Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 36


    'ఎక్కడికి?'
    ఈ ప్రశ్న సూర్యం ని చకితుని చేసింది.
    'ఎక్కడికా-- ఎక్కడికీ లేదులే-- వస్తాను '
    అంటూ వెళ్లి పోవచ్చాడు. అతను వెళ్లి పోయాక ఆమె వెక్కి వెక్కి ఏడవ నారంభించింది. ధైర్యంగా నున్న వాళ్ళు అధైర్యాన్ని మనసులో ఒకచోట కట్టి పెడ్డ్తారు. ఒకోసారి ఆకట్లు తెగి అధైర్యం విజ్రుంభించి కన్నీటిని కార్పిస్తుంది. ఆమె మళ్లీ ధైర్యాన్ని తెచ్చుకునేసరికి చాలా సేపయ్యింది.
    సూర్యం పంతం మీద యింటికి వచ్చాడు. ఆ తొందర లో కాగితం కలం తీసాడు.
    'మీకు యీ వుత్తరం యింత త్వరలో రాస్తున్నందుకు క్షమించండి. మీ అభిమానాన్ని, మంచితనాన్ని నా స్వలాభం కోసం  వద్దనుకున్నా వినియోగించు కుంటున్నాను. ఈ ఋణం యెలా తీరుస్తానో నాకేం అర్ధం కావటం లేదు. ఏ హోదా లేని వాడికి ఒక హోదా యిచ్చారు. ప్రస్తుతానికి యే ఆశా లేనివాడికి ఓక ఆశా కిరణం ప్రసరిస్తే గానీ బ్రతకాలనే వాంఛ పోతుంది. ఆ ఆశ మీ దగ్గరలో వుంటే వస్తుందని నమ్మకం. ఇక్కడ వున్న నా పై ఆఫీసరును కాదని డిపార్టుమెంటు పెద్దయైన మీకే నా బాధ విన్నవించు కున్నందుకు నన్ను మన్నిస్తారని ఆశిస్తాను. ఇక్కడి నుంచి నేను వీలైనంత వేగిరం గా కదిలేటట్లు చేస్తారని యెదురు చూస్తుంటాను.
                                                                                   మీ విధేయుడు.
                                                                                        సూర్యం '
    వెంటనే కవరు లో పెట్టి సర్కారు ఎడ్రసు రాసాడు. ఆ రాత్రంతా తర్జన భర్జన చేస్తూనే వున్నాడు. ఇక్కడ నించి దూరామైతే గానీ విశాల కు చదువు కూడా అబ్బదు. చదువు అబ్బనిది ఆమె డాక్టర్ ఎలా అవుతుంది? ఆమెను తను పెళ్లి చేసుకోలేనని దృడంగా తట్టింది. వ్యవహారం  యిటో అటో తేల్చడం బుద్ది మంతుల లక్షణం. లేనిపోని ఆశలు యిప్పటికే రేకెత్తించాడు. ఆమె యీ ఆశలను పెంచి పెద్ద చేసిన ఒక్కసారి అవి అడియాసలని తెలుసుకోగానే ఆత్మహత్య కు సిద్దపదవచ్చు. దగ్గరగా నుంటే యే అఘాయిత్యమైనా జరగవచ్చు. ఏ తొందరపాటు వల్లనైనా ఆమెను బలవంతం చెయ్యవచ్చు. తను కాలు జారితే తండ్రి అసలే ఆవేశ పరుడు. తెగించి యేమైనా తొందరలో ఘోరమైన సాహసానికి వడి గడితే అతని మూలాన తన తల్లికి, కుటుంబానికి తీరని అపచారం జరుగుతుంది. కొంతకాలం దూరంగా వుంటే మనసులో తొందరాటు తగ్గుతుంది. సావకాశంగా అలోచించి పనులు నెరవేర్చటం జరుగుతుంది.
    ఇంకా ఎన్నెన్నో విధాల తల్చుకున్నాడు. విశాల ముఖం చూడకుండా యెలా వుండగలడు? ఆమె యింత సన్నిహితంగా యింకేప్పుడూ లేదు. ఇద్దరూకలిసి నివసిస్తున్నట్టే తను వూహించుకొంటాడు. ఆమె కోసమే తను బ్రతికున్నానన్న తలపు ఆ ఉత్తరాన్ని పోస్టు చెయ్యకూడదని చెప్పింది. మళ్ళీ తండ్రి తల్లీ జ్ఞప్తి కి వచ్చారు. విశాల శ్రీనివాస్ భార్య, ఆమె అతని దగ్గరే కొన్నేళ్ళు వుంది. మనసులు దూరమైనా శరీరాలు దగ్గరనే వున్నాయ్. ఉప్పొంగిన యౌవ్వనం ఒకోసారి యిష్టా యిష్టాలతో సంబంధాలు త్రెంచుకొని కోరికలను తీర్చుకొంటుంది.
    ఏనాడు విశాల ను కాదన్నాడో ఆనాటి తోనే ఆమెకూ తనకూ యెడబాటైంది. మళ్ళీ లోకం వేలెత్తి చూపించే పరిస్థితి తనెందుకు తీసుకు రావాలి? ఆమెను ఎంతగా ప్రేమించినా ఆ ప్రేమలో ఒక మారు మూల మాలిన్యం కొద్దిగా కలిసే వుంటుంది. అలాంటి మాలిన్యం ఆమె ఏవర్నీ పెళ్లాడ కుండా తనలానే వుండిపోతే వుండకపోయేది. ఆమె తనపై ఆశ పెట్టుకుందంటే అతని మాలిన్య రహితమైన ప్రేమ పై విశ్వాసం ఉండబట్టే ఈ విశ్వాసాన్ని తనలోనూ చొచ్చుకొనే మనో నిబ్బరం నిర్మలత్వం వచ్చే వరకూ దూరంగా ఉంటేనే మంచిదని ఉత్తరాన్ని పోస్టు  చేసాడు.
    పది రోజుల్లో జవాబు కూడా వచ్చింది. ఈలోగా ఎంతో ఆరాట పడిపోయాడు. ఎన్ని సార్లో విశాలను చూడటానికి వెళ్ళాడు. ఆమె మార్పు అతనికి భరించరానిదైనది. కారణం అడుగుదా మనుకున్నాడు దానికి జవాబు.
    'నేనింకా యెంత కాలం యీ ఒంటరి బ్రతుకు భరించ లేనని' అంటే తను జవాబు చెప్పలేడు. అందుకే కారణం అడగటానికి సాహసించలేకపోయాడు. సర్కారు నించి ఉత్తరం వచ్చాక విశాల దగ్గరకు వెళ్ళాడు.
    'నాకు బదిలీ యైనది!'
    'ఎక్కడకు?'
    'డిల్లీ!'
    'ఒంటిగానే వెళ్తున్నారా?'
    'హా....మా అమ్మ రాలేదు.'
    ఈ మధ్య ఆమె తొలిసారి కన్నెత్తి అతని కళ్ళల్లోనికి చూడగానే అతని హృదయం ఉప్పొంగింది.
    'ఇంత వేగిరం బదిలీ వచ్చింది. కావాలని చేయించుకోలేడుగా?'
    ఈ ప్రశ్నకు తను మౌనం దాల్చగానే 'దూరాన వుంటారు. ఎప్పుడో చూడాలని మనసు పుట్టినా రావటానికి కాదు'
    'దగ్గర వుండగా వచ్చాను. రమ్మని కోరితే యెక్కడి కని అడిగావుగా?'
    'క్షమించండి. మీ మనసు కష్ట పెట్టాను. దూరంగా వెళ్లి పోతున్నారు. ఎలా వుండటమో...ఏమిటో...'
    సూర్యం ఆమె కన్నీరు కారుతున్న కళ్ళ వేపు చూసాడు. ఆమె ఆ నీరు తుడుచుకోడానికి ప్రయత్నించలేదు. ఇంకెంతో సేపూ అలా చూస్తూ వుండలేక పోయాడు. ఆమె దగ్గరగా చేరి ఆమె చీర కొంగే పట్టుకుని కన్నులు తుదవగానే ఆమె వెక్కి వెక్కి యేడుస్తూ అతని భుజం పై తల అన్చేసింది. అతను అంతా మరచిపోయి ఆమెను గట్టిగా కౌగలించి,
    'వూరుకో....విశాలా....వూరుకో' అతనూ ఏడవటానికి ఉపక్రమించాడు. కాస్సేపటికి గానీ యిద్దరూ యీ లోకాన పడలేదు-- ఏదో తప్పు చేసినట్లు మళ్లీ బాధ పడ సాగారు.
    'వస్తాను' అన్నాడు సూర్యం.
    ఆమె మౌనంగా అతనిని గుమ్మం వరకు అనుసరించింది. ఆవేశాలు ఆణిగాక ఆ మధురమైన ఘట్టాలు వేరే అర్ధాలను  యిచ్చాయి. ఎందుకు తొందర పడ్డానని అతడు విసుక్కున్నాడు. కానీ ఆ ఘట్టం తుడిచి పెట్టె సాహసం లేకపోయింది.

                                      16
    వెళ్ళలేక వెళ్ళలేక డిల్లీ వెళ్ళాడు. ఒకసారి బదిలీ ఆర్డర్లు వచ్చాక అవి రద్దు పరచమనటం భావ్యం కాదని బలవంతాన కదిలాడు. డిల్లీ వెళ్ళాక మళ్లీ తిరిగి రావాలన్న తలపు రోజూ వేధించేది. ఎక్కడ తిరిగినా యేది చూసినా విశాల తనతో వుంటే యెంత బావుండేదనిపించేది. అలా అనుకుంటూనే ఆమె మీద కోపంతో కూడా మనసు మండి పడేది. ఆమె వుత్తరం రాస్తుందని యెదురు చూసాడు. ఆ వుత్తరం లో తియ్యని ప్రేమ కవిత్వం, గంబీరంగా అగపడుతుందని కాంక్షించాడు. ఆమె హృదయం విప్పి వుత్తరం లో పెట్తుందని ఆశించాడు. ఈ కాంక్షలూ ఆశలూ తీర్చుకోక పోగానే ఆమె పై కోపం కలగసాగింది. మంచి చెడ్డలు రామం రాస్తున్నాడు గానీ విశాల రాయటం లేదు. విశాలను ఉత్తరం లో నైనా చూడాలని వేగిపోతున్న మనసు వెర్రి ఆలోచనలకు లోనైంది.
    మనసులో అదొక విధమైన వేదాంతం అల్లుకుంది. లోకంలో మనిషి నటించే చివరి అంకం చావు అయినప్పుడు మానవ జీవితం ఒక ట్రాజాడీయే అనుకున్నాడు. ఎన్ని ఆశలు, ప్రేమానురాగాలు , బంధాలు పెట్టుకున్నా అవి చివరి క్షణం లో తెగి పోతాయి. ఇన్ని ఆశలతో అభిమానాలతో కట్టిన మేడలు కూలి పోతాయి. మిగిలింది మట్టి. అలాంటప్పుడు కనిపించే మనోహర మైన వాటి కోసం క్షణిక మైన అనుభూతుల కోసం అర్రులు చాచట మంత తెలివి తక్కువ తనం యింకొకటి లేదు . ఈ తాత్కాలిక మైనవి కాకుండా మనిషి సాధించవలసిన శాశ్వతమైనదేమైనా వుందా అన్న జిజ్ఞాస అతనిలో చొచ్చుకుంది. నల్ల మేఘాలు రాపాడటం వలన మెరుపులా వుద్భావిస్తుందో మనిషి అజ్ఞానాన్ని రాపాడించటం వలన జ్ఞానో దయం కలుగుతుంది. చీకటి లోనికి వెలుగు ఎలా చొచ్చు కుంటుందో మనసులోనికి ఆత్మ అలా చొచ్చు కుంటుంది. అలా ఆత్మ చొచ్చుకునేటట్లు చేసే ప్రజ్ఞా సామాన్యమైనది కాదు. ఆ ప్రజ్ఞా నే తపస్సు గా పెద్దలు చెప్పారు. ఆ తపస్సు తనెందుకు చెయ్యకూడదు?
    ఒక మఠం కు వెళ్ళాడు. మూడు నాలుగు సార్లు గురూజీ చెప్పిన ఉపన్యాసాలు విన్నాడు. అతను చెప్పిన దానిలో తనకేమీ క్రొత్త కనిపించలేదు. ధ్యానం ముఖ్య మంటాడు. ఇంటికి వచ్చి భగవద్గీత పట్టుకుని అక్కడక్కడ త్రిప్పితే--
    'ఎవడు దేనిని ద్వేషించడో
    ఎవడు దేనిని కొరడో
    అతడు నిత్య సన్యాసి అని నమ్ము
    ఏమంటే సుఖ దుఃఖాలు
    మొదలైన ద్వందాలనించి    
    వేరైనా వాడు అనాయాసం గానే
    బంధాలు వోదుల్చుకుంటాడు.'
    విశాల కూ తనకూ బంధాలు వదలా లంటే ఆమెను ద్వేషించ కుండా వుండాలి. కోరకుండా వుండాలి. ఇదేదీ చేయ్యన్నాడు తను బ్రహ్మ భావం పొందలేడు. ప్రసన్న చిత్తుడు కాలేడు. సమస్త ప్రాణుల్నీ సమంగా చూడలేడు. భక్తీ లేనిది దేముడు యెవడో యెంతటి వాడో తెలుసు కాలేడు.
    ఒక వస్తాదు ఎదుటి వస్తాడు బలం తన బలంతో నే తెలుసు కుంటాడు. అది పోరాటం వలన తెలుస్తుంది. మనసనే వస్తాదు ఆత్మ అనే యింకో వస్తాదు బలం తెలుసుకోవాలంటే యీ రెండింటి పోరాటం మనిషిలో జరగాలి. మనసు అహంతో నిండి తొడలు చరఛి ముందుగా పోరాటానికి పిలుస్తుంది. అలా పిలవగల మనసే వేగం ఆత్మకు లొంగి పోతుంది. ఇంకోసారి 'ధర్మ సంస్థాపన కోసం యుగయుగానికి అవతరిస్తానని' దేవుడు చెప్పటం చదివాడు. ఒక వ్యక్తీ ఎల్ల వేళల యందు ఒకే విధంగా పోడు. ఈనాడు ధర్మంగా పోయిన వ్యక్తీ యింకో నాడు పరిసరాల ప్రభావం వలన అన్యాయానికి దారి తీయవచ్చు. అలాంటప్పుడే ఒక వ్యక్తీ లో ధర్మం మళ్లీ స్థాపించడానికి దేవుడు ఆత్మ రూపం లో వేలుగుతాడు. ఆ ఆత్మ వెలుగు పడనిది మనసులో ఒక మంచి ఆలోచన , తిరిగి మారాలన్న ఆతృత కలగదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS