వీడ్కోలు తీసుకుంటూ సుభద్ర దగ్గర దుఃఖాన్ని అణిచి పెట్టడం కష్టమైంది. పార్వతి కళ్ళ వెంట ఆవేదన స్రవంతి గా మారి కారుతున్నది. పాప ఫ్రాకు అంతా పార్వతి కన్నీటితో తడిసి ముద్దయింది. సుభద్ర పార్వతి ని ఉపశమింప చేస్తూ, "మళ్ళీ కలుసుకోకుండా ఉంటామా? ఎందుకింత బాధపడతావు?' అన్నది మందలించి.
రాజు స్తంభం లా నిలబడి కిటికీ లో నుంచి చెట్టు పుట్టల మీదికి దృష్టి పోనిచ్చాడు. "పార్వతి రాను రాను మరీ సెంటిమెంటల్ అయిపోతున్నది.' అనుకున్నాడు.
సరిగ్గా ఆ మాటలే రాధాకృష్ణ అన్నాడు. "పార్వతీ! మీరిలా ప్రతి చిన్న పరిస్థితికీ అనుభవానికి లొంగిపోయి దిగజారి పోకూడదు. స్తైర్యాన్ని అలవరచుకోవాలి. మీరెంతో సాహసం కలవారను కున్నాను.' స్నేహంతో కూడిన మందలింపు తో పార్వతి కాస్త నిలదొక్కుకుంది.
సుభద్ర గారికి ఐన తర్వాత రాధాకృష్ణ కు పాదాభివందనం చేసింది పార్వతి. ఆమె మనసులో ఆతను చాలా మంచి స్నేహితుడు. అతని మీద భక్తీ కూడా ఉంది.
"మిమ్మల్నీ, మీ అక్కగారి ఉద్భోధననీ మరిచిపోను, పార్వతీ! తప్పకుండా ఆమె అజ్ఞా ప్రకారం పెళ్లి చేసుకుంటాను." అన్నాడు.
రాజు, సుభద్ర ఒక్కసారే వింతగా చూచారు. రాధాకృష్ణ ను. రాజు మరీ ఆశ్చర్య పడ్డాడు-- సరస్వతి తో ఎలా జోక్యం కలిగిందా? అని.
ప్లీడరు గారు లోనికి వస్తూ "రాజు గారూ! ఇవాళే గా ప్రయాణం? పార్వతి కూడా వస్తుందా?' అన్నారు.
"ఔనండీ!" అన్నాడు రాజు తల వంచుకుని.
"అమ్మగారి నైనా తోడు రమ్మని వ్రాయలేక పోయారా? ఇల్లుకు ఇబ్బంది పడాలేమోనే? ముందర హోటల్లో దిగుతారా?' అయన సాలోచనగా అన్నారు.
"మా అమ్మకు రావడానికి వీలుపడదట. అక్కడ నాకు తెలిసిన ప్రిన్సిపాల్ గారోకరు ఉన్నారు లెండి. అయన మాకోసం ఇల్లు చూసి ఉంచినట్టు వ్రాశారు."
"అయితే ఇంకేం? నాకు కోర్టు పనుంది. నేను వెళ్ళొస్తానమ్మాయ్, పార్వతి! రాధాకృష్ణా! స్టేషన్ కు వెళ్తున్నావా? సుభద్ర కూడా వస్తుందేమో తీసుకెళ్ళు."
"ఎందుకు శ్రమ-- వెళ్లి పోయే వాళ్ళ కోసం?" అంది పార్వతి.
"నేనూ వస్తాను" అని కాళ్ళ కు చుట్టుకున్న పాప నెట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు రాజు. రాధాకృష్ణ తో పాటు అందరూ వెళ్ళుతుంటే , వీధి వాకిట్లో నవ్వుతూ నిలబడి కనుచూపు మేర దాటేవరకూ చూచింది సుభద్ర. తర్వాత తన కళ్ళలో నీళ్ళు నిండి ఉండటం గుర్తించి తుడుచుకుంటూ "భగవంతుడు సృష్టించిన ఎడబాటు చిత్రమైనది' అనుకుంది.
31
కాకినాడ కు వచ్చి పది రోజులవుతున్నా -- ప్రిన్సిపాల్ గారు కుదిర్చిన ఇంట్లోకి ప్రవేశిస్తూనే -- 'ఇద్దరి కోసం ఇంత ఇల్లేమిటి?' అనుకుంది పార్వతి. అయన గారి కేమన్నా తిక్క ఉందేమో అనుకుంది. అయితేనేం -- అందమైన ప్రహరీ గోడ, రకరకాల పూల మొక్కలు, -- బలే మోజు పుట్టించే ఇల్లు.
సామాన్లు సర్దుకునే ఒత్తిడి అంతా రెండు రోజులకు సరిపోయింది. ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు పార్వతికి. ఉద్యోగం చెయ్యాలనే వాంఛ బలవంతం గానో, ఉద్దేశ పూర్వకంగానో అరికట్టుకుంది. ఉద్యోగం నిర్వహించి తను పొందిన ప్రశంసలు ఇక్కడకు చాలునని పించింది.
దగ్గర లో ఉన్న లేడీస్ క్లబ్ లో సభ్యురాల యింది పార్వతి. అందరూ కొత్త వ్యక్తులు. ప్రదేశాలన్నీ అపరిచితంగా ఉన్నాయి. ఎప్పుడూ ఆ పరిసరాల్లో కాలు పెట్టి ఎరగదు. పట్టణ వాతావరణ మై ఉండీ దిగులు కల్పించిన కారణం ఇదే ముఖ్యంగా.
పుల్లమ్మ గారి వంటి ప్రముఖులను తెలుసుకున్నాక పొరుగింటి స్నేహాల పై మోజు తీరిపోవడం సహజమే. ఒక రోజు అడ్డుగోడల్లేని పెరటి ఆవరణ లో దూరంగా ఎవరో పెద్దావిడతో మాట్లాడుతూ ఒక అమ్మాయి కనిపించింది. ఆమెతో పరిచయం చేసుకుంటే బాగుండు ననుకుంది. అనుకూలం కాలేదు అప్పట్లో.
ఏదేమైనా దట్టమైన మేఘాల్లాటి ఆలోచనలు పనులు ఉన్నప్పుడూ , లేనప్పుడూ కూడా మానసాకాశం లో సంచరిస్తూ ఉన్నాయి.
రాజు ఏదో ఆత్రుత చెందుతున్నాడు పార్వతి ని గురించి. కాని ఆ అమ్మాయి ముఖం లోని గంబీరత నైరాశ్యం వల్ల ఏర్పడిందో, అమిత దుఃఖం వల్ల అలవాటైందో తెలుసుకోవాలని ప్రయత్నించి ధైర్యం సన్నగిల్లి ఊరుకున్నాడు.
ఆ మధ్యాహ్నం వేళ సంధ్యలోకి అడుగు లో అడుగు వేస్తూ జారిపోయింది. ఉదయమూ, మధ్యాహ్నమూ, సంధ్య! తిరిగి ఉదయ మధ్యాహ్న సంధ్యలు. ఈ భ్రమణ ధ్వని గీతానికి ఏనాడూ లయ తప్పినట్టు తోచదు.
ఇదే అసుర సంధ్య ను కొన్నాళ్ళ క్రితం పార్వతి భరించలేక పోయేది. హటాత్తుగా జరిగిపోయిన విషాద సంఘటనల చాయలు పార్వతి లో నిగూడంగా దాగి, అప్పుడప్పుడు రేగి, బాధపెడుతున్నాయి. అవన్నీ విదిలిపోతున్నట్టు సడలి పోనీ నిబ్బరమేదో గుండెలను ఆవరించింది. ఈ సంధ్య లో గొప్ప పరమార్ధ ముంది. వృద్ధాప్యానికి బెదిరి పోయేవారికి కూడా ఒక్కొక్క సారి ఈ సంధ్య అందంగా కనిపిస్తుంది. ఎందుచేత? దాన్ని తర్కించు కోవాలి. ఆ రహస్యాన్ని ముందే భేదించిన వారు ఆ దశకే తహతహ పడతారు. బాల్య యౌవన వృద్దాప్యాలు ; ఉదయ మధ్యాహ్న సంధ్యలు . చివరకు అనంత తమః శక్తి లోకి, అంధకారం లోకి అగుపించకుండా పోవడం.
కాలగమన వేగంలోనే మానవ జీవిత రహస్యం ఇమిడి ఉంది.
గొల్లున ఏడ్పులు వినిపించి నివ్వెర పోయి అటుకేసి చూచింది. ఎవరో రైలు కింద పడ్డారని గడబిడ ఆ ఇంటి వాళ్ళ ఏడుపు రోదలతో గొడవ గొడవ గా ఉంది. దుఖితుల ప్రతి స్వరూపం లాగా -- నడిచి వస్తున్న యామినీ కాంత వదనం బాగా ఎర్రబడి పోయింది ఆకాశంలో.
పార్వతి ఎందుకో త్వరత్వర గా ఉద్రిక్త స్థితి లోకి వచ్చింది. ఇటీవల 'చావు' అనే పదం వినిపించడమే తడవు -- పార్వతి లోకి నిర్విశేషంగా అశేషమైన ఆలోచనలు వచ్చి పడిపోతున్నాయి. వాటికి అంతోకటి ఉన్నదని ఆశ లేదు.
మొదట సరస్వతి, తర్వాత తండ్రి అంతర్నేత్రంలో కనిపిస్తారు. ఇక అక్కడి నుంచి చిత్ర విచిత్ర రీతుల్లో భిన్న విభిన్న మార్గాల్లో మనసు సర్వావయవా ల్లోకి ప్రవహిస్తుంది . పరీక్షిస్తుంది. పరిషోధిస్తుంది. దేనికోసమో , ఎందుకో తెలియదు. అంతర్యం లో జరిగే సంఘర్షణ పైకి ఎవ్వరికీ తెలియదు.
హటాత్తుగా పార్వతి అంతరాళం లో ఒక మెరుపు మెరిసింది. ఈ ఆవేదననంతా , నిర్వచన శూన్యమైన ఈ అర్బాటాన్నంతా ఎంత కష్టపడి అయినా వచన రూపంలో బహిర్గతం చేస్తే?
మరొక విధమైన స్పందన మొదలైంది పార్వతి లో.
కనిపించే ప్రతి వస్తువును, ప్రతి దృశ్యాన్ని ప్రతి వ్యక్తీ ని పరిశీలనాత్మకంగా చూచాయి కళ్ళు.
ఏ భావాన్నయినా పరిగ్రహించి దానికి అనుసంధానంగా తమ కల్పన చెయ్యాలి. తాను చూస్తున్న వర్నికలే , పొందుతున్న అనుభూతులే మస్తిష్కంలో అవిరామంగా రచనలై పోసాగాయి. తన ఎదట కనిపించే దృశ్యాలే అస్పష్టంగా కనిపించే కలలై పోయాయి.
ఆత్రుత నుంచి తప్పించు కోవటానికి శక్యం కాలేదు. బీరువా లో కాగితాలు కొన్ని సంగ్రహించి వ్రాసే ప్రయత్నం చేసింది పార్వతి. కొన్ని కాగితాలు తగలబడిన తర్వాత మాటల పొందిక కుదిరింది.
అంతవరకూ గుండెల మీద ఉన్న బరువును ఎవరో తీసినట్టయింది. ఎన్నుకున్న వస్తువు ఎంత విషాద వంతమైనదైనా అంతా వ్రాసి తన సృష్టి ని ఒకసారి తిరగేసి చూడగానే పార్వతికి అప్రయత్నంగా నవ్వు వచ్చింది.
