26
మర్నాడు ఉదయన్నే సూరయ్య, వాడి జతగాడు రంగయ్య కలిసి రామయ్య గారింటికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రామయ్య గారు చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు అరుగు మీద. అయన మనస్సు ఇప్పుడెంతో తేలిగ్గా ఉన్నట్లనిపించింది. రాత్రి తెల్లవార్లూ ఆయనకు నిద్ర పట్టలేదు. రాత్రంతా అలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడాయన.
"తమరు రమ్మన్నట్టే వచ్చాం దొరా. బీదోడ్ని కొంప బాగు జేసుకోవాలంటే నావల్లయ్యే పనా దొరా? నిన్ననేదో దొమ్మీ గా వచ్చామని తమురను కున్నారు. మాకు దొమ్మీ ఏంటి దొరా?" అన్నాడు సూరయ్య. సురేంద్ర కూడా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు.
"సూరయ్యా" అన్నాడు రామయ్య గారు. అయన మనస్సు లో ఆరాటం మాటలో తెలుస్తున్నది. పరిస్థితి గమనిస్తూ కూర్చున్నాడు సురేంద్ర.
"ఏం దొరా?" అన్నాడు వాడు. వాడికీ ఆదుర్దాగానే ఉంది మళ్ళీ ఏం పేచీ పెడతాడో నని.
"పార్టీ కక్షతో నన్నేదిరించాలను కున్నారా?"
"బీదోళ్ళ కి మాకు పార్టీ కక్ష లేంటి బాబూ?" అన్నాడు సూరయ్య.
"అంతమంది రావటం తప్పు కాదురా?"
"తప్పేనయ్యా. సాటి పెదోడ్ని. అందుకని అంతా సానుభూతి గా తమురు నాయం సేబుతారని అల్ల ఉద్దేశం."
"ఏభై రూపాయలతో ఇల్లు బాగు చేయించు కుంటావా?"
"అవును దొరా" అన్నాడు సంతోషంతో.
"మరి సామాన్లు పాడయిన నన్నావుగా?"
"అవును దొరా. అప్పో సొప్పో చేసి మల్లీ అన్నీ కొనాల్చిందే."
"ఏరా, రంగయ్యా, నువ్వేమంటావురా?"
"నాను సెప్పెదెందుండి? ఆడికి అన్నాయం సేయ్యకండి. అంతే మాగావాల్సింది."
"పార్టీ కక్షతో నన్ను పరాభవించాలను కున్నారు కదూ?"
"మాకు పార్టీ లేంటి బాబయ్యా? బీదా బిక్కీ ని, ఎవళ్ళేది జెప్తే అది యిను కుంటాం. కడుపులు కాలి మేం జస్తావుంటే మాకు పార్టీ కచ్చా లేంటి? ఎవుళ్ళు మాకింత కూడూ, గుడ్డా యిప్పిత్తే ఆళ్ళ పార్టీనే మా పార్టీనూ."
"సరే. ఈ వంద రూపాయలూ తీసుకో. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యక మర్యాదగా మసలు కొండి" అంటూ రామయ్య గారు సూరయ్య కు వంద రూపాయలు యిచ్చాడు. వాళ్ళ ముఖాలు ఎంతో విప్పారినాయి.
"యాభై అడిగితె వంద రోపా లిచ్చారు మా రాజులు" అంటూ దణ్ణాలు పెట్టి వెళ్ళారు.
"పిచ్చి వాళ్లు!" అన్నాడు సురేంద్ర.
"వాళ్లు కాదు. నేను పిచ్చి వాడ్ని. లోకం పోకడ తెలుసుకోలేక పోయానురా, సురేంద్రా. పంతాలకూ, పట్టుదలల కూ ఇవి రోజులు కావు. బుద్ది సూక్ష్మతా, తెలివి తేటలూ, సమయస్పూర్తీ ఉంటేనే యీ రోజుల్లో ఎవరైనా రాణించేది. సరే, అయిందేదో అయిపొయింది." అంటూ కండువా వేసుకుని ఊళ్లోకి వెళ్లి పోయాడు రామయ్య గారు.
సురేంద్ర కు పట్టరాని సంతోషం కలిగింది. లోకం పోకడ యీ రోజుకు తిన్నగా తండ్రి అర్ధం చేసుకున్నందుకు ఎంతో సంతోషించాడు . సంతోషంతో తల్లిని పిలిచాడు.
"చూశావా, అమ్మా?"
"ఏమిట్రా అది?"
"నాన్నకు పట్టూ, విడుపూ తెలుసు. పైకి బింకంగా కనిపించినా జాలి గుండె. వాళ్ళు ఇల్లు బాగు చేసుకునేందుకు యాభై రూపాయలడిగితే నాన్న వంద రూపాయలిచ్చాడు. నాన్న ఇట్లా మారిపోతాడని నేను అనుకోలేదమ్మా."
"ఇంతే కద!" అన్నది తల్లి. ఆవిడ మనస్సులో ఆవేదన సురేంద్ర పెళ్లి విషయం. అదేమైనా కొడుకుతో అయన చెప్పారేమోనని అనుకుంది.
"అంతే కాదమ్మా. నాన్న నాతొ ఎంతో సంతోషంగా మాట్లాడారమ్మా. అమ్మా1"
"ఏమిట్రా?"
"నాన్న యిప్పుడు మన పార్టీ లో చేరినట్లే."
"అంటే?"
"అదేనమ్మా. నీకు కోడలుగా శ్యామసుందరి ని చెయ్యటానికి."
"ఆ గడియ రానీ. వస్తే ఇంక లేందేముంది ?'
ఆరోజు మధ్యాహ్నమే రమేష్ దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది. బారసాల చేసుకున్నామనీ, మూడో నెల రాగానే, వసుంధర నూ, పిల్లవాడినీ హైదరాబాదు తీసుకు వస్తామనీ, వాళ్ళు వచ్చాక తప్పక ఒకసారి వచ్చి పిల్లవాడిని చూసి పొమ్మని వ్రాశాడు రమేష్. ఆ ఉత్తరం చదివి ఎంతో ఆనందించాడు సురేంద్ర.
మరో వారం రోజులు గడిచినాయి. రామయ్య గారు తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. సురెంద్రతో ముచ్చటగా మాట్లాడాలని అయన అనుకున్నాడు. అయన మనస్తత్వం చాలావరకు యిప్పుడు మారింది.
"జీవితంలో ఒక్కసారి తప్పటడుగు వెశామంటే యింక కూడ తీసుకోవటం కష్టం రా" అన్నాడాయన కొడుకుతో.
"తప్పటడుగులు వేసినా నేర్పుగా తప్పుకోవచ్చు నాన్నా. అంతేగాని తప్పు చేశామే అనుకుని అట్లా బాధపడుతూ కూర్చుంటే ఎన్నటికీ కాలు కూడదీసుకోలెం" అన్నాడు సురేంద్ర.
"సురేంద్రా!" మాటలో ఆప్యాయత తొణికిసలాడింది.
సురేంద్ర కూడా ఎంతో నమ్రత తో "ఏం నాన్నా?' అన్నాడు.
"నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా యిచ్చానురా. పార్టీ మొత్తం మంచిది కాదని నేననను. ఈ పార్టీ అప్పోజిషన్ పార్టీ గానే ఉంటుంది గాని అధికార పార్టీ గా నిలబడలేదు. డానికి కారణాలు చాలా ఉన్నాయ్. తీగె లాగితే డొంకంతా కదులుతుంది. సరే, దానికేం గాని, ఈ పార్టీ సభ్యత్వానికి నిన్ననే రాజీనామా దాఖలు చేశాను. ఇప్పుడు నేను.... " అంటూ ఉండగానే రాయుడు గారు, యింకో నలుగు దయిదుగురూ ఊళ్ళో పెద్దలు వచ్చారు రామయ్య గారికి ఆశ్చర్యం వేసింది.
అందరినీ సాదరంగానే ఆహ్వానించి కూర్చో బెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. ఇంతమంది ఎందుకు వచ్చారో రామయ్య కు తెలుసు. తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా యిచ్చినందుకు కృతజ్ఞత చెప్పటానికి వచ్చారను కున్నాడు.
కాని రాయుడు గారు అందుకు రాలేదు.
"ఏం, బావగారూ, దారి తప్పి వచ్చినట్లున్నారు?" అన్నాడు రామయ్య గారు నవ్వి.
"దారి తప్పలేదు, బావగారూ! దారిలోనే నడుస్తున్నా. ఒక్కొక్కప్పుడు దారిలో ఏదో అడ్డు ఉండవచ్చు. అప్పుడు పక్కగా తప్పుకు పోతాం. దారి బాగుపడితే దారెందుకు తప్పుతాం చెప్పండి." అన్నాడు రాయుడు గారు.
"చాలా ఆసాధ్యులు. మొత్తం మీద బావగారికి మామీద ఎందుకో కరుణ కలిగింది."
"సరే దానికేం గాని, నాకు ఈ ఊరు వచ్చాకనే తెలిసింది, మీరు మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా యిచ్చారని. చాలా సంతోషించాను. నా మనస్సులోని ఆరాటం పూర్తిగా తొలిగి పోయింది. ముందు చెల్లమ్మ ను పలకరించి రావాలి"అంటూ ఇంట్లోకి వెళ్ళారు రాయుడు గారు.
రాకరాక అన్నగారు వచ్చినందుకు ఎంతో సంతోషించింది వరలక్షమ్మ.
"నేటి, కాలానికి మీ బావగారు పార్టీ కి రాజీనామా యిచ్చిం తరువాత మా యింటికి రా బుద్ది పుట్టిందన్న మాట. పోనీలే, అన్నయ్యా. మీ రాజకీయాల పట్టుదలతో బందుత్వాన్ని దూరం చేసుకున్నారు. పోనీలే, ఇప్పటి కయినా వచ్చావ్. అంతే చాలు" అన్నది వరలక్షమ్మ.
"బావ పార్టీ సభ్యత్వానికి రాజీనామా యిచ్చినట్లు నాకు యింతకు ముందే తెలిసింది. బావ రాజీనామా యిచ్చారని తెలిసి రాలేదు. సరే, అయిందేదో అయిపొయింది. ఏ ఉద్యోగానికయినా వయస్సు దాటాక రిటైరు కావడమంటూ ఉంటుంది. కాని రాజకీయోద్యోగికి రిటైరు కావడమంటూ లేదు. ఆ తాపత్రయాలు పుడకలతో పోవలసిందే. సరే, దానికేం గాని, మా పెద్ద వాళ్ళ మనస్సులు మన పిల్లలు మరమత్తు చేశారు. రోజుల్నీ బట్టి మనమూ మారుతూ ఉండాలి. ఎవరికయినా మార్పు సహజమే. పిల్లల పెళ్ళిళ్ళ విషయమే మాట్లాడుదామని వచ్చాను. సరే, తరవాత తీరిగ్గా మాట్లాడుదాం. వాకిట్లో ఇంకా చాలామంది ఉన్నారు." అని వరండాలోకి వచ్చారు రాయుడు గారు.
"ఏమయ్యా, సురేంద్రా, కులాసా? మొన్న మా యింటికి వచ్చి వెళ్ళవుట" అన్నాడు రాయుడు గారు నవ్వుతూ.
సురేంద్ర కూడా నవ్వి ఊరుకున్నాడు.
"ఏం, బావగారూ, మన రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. మనకన్న ముందే మన పిల్లలు అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. మనమూ మన పెద్దరికం నిలబెట్టు కుంటే మన పరుపు ప్రతిష్టలు నిలబడతయ్యి. మన చేతి మీదుగా వారి పెళ్లి చేసిన వారమవుతాం. కాదంటారా , వాళ్ళే రిజిష్టరు పెళ్లి చేసుకుంటారు. మనకు ఖర్చు తప్పుతుంది." అన్నాడు రాయుడు గారు.
"నాకన్న అన్ని విషయాల్లో మీరే పెద్ద , బావగారూ. పరువు ప్రతిష్టలు పోయేటంత పని మనం మాత్రం ఎందుకు చెయ్యాలి?' అన్నాడు రామయ్య గారు.
"శుభస్య శీఘ్రం" అన్నారు మిగతా వాళ్ళు.
"రాజకీయాల్లో నాతొ మీరు గెలవలేక పోయినా, బాంధవ్యం కలుపుకునే విషయంలో మీరే గెలిచారు బావగారూ. నేనే ఓడిపోయాను. పరువు ప్రతిష్ట లనేవి లాల్చీలు వేసుకున్నంత మాత్రాన రావు. లాలూచీ వ్యవహారాలు లేకుండా అందర్నీ సమంగా ఆదరించటం లోనే పరువు ప్రతిష్ట లున్నయ్యి. ఇంక సంబంధ బాంధవ్యాల విషయం లో చెప్పే దేముంది?" అన్నాడు రాయుడు గారు.
"లోకం పోకడ అర్ధం చేసుకున్నాను, బావగారూ. అందుకే పార్టీ కి రాజీనామా యిచ్చాను. ఇప్పుడు మనమంతా ఒక్కటే పార్టీ"అన్నాడు రామయ్య గారు అయన మనస్సు లో ఆ పార్టీ పతాకం రెపరెప లాడుతూ ఎగిరింది.
"ఈ శుభ సమయం లోనే మన మిద్దరం కాబోయే వియ్యంకులం అని పెద్దలకు సాదర పూర్వకంగా విన్నవిద్దాం"అన్నాడు రాయుడు గారు నవ్వుతూ.
అంతా నవ్వుకున్నారు. సురేంద్ర మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. అతని మనస్సులో శ్యామసుందరి దోబూచులాడింది.
ఆ రోజుకు రాయుడు గారు ఉండి అన్ని విషయాలూ మాట్లాడి వెళ్లారు. మర్నాడే రమేష్ కు ఉత్తరం వ్రాశాడు సురేంద్ర.
