Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 36


    'ఇప్పుడు నేనేం చెయ్యాలి? శాంత కు మాటిచ్చాను; సుందరంతో వివాహం జరిపిస్తానని. సుందరం పేరెత్తితేనే మండిపడుతున్నాడు మామయ్య. అసలే మామయ్యకు గుండె జబ్బు. అతనికి ఎటువంటి మానసికందోళన కలుగ కూడదు. కాని ఈ విషయం తెలిసినప్పటి నుండి మానసికంగా ఎంతో కృంగి పోతున్నాడు. శాంత నా ఆసరా చూసుకొని ధైర్యం వహించింది. మామయ్య ఆమె ధైర్యాన్ని చూసి మరీ మండి పడుతున్నాడు. అతనికి ఎటువంటి అవేశమూ ఎక్కువ మోతాదు లో కలగ కూడదనీ , అలా కలిగితే రక్తపోటు ఎక్కువై మళ్ళీ గుండె నొప్పి వస్తుందనీ, ఒకటికి రెండు సార్లు డాక్టరు హెచ్చరించాడు. మరిప్పుడెలా? శాంత మొండి పట్టు వదలడం లేదు. మామయ్య అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. నేనేమైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నాపై కసురు కుంటాడు. అందువల్ల అతని హృదయ వేదన ఎక్కువవుతుందే కాని తగ్గదు. అబ్బ......ఆ భాగావంతుడు నాకు ఎటువంటి విషమ పరీక్ష పెట్టాడు? పోనీ మామయ్యా ను సంతోష పరచడానికి శాంతను బలవంతంగా వివాహం చేసుకుంటే ఆమె నేను జీవితంతమూ బాధపడవలసి వస్తుంది. అలా కాక శాంత కు సుందరానికి వివాహం జరిపిస్తే మామయ్య జీవించడమే కష్టమేమో ననిపిస్తూ ఉంది. మరిప్పుడు నా కర్తవ్య మేమిటి? ఉపాయం ఆలోచిస్తానని శాంత కు మాట యిచ్చాను. ఈ మాటనేలా నిలుపుకోవాలి? మామయ్యను ఎలా శాంతింప చేయాలి? ఏమీ తోచడం లేదు; పై విధంగా ఆలోచిస్తున్న రామానికి అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అంతే .....! తృప్తిగా నిట్టూర్చాడు ఒక పెద్ద బరువు అతనిపై దింపినట్లైంది అతనికి 'అలాగే చేస్తాను. అంతకన్న మార్గం లేదు. నేనేమైనా ఫర్వాలేదు. మామయ్య క్షేమంగా ఉండి శాంత సంతోషంతో ఎప్పుడూ కళకళ లాడుతూ ఉండాలి. నాకంతే చాలు! పలవరిస్తున్నట్లుగా అంటూ తోట దాటి రమణయ్య గారి యింటి వైపు నడిచాడు.
    'అంతా విన్నావుగా బాబాయి. ఇదొక్కటే మార్గం అంతకు మించి యిప్పుడు మనం ఏమీ చేయలేము.'
    'ఒరేయ్ రామం! నాకంతా అయోమయంగా ఉంది శాంత ను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. మిమ్ములను చూసి' ముచ్చటైన జంట' అని ఎన్నిసార్లో చెప్పుకొని మురిసిపోయాం. ఇలా జరుగుతుందని కలలో కూడా తలచలేదు. అయినా విధి ముందు మనం ఎంతటి వాళ్ళం? పోనీ మరొక్కసారి శాంతను మందలించరాదూ?'
    'లాభం లేదు బాబాయీ! తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా చెప్పింది. శాంత వాదన కూడా సబబు గానే ఉంది. ఉన్నత విద్య నభ్యసించిన ఆమె నన్ను వివాహమాడాలంటే ఎలాగైనా ఎబ్బెట్టు గానే ఉంటుంది. ఈ విషయంలో మామయ్య నన్ను ఆనాడే హెచ్చరించాడు. కాని నా స్వార్ధం కోసం శాంత ఉన్నతికి అడ్డు నిలవడం యిష్టం లేక స్వయంగా నేనే శాంతను పై చదువులకు పంపించాను. ఈ అనుమానం నాకు కూడా ఆనాడే కలిగింది. కాని శాంత ఉత్సాహాన్ని కాదనలేక ఆమె ఉన్నతికి హృదయ పూర్వకంగా దోహదం  చేస్తూ నా మనసును సమాధాన పరచుకున్నాను. ఆనాటి నుండి ఈ అనుమానం నా మనసులో ఏదో , ఎక్కడో ఒక మూల స్థావర మేర్పరచుకుంది. కాని నేను ఎప్పుడూ ఎవరితో నూ అనలేదు.' వేడి నిట్టూర్పులు విడుస్తూ అన్నాడు రామం.
    'రామం.....! నీది వెన్నె లాంటి హృదయం రా.....! ఎవరి కష్టాన్ని చూడలేవు. నీకు ఆ భగవంతుడు గొప్ప మనసును యిచ్చాడు. ఒకరి మంచిని కోరే నీకు ఎటువంటి అన్యాయమూ జరగదని ఎందుకో నా హృదయం పదేపదే తలుస్తూ ఉంది. ఇప్పుడు కమ్మిన విషాద మేఘాలు త్వరలో సర్వేశ్వరుని కృప.' తమ వయసులో తమకు కలిగిన అనుభవాలను నెమరుకు తెచ్చుకుంటూ అన్నారు రమణయ్య గారు.
    'అలా జరిగితే అందరికీ సంతోషమే! నే చెప్పినవన్నీ గుర్తున్నాయా బాబాయీ? చాలా జాగ్రత్తగా వ్యవహారం నడపాలి. మామయ్య ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్రయత్నం విఫల మౌతుంది.' తన ముఖంలో ఎంతో ఆందోళనను వ్యక్తం చేస్తూ అన్నాడు రామం.
    'వేరే మార్గం లేదంటావా?'
    'చాలా ఆలోచించాను. ఇంతకు మించిన ఉపాయం నాకు తోచలేదు. నీకు తోస్తే చెప్పు.' గత్యంతరం లేదన్నట్లుగా రమణయ్య గారి ముఖంలోకి చూస్తూ అన్నాడు రామం.
    'సరే! నీవు హైదరాబాదు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళు. కార్యం చక్కబడేలా చూస్తాను.'
    'నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబాయీ! వస్తాను.' రమణయ్య గారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ యింటి వైపు నడిచాడు రామం.

                           *    *    *    *
    'జ్యోత్స్న ' రచనల ప్రభావంతో ప్రభాకరం పూర్తిగా మారిపోయాడు. గొట్టం పాంట్లు, ధరించడం పూర్తిగా మానేశాడు. పైజమా, లాల్చీ , అప్పుడప్పుడు ధోవతులు కూడా కడుతున్నాడు. జ్యోత్స్న, రచనలు, ప్రసాద్ సత్సంగత్యం ప్రభాకరాన్ని పూర్తిగా మార్చి వేశాయి. అతని ముఖం లో మునుపటి దుడుకుతనం చిలిపితనం బొత్తిగా కనుపించడం లేదిప్పుడు. గంబీర్యం, హుందాతనం యిప్పుడు అతని ముఖంలో ప్రస్పుటమౌతూ ఉంది.
    ప్రసాద్ ఎంతగా రానని మొండి కేత్తినా వినకుండా పరీక్షలై పోగానే అతనిని తీసికొని డార్జిలింగ్ వగైరా చల్లటి ప్రదేశాలు తిరిగి వచ్చాడు. వీరు తిరిగి వచ్చేసరికి శ్రీపతి గారు వ్రాసిన ఉత్తరం ప్రభాకరం రూములో పడి ఉంది. అది పదిహేను రోజుల క్రితం వ్రాయబడిన ఉత్తరం. అందులో ప్రభాకరాన్ని త్వరగా యింటికి రావలసిందిగా కోరుతూ వ్రాశారు శ్రీపతి గారు.
    రెండురోజులు ప్రభాకరం , ప్రసాదు ప్రయాణ బడలిక తీర్చుకున్నారు. రిజల్స్ వచ్చేంత వరకూ ప్రభాకరం యింటికి వెళ్ళ తలచుకో లేదు.
    ఒకరోజు ......సాయంత్రం మిత్రులిద్దరూ విశ్వనాధుని దర్శనార్ధం ఆలయానికి బయలుదేరారు. మధ్యలో పూలు, పండ్లు తీసుకున్నారు. పూలు పొట్లం గా కట్టిన కాగితం పై ప్రసాదు దృష్టి అకస్మాత్తుగా పడింది. అందుకు కారణం పెద్ద పెద్ద అక్షరాలతో జ్యోత్స్న కు సన్మానం జరుగుతుందన్న ప్రకటన కనుపించడం . వేరే కాగితం లో పూలు పొట్లం కట్టించి ఆ ప్రకటన నంతా చదివాడు ప్రసాద్. ప్రభాకరం శ్రద్దగా విన్నాడు. ఆ సన్మానం జరగబోయే తేదీ యింకా ఆరు రోజులు మాత్రమె ఉండడం వారిద్దరికీ ఆదుర్దా కలిగించింది. విశ్వనాధుని దర్శించు కొని హాస్టలు రూముకు వెళ్లారు.
    "ప్రభాకర్ ! మరి నీవేమో రిజల్ట్స్ వచ్చేంతవరకూ యింటికి వెళ్లనని పట్టుపట్టావు. పైగా నన్ను కూడా యింటికి వెళ్ళనివ్వ లేదు. మరిప్పుడేమంటావు? మన అభిమాన ఆచయిత్రి సన్మాన సభకు వెళ్ళలేక పోవడం అన్యాయం.
    'తప్పకుండా వెడదాం ప్రసాద్...! అంతకన్నానా? ఆ జ్యోత్స్న గారి చలవ వల్లే నాలో ఈ మార్పు వచ్చింది. ఈరోజే నాన్నగారికి టెలిగ్రాం యిద్దాం బయలుదేరి వస్తున్నామని. నా స్వగ్రామం లో జరిగే జ్యోత్స్న గారి సన్మాన సభకు నేను వెళ్లక పోవడం హాస్యాస్పదం గా ఉంటుంది.'
    'సరి.......! నీ పట్టుదలకు జ్యోత్స్న గారి సన్మాన సభ సడలించేసిందే!'
    'వారి సన్మానసభ నా యిప్పటి పట్టుదలను సడలించింది. వారి రచనలు నా జీవితాన్నే మార్చి వేశాయి.' చిరునవ్వుతో అన్నాడు రామం.
    అతని నవ్వుతో శృతి కల్పుతూ 'ప్రభాకరం! ప్రస్తుతం మనదేశానికి యిటువంటి రచయితల అవసరం ఎంతైనా ఉంది. నిజంగా జ్యోత్స్న గారు ధన్యులు. రచయితలు తమ రచనల ద్వారా ప్రజలలో నవ చైతన్యాన్ని, క్రొత్త పంధాలను, సృష్టింపచేయగలరు. హృదయరంజకమైన ఏ రచనైనా పఠితను అపాంతం చదివించి డాన్ని గురించి ఆలోచింపజేయిస్తుంది. హృదయాలను కదిలిస్తుంది, కన్నీటిని రప్పిస్తుంది; ఆనంద డోలికలలో ముంచెత్తు తుంది. మంచి రచనకు అటువంటి శక్తి సామర్ధ్యాలుంటాయి. నాకు తెలిసినంత లో నీవు మారావు. నీలా మరొకరో యిద్దరో మారినా ఆ రచయిత జన్మ సార్ధక మైనట్లే! ఆనాటి మన పురాణాలు కూడా సంఘం లోని మంచి చెడులను వాటి పర్వవసానాలను నరకం.....స్వర్గం ల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించాయి. ఇప్పటి ఈ సమస్యలను, సాధక బాధకాలను ప్రస్తుత రచయితలు కధా వస్తువులుగా తీసుకొని చక్కని రచనలు సాగిస్తున్నారు. దీనివల్ల ఒక విషయం స్పష్టమౌతు ఉంది; రచయితలకు సంఘంలో ఎప్పుడైనా ప్రధమ స్థానం ఉండాలని. వారిని అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలు సహృదయంతో ఆదరించాలి. వారి వల్ల సంఘానికి ఎంతో మేలు కలుగుతుంది. ' చివరి వాక్యాలను దృడంగా వత్తి పలుకుతూ, గంబీరంగా ముఖ కవళికలను మార్చుకుంటూ అన్నాడు ప్రసాదు.
    'నీవు చెప్పినదంతా నిజమే! అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే! ఇందులో నీ సహకారం కూడా ఎంతో ఉంది. ఆ విషయాన్ని నీవు విస్మరించినా నేను మాత్రం నా జన్మలో మరిచిపోలేను. నా ఈ జీవితంలో మార్పుకు కారకులు నీవు, రచయిత్రి జ్యోత్స్న. ఒక విధంగా మంచో, చెడో రోజా కూడా.....! పాపం యిప్పుడేలా ఉందొ......? ఏం చేస్తూ ఉందొ?' దీర్ఘంగా నిట్టురుస్తూ అన్నాడు  ప్రభాకరం.
    'ఇందులో నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రచనల ప్రభావం చాలా గొప్పది. ఆ కారణం గానే నీవు మారవు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారు, అమ్మగారు నీలో వచ్చిన ఈ మార్పుకు ఎంతగా ఆనందిస్తారో?'
    'సాయంత్రమే మన ప్రయాణం.......! అన్నీ సర్దుకో. ప్రసాదు ను హెచ్చరించాడు ప్రభాకరం.

                            *    *    *    *
    'ఇదేమిటన్నయ్యా ? నేను యిటువంటి వార్తా వింటానని కలలో కూడా తలచలేదు. అసలు శాంత తన మనసెందుకు మార్చుకున్నట్లు?' ప్రశ్నార్ధకంగా రామం ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది.
    'అది తెలుస్తే లేనిదేముంది? సుందరాన్ని వివాహం చేసుకోవడానికి దృడ నిర్ణయం చేసుకున్నట్లు చెప్పింది. అక్కడికి ఒకటికి నాలుగు సార్లు మళ్ళీ ఆలోచించుకోమని తరచి, తరచి అడిగాను. లాభం లేకపోయింది.'
    రామం ముఖం లోని భావాలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది శారద.
    శ్రీపతి గారు ఆమె గది లోపలికి వచ్చి 'అమ్మా శారదా.......! ప్రభాకరం వస్తున్నాడు. బెనారస్ నుండి యిప్పుడే టెలిగ్రాం వచ్చింది. రిజల్డ్స్ తెలిసేంత వరకూ రానని లోగడ ఉత్తరం వ్రాశాడు. ఏ దేవుడు కరుణించి వాడి మనసు మార్చాడో?' శ్రీపతి గారి ముఖం లో సంతోషం తాండవిస్తూ ఉంది. వారి సంతోషం లో పాలు పంచుకుంది శారద.
    'చాలా సంతోషకరమైన వార్త చెప్పారు బాబుగారూ! ప్రభాకరం గారు ఎప్పుడు వస్తున్నారు?' ఉత్సుకత ప్రదర్శిస్తూ అడిగింది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS