శాంత అలొచనలొ పడింది. 'నిజం చెప్పడమా? మానడమా? జరిగిన సంఘటన లన్నీ నేను నా కళ్ళారా చూశాను. కాని సాక్ష్యమేమీ లేదు. రుజువు చేయడం కూడా కష్టమే! అటువంటప్పుడు ఆ సంఘటనలను గురించి చేర్చించడం నా అవివేకమని రుజువవుతుంది. అతని పై మోపిన నిందలు ఎవ్వరూ నమ్మరు. నన్ను బలపర్చరు. పైగా అంతా నాకే నీతులు చెబుతారు. మరిప్పుడెం సమాధానం చెప్పాలి? చెబుతాను. నాకేం భయం? సమయమొచ్చినప్పుడు భయపడి జీవితాంతం బాధపడడం నాకు చేత కాదు. నాకు యిష్టం లేదని చెప్పేస్తాను. ఆ తర్వాత ఏమైనా జరగనీ.......?
శాంత ఆలోచిస్తూ ఉందని గ్రహించిన రామం మౌనంగా ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగాడు. అతని కళ్ళల్లో నీలి నీడలు అవరిస్తూ మాయమౌతూ ఉండడం శాంత గుర్తించలేదు.
'బావా......నన్ను క్షమించమని రెండవ సారి వేడుకుంటున్నాను. కారణా లేవీ చెప్పలేను. ఎందుకో నాకు తెలియకుండానే నా మనసు సుందరం వైపు మొగ్గుతూ ఉంది.'
'ఇది నీ తుది నిర్ణయమా? బాగా అలోచించి ఈ నిర్ణయానికి వచ్చావా? ఆవేశం, తొందర పాటు లేకుండా నీవు ఏ నిర్ణయానికి వచ్చినా నేను సంతోషంగా ఆమోదిస్తాను. ఆ నిర్ణయం నన్ను చిత్ర హింస చేసేటటువంటిదైనా బాధపడను. బాగా ఆలోచించుకో. నీ కోరిక ఎటువంటిదైనా సంతోషంగా తీరుస్తాను.'
'బావా.....నీ వటువంటి త్యాగమూర్తి వని నాకు తెలుసు. కాని నాన్నను ఒప్పించడమేలా? సుందరం పేరెత్తితేనే మండిపడుతున్నాడు.' తన కోరికను రామం మన్నించాడనే ఉత్సాహంతో శాంత కళ్ళు మేరిశాయి.
'శాంతా ....అది అంత తెలికైనా విషయం కాదు. ఈ విషయం లో మాత్రం నేను అశక్తుడనేమోనని అనిపిస్తూ ఉంది. మామయ్యా ను దృష్టి లో ఉంచుకోనైనా నీవు చివరిసారిగా ఆలోచించు. ఇంకేదైనా సహిస్తాడు కాని మనమిద్దరం దంపతులం కాకపోవడం మాత్రం సహించడు. ఈ వృద్దాప్యం లో అతనికి చిత్త క్షోభకు గురి చేయడానికి నా మనసొప్పడం లేదు.'

'లేదు బావా ..........బాగా ఆలోచించిన తర్వాతే ఈ విషయం లో దృడ నిర్ణయం చేసుకున్నాను. నా ఈ కోరిక నెరవేరక పొతే జీవితాంతం నేను సుఖ శాంతులకు దూర మౌతాను.'
'నీ వటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత మనం నిద్దరినీ కలపడం ఎవరికీ సాధ్యం కాదు. సరే....! మామయ్యా ను మభ్య పెట్టడానికి, నీ వివాహం సుందరం తో నిరాఘాటంగా జరిగిపోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను.'
'ధన్యురాలను బావా......! నీ ఋణం ఎన్ని జన్మల కైనా తీర్చుకోలేను.' ఆ క్షణం లో ఆమె ముఖంలో వేయి నియాన్ లైట్ల వెలిగినంత కాంతి కనిపించింది.
ఆమె సంతోషం రామాన్ని మానసికంగా ఎంతో కృంగ తీసింది. తెచ్చి పెట్టుకున్న సంతోషంతో 'శాంతా! సుందరమైనా నాకు పరాయి వాడు కాదు. బాల్య స్నేహితుడు. ఏ పరిస్థితిలోనూ మీరిద్దరూ ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలు లేదు. అలా నాకు మాట యివ్వాలి. ఈ నా చిన్న కోరికను మీలో ఎవ్వరూ కాదన కూడదు. మామయ్య చిరకాల వాంఛ కూడా సుందరం అతని అల్లుడు కావడంతో నెరవేరుతుంది. నన్ను మెడిసిన్ చదివించాలని మామయ్యకు ఎంతో కుతూహలంగా ఉండేది. కాని ఆ కోరికను భగవంతుడు తీర్చలేదు. కాని వేరే దారి ఈ విధంగా చూపించాడు. అది ఉభయ తారకంగా కూడా ఉంటుంది. తన అల్లుడు డాక్టరు కావాలని కోరిన మామయ్య కోరికా, నీ కోరికా నెరవేరుతాయి. నీవు మాత్రం సుందరంతో ఈ విషయం నొక్కి ఒప్పించాలి. అది నీ బాధ్యత. ఈ మాట మీద నీవు నిలబదతానంటే యిక నా ప్రయత్నంలో నేనుంటాను. నీ సంతోషం కన్న నాకు కావలసింది వేరొకటేముంటుంది?'
'బావా! ఇప్పుడు నా హృదయం ఎంతో తేలిక పడింది.
ఇద్దరూ తలలు వంచుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇద్దరి హృదయాలలోనూ తుఫాను చెలరేగింది. శాంత పైకి అలా అన్నా తన తండ్రి విషయం ఆలోచిస్తూ భయపడుతూ ఉంది. ఇద్దరి ముఖాలూ పైకి మాత్రం ఎంతో ప్రశాంతంగా కనుపిస్తున్నాయి.
'మీ నిర్ణయాలకు వోరు సంతోషించరు సినబాబూ....!'
ఇద్దరూ ఒకేసారి ఉలికిపడ్డారు----
'ఎవరూ........? పుల్లయ్య మామా......!' ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రామం.
'అవును సినబాబూ! మీరు మాట్లాడుకున్నదంతా యిక్కడే కూసుని యిన్నాను. ఇదేం అన్యాయం సిన్నమ్మ గోరూ? సినబాబు గారిని కాదని అర్నేవర్నో పెళ్ళాడుతారా? మీ యిద్దరినీ జంటగా నా భుజాల మీద ఎత్తుకు తిరిగాను. మీ యిద్దర్లో ఏ ఒక్కరూ కట్టపడ్డా నే సూడలేను.'
'మా యిద్దర్లో ఏ ఒక్కరూ కష్టపడడం లేదు. కందకు లేని దూల కత్తిపీట కేల అన్నట్లు మధ్యలో నీవు మాత్రం ఎందుకు బాధపడాలి?' ముఖం చిట్లిస్తూ పుల్లయ్య వైపు కోపంగా చూస్తూ అంది శాంత.
'శాంతా....! త్వరపడుతున్నావు. ఆవేశంలో పుల్లయ్య మామ మనసును నొప్పించావు. అతను మన కుటుంబానికి ఎంతో ఆప్తుడు. చివరకు మామయ్యా కూడా కొన్ని కొన్ని విషయాలలో అతని సలహా తీసుకుంటాడు. అతనికి మన కుటుంబం లోని వారందరి వద్దా ఎంతో చనువుంది.'
'సినబాబూ! సిన్నమ్మ గోరు పూర్తిగా మారిపొయిండ్రు. బత్తీ చదువులు చదివితే గానం అబ్బుతుందటారు గాని, సిన్నమ్మగోరికి ఉన్న గానమే పోయినట్టుండాది. మీరేన్నైనా సేప్పండ్రి! మీరిద్దరూ మొగుడు- పెళ్లాం కాకపొతే మీ కుటుంబానికి శని పట్టు కుంటాది ....ఇది మాత్తరం నిజం!'
'పుల్లయ్యా! హద్దు మీరుతున్నావ్. ఇవి మా స్వంత విషయాలు. నీ జోక్యం అనవసరం.' కోపంతో , ఆవేశంతో ఒణికి పోతూ అంది శాంత.
'మీరు నన్ను తిట్టండి -- సంపండి . నిజం నిట్టురంగానే ఉంటాది .'
'ఏమిటా నిజం?'
'వోరికి తెల్దని......? ఆ సుందరం గోరు పన్నిన పన్నాగం యిదంతా. ఈయాల కాకపోనా ఒకనాడైనా నిజం తెలుస్తాది. నిజం నిప్పులాంటిది సిన్నమ్మ గోరూ.......! నిజం ఎల్సిన్రోజు మీరు యిశారపడతారు. నేను కళ్ళారా సూస్తాను.' అని పై పంచతో కళ్ళద్దుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పుల్లయ్య.
ఇంతకుముందు రామం సంభాషణ వల్ల కలిగిన సంతోషం మటుమాయమైంది శాంతకు.
చెదిరిన భావాలను కూడ తీసుకుంటూ అక్కడి నుండి మౌనంగా లేచి హాస్పిటలు వైపు భారంగా అడుగులు వేయసాగాడు రామం.
అతను వెళ్ళిన తర్వాత ఏదో ఆలోచిస్తూ తల ఒంచుకొని యింటి వైపు నడిచింది శాంత.
* * * *
అజ్ఞాత రచయిత్రి జ్యోత్స్న కు సన్మాన సభ జరుగుతుందని పత్రికలన్నీ ప్రకటించాయి. సంవత్సరాది నవలల పోటీలలో ఆమె నవలకు ప్రధమ బహుమతి లభించింది. అంతకు ముందే ఆంధ్ర పఠితలకు పరిచితు రాలైన జ్యోత్స్న రచయిత్రి అని అందరికీ సువిదితమైంది. ఆ సన్మాన సభలోనే సాహిత్య ఎకాడమీ వారు ఆమె వ్రాసిన కధలకు బహుమతి యిస్తారని కూడా పత్రికలు ప్రకటించాయి. ఈ ప్రకటన ఆంధ్ర పాఠకులకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించింది. అంతా ఆ తేదీ వరకు నిరీక్షించసాగారు.
జ్యోత్స్న రచనలను ఎంతో ఉత్సుకతతో చదివే చదువరులలో రామం ముఖ్యుడు. ఈ వార్త అతనిని ఎంతో సంతోష పరిచింది. ఆ సన్మాన సభకు తప్పకుండా వెళ్లాలని మనసులో దృడనిశ్చయం చేసుకున్నాడు. ఆ విషయమే శారద కు వ్రాశాడు.
శాంత విషయం రామానికి ఒక గడ్డు సమస్యగా మారింది. శాంత అతనిని వివాహమాడడానికి నిరాకరించడంతో మానసికంగా ఎంతో బాధపడ్డాడు. తను ఎటువంటి మానసిక బాధల నైనా ఎదుర్కో గలడు. కాని లక్ష్మయ్య గారి పరిస్థితే అతనిని ఎంతో ఆందోళన పరుస్తూ ఉంది ఒక ప్రక్క శాంతకు ఆమె వివాహం సుందరంతో జరిపిస్తానని మాటిచ్చాడు. లక్ష్మయ్య గారేమో శాంత మీద కారాలూ మిరియాలు నూరుతున్నారు. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచక తికమక పడుతున్నాడు రామం.
ఒకరోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత తోటలో ఒంటరిగా కూర్చొని ఆలోచనలో పడ్డాడు రామం.
