Previous Page Next Page 
లోకం పోకడ పేజి 36


                                   27

                  
    శారద పెళ్ళయ్యాక ఎంతో ఆనందంగా ఉన్నది. తనకు వివాహమవుతుందని తానెప్పుడూ అనుకోలేదు. తల్లి అంతకన్నా అనుకోలేదు. రోజూ ఆఫీసు కు వెళ్లి ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నా, ఇద్దరూ ఎంతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉంటున్నా, రామారావు మనస్సులో తెలియని ఆవేదన. శారద సాహచర్యం లో ఆ ఆవేదన ను బయటికి చెప్పలేక పోతున్నాడు. తన మనస్సులో ఉన్న విషయం తెలిస్తే శారద ఎక్కడ బాధపడుతుందో నని .
    రామారావు కు పదేళ్ళ క్రితం క్షయ వ్యాధి వచ్చింది. మొదట్లో చాలా ఉదృతంగానే ఉంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో మందులు తిన్నాడు. రక్తం కక్కుకున్నాడు. తన జీవితం సమాప్త మవుతుందనే అనుకున్నాడు. కాని క్రమేణా వ్యాధి తగ్గిపోయింది. డాక్టర్లు యింక ఫరవా లేదని గట్టిగా చెప్పలేక పోయారు. అతని దిగులు కన్నా భార్యకు దిగు లేక్కువై ఆవిడ మంచం ఎక్కింది. కొద్ది రోజుల్లోనే ఆవిడకు "గాల సింగ్ టి.బి.' వచ్చి అకస్మాత్తుగా పోయింది. అప్పటి నుంచి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళికి ఇష్టం చూపలేక పోయాడు. తనకు వ్యాధి తిరగబెట్టకపోయినా మానసికంగా మధన పడటం మానలేదు. ఎందరో జ్యోతిష్కులకు, సాముద్రికులను విచారించాడు. తన ఆయుర్దాయం గురించి. అంతా తలో రకంగా చెప్పారు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటె, ముప్పయి అయిదేళ్ళ వాడి జీవితం ఎప్పటికి తెల్లవారను?
    ఎంతో మధన పడ్డ తరువాత అతనికి ఒక సమస్య మనస్సుకు తట్టింది. తనకా, జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఆ వ్యాధి ఎప్పటి కయినా తిరగ బెట్టవచ్చు. అభం శుభం తెలీని అమాయకురాల్ని చేసుకుంటే, తనేదయినా అయితే, ఆ పిల్ల గతేం కావాలి? కాని అతని మనస్సులో ఒక రకమైన దారి ఏర్పడింది. సంపాదన పరురాలూ, కొంచెం వయస్సు పై బడినదీ అయిన పిల్లను చేసుకుంటే ఆ పిల్ల అదృష్ట వంతు రాలై ఆమె పూజలు ఫలిస్తే, ఆమె మాంగల్యం నిలవచ్చు. దైవం చిన్న చూపు చూసి తనేదయినా అయితే ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటుంది. ఒక రకంగా ఈ నిశ్చయానికి వచ్చి, తనకు ఆప్తురాలయిన వారిని సంప్రదించి జీవితం తో పందెం వేశాడు రామారావు. ఆ రోజుల్లోనే శారద అనుకోకుండా రమేష్ ఇంట్లో తారసిల్లింది. తన భావానికి అనుగుణం గానే తన వ్యాధి సంగతి తెలీక రమేష్ , శారద పెళ్లి విషయం సంప్రదించాడు. తనూ కాదనలేక పోయాడు.
    ఈ విషయాలన్నీ తలుచుకోగానే రామారావు మానసికంగా క్రుంగి పోయి, ఆరోజున రమేష్ తో సినిమా కు వెళ్లి వస్తూ, "నేను యింక ఆర్నెల్ల లో...." అన్నాడు.
    ఆ రోజుతో ఆ విషయాలు గడిచిపోయినాయి.  శకుంతల పరిచయం తో రమేష్ ఆ విషయమే మరిచి పోయాడు.'    
    ఒక రోజున హటాత్తుగా గుర్తు వచ్చి రామారావు యింటికి వెళ్ళాడు రమేష్. రోజూ ఆఫీసులో రామారావు కనిపిస్తున్నా ఆ విషయమే గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తుకు రాగానే రామారావు యింటికి వెళ్ళాడు. ఆరోజు ఆదివారం. సెలవు. శారద , రామారావూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఫలహారం చేస్తున్నారు. రమేష్ ను చూడగానే సిగ్గుపడ్డది శారద. శారద కిప్పుడు నాలుగో నెల.
    ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు రామారావు. శారద వెళ్లి రమేష్ కు కూడా ఫలహారం తెచ్చి పెట్టింది. కుశల ప్రశ్నలయ్యాక వసుంధరా, పిల్లవాడూ తిరిగి వచ్చారని చెప్పాడు రమేష్.
    "అదేవిటోయ్ , మొన్నననగా వస్తే నాతొ చెప్పలేదేం?" అన్నాడు రామారావు.
    "ఏమిటో, మరిచిపోయాను, చూడు, శారదా, వసుంధర నిన్ను తప్పక రమ్మంది. ఇవ్వాళ ఆదివారం . అందరికీ సెలవే. మేమిద్దరం ఏదో యిష్టా గోష్టి మాట్లాడు కుంటాం. నువ్వు వెళ్ళు. నీకోసం ఈ రెండు రోజులకే కలవరిస్తున్నది వసుంధర" అన్నాడు రమేష్.
    పది నిమిషాల్లో నే శారద బయల్దేరింది . దార్లో నే పళ్ళూ, పిల్లాడి కి మంచి సిల్కు చొక్కా కొనుక్కొని వసుంధర ను చూడటానికి వెళ్ళింది శారద.
    శారద వెళ్ళగానే రమేష్ ఆరోజు విషయం గుర్తుకు తెచ్చాడు. రామారావు తన జబ్బు విషయమంతా చెప్పాడు.
    అంతా విన్నాడు , రమేష్.
    "ఒక్కమాట, రామారావు గారూ , జబ్బు కన్న ఆందోళన మనిషిని క్రుంగ దీస్తుంది. ఇదే ఆందోళన తో ఆరోజున అట్లా అన్నారన్న మాట. నేను సగర్వంగా చెపుతున్నాను. శారద లాంటి ఉత్తమురాలిని ఎప్పుడయితే చేసుకున్నారో అప్పుడే మీ జబ్బు పోయింది. భగవంతుడు ఆమెను అన్యాయం చెయ్యడు" అన్నాడు రమేష్. రామారావు ముఖం విప్పారింది.
    "నిజమే , రమేష్. శారద నాకు అన్నివిధాలా తగినది. అందం లేకపోయినా , సద్గుణాల్లో మణి పూస. నిజంగా భగవంతుడు శారద ను అన్యాయం చెయ్యడు. నాకూ ఆ నమ్మకం పూర్తిగా కలిగింది. డానికి తోడూ మేమూ అమ్మా, నాన్నా కాబోతున్నాం. ఇప్పుడు నా మనస్సులో ఆసంకోచం పూర్తిగా పోయింది. క్షయకు మించిన జబ్బు వచ్చినా శారద నన్ను చావనివ్వదు. కాపాడుకుంటుంది." అన్నాడు రామారావు. అతని మనసు నిబ్బరం మాటల్లోనే గ్రహించాడు రమేష్.
    ఇప్పుడు రమేష్ మనస్సు కూడా కుదుట పడ్డది.
    "మళ్ళీ ఎప్పుడైనా డాక్టర్ని సంప్రదించారా?' అన్నాడు రమేష్.
    "అక్కర్లేదు. శారద నా మీద చూపించే ఆదరాభిమానాలే నాకు మందు. వాత్సల్య పూరిత మైన ఆమె నిబ్బరమే నాకు శ్రీరామ రక్ష. ఆమె అందాన్ని గాక, మనస్సును చూస్తున్నాను కాబట్టే నాకీ నిబ్బరం ఏర్పడింది. నాకు ఏమీ అధైర్యం లేదు, రమేష్": అన్నాడు నవ్వుతూ రామారావు.
    రమేష్ మనస్సులో శారద, తేజస్వీ నిలా నవ్వు ముఖంతో కనిపించింది.

                                     28
    అత్తవారి ఊరు వెళ్ళిన కామాక్షి పదిహేను రోజులు గడిచాక వచ్చింది. పిల్లవాడికి మూడో నెల రాగానే వసుంధర కూడా వచ్చింది.
    కామాక్షి బావగారూ, మరదలూ కామాక్షి ని బాగా ఆదరించారు. ఏదో ఒక ఉమ్మడి పొలం ఉంటె అది అమ్మి కామాక్షి వంతు వెయ్యి రూపాయలు యిచ్చారు. కామాక్షి వద్దన్నా, " వాడు బ్రతికుంటే వాడి భాగం వాడి కివ్వద్దా?" అన్నారు వాళ్ళు. ఆ వెయ్యి రూపాయలూ, తీసుకు వచ్చింది కామాక్షి.
    "పురుడూ, పుణ్యమూ అయి డబ్బపండు లాంటి పసివాణ్ణి ఎత్తుకోచ్చింది మా మరదలు. కోరి చేసుకున్నందుకు కోరికలు తీర్చుకుని, కొడుకులూ, కోడళ్ళ తో మీరంతా తామరతంపారగా సుఖంగా ఉండాలనే నా కోరిక. మీ అందరి కోరికలూ మీరు తీర్చు కుంటున్నారు. మరి నా కోరికా ఒక్కటుంది. అది మీరూ తీర్చాలి." అన్నది కామాక్షి పసివాణ్ణి ముద్దు పెట్టుకుంటూ....
    ":ఏమిటే అక్కయ్యా, నీ కోరిక ?" అన్నాడు రమేష్.
    "చెప్పండి, వదినా" అన్నది వసుంధర.
    "పొలం అమ్మగా వచ్చిన పదివేల చిల్లరా బాంకు లో వేశావు కద. ఆ డబ్బుతో హైదరాబాదు లోనే ఒక చిన్న యిల్లు కొనుక్కోండి. ఆస్తి పాస్తులు పోయినా తల దాచుకోవటానికి సొంత ఇల్లు అవసరం. రెండోది, మా అత్తవారు మొన్న వెళ్ళిన ప్పుడిచ్చిన వెయ్యి రూపాయలతో నేను కాశీ, రామేశ్వరం తీర్ధ యాత్రలకు వెళతాను. అదే నా కోరిక." అన్నది కామాక్షి.
    "తప్పకుండా వెళ్లిరా, అక్కయ్యా. అంతకన్న నీ జీవితంలో కావలసిందేమీ లేదు ఇల్లు కొనే విషయం కూడా ఆలోచిస్తాను" అన్నాడు రమేష్.
    "అవశ్యం ఈ రెండు కోరికలూ తీర్చాల్సిందే" అన్నది వసుంధర.
    "ఏరా, బాబూ, నువ్వు చెప్పు మరి?" అని రెండు వేళ్ళూ లెక్క పెట్టుకు ప్రశ్న వేస్తున్నట్లు ఒక వేలు పట్టుకో అన్నది పసివాణ్ణి కామాక్షి. వాడూ కాళ్ళూ, చేతులూ నిగడదన్ని కేరింత లాడుతూ ఒక వేలు పట్టుకున్నాడు. కామాక్షి ముఖం విప్పారింది.
    "వాడూ ఒప్పుకున్నాడురా" అన్నది కామాక్షి.
    "యాత్రా స్పెషల్ రైల్లో వెళ్ళండి వదినా. ప్రయాణం బాగుంటుంది." అన్నది వసుంధర.
    శకుంతల కూడా వచ్చింది. కామాక్షి విషయం చెప్పింది.
    "అదృష్ట వంతు రాలివి కామాక్షమ్మా! నీ మంచితనమే అన్ని యాత్రలూ నీకు పూర్తీ చేయిస్తుంది. తప్పకుండా వెళ్లిరా" అన్నది శకుంతల.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS