ఆ కొశ్చెన్ ఆన్సర్ చేయడానికి నానా తంటాలు పడ్డాడతను. అయినాగానీ చివరకు ఆ మిషన్ పెద్దగా సైరన్ మోగించింది.
"చూశావా! నువ్ చెప్పేది అబద్దం అంటోంది మిషన్-"
"అలాగా మేడమ్- అయితే ఒకపని చేయండి మేడమ్-"
"ఏమిటది?"
"నీళ్ళు ఒక్క చుక్క కూడా లేని పాలు- ఆ మిషన్ నే పోయమనండి- రేపట్నుంచీ నేను పాలు బంద్ చేస్తున్నా-"
లేడీస్ అంతా షాకయిపోయారు.
వాడి ధైర్యానికి మా మగాళ్ళందరికీ తప్పట్లు కొట్టాలనిపించింది గానీ- మళ్ళీ అది ఏం గొడవకు దారితీస్తుందో అని సైలెంట్ అయిపోయాం.
కొద్ధిసేపు వాదోపవాదనలు తర్వాత పాలతనూ, లేడీసూ ఒకరాజీకొచ్చారు.
ఇకనుంచీ అతను నీళ్ళు కలపకూడదు. వాళ్ళు అతనిని లై డిటెక్టర్ టెస్ట్ లు చేయరు. నీళ్ళు కలిపావా? అని అడగరు.
ఆ పాలతను ఎంత పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశాడో ఏమోగానీ- ఆ మర్నాటి నుంచీ మా అపార్ట్ మెంట్స్ కి రెగ్యులర్ గా వచ్చే కూరగాయల బండివాడూ, పళ్ళు అమ్మే బండివాడూ రావటం మానేశారు.
దాంతో రోజూ మార్కెట్ కెళ్ళి కూరగాయలూ, పళ్ళూ కొని తెచ్చేడ్యూటీ మామీద పడింది.
ఒకరోజు మేము మార్కెట్ కెళ్తూంటే మా అపార్ట్ మెంట్స్ కి రావటం మానేసిన కూరగయల బండివాడు రోడ్ పక్కన బండితో కనిపించాడు.
"ఏమిటి శంకరయ్యా! మా అపార్ట్ మెంట్స్ కి రావటం మానేశావ్?" అడిగాడు విజయ్ యాదవ్.
"మీ లేడీస్ అదేదో మిషన్ కొన్నారంట కద్సార్- దాంతో మా తూకాలు, మా రేట్లూ అన్నీ చెకింగ్ చేస్తారంట! మాకెందుకు సార్ ఈ కిరికిరంతా! ఇక్కడే హాపీగా అమ్ముకుంటా" అన్నాడతను.
ఆ వార్తా తీసుకెళ్ళి షైనీకి చెప్పాం!
అప్పటికయినా ఆమె రూటు మార్చుకుంటుందేమో అని! కానీ ఆమె చాలా నిర్లక్ష్యంగా నవ్వింది.
"ఎవడు రానీ- రాకపోనీ- ఎవడికిష్టం ఉండనీ-ఉండకపోనీ- లై డిటెక్టర్ ఇక్కడే ఉండి తీర్తుంది-" అంది కర్కశంగా.
ఇలా రెండ్రోజులు గడిచేసరికి మూడో రోజు ఇంకో ఉపద్రవం ముంచుకొచ్చింది.
ఆ రాత్రి అందరూ న్యూస్ ఛానెల్స్ చూస్తూండగా- సడెన్ గా ఒక "బ్రేకింగ్ న్యూస్" స్క్రీన్ మీద ఫ్లాష్ అవటం మొదలుపెట్టింది.
సహజంగానే అందరూ ఎలర్ట్ అయి ఆ న్యూస్ చూశారు. న్యూస్ రీడర్, యాంకర్ మామూలుగానే రెచ్చిపోయి ఆ వార్తను జనం మీదకు వదులుతున్నారు.
"ఇప్పుడే అందిన వార్త! - మేడ్చల్ కి సమీపంలోని ఒక రిసార్ట్స్ చెందిన క్లబ్ హౌస్ లో బొంబాయి నుంచి రప్పించిన యువతులతో - సెక్స్ డాన్స్ ల పేరుతో యథేచ్చగా, విచ్చలవిడిగా, విశ్రుంఖలంగా, జరుగుతోన్న సెక్స్ రాకెట్ విషయం తెలుసుకున్న పోలీసులు, తుగ్లక్ టివి జర్నలిస్ట్ రాజుతో కలసి ఆ రిసార్ట్స్ మీద రైడ్ చేశారు. ఆ యువతుల డాన్స్ లు చూడ్డానికి వచ్చిన విటులు అందరూ హైదరాబాద్ వాసులే! ఒక్కొక్క విటునికీ పదివేల రూపాయలు ఛార్జీ వసూలు చేసిన నిర్వాహకులు- పోలీసులను చూడగానే అక్కడినుంచి జారుకున్నారు. అయితే ఆ విటులు, ఆ యువతులూ మాత్రం పోలీసులకు దొరికిపోయారు."
అంటూ వివరిస్తుండగానే కెమెరా ఆ యువతుల మొఖాలనూ (అందరూ మొఖానికి చీరకొంగులూ, దుపట్టాలు అడ్డం పెట్టుకున్నారు)
ఆ విటుల మొఖాలనూ (అందరూ కర్చీఫ్ లూ, టవల్సూ మొఖానికి అడ్డం పెట్టుకున్నారు) పదేపదే చూపించటం మొదలుపెట్టింది.)
వెంటనే న్యూస్ రీడర్ రాజుని తగులుకుంది.
"రాజూ! ఈ సెక్స్ రాకెట్ ఎంతకాలం నుంచి నడుస్తోంది? ఈ విషయం ఇంతకాలం పోలీసులకు ఎందుకు తెలీలేదు? 'నృత్యం' పేరుతో ఈ వ్యభిచారం నిర్వహిస్తోన్న నిర్వాహకులెవరు?"
"వెంగమాంబా! ఈ రాకెట్ చాలాకాలం నుంచీ నడుస్తోన్నట్లు తెలుస్తోంది! ఈ రిసార్ట్స్ కి చాలామంది ధనికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది రాజకీయనాయకులు కూడా వస్తోన్నట్లు తెలుస్తోంది.
వెంగమాంబా- అయితే దీని నిర్వాహకులు ఎవరు అనేది తెలీటం లేదు వెంగమాంబా! ఎందుకంటే దీని ఓనర్స్ ఒకరయితే ఇంకొకరు లీజుకు తీసుకున్నారు- ఆ లీజుకి తీసుకున్న వ్యక్తులు మరో గ్రూప్ కి సబ్ లీజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఇన్ వెస్టిగేట్ చేస్తున్నారు వెంగమాంబా!"
"మరి బొంబాయి నుంచి వచ్చిన యువతులెవరు? వారు ఎందుకని- అంటే ఏ కారణం చేత ఇలాంటి అసాంఘిక, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? వారికి నిర్వాహకులు ఎంత డబ్బు ముట్టజెబుతున్నారు- రాజూ?"
"వెంగమాంబా! ఆ యువతులు కొంతమందితో మేము మాట్లాడటం జరిగింది. వారి అడ్రస్ లు, సెల్ ఫోన్ నెంబర్స్ కూడా మన ఛానెల్ లో స్క్రోల్ చేయడానికి పంపించాము. వాళ్ళు చెప్పేది వాళ్ళ మాటల్లోనే-
"మీరెక్కడినుంచి వచ్చారు?"
"బొంబాయి నుంచి!"
"ఎందుకొచ్చారిక్కడికి?"
"ఎందుకేముంది? డాన్స్ ర్స్ మేము. ఎవరు డాన్స్ ప్రోగ్రాం కి పిలుస్తే అక్కడికెళ్తాం-"
"కానీ మీరు అర్ధనగ్నంగా అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కదా!"
"డబ్బు ఎక్కువిచ్చి నగ్నంగా కూడా డాన్స్ చేయమని ప్రేక్షకులు కోరుతున్నారు. అందుకని వారు చెప్పినట్లు చేయక తప్పటం లేదు-"
"డాన్స్ ప్రోగ్రాం తర్వాత మీరు విటులతో సెక్స్ లో పాల్గొంటున్నారని అంటున్నారు-"
"డబ్బు పెరిగిన కొద్దీ- ఏం అడిగితే అది చేయటం మా ధర్మం-"
"కానీ మీరు గౌరవంగా బ్రతక్కుండా ఇలాంటి వృత్తి ఎందుకు ఎంచుకున్నారు?
"ఎందుకేముంది? మా ఇంట్లో ఖరీదయినా జబ్బుతో బాధపడే తల్లీ పక్షవాతం వచ్చిన తండ్రీ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళను పోషించటం కోసం, చదివించటం కోసం-"
"కానీ అందుకు ఏదొక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవచ్చు కదా?"
"మీ చానెలోళ్ళకి ఏమయినామెంటలా? మాకెవరు ఉద్యోగమిచ్చినా చివరకు మాతో యాజమాన్యం చేయించేదిదేగా? రోజూ బ్రేకింగ్ న్యూస్ అంటూ మీ చానెలోళ్ళు వేసేది అలాంటి వార్తలేగా? నర్సింగ్ స్కూల్ కెళ్తే- దాని ఒనరూ, వాడి కొడుకులూ మమ్మల్ని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతారు వేరే ప్రైవేట్ ఉద్యోగాలూ, గవర్నమెంట్ ఉద్యోగాలూ అన్ని చోట్లా మమ్మల్ని ఆ రకంగా వాడుకునేవారే కదా! ఆ కీచకులందరినీ టి.వీలో చూబిస్తూండి కూడా ఇంకా ఇలాంటి చెత్త ప్రశ్నలేయడానికి మీకు సిగ్గుండక్కర్లేదూ? అదీ గాక మాలో చదువురాని వాళ్ళుంటారు- వాళ్ళకెవరిస్తారు ఉద్యోగం?"
"వాళ్ళు ధనవంతుల ఇళ్ళల్లో మెయిడ్ సర్వెంట్స్ గా పని చేయవచ్చు కదా! మెయిడ్ సర్వెంట్స్ కి బంజారాహిల్స్ లో, జూబ్లీహిల్స్ లో ధనవంతుల ఇళ్ళల్లో చాలా డిమాండ్ ఉందికదా"
"షైనీ ఆహుజా అనే అతను తనింట్లో సర్వెంట్ మెయిడ్ ని రేప్ చేసిన విషయం మీ చానెల్లో టెలికాస్ట్ చేసికూడా ఇంకా ఈ ప్రశ్నలేంటి? నీకు తెలీదేమో? దేశమంతా షైనీ అహుజాలతో నిండిపోయి ఉంది. ఆఖరికి పోలీసులు కూడా మాలాంటి వాళ్ళను బెదిరించి, మమ్మల్ని నగ్నంగా సెల్ ఫోన్లో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి సంవత్సరాల తరబడి రేప్ చేస్తున్నారని మొన్నేగా విజయవాడలో గొడవయింది? అందాక ఎందుకు? మీ టి.వి. ఛానెల్ జర్నలిస్ట్ లు కూడా ఎంతమంది మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవటం లేదు?"
