మన్నుతిన్న మనిషి
----బలివాడ కాంతారావు

రేగింది జగడం. మొదట పుత్తిపొగలా కనిపించి రాను రాను మంటల్లా పైకెగసిపోయింది. ప్రొద్దు పడమటకు వాలు తున్నప్పుడు రేగినది- పొద్దు క్రుంగడానికి వస్తున్నా చల్లబడలేదు.
జగడమెట్లా వచ్చిందంటే గాడిద నుంచి! జీవితం దేశాటనం చేస్తూ దెప్పల మీద. దిబ్బలమీద గడిపే యీ మందళి వాళ్ళ గుంపుకు గాడిద ఒక లెజెండ్ లారీ లాంటిది. ఉన్న ఒక్క లారీ అప్పుక్రింద యిచ్చే మంటే వుప్పాల రాముడు ఒప్పుకుంటాడా?
పెండ్ర పొట్టయ్య మంచి సమయంచూసే జగడం రేపాడు. కులపెద్ద ఆసనాల వీరన్న లేని సమయం చూసే నవ్వుతూనే నల్లికాటు వేశాడు. తరవాత ఆ నరుడు సుద్ధంబద్ధం లేకుండా మాటాడాడు.
"ఒరే రాంగా! దీపావళిమాసకి యిత్తానన్నావు. వారాలు పోయి యేడాధైంది? ఇచ్చేయెవ్వారమా ఎగ్గొట్టే బాపతా!"
"పొట్టయ్యా- ఏ మూర్తాన యిచ్చావో? పెళ్ళాడాను. పెళ్ళాం వచ్చిందిగానీ ... ఒళ్ళు బాగులేదు కదరా - నీ అసలు సిసలు చేసేనూ ....ఏనాటికైనా వడ్డీతో యిచ్చుకుంటానులే..."
"జబ్బుతో వున్నావు. ఈ మధ్డిన నివ్వు వస్తే నాగతి..."
"నా పెళ్ళం ముండ మొయ్యాలని సూస్తున్నా వురా?"
"అంత పౌరుషం వున్నోడి వైతే నా డబ్బు కక్కు.....లేకపోతే...నీ గాడిద దరకట్టు..."
"దాన్ని ఒదలను..."
"ఓహోహో....అయితే డబ్బు తీసుకున్నాడు పెట్టిన ఖరారు పెకారం పెళ్ళాన్ని ఒదులు."
ఉప్పాలరాముడికి చిన్న గోచి తప్పించి ఒంటి మీద బట్టలేదు. నులక మంచం మీద దీనంగా కూర్చున్నవాడొక్క సారి యెగిరిపడ్డాడు.
"ఎదవ - ఎర్రెర్రిగా వాగావంటే వైకుంఠం సూపిస్తాను."
"ఎందుకొచ్చిన కోపంరా అది? ఆకలికోపం. ఇప్పుడు నాకు బెమ్మదేముడు చెప్పినా కనికరించను. ఆ రాజ్యంలో పెళ్ళం రాదని కాళ్ళలపడి బతిమాలావు. ఈ రాజ్యాన కొట్టొస్తావురా? వంచురా యీ జబ్బ. చాతకాని మొగోడు, శౌర్యమెక్కువ - ఛీ."
"ఛీ...." ఆ ఛీ ఛీ లు తిట్లుగా మారాయి. తిట్లు తగ్గి తన్నులాట వరకు వచ్చింది. నలుగురూ అడ్డు కున్నారు. రెండు ప్రక్కలా మాటాడే వారున్నారు. మగాళ్ళే కాదు ఆడవాళ్ళు రంగంలో దూకారు.
"అనుకున్న మాటకాకపోతే యెవ్వరికి పౌరుషం రాదు."
"అంత పౌరుషం అయినోడైతే ఆలిని అనుకున్నట్టు అప్పచెప్పకూడదా?"
"జబ్బు - ఆడికేం జబ్బు? అప్పు ఎగెయ్య డానికి యీ యేషం యేస్తున్నాడు.."
"కట్టుకున్న దాన్ని యెలాగ ఒదుల్తాడు?"
"ఆఁ...అది ఆచారపు అచ్చమ్మేంటి? ఈడ్ని కట్టుకుని యేం సుఖపడ్తున్నాది? ఆ పొట్టిగాడికి ఏంలేదు? ఒకదాని దగ్గర యింకోదాన్ని భరించ లేడా?"
అంకమ్మ పొట్టయ్య అక్క. నాలుగు గాలి వానలు చూసి నాలుగు మణుములు తెంపుకుంది. ఒకసారి ఒక మొగుడిని కర్రెట్టి కొట్టి రక్తం చిమ్మించింది. దానికి తొమ్మిది పుంజీలు ఖర్చు పెట్టి తప్పోప్పుకుంది. తండ్రి వున్నప్పుడు పెళ్ళి కట్నం పదహార్రూపాయలూ యిచ్చాడు. తమ్ముడి చేత నాల్గో పెళ్ళికి అంతే కట్నం యిప్పించింది. వయసు మళ్ళినా సంతానం లేదు. ఒళ్ళు చేసి దిమ్మిన దుక్కలా వుంది.
"ఏమే కోటమ్మా! సత్తికాలపు సిన్నదానా ? పాకలో శివాలేసు క్కూర్చొంటేయెలాగ? దేముడు నిన్ను దేవతలాగ సెక్కి పేణం పోసినాడు. ఈ దిక్కు మాలినోడికి కట్టేసాడు. రాంగాడికీ నీకూ పడలేదని కులపెద్ద ఆసనాల యీరన్న యెదట సెప్పు యిడాకులు తెగిపోతాది." మరీ దగ్గరగా జరిగి-
"మా తమ్ముడు దేవరలాంటోడు. ఆడు చిత్తగించాడంటే ఛీ...యీ పాడు యెండి తీగేల- నీ మెడలో బంగారు తీగ-పుస్తెల దండ. బంగారు కాసులు, పూసల దండలు....ఎంతైనా హంగు చేస్తావ్. ఎంచక్కావుంటావ్? ఈ భోగం వదులు కోక"
కోటమ్మ సొంతంగా వింది. ఆ చిరిగిన చీరతో వంచిన మోముతో ఒక్కసారి కదిలింది. ఏడుపులో కూడ ఆమె అపురూపంగా కనపడింది. ఆమె ఆకాశమంత ధాన్యరాసిలా వుంది. లేచి అడుగు వేస్తుంటే అలలు కదలుతున్నట్లున్నాయ్. అమృతం త్రోవంట వొలికిస్తోంది. ఉప్పాలరాముడు కాకిలావుంటే కోటమ్మ దొండ పండులా వుంది.
వదలని అంకమ్మ కేసి ఒకసారి ఆగిచూసింది. అంకమ్మ ధాటిగా "ఆ మురిగి రోగంతో చస్తున్నోడి దగ్గరకు యెల్లమోకు?"
గాడిదలు అరుస్తున్నయ్, పందుల మూకలు పాకలవేపు పరుగులెడుతున్నయ్. మొగుడి వేపు వెళ్తున్న కోటమ్మ చేరిని భల్లూకపుపట్టులా పట్టుకుని అంకమ్మ కదలనివ్వక పోవటంతో ఆమె విదలించుకోడానికి ప్రయత్నిస్తోంది. లాభంలేక పోవడంతో ఆమె చప్పున కేకలేసింది. అటుప్రక్క కొట్లాడు కుంటున్న వాళ్ళిటు ప్రక్క తిరిగారు. పెద్ద సంచలనం బయలు దేరింది.
పొద్దే గంట్ల దీపాలు పెట్టేసారు. ఆ గలాభాలో ఎవరే మంటున్నారో వినపడలేదు. కొందరు మెల్లగా జారి తిండిదగ్గర కూర్చున్నారు. ఒక్క సారి నక్కలు అరవగానే అపశకునమని తిండి దగ్గర కూర్చున్నవాళ్ళు లేచిపోయారు. దెబ్బలాడు కుంటున్న వాళ్ళు ఆగారు, ఆ సమయంలోనే ఆ నక్కలు అమంగళ వాక్యాలు మ్రోగిస్తున్న ప్పుడే ఆసనాల వీరన్న ఎదిగిన ఒకే కొడుకుతో ఆ గుంపులో పాదంమోపాడు. పాదం మోపుతూ నక్కల అరుపులు విని పాదం వెనుకకు వేసాడు కొడుకు యివి లెక్క చెయ్యకండా ముందుకు నడిచి పోతున్నాడు.
ఆసనాల వీరన్న యీ గుంపు కులపెద్ద. ఈ గుంపు సఖ్యంగా వుంటే ఒక కుటుంబంలా వుంచటం తన విధి. ఈ విధి నిర్వర్తించడానికి కులాచారం. ఆంక్షలు, కట్టుబాట్లు గరపి గుంపు నిత్యం సజీవంగా. ధర్మబద్ధంగా వుంచటం తన ధర్మంగా పెట్టుకున్నాడు. వీరన్నకు ఓకే ఒక కొడుకు. వాడు పదేళ్ళ వరకూ తన దగ్గరే పెరిగాడు, అసలు వాడు ఒక చెట్టుక్రింద పుట్టాడు. భార్య యింకా పురుడు రాదని ఊర్లోకి వెళ్ళి సోది చెప్పి తిరుగ వూరికి దూరాన వున్న పాక వేపు వస్తుంటే త్రోవలో ఈ బాలు పుట్టాడు. చెట్టు క్రింద పుట్టాడు కాబట్టి 'చెట్టు రాజు' అని పేరు పెట్టాడు. ఆఖరికి ఆ పేరు 'చిట్టిరాజు'గా మారింది. ఈ గుంపుకు వీరన్న రాజైతే, వీడు నిజంగా చిట్టిరాజే! వీరన్న తర్వాత యీ గుంపుకు కులపెద్ద వాడే? పదేళ్ళ వరకూ కొడుకును తన వెంటే దేశాటనం చేయించాడు. తను నీతి, నియమాలు, న్యాయాలు, ధర్మాలు చెప్పడానికి యింకా చిన్న వయస్సు 'తమవన్నీ పాతవి. లోకంలో యెన్నో కొత్త మార్గాలు, నీతులు, గేనం వచ్చింది. పాతతో పాటు కొత్త కూడా కొడుక్కి తెలిస్తే, కొత్తా పాతాకలిపి సరికొత్త నాయం. నీతీ వస్తుందనుకున్నాడు. అందుకే మొదట యిష్టంలేకపోయినా, పెళ్ళం, బావమరిది బలవంతంమీద కొడుకును పదోయేట వాడి మేనమామ యింట్లో వదిలేశాడు- చిట్టిరాజు మేనమామ ఉరట్ల వెంకడు వురఫ్ వెంకటాద్రి యింతో అంతో చదువుకున్నాడు. తెలుగులో సంతకం బాగా పెట్తాడు. ఉపన్యాసాలు యివ్వగలడు కానీ వాటి అవసరం లేదు. వాడూ ఒకప్పుడు కులపెద్దే గానీ యీ తిరిగే వ్యవహారం వాడికేం నచ్చలేదు. "ఉండటానికి చోటులేకపోతే కదా తిరిగి నవ్వాల." తిరుగులతో విసిగిపోయాడు. దీపం వుండగా చక్కబెట్టుకోవాలని తోచింది. ఇలాగా అలాగా డబ్బుచేసు కున్నాడు. కుల తప్పులు తను పనుగురికి పంచె బదులు తన పేఢ చెక్కా ముక్కా చేసుకున్నాడు. చేతిలో వ్రేలికి ఉంగరాలు తగిలించాడు. చెవిలో కాడలు తీసి. చేతిలో కడియంతీసి చేతికి వాచీ గొలుసు. మెడలో గొలుసు చెయ్యించాడు. ఇల్లు కట్టాడు. ఇల్లాలి వేషం మార్చేశాడు. అక్కడే స్థిరపడి పోయాడు. గుంపు చెదరిపోయింది గానీ వెంకటాద్రి చెదరిపోలేదు. పిండికి తగ్గ పిడచ చేసుకుని పెదిమల మీద అభిమానం చూపించి పెద్దవాడనిపించుకున్నాడు వూర్లో.
అలాంటి వానిదగ్గర తరిఫీధై వచ్చాడు చిట్టి రాజు. వెళ్ళినప్పుడు మీసాల్లేవు. వచ్చినప్పుడున్నయ్. కూత ఘనంగా వుంది. వేషానికి చోటులేదు. ఒక నాటి పిందె కాయయ్యింది. ఇక తనలా పండుకాక మానుతుందా అనుకున్నాడు వీరన్న. గుంపులో ధర్మం పాలులాంటిది. మనుషులు పిల్లుల్లాంటి వాళ్ళే. తనలాంటి పెద్ద, పిల్లి కాకుండా పాలులాంటి ధర్మాన్ని యీ పిల్లుల్లాంటి మనుషులముందు పెట్టాలి. పాలు వద్దన్న పిల్లులంటూ? తన కొడుకూ మనిషయ్యాడు. పిల్లికాదు. తనకు తగిన వారసుడౌతాడు. కులానికి బలం చేకూరుస్తాడని కొడుకు అండగా వుంటాడని ఆశతో శాశ్వతంగా తీసుక వచ్చాడు.
వీరన్న వచ్చాడని తెలియగానే గుంపంతా గుమి గూడి పోయింది. అంకమ్మ కుయ్యో, మొర్రోమని యేడుస్తూ తన తమ్ముడికి జరిగిన పరాభవం చెప్పుకొచ్చింది.
"జాతికి మనం మందలోలం. మనకు మానిందే మందు. బతికించే వూరు. ఈ నాడు యిక్కడ-రేపెక్కడో? ఈ ఏడాదిలోనే శికాకుళం యేపు. పార్వతిపురం యేపు. బొబ్బిలి, సాలూరు, సవరదేశాలు తిరిగాం. మాటంటే మాట. నీతంటే నీతి - గేనం వొచ్చిన చిట్టిరాజు నీ యెంట తెచ్చినావు. ఇప్పుడు పంచాయతీ పెట్టించు. తప్పెవరిదో తేల్చు..."
"తేల్చు..." అంటూ అరచాడు రాముడు.
రాముడు ప్రక్కనే నిల్చుంది కోటమ్మ. దిగులుతో శ్రావణ మేఘంలా వున్నా, చుట్టూ తేటైన వెలుగు ప్రకాశిస్తోంది. ఆమె మీద చిట్టిరాజు కళ్ళు పడ్డాయ్. రెప్పలు కూడ కాస్సేపు ఆడలేదు. అప్పటి కప్పుడే పంచాయతీ కూర్చున్నారు. రెండువేపుల వాదనలు విన్నారు. కొడుకుకూడా వున్నాడు, అవనాల వీరన్న చివరకు అన్నాడు:
"నిజమేనర్రా! ఆడు అవసరానికి డబ్బు వాడాడు. అనుకున్న పెకారం యివ్వలేక పోయాడు. ఆడికున్న ఆస్తి అంతా ఆ పెళ్ళం, ఆ గాడిద, ఆ రెండింటిలో అప్పుక్రింద యేదో ఒకటి ఒదిలే మంటున్నారు. మీ అందరికీ ఆ రెండూ మాదిలా కనిపిస్తున్నాయ్. రాముడికి ఆ రెండూ రెండు కళ్ళు - ఏ కన్ను వూడపీకేసినా వాడు బ్రతకడు. పొట్టయ్యకు డబ్బు అవసరం యిప్పుడు లేదు. పంతానికి అడుగుతున్నాడు. మనం మనుషులం కానీ రాబందులం కాము. రాబందులు బతికిన మనుషులజోలికి పోవు. మనుషులమే యెదుటోడి కష్టసుఖాలు సూడకుండా ఆలు సెవాలనుకుని బతికున్న మనుషుల్నే రాబందుల్లా పీకేస్తే యెలాగర్రా? దేనికైనా కాసింత ముందుయెనకా వుంటాది? లోకంలో మంచి చెడ్డావున్నాది. చెడ్డతో మంచి తెస్తామంటే ఆపుతావా? కొట్లాడుకుని మంచి తెస్తారా? అప్పు వసూలు చేసుకుంటారా? ఆడు వడ్డీ యిత్తానంటున్నాడు. ఆగటం మంచిది."
