ఇప్పుడు రైడ్ చేయడానికి వచ్చిన పోలీసులే మమ్మల్ని బుక్ చేసుకుని వాళ్ళ అధికారుల దగ్గరకు పంపిన విషయం మీ ఛానెల్ వాళ్ళకు తెలీదా?-"
ఆ మాట పూర్తి అవకుండానే కెమెరా కట్ చేసేశాడు రాజు కంగారుగా!
"ఏదేమయినా ప్రభుత్వమే ఈ యువతుల ఉపాధి కోసం ఏదయినా స్కీమ్ ని పెట్టి ఆదుకోవాల్సిన వీళ్ళు కోరుతున్నారు వెంగమాంబా...."
సడన్ గా మా అపార్ట్ మెంట్ లో ఆ దృశ్యాలు చూస్తున్న వాళ్ళందరిలోనూ కలవరం మొదలయింది.
అందుక్కారణం- ఆ విటుల్లో మా అపార్ట్ మెంట్స్ కి చెందిన శాస్త్రి కనిపించాడు. శాస్త్రి మా అపార్ట్ మెంట్స్ లో 'సి' బ్లాక్ లో ఉంటాడు. ఆయన మా అపార్ట్ మెంట్స్ లో ఏ పూజలు జరిగినా తనే స్వయంగా నిర్వహిస్తూంటాడు. వారానికొకసారి భక్తులందరినీ పోగుచేసి భగవద్గీత పారాయణం చేస్తూంటాడు. రోజూ తెల్లారుజామునా, రాత్రీ ఆయన చేసే భగవన్నామస్మరణ రెండుమూడు బ్లాకులు వరకూ వినబడుతూనే ఉంటుంది.
"అవును! మన శాస్త్రే- అనుమానం లేదు- చేతివాచ్ శాస్త్రి పెట్టుకునేదే!" అన్నాడు విజయ్ యాదవ్.
"అతని ఫింగర్ కున్న 'అంగూటీ భీ- శాస్త్రి దే" అన్నాడు హమీద్ మియా.
అయితే ఆ కాండేట్ మొఖం మెకెరాకు కనిపించకుండా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా శాస్త్రే అని చెప్పటం కష్టంగా ఉంది.
అప్పటికే అపార్ట్ మెంట్స్ లో లేడీస్ అంతా గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు.
"మనకు భగవద్గీత బోధించే శాస్త్రి సెక్స్ డాన్సర్స్ ని బుక్ చేసుకోడానికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయాడంట- టి.వి.లో చూపిస్తున్నారు" అంది మంజులత షైనీతో.
లేడీస్ అంతా శాస్త్రి ఇంటికెళ్ళేసరికి వాళ్ళావిడ ఏడుస్తోంది.
"ఏం జరిగింది?" అడిగింది షైనీ.
"చూడండి! అందరూ ఫోన్లు చేసి "మీ హజ్ బెండ్ ని బ్రోతల్స్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. టి.వి. ఆన్ చేయండి. మీ ఆయన కనిపిస్తాడు. మొఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటే మాత్రం మేము గుర్తుపట్టలేమా ఏమిటి?" అంటూ నానా హేళనా చేస్తున్నారు" అందామె.
"ఇంతకూ టి.వి.లో కనబడుతోంది మీ ఆయనేనా"
"ఆయన లాగానే ఉన్నాడు. ఆ షర్టూ, పాంటూ అచ్చం ఆయనకున్న లాంటివే- ఆ వాచీ ఉంగరం కూడా ఆయనని లాగానే ఉన్నయ్- కానీ ఆయనలాంటివారు కాదు! మహాభక్తులు-"షైనీ నవ్వింది.
"భారతనారి అన్నాక భర్తమీద ఆమాత్రం నమ్మకం ఉండాల్సిందే కానీ అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి! మొన్నేగా పేపర్లో చదివాం- ఒక పూజారి గుడికొచ్చిన భక్తురాలి మీద అత్యాచారం చేయబోయాడని"
"ఏమో- నాకు మత్రం ఆయనలాంటి పని చేయరనే అనిపిస్తోంది"
"అయితే ఒక పనిచేయండి- ఇప్పుడు శాస్త్రి గారెక్కడున్నారు"
"ఒక చోట మహాపూజ ఉందని సాయంత్రమనగా వెళ్ళారు-"
"అయితే ఇంక అనుమానమెందుకు ఈ పూజకే వెళ్ళి ఉంటారు" అంది మంజులత.
అందరూ ఘొల్లుమనినవ్వారు.
"పోనీ ఓ పని చైరాదూ? మీ హజ్ బెండ్ సెల్ కి ఫోన్ చెయ్- ఏ పూజలో ఉన్నారో తెలిసి పోతుంది కదా-"
ఆ అయిడియా ఆమెకి నచ్చింది. వెంటనే లాండ్ లైన్ నుంచి శాస్త్రిగారి సెల్ కి ఫోన్ కొట్టింది.
"మీరు డయల్ చేసిన సెల్ నెంబరు ప్రస్తుతం ఆఫ్ చేయబడి వుంది" అందా టేప్ డ్ వాయిస్.
"ఆయన పూజలో ఉంటే సెల్ ఆఫ్ పెడతారు" చెప్పిందామె ఇంకా చావని ఆశతో.
"అమ్మా! టి.విలో మళ్ళీ నాన్నని చూపిస్తున్నారే!" అంటో పరుగుతో వచ్చాడు శాస్త్రి కొడుకు.
"ఇదిగో చూడండి మీనాక్షిగారూ! మీరు ఆ భ్రమలో నుంచి బయటకు రండి! మీ ఆరేళ్ళ అబ్బాయి కూడా తేలిగ్గా తండ్రిని గుర్తుపట్టాడు- కానీ పదేళ్ళు కాపురం చేసిన మీరు మాత్రం మొఖానికి కర్చీఫ్ అడ్డం ఉండేసరికి ఆయన కాదంటున్నారు- కొంచెం అసహ్యంగా లేదూ?" అంది షైనీ- అక్కడితో అందరూ డిస్పర్స్ అయిపోయారు.
రాత్రి రెండింటికి శాస్త్రి ఇంటికి తిరిగివచ్చాడు.
ఆ రాత్రి తెల్లార్లూ శాస్త్రి అతని భార్య గొడవపడటం చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళంతా నిద్రపోకుండా వినాల్సివచ్చింది.
తెల్లారేసరికి లేడీస్ అంతా సెల్లార్ లో గుమిగూడటం, షైనీ లు డిటెక్టర్ ని తీసుకురావటం జరిగిపోయింది.
శాస్త్రిని వాళ్ళావిడ తీసుకొచ్చి మధ్యలో నుంచోపెట్టింది.
రాత్రికి రాత్రే శాస్త్రి టివి చానెల్స్ పుణ్యమా అని హీరో అయిపోవడంతో అపార్ట్ మెంట్స్ లోని జనమంతా కిక్కిరిసిపోయారు- కాసేపట్లోనే!
ఇంకాసేపట్లో తనని ఉరి తీస్తున్నలెవల్లో కనబడుతున్నాడు శాస్త్రి.
"నేను బొల్లారంలో ఒకళ్లింట్లో పూజలు చేయడానికెళ్తే- నేను సెక్స్ డాన్స్ లు చూడ్డానికి వెళ్ళానని ఈ అపవాదులేమిటో, నావాచీ, నా ఉంగరం, నా బట్టల్నీ పోలి ఇంకొకడివి ఉండటం ఏమిటో, ఈ అపార్ట్ మెంట్స్ లోని వాళ్ళందరితోపాటు నా భార్యకూడా నన్ననుమా నించటం ఏమిటో - అక్కడితో ఆగక ఈ లేడీస్ అంతా కలసి నాకీ లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిందేనని తీర్మానించటాలేమిటో- ఈ సీన్ చూడ్డానికి జనం ఇలా విరగబడి పోవటం ఏమిటో - అంతా అయోమయంగా ఉంది- వచ్చివచ్చి-నాలాంటి భక్తుడికే ఈ పరీక్షలు రావాలా? హమీద్ గారూ- మీరయినా కలుగజేసుకోకపోతే ఎలాగండీ?" అంటూ ప్రాధేయపడ్డాడు శాస్త్రి.
"ఇప్పుడు నేను ఏమో చెయ్యలేవ్! శాస్త్రీ!' అన్నాడు హమీద్ మియా విచారంగా.
"అన్యాయంగా నా మీద అపవాదులేస్తున్నారు! నేనెంత గొప్పభక్తుడినో మీ అందరికీ తెలుసు-"
"ఆ మాట నిజమే-" వప్పుకున్నాడు విజయ్ యాదవ్. "నాకూ మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరలాంటిపనులు చేయరని-"
సరిగ్గా అప్పుడే ఓ యువకుడు వచ్చి శాస్త్రి చెవిలో గుసగుసలాడాడు.
"శాస్త్రిగారూ! ఆ రిసార్ట్స్ అడ్రస్ చెప్తారా ఓసారి? మా ఫ్రెండ్సందరూ అక్కడ పార్టీ చేసుకుందామని అడుగుతున్నాడు-"
ఠక్కున అడ్రస్ చెప్పబోయీ "శివశివా శివశివా!" అంటూ చెవులు మూసుకున్నాడాయన.
ఈలోగా షైనీ హడావుడిగా ఆయన దగ్గరకొచ్చింది.
"శాస్త్రిగారూ! మీరంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికయినా మించిపోయింది లేదు. ఆ రిసార్ట్స్ లో కనిపించింది మీరేనని మీ మిసెస్ దగ్గర వప్పుకుంటే- ఇంతమందిలో పరువుపోకుండా ఉంటుంది-" అంది చాయిసిస్తూ.
"అంతా ఆ భగవంతుడికి తెలుసమ్మా" ఎటూ తేల్చకుండా అన్నాడు శాస్త్రి.
శంకరమూర్తి కూడా ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు.
"పోనీ సీక్రెట్ గా మీ ఆవిడదగ్గర వప్పేసుకోండి శాస్త్రిగారూ! ఈ న్యూసెన్స్ అంతా తప్పిపోతుంది-"
