Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 37


    "ఇది టూ మచ్"
    "మీరు మందు కొట్టటం కూడా టూ మచ్చే కదా-"
    ఇద్దరూ మర్నాడు సాయంత్రం వరకూ గొడవపడ్డారు. ఆ గొడవ మామూలుగానే పెరిగి పెద్దదయి షైనీ నోటీస్ కొచ్చింది.
    వెంటనే లై డిటెక్టర్ టెస్ట్ ఏర్పాటు చేసేసిందామె. ఏంజరుగుతుందో అని మళ్ళీ అందరం మూగాం.
    రెడ్డిని లేడీస్ అంతా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మిషన్ తగిలించారు.
    రెడ్డిని కొశ్చెన్ చేసే ముందు షైనీ, సీతావరదరాజన్, మంజులతా, బోపాషా ఓ మూలకెళ్ళి అతన్నేం కొశ్చెన్ చేయాలా అన్న విషయం మీద డిస్కస్ చేసుకోసాగారు.
    "ఇలాంటి వాళ్ళను మామూలుగా కొశ్చెన్ చేయకూడదు. వీళ్ళకోసం 'గిల్టీ నాలెడ్జ్ టెస్ట్' అని ఇంకోరకం ఉంది. ఆ పద్దతిలో చేస్తేనే వీళ్ళు దొరికిపోతారు" అంది మంజులత.
    "గిల్టీ నాలెడ్జ్ టెస్ట్' పద్దతిలో కొశ్చెన్స్ ఎలా వుంటాయ్?" అడిగింది సీత.
    అవతలివాడు కొంచెం ముదురు కేన్ అయినప్పుడు ఆ పద్దతిలో కొశ్చెన్ చేయాలన్నమాట! అంటే వాడు ఆ పని చేసినట్టుగానే భావించి కొశ్చెన్ చేయాలి- ఫరెగ్జాంపుల్ దొంగనోట్లు ప్రింట్ చేశాడని అనుమానం ఉన్నవాడిని ఈ మిషన్ మీద టెస్ట్ చేస్తున్నామనుకో-అప్పుడు కొశ్చెన్ ఎలా ఉండాలంటే 'నువ్ ప్రింట్ చేస్తోంది వందనోట్లా! అయిదొందలనోట్లా, వెయ్యినోట్లా?' అనడగాలి.
    దాంతో అతను అబద్దం చెప్పాలంటే చాలా కష్టపడాల్సివస్తుంది గనుక తేలిగ్గా పట్టుబడిపోతాడన్నమాట-"
    వెంటనే వాళ్ళంతా రెడ్డి దగ్గరకొచ్చారు.
    రెడ్డి మొఖంలో అప్పటికే భయం, ఆందోళన కనబడుతున్నాయ్.
    "ఎందుకొచ్చింది- తాగానని వప్పేసుకో- ఈ రోజుల్లో తాగనోడెవడు?" శంకరమూర్తి రహస్యంగా రెడ్డి చెవిలో గుసగుసలాడటం నేను విన్నాను.
    రెడ్డి వప్పుకోలేదు.
    "ఇవాళొక్కరోజు వప్పుకున్నాననుకో- ఇకనుంచీ రోజూ తాగకపోయినా తాగానని గొడవ మొదలెడుతుంది మా మిసెస్- దాని సంగతి నాకు తెలుసు కదా! కొంచెం ఛాన్సిస్తే నెత్తినెక్కి కూర్చునే టైప్-"
    వెంటనే షైనీ రెడ్ బటన్ ప్రెస్ చేసింది.
    "చూడు మిస్టర్ రెడ్డీ! మీరు నిన్న తాగింది కోర్టరా, హాఫా, ఫుల్లా?"
    రెడ్డి అబద్దం చెప్పడానికి నిజంగానే కొంచెం స్ట్రగులవాల్సి వచ్చింది.
    "నేనస్సులు తాగలేదంటే ఆ కొశ్చెనేంటి?"
    దాంతో సైరన్ నిజంగా ఫాక్టరీ సైరనంత పెద్దశబ్దంతో మోతపెట్టింది.
    ఆడాళ్ళందరి మొఖాల్లోనూ 'విజయ గర్వం' వీరవిహారం చేసింది.
    "ఇలాంటి అబద్దాల కోరుతో సంసారం చేయటం నా వల్లకాదు" అంటోంది రెడ్డిభార్య.
    రెడ్డి పరిస్థితి చూడలేకమేము అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాం.
    ఆ రాత్రి మళ్ళీ మగాళ్ళందరం టెర్రస్ మీద చీకట్లో సీక్రెట్ మీటింగ్ పెట్టాం.
    "పరిస్థితీ బహుత్ డేంజరస్ హై! అపన్ లోగ్ ఇమీడియట్ యాక్షన్ చేయాలె! లేకుంటే మగాళ్ళందరికీ బెయిజ్జత్ అవుతయ్" అన్నాడు హమీద్ మియా.
    డి-బ్లాక్ లో ఉండే ప్రొఫెసర్ నారాయణ్ గౌడ్ ఒక అయిడియా చెప్పాడు.
    "ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లకు నిబద్దత లేదు. ఈ టెస్ట్ లన్నీ ఇంతవరకూ సైంటిఫిక్ రుజువు చేయలేదెవరూ! అందుకనే పోలీసులు వీటిసాయం తీసుకుంటారుగానీ వీటి ఫలితాలు ఆధారంగా కేస్ లు పెట్టలేరు- ఇలాంటి పరిస్థితుల్లో మన అపార్ట్ మెంట్స్ లో ఉపయోగిస్తున్న లై డిటెక్టర్ ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. కోర్టుల్లో కూడా వీటిని వప్పుకోరు. ఎందుకని? ఎందుకంటే వీటి రిజల్ట్స్ ని నమ్మడానికి వీల్లేదు కాబట్టి!" అంటూ అతను వివరిస్తూంటే మా మగాళ్ళందరిలో పోయిన ప్రాణం తిరిగివచ్చింది.
    "అయితే మరి మీరు సైలెంట్ గా ఉంటే ఎలాసార్? ఈ డిటెయిల్స్ అన్నీ షైనీకి చెప్పండి!"
    ప్రొఫెసర్ కొంచెం గాబరాపడ్డాడు "షైనీకా! నోవే!"
    "ఎందుకని?"
    "ఆమె వినే టైప్ కాదు! కుందేలు- మూడేకాళ్ళు టైప్!
    "మరామెలోని ఈ మూఢ నమ్మకాన్ని పోగొట్టటం ఎలా?"
    అందరూ ఆలోచనలో పడ్డారు.
    చివరకు విజయ్ యాదవ్ సలహా ఇచ్చాడు.
    "మా చిన్నాయన ఒకాయన 'ఈ లై డిటెక్టర్' టెస్ట్ లు చేయటంలో ఎక్స్ ఫర్ట్! ఆయన్ను ఒకసారి మన అపార్ట్ మెంట్స్ కి పిలిపించి లై డిటెక్టర్ మీద మన అపార్ట్ మెంట్ లేడీస్ కి ఒక లెక్చర్ ఇప్పిద్దాం!-
    అందరూ ఏకగ్రీవంగా వప్పుకున్నారు.
    మర్నాడు ఆ వార్త షైనీకి చెప్పాడు హమీద్ మియా.
    "కానీ మా లేడీస్ ని ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలని మీరెందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లు?" అంటూ అనుమానంగా అడిగిందామె.
    హమీద్ మియా జవాబు చెప్పడానికి కంగారు పడుతూంటే శంకరమూర్తి అందుకున్నాడు.
    "సంగతేంటంటే ఇది ఈ మిషన్ ని ఇంకా విరివిగా వాడ్డానికి ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సు అన్నమాట! మన అపార్ట్ మెంట్ లేడీస్ కదాని మన ప్రెసిడెంట్ గారికి సాఫ్ట్ కార్నర్- ఆ ఆదివారం పోలీసాఫీసర్ రానే వచ్చాడు.
    "నిజం చెప్పాలంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లనేవి టోటల్ గా బోగస్- అందుకే వీటిని కోర్టుల్లో యాక్సెప్ట్ చేయరు. అదీగాక ఈ మిషన్ ని ఇంతవరకూ- సైంటిఫిక్ గా- ఎక్కడా-ఎవరూ- కరెక్ట్ అని ప్రూవ్ చేయలేకపోయారు. కనుక మీరు దీంతో పరీక్షలు జరిపి ఫలానా వాళ్ళు అబద్దం చెప్తున్నారు అని అనటం రాంగ్......"
    ఇంతవరకూ నిశ్శబ్దంగా వింటున్న లేడీస్ అంతా ఆ మాటతో ఒక్కసారిగా లేచి నిలబడి కేకలు వేయటం మొదలుపెట్టారు.
    "అది బోగస్ మిషనయితే మరి మీ పోలీసులు దాన్నే అన్ని నేర నిర్ధారణలకూ ఎందుకు వాడుతున్నారు?" అంటూ మంజులత అరచింది.
    "అయినా అంకుల్- మీరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసి కూడా మీకు ఈ లై డిటెక్టర్ ని కొన్ని కేసుల్లో కోర్టులు నేర నిర్ధారణ కి యాక్సెప్ట్ చేస్తాయనే విషయం కూడా తెలీదంటే చాలా సిగ్గుచేటు!" అంటూ షైనీ అందుకునేసరికి ఆ పోలీసాయన వెంటనే స్పీచ్ ఆపేసి ఇప్పుడే వస్తా అంటూ ఎటో పారిపోయాడు.
    మర్నాడు పొద్దున్న ఆరుగంటలకే ఏదో గొడవవుతున్నట్లు కేకలు వినబడే సరికి అందరం గ్రౌండ్ ఫ్లోర్ లోకి పరుగెత్తాం!
    లేడీస్ అందరూ కలసి అపార్ట్ మెంట్స్ లో పాలుపోసే వ్యక్తిని కూర్చోబెట్టి లై డిటెక్టర్ ని తగిలిస్తున్నారు.
    "నువ్ పాలలో నీళ్ళు ఒక్క చుక్కకూడా కలపలేదంటున్నావ్ కదా! నీ మాట నిజమో, కాదో ఈ మిషన్ చెప్తుంది- అప్పుడు గానీ మేము నీ మాట నమ్మం!" అంటోంది షైనీ.
    "నేను నిజమే చెప్తున్నానండీ! నీళ్ళు కలపాల్సిన అవసరం మాకేంటి? మీ దగ్గర ఎక్కువ రేటు తీసుకున్నాంగా" అంటున్నాడు పాలతను.
    "మేమనేదీ అదే- ఎక్కువ రేటు తీసుకుని నీళ్ళపాలు పోస్తున్నావ్" అంటూ రెడ్ బటన్ ప్రెస్ చేసింది షైనీ-
    పాలతని మొఖంలో భయం స్పష్టంగా కనబడుతోంది.
    "నిజం చెప్పు బాబూ! ఇవాళ పాలల్లో ఎన్ని నీళ్ళు కలిపావ్? పావు, సగం, మూడొంతులు? ఎన్ని? చెప్పు త్వరగా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS