగా మార్చ మంటున్నారు?'
    'బయట పుస్తకాలు చదివి చాలా నేర్చావే?'
    'నా  వూహలు వ్యక్త పరచటం మీకిష్టం లేదా?'
    'లేదని కాదు. నిన్ను నివ్వు ప్రేమించకు -- ఎదుటి వాళ్ళను ప్రేమించు.'
    'బాగుంది నన్ను నేను ప్రేమించు కోలేనిది నాకు గర్వం యెలా వస్తుంది? నన్ను నేను ప్రేమించనిది యెదుటి వాళ్ళను ప్రేమించడానికి ప్రేమ ఎక్కడిది? నన్ను నేను ప్రేమించుకోవటం వల్లనే బ్రతికున్నానండీ. లేకపోతె యీ సరికి ఆత్మహత్య చేసుకునే వుందును.'
    'నిన్ను నివ్వు ప్రేమించు కోవటం వలన వచ్చిన సంతోషం ఎన్నాళ్ళో వుండదు. ఎదుటి వాళ్ళను ప్రేమించగా వచ్చిన తృప్తి కలకాలం వుంటుంది.'
    'ఏంటో మనం యిలా వాదన లోనికి దిగిపోతున్నాం-- నా మట్టుకు నేను ఆత్మ జ్ఞానం గూర్చి ఈ వయసు లో తల పాడు చేసుకోనదలచుకోలేదు. ప్రేమిస్తాను -- ప్రేమను పొందుతాను-- ఇదే నా ధ్యేయం.'
    'ఎవర్ని ప్రేమిస్తావ్?'
    'ఏమిటీ యిలా ప్రశ్నిస్తున్నారు? ఆడది యెవరిని ప్రేమిస్తుంది? మీ తల్లి ప్రేమ లేకుండా మీరు పెద్ద వారయ్యారా?'
    'ఆ ప్రేమే నటన అంటాను. నేను అన్న అజ్ఞానం వలన మనిషి యిన్నీ చేస్తాడు.
    'బహుశః మీరన్న మనిషి అజ్ఞానం వల్లనే దేవుడు నిల్చున్నాడేమో! ప్రేమ నటనని మీరంటే -- నటించి ప్రేమించటం వలెనే మనిషి మోక్షం పొందుతాడు.'
    'కాదు. ఆత్మను తెలుసుకోవటం వలన మోక్షాన్ని పొందుతాడు.'
    'మనిషి ఆత్మను తెలుసుకోడానికి బ్రతకాలా? మనిషి బ్రతకాలంటే తినాలి. తిండి వలన పెరగాలి, ప్రేమించాలి, ప్రేమ వలన సృష్టించాలి, సృష్టి వలన తనో దైవాంశ ను పొందుతాడు. అప్పుడు ఆత్మను తెలుసుకున్నట్లే లెక్క కాదూ?'
    కాస్సేపు సూర్యం మౌనం దాల్చాడు. ఇలాగే గోవిందరావు తో వాదించి వెనుక బడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS