Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 36


    కడసారిగా విశ్వభారతికి హృదయాంజలి ఘటించి వచ్చేస్తున్న శాంతికి తునాతునకలై నేలపాలైన శిరీషం కన్పించింది. తుఫాను గాలికి పడిపోయినట్టు తెలిసింది. ఒకనాడు పరిమళ పుష్పగుచ్చాలతో పచ్చగా కళకళలాడిన ఆవృక్షాన్ని, నేలపాలై తునాతునకలై అవస్థలో ఉన్న ఆ శిరీషాన్ని, ఎన్నో ఆలోచనలను రేపే ఆ వృక్షాన్ని, నాశనమైన రూపాన్ని ఒకసారి రెప్పవాల్చకుండా పరీక్షించింది. శాంతి మరుక్షణమే గబగబా వెళ్ళిపోయింది.
    
                                   44

    కలకత్తా లాడ్జికి తిరిగి వచ్చేసరికి రాజా ఎదురుచూస్తూ కూర్చున్నాడు వారికోసమే.
    శాంతి లేకుండా చూచి మెల్లగా చెప్పాడు రాజా: "ఏదో మహాపద వాటిల్లినట్టు బాధ పడుతున్నావ్. ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులు."
    ప్రశ్నార్ధకంగా చూచాడు శ్రీహరి.    
    రాజా తిరిగి చెప్పాడు: "నేను నిన్న యింటికి వెళ్ళలేదు. రాత్రికి రాత్రి శాంతినికేతన్ వెళ్ళిపోయాను. అక్కడ నాకింకా స్నేహితులున్నారు. కాని ఈ పని ఇదివరకే చేయనందుకు చాలా విచారిస్తున్నాను."
    "ఇంతకూ అసలు సంగతి?"
    "చెపుతున్నా. గోవిందరావును ఎలాగైనా ఒప్పించాలనే ఆశతో వెళ్ళాను. కాని ఆరాతీయగా అతడి కిదివరకే పెళ్ళయినట్లు తెలిసింది. స్వభావంకూడా అంత మంచిది కాదట!"
    నిర్ఘాంతపోవడం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీహరి.
    మర్నాడు ఎంత బ్రతిమాలినా వినకుండా తిరుగు ప్రయాణం పెట్టుకున్నాడు శ్రీహరి. అతడు టిక్కెట్టు కొనడానికి వెళ్ళినప్పుడు రాజా అడిగాడు శాంతిని: "ఈపాటికి మీ మనస్సు కొంచెం సర్దుకుని వుంటుంది. శాంతీ, అసలు విషయమేమిటో నాకింతవరకూ వివరంగా తెలియలేదు."
    ఒక్కసారి కళ్ళెత్తిచూచి తిరిగి తల వాల్చుకుంది శాంతి.
    "స్నేహితుడుగా తెలుసుకోధగనా, శాంతీ?"
    ఆ సౌమ్యతకు కట్టుబడిపోయిన శాంతి జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది. వివరంగా నిన్న రాజా ముఖం క్రోధంతో జేవురించింది, అప్పటికప్పుడు కండ్లలో ఎరుపుజీరలు పేరుకున్నాయి.
    "స్కౌండ్రల్! అంత మోటుగా సమాధానం చెప్పాడా?"
    "......"
    "అయితే, శాంతీ, ఒక్కమాట. నిజం చెప్తారా?"
    "నేను ఎప్పుడూ అబద్ధమాడను. ఇష్టం లేకపోతే సమాధానమే యివ్వను కాని-"
    కొంచెం సేపు ఊరుకొని మెల్లగా అడిగాడు: "అతడితో మీరేం హద్దులుమీరి ప్రవర్తించలేదు కదా?"
    కళ్ళెత్తి నిశితంగా చూచింది శాంతి. నిదానంగా జవాబు చెప్పింది. "దైవసాక్షిగా-లేదు."
    తృప్తిగా నిట్టూర్చాడు రాజా.
    "నమ్మారా నా మాట?"
    "నమ్మకం లేనివాళ్ళ నాసా అడగనే అడగం. నమ్మకముంటేనే ప్రశ్నించేది."
    కొద్ది సేపటికి మళ్ళీ రాజా అన్నాడు: "చదువు మానవలసింది కాదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు?"
    "నాకూ అలానే అన్పించింది. కాని, ఇక అక్కడ వుండలేను."
    "అదీ నిజమే. కాని, శాంతీ, ఒక్కమాట. అది విని ప్రస్తుతం బాధపడినా క్రమంగా సంతోషించగలరు. మీరు చాలా అదృష్టవంతులు. అతడి కిదివరకే పెళ్ళయిందట."
    అదిరిపడి ఒక్కసారి తలెత్తి చూచింది శాంతి. కాని ఏమీ మాట్లాడలేహ్డు.
    "శాంతీ!" తిరిగి మెల్లగా పిల్చాడు రాజా. "మీ గంభీరత చూస్తే నాకు భయంగా వుంది. ఆడవాళ్ళు సాధారణంగా తొందర స్వభావులు. ఏమీ అఘాయిత్యానికి పాల్పడనని మాటివ్వండి."
    శాంతి మౌనంగా నేలవైపు చూస్తూ కూర్చుంది.
    "స్నేహితుడుగా నాపై మీకు చాలా గౌరవం కదూ?"
    మెల్లగా కళ్ళెత్తింది శాంతి. "మాట యిస్తున్నాను. అంత బలహీనురాల్ని కాను."
    "ఆశలు తీరకపోవడంతో వేదన కలగడం సహజం. కాని ఆవేదనతో క్రుంగిపోక ఆ వేదనాలార తైలంతో వివేకజ్యోతిని వెలిగించుకుని జీవితాన్ని నడుపుకుపోవాలి, శాంతీ!"
    "వివరాలు నాకు వినాలని లేదు. కాని నాన్నగారితో చెప్పక తప్పదు" అన్నాడు శాంతినిలయం జేరుకొంటూ దారిలో శ్రీహరి, చెల్లెలితో.
    "ఇక ఆ ఆశ లేదని చెప్పు. చాలు" అంది శాంతి మెల్లగా. రాజాకు చెప్పిన విషయం స్వంత అన్నయ్యకు చెప్పలేకపోయింది.
    
                                    45

    ప్రఫుల్లవదనంతో తిరిగి వస్తుందనుకొన్న కుమార్తె వదనంలోని ఆమనస తిమిరాన్ని చూచి కలవరపడ్డాడు బలరామయ్య.
    ఆరోజు శాంతినిలయంలో ఎవ్వరికీ నిద్రాహారాలు లేవు. ఎవ్వరితోనూ ఎవ్వరూ విశేషించి మట్లాడలేదు. ఎవరి గదుల్లో వారు కదలకుండా పడి ఉన్నారు. మనుషుల్నీ, పరిసరాల్నీ నిరాశా నిస్పృహాంధకారా లావరించేశాయి.
    సుకుమార హృదయురాలైన శాంతి, పుట్టినదాదిగా కలిగిన ప్రతి కోరికా తీర్చుకొంటూన్న శాంతి ఈ అఘాతానికి తట్టుకోలేదనీ, ఏదో భయంకర పరిణామం జరుగగలదనీ భయపడిన అందరూ - ఉదయమే లేచి నిర్మల వదనంతో తోటలో తిరుగాడుతున్న శాంతిని చూచి ఆశ్చర్యపోయారు. కొంత సంతోషించారు కూడా కాని, శాంతి విషయంలో కలిగిన భయాలన్నీ బలరామయ్య విషయంలో నిజమయ్యాయి.
    శ్రీహరి నోటిమీదుగా విషయాలన్నీ విని డీలా పడిపోయి విచారంతో మంచంపై వాలిన బలరామయ్య మరి లేవలేకపోయాడు. వార్ధక్య దశలో ఇంతటి అఘాతానికి తట్టుకోలేకపోయాడాతడు. తన ప్రాణాధికమైన శాంతికి అది తీవ్ర సంక్షోభం; తమ పరువు ప్రతిష్ఠలకు మాయని మచ్చ. ఈ అవమానం ఎలా తీరుతుంది? ఆ పగలూ, రాత్రీ అదే విచారంతో మధనపడిన బలరామయ్యను తెల్లవారేటప్పటికి 104 డిగ్రీల జ్వరం ఆవరించేసింది. ఆ జ్వరం వారం తిరిగేసరికి టైఫాయిడ్ గా మారింది.
    లక్ష్మీదేవి నిత్యం భర్త శయ్యవద్దనే ఉంటూంది. కూతురుతో పూర్తిగా మాట్లాడడం మానేసింది. శ్రీహరి ఆఫీసుకు వెళ్ళేవరకూ పొలంపనుల విషయమై నౌకర్లతో, పాలేళ్ళతో సంప్రతించటం, ఆ తర్వాత తండ్రిదగ్గర కొంతసేపు ఉండడం, ఆదరా బాదరా ఆఫీసుకుపోవటం, మళ్ళీ ఏ చీకటి పడేవేళకో ఇల్లు చేరుకోవడం, వచ్చిన దగ్గర్నుంచీ తండ్రి జబ్బు విషయమై కనుక్కోవడం, డాక్టర్లతో మాట్లాడడం, తల్లికి ధైర్యం చెప్పటం, ఇంటి పనులు, పొలం పనుల విషయమై నౌకర్లతో పాలేళ్ళతో మాట్లాడి ఫర్మాయించటం. ఈవిధంగా ఇంకెవరితోనూ మాట్లాడడానికసలు తీరికే చిక్కటం లేదు. అత్తగారు పూర్తిగా రోగివద్దనే గడపటంతో ఇంటి పనులలో పద్మకెక్కడా తీరిక చిక్కటంలేదు. ఈవిధంగా శాంతితో మాట్లాడే వారెవరూ లేకపోయారు. లక్ష్మీదేవి పూర్తిగా విరక్తి పెట్టుకున్నట్టు అసలు కూతురువైపు చూడటం లేదు; మాట్లాడటం లేదు. ఈ అశాంతికంతకూ శాంతే కారణమని ఆమె అభిప్రాయం. బలరామయ్య మాత్రం శరీరోష్ణత తగ్గి కొంచెం ఏబాధాలేకుండా పడుకున్న సమయంలో మాత్రం కూతురుగురించే మాట్లాడుతుండేవాడు. శాంతిని చేరబిలచి ఏమైనా ఒకటి రెండు మాట లడుగుతూండేవాడు.
    "నేను నిశ్చింతగా వున్నాను, నాన్నా. నాగురించి బెంగపెట్టుకోకండి. మీ ఆరోగ్యం బాగుండాలి" అని వాపోయేది శాంతి, తండ్రి గుండెమీద వాలి.
    "లేదు, తల్లీ. నాకేం ఫర్వాలేదు. నువ్విలా చిక్కిపోతున్నావేమిటి?" అంటూ బలరామయ్య కూతురికి ధైర్యం చెప్పబోయేవాడు. తిరిగి జ్వరతీవ్రతలో కన్నెరగకుండా పడి ఉండేవాడు.
    శాంతి ఏ ఏకాంతంనుండైతే పారిపోవాలని ప్రయత్నించిందో ఆ ఏకాంతమే. బలవంతంగా చుట్టుకోసాగింది. దానితో ఆలోచనలు పెనుభూతాలలా ముప్పిరిగొనసాగాయి,
    మూడు వారాలు గడిచాక బలరామయ్య జ్వరం తగ్గుముఖం పట్టింది. అందరూ కాస్త తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. కాని, జ్వరం బాగా తగ్గి పథ్యానికి రావాలి. అప్పుడు పూర్తిగా తృప్తిపడాలి. నారయణ హైదరాబాద్ లో ఉన్నాడు; ఇంకా భార్యతో విహారం పూర్తికాలేదు. 'నాన్నగారికి చాలా జబ్బు చేసింది. నువ్వు రావడం మంచిది' అంటూ శ్రీహరి వ్రాస్త్రే జవాబుకూడా యివ్వలేదు. తర్వాత పదిరోజులకు నాలుగువందలు పంపించమని టెలిగ్రాం యిచ్చాడు, మైసూరు నుంచి. ఒక ఉత్తరం కూడా వ్రాశాడు. కాని, అందులో ఎవరి యోగక్షేమాల ప్రసక్తీలేదు. అడిగిన డబ్బు పంపించి ఊరుకున్నాడు శ్రీహరి. ఆత్మబంధువుల దగ్గరకూడా ఈ అరమరికలూ, అప్రసన్నతలూ ఏమిటో అర్ధం కాలేదతడికి. తండ్రికి జబ్బుచేస్తే అతడి ప్రాణం అంత దూరాన అంత విగ్రహంతో ఎలా నిలవగలిగిందో అర్ధం కాలేదు శ్రీహరికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS