"ఏవిటండీ! ఏవిటా అఘాయిత్యం ?....ఏం జరిగింది ?" అంటూ ఒళ్ళు తెలియని ఆవేశం లో అరిచింది సావిత్రి. శంకరం వినిపించుకొనే స్థితిలో లేడు. చేతిలో ఉన్న కర్ర ఎత్తాను బలం కొద్దీ మణి నెత్తి మీద కొట్టడం కోసం -- అంతే -- వెంటనే ఏదో వెఱ్రి బలం, మొండి దొరివా వచ్చేసింది సావిత్రి కి. శంకరం చేతిలో ఉన్న కర్ర బలం కొద్దీ లాగి అవతల పడేసింది. మణిని పూర్తిగా తనలోని తీసుకొని శంకరం మండి రక్షణ కలిగించింది. మణి అమ్మ కౌగిట్లో , బెదిరిపోయిన గువ్వ పిట్టలా ఒణికి పోతూ ఇమిడి పోయింది. రొప్పుతూ నిలబడ్డ శంకరం , కళ్ళ తోటే మణిని తినేస్తూ "చీరేస్తాను- చెప్పు. వాడితో ఎన్నాళ్ళ నుంచి ఈ నాటకం సాగిస్తున్నావు?' అన్నాడు.
సావిత్రి ఆ మాటలకి అదిరిపడి "ఏవిటండి ? ఏవిటి మీరు అంటున్నదీ?' అంది.
సావిత్రి కి సమాధానం ఏం చెప్పకుండా మణి ని నిలదీస్తున్నాడు శంకరం -- సావిత్రి భయంతో నిలువెల్లా వణికిపోతూ "ఏవిటే తల్లీ-- ఏం జరిగిందో నువ్వేనా చెప్పవే!........" అంటూ మణి ముఖం లోకి చూసింది. అతి ప్రయత్నం మీద ధైర్యాన్ని తెచ్చుకొని, మధ్య మధ్య ఎక్కెక్కి వస్తూన్న ఏడుపు ని ఆపుకుంటూ , ఒక్కొక్క మాట తర్వాతే ఆగి ఆగి. మొత్తం మీద తను శేషయ్య ఇంటికి వెళ్ళిన కారణం . అక్కడ జరిగిన సంగతీ. ఆ తర్వాత వాసు కనిపించడం ఇవన్నీ అవసరం అయినంత మట్టుకు సూక్ష్మంగా చెప్పింది మణి. వాసుతో కలిసి పారిపోవడం సంగతి మాత్రం చెప్పకుండా.
మణి చెప్పింది ఓ పక్క నుంచి వింటూ , అసస్యంగా ఆమె కేసి చూసి "అబద్దం' అన్నాడు శంకరం.
శంకరం అన్న ఆ మాటతో మణికి ఎక్కడ లేని మొండి చొరవా. ధైర్యం వచ్చేసింది. పైట చెంగు తో కళ్ళు తుడుచుకుని ముఖంలో కి గంబీర్యాన్ని బలవంతంగా తెచ్చుకుని "నా మాట నమ్మకపోతే వెళ్లి వాళ్ళని కనుక్కో " అంది చటుక్కున మణి కోపంతో-
శంకరం దానితో తోక తొక్కిన తాచు అయిపోయాడు.
శంకరం కోపం తార స్థాయిని అందిన కొద్ది మణికి మొండి దైర్యం ఎక్కువ సాగింది. మాటకి మాట మాటకి మాట అందిస్తూన్న మణిని చూసి ఏం కొంప మునుగుతుందో అనే భయంతో సావిత్రి "ఊరుకో మణీ ఏం . మతి పోతోందేవిటి?....ఆయనతో సమానంగా అలా రెచ్చి పోతావేమిటి ?" అని గట్టిగా మందలించబోయింది.
"నేను ఊరుకోవే?....ఊరుకుని ఊరుకుని ఈ స్థితికి తీసుకొచ్చావు ఆయన్ని-- నాన్నా: ఈ కక్షలూ కావేషాలతోటి నిండి ఉన్న వాతావరణంలో ఒక్క క్షణం ఉండలేను నేను రాజమండ్రి లో ఏ బాబయ్య దగ్గరకో వెళ్లి చదువు కుంటాను. నన్ను పంపెయ్యి!"
'ఆ ఆ ప్రాచ్యుడి దగ్గరికి వెళ్ళావంటే తన్ని తీసుకురామా వెనక్కి?"
"లేకపోతె ఈ దరిద్రగొట్టు పోటీలోంచే మానెయ్యి . కొంత మనసు కి శాంతి అయినా లభిస్తుంది"
"నోర్మూయ్?....దారిద్ర గొట్టు పోటీ అన్నావంటే పళ్ళు రాలగోడతాను
"ఒక్కసారి కాదు -- లక్షసార్లు అంటున్నాను దరిద్రగొట్టు పోటీ అని"
శంకరం కోపం అతని వశం తప్పింది.
మణి గూబ పెళ్ళు మంది.
తల అదిరిపోయి కళ్ళు బైర్లు గమ్మి మొదలు నరికిన అరిటి చెట్టులా పడిపోతున్న మణిని పొదుపు కుంటూ "నా తల్లీ!" అంటూ కుప్ప కూలినట్లు కూలిపోయింది సావిత్రి...
మణి మీద చెయ్యి చేసుకున్నందుకు మనస్సు వికలం అయి పోయి కటకటాల్లో పచార్లు చేస్తున్న మనిషి పచార్లు చేస్తూన్నట్లే ఉన్నాడు శంకరం రాత్రి పన్నెండు అయ్యే దాకా, మంచం మీద నిశ్చలంగా పండుకొని కను రెప్ప వెయ్యకుండా ఇంటి పై కప్పు కేసి చూస్తూన్న మణి ముఖాన్ని ఆ ముఖం లో కనిపిస్తున్న గంబీర్యాన్నీ చూసీ , పన్నెత్తి పలకరించడానికి దైర్యం లేక. ఆ మట్టునే ఉండి పోయింది సావిత్రి అర్ధరాత్రి దాకా. అయిదు వేళ్ళూ అంటుకుని ఎర్రగా బొబ్బ తేలిన మణి బుగ్గకి రాద్దాం అని తెచ్చిన వెన్న పూస చేతిలోనే కరిగి పోతోందన్న ధ్యాసేనా లేకుండా. భోజనాల కని సిద్దం చేసిన కంచాలూ, నీళ్ళు అన్నీ అమట్టునే ఉండి పోయాయి వంటింట్లో -- బాగా ఒంటి గంట రెండు అయితేనే కాని అక్కడ శంకరానికీ, ఇక్కడ సావిత్రి కీ, కునుకు పట్టలేదు.
శంకరం పడక కుర్చీ లోను సావిత్రి గోడకీ జార్లబడీ అ మట్టునే నిద్రపోయారు. ఆలోచనల తీవ్రతతో అలసి పోయి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా.

భళ్ళున తెల్లారి, శంకరం సావిత్రీ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి, ఇంట్లో మణి లేదు. మంచం మీద మణి బదులు ఒక చీటీ మాత్రం ఉంది.
"సుఖ శాంతులూ నాగరికతా సంస్కారము లూ కల ప్రదేశాన్ని వెతుక్కుంటూ , విద్యనీ విజ్ఞానాన్ని సంపాదించు కోవడం కోసం వెళుతున్నాను నేను. నాకోసం వెతికి లాభం లేదు. పుష్కలంగా నూ విద్యా ధనాన్ని సంపాదిస్తే నే కాని రాను. ఎక్కడ ఉన్నా, భయంకరమైన నాన్న కోపాన్నీ-- అనురాగ పూరితమైన అమ్మ వాత్సల్యాన్నీనిత్యమూ స్మరించుకొనే
మీ మణి."
ఆ చీటీ ని చూసి, నవనాడు లూ క్రుంగి నిస్తేజుడై నిలబడి ఉండి పోయాడు శంకరం. ఇల్లు లాగే హృదయం కూడా శూన్యంగా మారిపోయింది. మెదడు లో ఆలోచన కాని, శరీరం లో చలనం కాని ఏమీ లేకుండా చైతన్య రహితంగా ఉండిపోయాడు.......లేదు.....మణి ఇంక తనకి లేదు తన ఆహంకరానికీ , ఆగ్రహానికి తట్టుకోలేక తన నీడ అయిన పోకని ఏ ప్రశాంత ప్రదేశానికో వెళ్ళిపోయింది.
పదహారు సంవత్సరాలు నవ్వుతూ నట్టింట తిరిగిన కూతురు. తననీ తన ఒరవర్తననీ చీదరించు కుని ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది. మనస్సులో ఎంతగా మమతని పెంచు కున్నాడు?....పైకి అయితే ఎప్పుడూ అనలేదు కాని, మణి తన ప్రాణం కదూ........!...ప్రాణం పోయి నిర్జీవంగా తను మిగిలాడు ఈ రోజుకి.
తన అంతటి దౌర్భాగ్యుడు మరొకడు లేడు.
తమ్ముడా ఆ వరసని దూరమయ్యాడు.
కూతురా ఈ వరసని దూరమయింది.
ఇంక మిగిలింది తనకి సావిత్రీ , సావిత్రి కి తనూ.
మండే గుండె ను గుప్పిట పట్టుకుని . మహా నేరం చేసిన దోషి లాగ సావిత్రి కేసి బేలగా చూశాడు శంకరం, సావిత్రి నేలమీద కూచుని మణి మంచం కోడుకి తల కొట్టుకొని మౌనంగా ఏడుస్తూ ఉంది, సావిత్రి బాధ చూస్తె శంకరానికి గుండె చేరువై పోతోంది. ఈ బాధకి తట్టుకుని ఇది బతుకుతుందా అనుకున్నాడు శంకరం. సావిత్రి ని సముదాయిద్దాం అనుకున్నాడు. కాని నోరు విప్పితే దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేలాగ ఉంది. అందుకే ఆప్రయత్నం విరమించి సావిత్రి కేసి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
సావిత్రి పైకీ, శంకరం లోపలా కుమిలి పొసాగారు. ఓ గంట అయాక పైట తో కళ్ళు తుడుచుకుంటూ "అమ్మాయి ఎక్కడికి పోయిందో ఏమిటో వెతికించండి నలుగుర్నీ నాలుగు వేపులా పంపించి " అంది సావిత్రి.
"వెతికిస్తే దొరుకుతుందా నీ వెర్రి గాని-- ఈ మధ్య బస్సులూ, స్టీము లాంచీలు వచ్చాయి తెల్లారగట్ల ఇక్కడ మూడు గంటలకి స్టీము లాంచీ ఎక్కితే తెల్లరకుండా రాజమండ్రీ వెళ్ళొచ్చు-- లేదా ఎనిమిది మైళ్ళూ నడిచి నగరం వెళితే అక్కడ అయిదు గంటలకి బయలుదేరే బస్సు ఉంటుంది . రాజమండ్రి చేరాక ఇంక అక్కడ లక్ష రైళ్ళు ఎటు వెళ్లిందో లేదా రాజమండ్రి గోపాలం దగ్గిరికే వెళ్లిందో -- ఎలా జరిగినా కాని వెతికించడం మాత్రం శుద్ధ దండగ -- ఊళ్ళో లేనిపోని ప్రచారం మాత్రం మిగులుతుంది?"
ఇలా ఆలోచించి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు శంకరం. కాని సావిత్రి మాత్రం ఏడుపు మధ్యలో "ఏవండీ ?....నలుగుర్నీ నలుగు వేపులా పంపించండి -- ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్ళని వెర్రి మొహం-- ఏం అవస్త్జలు పడుతోందో -- ఏం అఘాయిత్యం చేస్తుందో?" అంటూ అతన్ని తొందర చెయ్యడంతో కాదనలేక 'సరే" అని బయలుదేరాడు శంకరం.
సావిత్రి తృప్తి కోసం ఇల్లు బయలుదేరి వచ్చాడే కాని శంకరానికి అలా పది మందినీ పది వేపులా పంపించి హడావిడి చెయ్యడం, అందరిలోనూ తన పరువు ని బజారు పాలు చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఎవరేనా అమ్మాయి ఎక్కడి కి వెళ్లిందని అడిగితె రాజమండ్రి లో మా తమ్ముడి దగ్గిరికి అని చెప్పాలనీ, సావిత్రి కూడా అలాగే చెప్పమనాలని నిర్ణయించు కున్నాడు.
ఉండుండి మణి జ్ఞాపకం వచ్చి హృదయం కలుక్కు మంటోంది. తను పైకి గంబీరంగా ఉండి బాధని ఎంత అణచి పెట్టుకోవాలన్నా హృదయం మాత్రం అక్రోశిస్తూనే ఉంది. మణి పుట్టుకతోటే తనకి అదృష్టం పట్టింది. పరీక్ష పాస్ కావడం, ఈ ఊరు వచ్చి ప్రాక్టీసు పెట్టడం, డాక్టరు గా మంచి పెరు తెచ్చుకోవడం, మంచి ఇల్లు కట్టడం ఇవన్నీ మణి లక్ష్మీలా తన ఇంట్లో వెలిసినప్పటి నుంచే. ఇప్పుడా లక్ష్మీ వెళ్ళిపోయింది . తనకి ఇంక మిగిలింది ఎడారి జీవితమే?....
మణి అంటే తనకి ఇంత మమత ఉందనీ, మణి లేని బ్రతుకు ఇంత వేదనా మయంగా ఉంటుందనీ అనుకోలేదు. తలుచుకుంటే రంపపు కోతగా ఉంది. ఈ కోత తను భరించ వలసినదే. తనకీ శాస్తి కావలసిందే...........లేకపోతె తను చేసిన పనేమిటి?...ఎప్పుడేనా అలా చేశాడా ?.......ఛీ.....వెధవ చేతులు....ఇంతకీ అది అన్నది ఏం ఉంది?.........అందులో తప్పేం ఉంది తనకి ఒళ్ళు తెలియని అహంకారం కాకపొతే ?......
అవును?.....ఇది దారిద్ర గొట్టు పోటీ కాకపోతే మరేవిటి?
