నీళ్ళు రాని కళ్ళు
---హరి కిషన్

ఉదయం పదకొండు గంటలైంది.
కోర్టు హాలంతా ప్లీడర్ల తో, ప్రేక్షకులతో నిండిపోయింది. ఎవరి నోట విన్నా, ఎవరి మనసులో ఉన్నా ఈ కేసును గురించే . ఇంతకన్నా దారుణమైన హత్యలూ, బంది పోట్లు, నడి వీధిలో హత్యలు, కత్తి పోట్లు ఎన్నో జరిగాయి. కాని అవన్నీ విని ఊరుకున్న ప్రజానీకం ఈ కేసును గురించి అమితాసక్తి తో, విభ్రాంతి తో , విచారం తో గమనించ సాగారు.
జడ్జి గారు పదకొండు గంటలకు తన స్థానంలో ఆశీనులయ్యారు. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. చోటు లేక కొంతమంది గుమ్మాల వద్ద నిలాబడ్డారు. మరికొంత మంది గోడ వారాన నిల్చున్నారు.
కూర్చున్న వారిలో తల వంచుకున్నవారు కన్నీరు పెట్టుకున్నారు. వారిలో సునంద, సత్యవతమ్మ, యశోదమ్మ , ఆనందరావు, ఆనందరావు తండ్రి ఉమాపతీ ఉన్నారు. ఇంకా రామారావూ చాలామంది ఆఫీసు వాళ్ళు ఉన్నారు.
న్యాయమూర్తి ముద్దాయి ని హాజరు పర్చమని ఆదేశించారు. ఇరువురు పోలీసుల మధ్యన ఉన్న ముద్దాయి బోనులో నిల్చున్నది. కోర్టు హాలులో ఉన్న అన్ని జతల కళ్ళు ముద్దాయి వైపు కేంద్రీకరించ బడ్డాయి.
ముద్దాయి వైపు చేతితో చూపిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను ప్రారంభించాడు.
'యువరా నర్ , ఈ నిందుతురాలు శ్రీమతి సుభాషిణి తన భర్త ను దారుణంగా కత్తితో పొడిచి చంపి వేసింది. భర్త అవినీతి పరుడు కావచ్చు, దొంగ కావచ్చు జూదరి కావచ్చు , తన అన్నను తన భర్త చంపాడు. కాని ఆ ముద్దాయిని శిక్షించే హక్కు కోర్టు వారికి తప్ప ఆమెకి లేదు. భర్తతో కాపురం చేస్తున్న ఇల్లాలు, ఇద్దరు బిడ్డల తల్లి, ఒక ప్రభుత్వ కార్యాలయం లో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్యోగి యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం కల చదువు కున్న యువతి. ఈ ముద్దాయిగా నిలబడిన ఈమె తన భర్త ను దారుణంగా హత్య చేసింది. ఈ ముద్దాయిని కోర్టు వారు విచారించి తగిన శిక్ష విధించాలని మనవి చేస్తున్నాను." అని కూర్చున్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
'ఏమమ్మా , నీ మీద మోపబడిన ఈ హత్యా నేరానికి నీ సమాధానం. నీ తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఎవరయినా ఉన్నారా.' ముద్దాయి సుభాషిణి ని ప్రశ్నించాడు న్యాయమూర్తి.
ముద్దాయి సుభాషిణి ఒక్కసారి తలెత్తి అందరి వంకా చూసి మళ్ళీ తల వంచుకున్నది.
'కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు ముద్దాయి సమాధానం చెప్పాలమ్మా." అన్నాడు న్యాయ మూర్తి.
"ఒక హత్యా నేరంలో డిఫెన్స్ లాయర్ని పెట్టుకునే ఆర్ధిక స్తోమతే ఉంటె అసలు హత్య చేయవలసిన అవసరమే లేదు.
.jpg)

ఆర్ధిక స్తోమత కారణం గానే ఈ హత్య చేయవలసిన పరిస్థితి వచ్చిందంటావా"
'హత్యకు కారణం, ఒక్క ఆర్ధిక స్తోమతే కాదు, మర్యాద, గౌరవం , కరుడుకట్టిపోయిన ఆవేదన. కాని ఇవన్నీ కోర్టు వారికి తెలియవు.'
'నీ భర్త , అన్న నిన్ను హింసించేవారా, నీ ప్రవర్తన లో ఏదైనా లోపం ఉన్నదని ఆరోపించారా?
సుభాషిణి హృదయం ఆక్రోశించింది. జుగుప్స కరంగా న్యాయమూర్తి వైపు చూసింది.
"క్షమించండి నా ప్రవర్తన లో దోషం ఉంటె పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తన వాదన లో నన్ను గురించి భర్తతో కాపురం చేస్తున్న ఇల్లాలుగా, ఇద్దరు బిడ్డల తల్లిగా పవిత్ర హృదయంతో చెప్పేవారే కాదేమో నేను హంతకురాల్ని కాని, అపవిత్రురాల్ని కాదు న్యాయమూర్తీ" అన్నది సుభాషిణి.
యావన్మంది జాలిగా చూసి నిట్టుర్పు విడిచారు.
"మరి ఈ దారుణ హత్య ఎందుకు చేశావమ్మా?' న్యాయమూర్తి ప్రశ్నించాడు.
అశేష బంధుమిత్రుల సమక్షం లో మంగళ వాయిద్యాలు మారు మ్రోగుతుండగా మా వివాహం జరిగింది. కాని అన్ని భవబంధాలు తెంచుకుని, రాగల పరిణామాలు తెలిసే ఈ హత్య చేశాను. ముద్దాయి నైనా నేను నేరాన్ని త్రికరణ శుద్దిగా ఒప్పుకున్నప్పుడు ఇంకా కారణాలు ఎంచవలసిన పనిలేదేమో నాకు మరణ శిక్ష విధించండి. న్యాయమూర్తి ని వేడుకుంటున్నట్లుగా అన్నది సుభాషిణి.
నేరాన్ని ఒప్పుకున్నంత మాత్రాన శిక్ష పడదమ్మా కారణాలు కావాలి. విచారణ జరగాలి. చట్ట ప్రకారం శిక్షపడుతుంది. చట్టాన్ని అమలు పర్చటానికి విచారణ జరగాలి. నువ్వు చెప్పదల్చుకున్న విషయాలన్నీ నిస్సందేహంగా చెప్పమని ఆదేశిస్తున్నాను.' అన్నాడు న్యాయమూర్తి.
"నేరం జరిగాక అందుకు కారణాలు చెప్పమనే ఈ చట్టాలు , న్యాయ స్తానాలూ, అసలు నేరాలు జరగటానికి గల కారణాలు పరిశీలించి, అ కలుషిత వాతావరణాన్ని నిర్మూలిస్తే ఈ నేరాలు జరగవు. నాబోటి అభాగ్య గృహిణుల కాపరాలూ బాగు పడడానికి ఎంతయినా సావకశమూ ఉన్నది.
"న్యాయస్థానాన్ని విమర్శించే హక్కు నీకు లేదమ్మా. నువ్విప్పుడు ముద్దాయివి. హత్యానేరానికి దారితీసిన విషయాలు కోర్టు వారి ఎదుట చెప్పాలి కాని, అనవసర ప్రస్తావన చేసి చట్టాల్నీ, న్యాయస్థానాన్ని విమర్శించవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాను.' కోపాన్ని చూపిస్తూ అన్నాడు న్యాయమూర్తి.
'క్షమించండి . ఇద్దరు బిడ్డల తల్లి. భర్తతో కాపురం చేస్తున్న ఒక ఇల్లాలు. ప్రభుత్వ కార్యాలయం లో ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి ని హత్య చేసిందంటే ఆ స్త్రీ జీవితం ఎంత విసిగి వేసారి, కరుడు కట్టుకు పోయిందో ఈ కోర్టు వారికీ, ప్రేక్షకులకూ తెలియదు. వీరంతా హతకురాలి నైనా నన్ను వింతగా చూట్టానికి, వచ్చారు. ఈ పాపాత్మురాల్ని , ఖూనీ కోరుని చుట్టానికి వచ్చారు. కానీ ఒక స్త్రీ ఈ పరిస్థితి కి వచ్చి న్యాయస్థానం లో ముద్దాయి గా నిలబడే కన్నా, ఇద్దరు బిడ్డలకూ దూరమై శాశ్వతంగా ఈ లోకం నుంచే నిష్ర్కమించ బోతున్నదంటే అందుకు గల బలీయమైన కారణాన్ని మీరంతా తెలుసుకో బోతున్నారే కాని, నా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించటానికి కాదు. పోనీండి. కన్నతల్లె హంతకురాలయినప్పుడు ఆ బిడ్డల్ని గురించి మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు.
నా స్థితికి నేను విచారించటం లేదు. నా కధ విన్న ఈ అశేష ప్రేక్షకులు తమ సంసార జీవితాల్లో ఇటువంటి కలతలూ, సంఘటన లూ జరగనీయకుండా తమ కాపురాల్నీ తీర్చి దిద్దు కుంటే ఈ హంతకురాలి మీద మీరు జాలి కనబర్చినట్లే. నాకు కావలసింది శిక్ష. మీకు కావలసింది నా కధ. నా ఆత్మ శాంతి కి కావలసింది నాలాంటి అభాగ్యులు ఈ సంఘం లో లేకపోవటమే. అందుకు తగిన వాతావరణం ఆ భర్తలు కల్పించటమే. అదే ఈ జీవితం లో ఈ ఆఖరు క్షణం లో నాకు కలిగే ఆత్మశాంతి.
ఇంకొక్క మాట. ఆత్మ ఉన్న వాళ్ళే నా కధ వినండి. ఆత్మ కలవారే ఈ కధ విని ఒక్క కన్నీటి బొట్టు రాల్చండి. ఆత్మాభిమానం కలవారే నేను చేసింది తప్పో ఒప్పో నిర్ణయించండి అన్నది సుభాషిణి.
"మా నాన్నగారి పేరు రాజగోపాలరావు గారు. అయన ఎలిమెంటరీ స్కూలు టీచరు దైవభక్తి. పాపచింతన కలవారైనా ఆయన్ని భగవంతుడే అన్యాయం చేశాడు కాని ఈ లోకం కాదు. భగవంతుని దృష్టి లో అందరూ సమానమే నంటారు. కాని ఒకడు రోగి. ఒకడు భోగి. ఒకడికి అక్షర జ్ఞానం అంటదు. మరొకడు గవర్నరు. ఇదంతా చూస్తె భగవంతుడు కూడా పెద్ద రాజకీయవేత్త. అవకాశ వాది. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు కర్మ అంటారు కర్మ జ్ఞానం కలవారు. కొంతమంది కర్మ అంటే మానవుడి అసమర్ధత కు మారు పేరంటారు.
ఈ లాంటి కర్మ మార్కు జీవితానికి ప్రతీక మా నాన్నగారు. మా అమ్మగారు సత్యవతమ్మ. ఎలిమెంటరీ స్కూలు టీచరు. భార్యకు ఉండవలసిన అన్ని మంచి లక్షణాలు మా అమ్మకు ఉన్నాయి.
నలుగురు పిల్లల్లో అక్కయ్య సునంద పెద్దది. తరువాత మా అన్నయ్య మణీ నాధం. తరువాత నేను నా తరువాత తమ్ముడు గోపీ.
పెదవారయినా , గొప్పవారైనా చిన్న పిల్లల మనస్తత్వాలు చంచల మైనవి. ఈ చంచల మనస్కులైన పిల్లల కోరికలు తీర్చటం లో పెద్ద వాళ్ళు తీసుకునే చొరవ వాళ్ళ ఆర్ధిక పరిస్థితి మీదనే ఆధారపడి ఉంటుంది.
ఆ రోజుల్లో నాకు కొద్దిగా గుర్తు గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజుల్లో రాజమండ్రి లో ప్రతిరోజూ అమ్మా, నాన్నా స్నానానికి వెళ్ళేవారు. జనం ఎక్కువగా ఉంటారని, అంటువ్యాధులు సోకుతాయని, పిల్లల్ని ఎత్తుకు పోయేవాళ్ళు ఉంటారనీ, ఏవేవో కబుర్లు చెప్పి మా నలుగురు పిల్లల్నీ పుష్కరాల్లో నాన్నగారు స్నానానికి తీసుకు వెళ్ళలేదు. తొమ్మిదో రోజున నేను, అన్నయ్యా బాగా మారాం చేశాం. మా గొడవ పడలేక ఆ రోజున స్నానాలకు తీసుకు వెళ్ళటానికి నాన్నగారు ఒప్పుకున్నారు. అమిత సంతోషంతో మేం నలుగురు పిల్లలం బయల్దేరాం.
నలుగురి పిల్లల్ని ముందు స్నానం చేయించి చీడీల మీద నిల్చోమన్నారు. అమ్మ నాన్న మంత్రాలు చదువుతూ స్నానం చేస్తున్నారు. అక్కయ్య, నేను, అన్నయ్య ఎంతో ఉత్సాహంతో, ఆసక్తిగా ఆ జనసందోహాన్ని చూస్తూ నిల్చొని మూడేళ్ళ తమ్ముణ్ణి చూడనే లేదు. వాడి పేరు మా తాతగారి పేరు గోపాలరావని పెట్టేరు. కాని ముద్దుగా గోపీ అనేవాళ్ళం.
అమ్మా, నాన్నా స్నానం చేసి వచ్చి తడి బట్టలు పిండుకుంటూ వచ్చి "గోపీ ఏడీ" అన్నారు. చుట్టూ చూశాం గోపీ లేడు. అతడి బట్టలతోనే గుండెలు బాదుకుంటూ అమ్మా నాన్నా ఆ ప్రాంతమంతా వెదికేరు. గోపీ కనుపించలేదు. అమ్మ ఏడుస్తున్నది. నాన్న కేకలేస్తున్నాడు. "నేను వద్దంటే నువ్వే వాళ్ళని బయల్దేరతీశావ్. అఘోరించు" అని నాన్న ఆరోపణ. పోలీసు రిపోర్టు ఇచ్చారు. లౌడ్ స్పీకరు లో చెప్పించారు, గోపీ కనబడలేదు.
అందరం ఏడుస్తూ ఇంటికి వెళ్లాం. మా కుటుంబం లో ఆ రోజు నుండే అన్నీ కష్టాలు ప్రారంభమయాయి. గోపీ చచ్చి పోయాడనే నిర్ధారణకు వచ్చాం. వాడి విషయం యింత వరకూ ఎవరికీ తెలీదు. బహుశా చచ్చిపోయే వుంటాడు.
అక్కయ్య కు పదేళ్ళు. మా అందరి మధ్యా ఒక్కొక్కరికి రెండేళ్ళు తేడా. అప్పటికి గోపీ మారుబడి రెండేళ్ళ యింది. చిన్న పిల్లల మాటలు, మనస్తత్వాలూ చిన్నప్పుడు తెలీవు. అని ముద్దు మాటలనుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులకు తెల్సినా ఆ లోపం ఇతరులకు తెలుస్తుందేమోనని కప్పి పుచ్చుకుంటారు.
అక్కయ్య కు పదేళ్లోచ్చాక గాని అలోపం బాగా తెలీలేదు. అక్కయ్య అమాయకురాలు. వయస్సు కు తగ్గ తెలివి తేటలు లేవు. కొత్త వాళ్ళు ఎవరయినా ఇంటికి వస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిల్చుంటుంది. పావుగంట సేపు వెకిలిగా చూస్తూ నవ్వుతూ "నీ పేరు అనేది , వాళ్ళ పేరు చెప్పేవారు. "బావుంది. బావుంది" ఆ చప్పట్లు కొడుతూ ఇవతలకు వచ్చేసేది. దాని కంటికి వాళ్ళు నచ్చకపోతే "ఒంటి పిల్లి రాకాసి" అనేది.
