Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 37

 

                  


    'మనసు చంచల మైనది
    నిగ్రగ్రహించడానికి సాధ్యం కానిదే
    సందేహం లేదు. కానీ
    అభ్యాసం వలన, వైరాగ్యం వలన
    దానిని స్వాధీనం చేసుకోవచ్చు.'
    భగవద్గీతలో మళ్లీ యిది చదివి తన చంచలమైన మనస్సును స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. మనసు అంత సులువుగా స్వాధీనం కాకపోడానికి కారణ మేమిటని ఆలోచించక పోలేదు. నేను అన్న అహంతో నిండి పరుగెత్తే పందెపు గుర్రం లాంటిది మనసు. ఆ గుర్రం కళ్ళాలు మనసు యొక్క కోరికలైతే అవి లాగి విడిచి పెట్టటం వలన వచ్చే ఉద్రేకం లోనే మనిషి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందం వదులుకోవటం అంత సులువైనది కాదు.
    'నేనే చేస్తున్నాను.' అనే భావం ఎవడికి లేదో వాడు ఈ లోకంలోని ణులందరినీ చంపినా చంపనట్టే లెక్క. ఆ హత్యా కర్మకి అతడు బద్దుడు కాడు.' అని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు అక్కడక్కడ తన దర్శనం యిలా యిచ్చాడు.
    'ఈ చరాచరమైన భూత కోటిలో నేను లేనిది ఏదీ లేదు. నాదివ్యవిభూతులికి అంతం లేదు. నా ఒక్క అంశతోనే నేను జగత్తంతా వ్యాపించి వున్నాను. నేనే అద్యక్షుడ్నీ ; నాతోనే ప్రకృతి యీ చరాచరా సృష్టి నంతా కంటున్నది. భూత కోటి కంతటి కీ నేనే నియంతని.
    ఈ జగత్తు కు నేనే తండ్రిని. నేనే తల్లిని, దాతని, తాత ని, నన్నే భుజించు, నన్నే వుపాసించు, నన్నే నమస్కరించు.'
    ఈ దైవాంశ నించి వుద్బవించిన మనిషి దేవుని యొక్క 'నేను' ను కూడా పొందాడని సూర్యం అనుకున్నాడు. ఆ అహం లేకపోతె తను లేడు. తను చేసిన ఏ పనీ 'నేను చేస్తున్నాననే చేస్తున్నాడు.' నావలనే మా యింటి పేరు వచ్చింది. నా నుంచి నా తలిదండ్రులు గర్విస్తున్నారు. నేనే నా తమ్ముళ్లూ చెల్లెళ్ళ బాగు చూస్తున్నాను . నేను అందగాడ్ని, నేను లేకపోతె విశాల బ్రతుకు యేమయ్యేది--ఈ నేనును మనిషి విడిచి పెడితే చర్మం లేని మనిషిగా రూపొందుతాడేమోనని సూర్యం కు తట్టింది.
    దేముడు నిత్యం వెలిగే సూర్యుడైతే ఆ సూర్యుని అంశాయైన భూము లాంటి వాడు మనిషి. భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే మనిషి దేవుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. భూమి సూర్యుని వేడీ, వెలుగూ కొంత నిలుపుకున్నా సూర్యుడు కాలేదు. అలాగే మనిషి దేముని అంశ వున్నా దేముడు కాలేడు. సూర్యుడు నిత్యం మండి శక్తిని విరజిమ్ముతాడు. ఆ శక్తి వెలుగై భూమి మీద పడి చరాచరా జీవులకు ప్రాణం యిస్తుంది. యీ ప్రేమాభిమానాలు, బంధాలు, కోరికలూ , ఆశలూ, సుఖ సంతోషాలు, అనురాగాలు ఆశయాలు -- యివన్నీ యీ మనిషనే భూమ్మీద పచ్చని అడవులు మంచుతో కప్పిన కొండలు, వుద్యానవనాలు , సెలయేరులు, లాంటివి. ఇవిలేకపోతే భూమికి అందం లేదు. ఈ ప్రేమలూ, ఆశలూ వగైరా లేకాపోతే మనిషికి అందం లేదు. ఆ పచ్చదనం సూర్యుని శక్తి వలన ఎలా నిల్చిందో యీ ప్రేమానురాగాలు దేవుని ఆశీర్వాదం వలన మనిషికి అబ్బాయి.   అంచేత యివి వదులుకోడం భావ్యం కాదు. అనుభవించటం లోనే తృప్తి వస్తుంది. అవి సృష్టించిన వానికీ ఆనందాన్ని కలుగ జేస్తుంది.
    సూర్యం యిలా యెన్నెన్నో తర్జన భర్జనలు చేసుకున్నాడు. తన తలపులను వుద్దేశాలు సమర్ధించుకోడానికి మనస్సును మదిస్తున్నాడు. సముద్రపు లోతులు, హిమగిరి శిఖరాలు, గంగా ప్రవాహం , పొలాల పచ్చదనం, పూల పరిమళాలు , పళ్ళ తోటల కడుపు పంటతో పాటు అతని మనసులో అగ్ని పర్వతాలు, తుఫానులు, బాంబుల వర్షాలు, భీకర యుద్దాలు, రక్తపు టేరులు కూడా కదిలి పోతున్నాయ్. ప్రశాంత చిత్తం కోసం అతని ప్రాకులాట తగ్గలేదు. తన అన్వేషణ నిత్యం జరుగుతూనే వుంది. తనలో తనే కాకుండా యెదుటి వారిలో కూడా తను నివశించాలన్న కోర్కె బలీయం కాసాగింది. పదిమంది లో నివశించ కలిగిన వాడు దేవుని వేసే ప్రయాణం చేస్తుంటాడు. దేవుడు అన్ని ప్రాణుల యందు వున్నాడు, దేవుని బిడ్డ మనిషి యెంత హెచ్చుతుంది ప్రాణుల మనసులో భక్తీ భావంతో మెసలుతాడో వాడే దేవునికి దగ్గరదగ్గరగా పోతుంటాడు. ఈ చక్రంలో నిల్చున్న యిన్ని ప్రాణులు ఒక దగ్గర దైవాంశ పొంది, పుట్టి ఆచక్రం చుట్టూ తిరిగి మళ్ళీ ఆ వెలుగు దగ్గరకే చేరటానికి ప్రయత్నిస్తాయ్. కొందరు  మెల్లగా నడుస్తారు. మరికొందరు పరుగెత్తి పోతారు. అలా పరుగెత్తే వాళ్ళు యెందరి నో మానసికంగా జయించి పోవాలి. మానసికంగా జయించట మంటే వాళ్ళ మనసుల్లో గొప్పగా నిల్చి పోవాలి. అలాంటి వాడే అడ్డంకులు లేకుండా పోతుంటాడు. అదే తనధ్యేయం అనుకున్నాడు సూర్యం.
    ధ్యేయం నిర్ణయించుకున్నంత మాత్రాన అనుసరించటం అంత సులువు కాదు. ఏకాగ్రత కోసం ప్రాకులాడాడు. తనకు తానే గురువు కాలేక పోయాడు. వేదాంత గ్రంధాలు చదివాడు. అవి చెప్పిన వేదాంతులను గురువులుగా భావించటానికి ప్రయత్నించాడు. విశాల ను యిప్పుడు వూహించినట్లే వాళ్ళను వూహించుకుని వాళ్ళ మేధస్సులను అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. విశాల ఎదరగా పొందిన ఉత్తేజం ఆమెను తలచుకోగా రాదు. గురువు కోసం వెదుకుతూ దేవ ప్రయాగ వెళ్ళాడు. ఇంకా కొన్ని స్థలాలు వుత్తరాది ని చూసాడు. భూమి యింత అందంగా రూపొందించడానికి యెన్ని పరిణామాలు చెందిందో? అన్ని పరిణామాలు చెంది మనిషి యిప్పటి వాడయ్యాడు. ఆ పరిణామం చెందిన మనస్సుతో ప్రకృతి లోని ప్రతి పాటలోని రాగాలను వినగలుగు తున్నాడు. ప్రతి అందంలో ఆనందాన్ని పొంద గలుగు తున్నాడు.
    హిమాలయాలపై సూర్యోదయం, నీలి నీటి పై వుదయ కాంతులు , పచ్చని చెరియలపై వెన్నెల ఆ వెన్నెల రేడు సామంతుడనే వూహ రాగానే తనలో పొందే నిస్పృహ ఆధారపడటమనే తత్వం భూమిని బట్టే మనిషికి వచ్చింది. ఆ తత్వాన్ని తను వదలాలంటే తనో సూర్యుడు కావాలి? స్వయం ప్రకాశం రావాలి. ఆత్మ వెలగాలి. వెలిగించడానికి ఏం చెయ్యాలి?
    'సంకల్పం వల్ల పుట్టే కోర్కెలు యావత్తూ పూర్తిగా వదిలి పెట్టాలి.
    ఇంద్రియాలన్నిటినీ , అన్ని దిక్కుల నించీ మనస్సుతో మళ్ళించాలి.
    ధైర్యం చిక్క బట్టిన బుద్దితో మెల్లమెల్లగా శాంతి పొందాలి.
    ఆత్మలోనే మనస్సు కుదుట పర్చుకుని ఏ విచారమూ మనసు లోనికి రానివ్వకుండా వుండాలి. నిలకడ లేని మనసుకు ఆత్మ వశం చెయ్యాలి.'
    ఈ ధ్యాన యోగం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అది శంకరులు కూడా ఆత్మ గురించే చెప్పారు. 'ఆత్మ తప్పించి యింకెవ్వరూ యీ అజ్ఞానం, కామం, స్వలాభం తో చేసే కార్యాల బంధాల నుంచి విముక్తి చెయ్యగలరు?'
    ఆత్మ అంటే యేమిటి? అతనే నిర్వచించారు.
    'ఆత్మ మనసుకు అది చేసే కార్యాలకు సాక్షి. అది పరి పూర్ణమైన జ్ఞానం. మనిషి అజ్ఞానం వలన ఆత్మ పరం కాని యీ శరీరం, అహం, యింద్రియాలతో తన్ను పోల్చు కుంటాడు. ఆత్మ పై భక్తీ చూపించి తెలివైన వాడు యీ అజ్ఞానం నించి బయటకు పడ్డాడు.'
    ఆత్మ పై భక్తీ చూపించటానికి ఆ పరిపూర్ణ జ్ఞానం సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళు మూసుకుని కొద్ది నిముషాల పాటు తన్ను మరచి పోవటం నేర్చుకుంటున్నాడు. కాలానికీ మనసుకు సంబంధం . ఆత్మకు కాలంతో సంబంధం లేదు. మనసుకు సరిహద్దు లుంటాయి. ఆత్మా సరిహద్దు లెరగని ఆకాశం లాంటిది. కాలంతో సంకెళ్ళు వేసుకుని సరిహద్దు లలో నివశించే మనిషి ఆత్మ పరం కావాలంటే అంత సులువు కాదు. రెక్కలతో ఎగిరిపోయే పక్షి కూడా భూమి మీద యెప్పుడో ఒకసారి వాలకుండా ఉండలేదు. అంతరిక్ష నావలో ప్రయాణం చేసిన మనిషి భూమి మీదకు యెప్పుడు తిరిగి పడ్తానా అని కోరుకుంటారు. కారణం -- మన్నుతో ప్రాణుల కున్న సంబంధం. శరీరం మన్ను-- ఆత్మ ప్రాణం. ప్రతి ప్రాణి లో ఆత్మ లేకపోతె కదల్లేదు. ఈ ఆత్మ యీ రోజు పక్షిలో వుంటే ఆ పక్షి చావగానే యింకో మనిషిలో వుండవచ్చు. చావు లేని ఆత్మను అందుకో వాలన్న ప్రయత్నం లోనే మనిషి ముందుకు పరుగెత్తాడు. ఎప్పుడైతే అందుకో గలిగాడో అతనికి ఆకారం వుండదు. అతను ఆత్మ వెలుగులో ఐక్యమై పోతాడు.    
    ఆత్మ జ్ఞానం పై ఒక ఆవేశం తో కూడిన అభిలాష సూర్యం కు పట్టుకుంది. ఇది ఒక విద్య అనుకుంటే గురువు లేని విద్య లానే తనకు పట్టు బడింది. బాట తెలుసుకోలేని అడవి లో తను వెళ్తున్నట్లున్నాడు. ఒకోసారి ధ్యాన నిష్ఠ , యింకోసారి వైరాగ్యం, మరో సారి యోగా భ్యాసం -- ఒక త్రోవ కాదు. వేరు వేరు త్రోవల్లో పడ్తూ యే త్రోవనూ నమ్మే పరిస్థితిలో లేడు. కాని ,మనస్సు లో కోర్కెలు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నం జరుగుతోంది. అలా పెట్టుకునే అవసరం ఏమోచ్చిందన్న ప్రశ్నలు కూడా వుదయించక పోలేదు. అతను యింకా సంసారి కావాలా సన్యాసి కావాలా అన్న సందేహాన్ని తీర్చుకునే పరిస్థితిలో లేడు. అందరిలో తన ప్రతి బింబాలు చూడాలి గానీ తనలో అందరి ప్రతిబింబాలు యిముడ్చుకునే సహనం లేదు. ప్రేమ బాటపై పరుగెత్తే శక్తి అతనికింకా రాలేదు. ఆ శక్తి గలవాడే త్యాగానికి సిద్దం కాగలడు. పరిస్థితుల ముందు పలాయనత్వం సాగించే మనిషి దేవుని ముందు నిల్చొని 'నిన్నొకటి అడగటానికి వచ్చాను. నీలో కలిసిపోయే వరం యియ్యి' అని అడిగే ధైర్యాన్ని పొందలేడు. అందరినీ ఒకే దృష్టి తో చూచి ఒకే ఆత్మను చూడ గలిగే అభ్యాసం తన కింకా రాలేదు. ప్రాపంచిక సుఖాలు, వస్తువుల మీద నించి దృష్టి మరల్చే సాహసం తను అలవరచుకోలేదు. బ్రహ్మాండమైన తపస్సు చేసే స్థోమత నింకా పొందలేదు. అతనిలో సందేహాలకు కొదవ లేదు. అందుకే మనసులో యేకాగ్రత లేదు.
    ఈ యేకాగ్రత , స్థోమత వగైరా అన్నీ తనకు లేవన్న వూహ అతనినించి పోలేదు. తన లోటు పాట్లేవో తెలుసు కోగలిగే జ్ఞానం గల మనిషి ఆత్మ వేపు ప్రయాణం చేస్తుంటాడన్న నమ్మకం అతనికి కలిగింది. ఇంటికి యేలకలు పెట్టె కన్నాల్లా మనిషికి కోరికలు కన్నాలు వేస్తాయి. ఇవి వున్నాయని తెలుసుకుని ఆ కన్నాలను కప్పడానికి చేసే ప్రయత్నమే తనలో జరుగుతోంది. చివరకు అతనికొక గురువు యమున ఒడ్డున తారస పడ్డాడు. అతను ఒక్క మాటే చెప్పాడు. 'దేవుని ప్రతినిధి ఆత్మ. దేవుడు సృష్టి స్థితి లయకారకుడు. అతనేవడో స్వంతంగా తెలుసుకోవటం తో ప్రతి వ్యక్తీ చరితార్దుడవుతాడు.'
    ఈ స్వంతంగా తెలుసుకోవటానికి యేనేన్నో త్రోవలను యెందరో వేదాంతులు వెతికారు. ఆత్మకు ఆ వెలుగు రాటానికి కారణం దానికి వుండే యేకాగ్రత. మనసుకు యేకాగ్రత వలన వెలుగు వస్తుంది. కట్టు బాట్లకు లోనైన మనసే బ్రేకులున్న సైకిలు లాంటిది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS