ఈసారి కామాక్షి ఇంట్లో లేకపోయినా వసుంధర ఉంటుందన్నట్లుగా రమేష్, శకుంతల వైపు చూశాడు. శకుంతల మనస్సులోనే నవ్వుకుంది.
ఆ రాత్రి రమేష్ , వసుంధర తో అన్నాడు. 'అక్కయ్య యాత్రలకు వెళ్లితే పిల్లవాణ్ణి సముదాయించాలి కదా? మరి ఆఫీసుకు సున్నా చుట్టినట్లేనా? ఆఫీసుకు వెళ్ళకపొతే నీకు తోచదేమో?"
"మీదంతా మరీ చోద్యం. నా ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగమేగా? పొతే పోతుంది. మీ అక్కయ్య యాత్రల నుంచి రాగానే, కాస్త పిల్లవాడికి ఏడాది వెళ్ళగానే ఈసారి రెగ్యులర్ సెలక్షన్ అయ్యేటట్లు గా మరేదయినా ఉద్యోగం యిప్పిద్దురు గాని. సరేనా?' అన్నది వసుంధర.
* * * *
వైశాఖ మాసం లో సురేంద్ర కూ, శ్యామసుందరి కి వివాహ మయింది. పెళ్ళికి రమేష్ వెళ్ళాడు. పెళ్లి చాలా వేడుకగా చేశారు. మంత్రులు, శాసన సభ సభ్యులు ఇంకా పెద్దలు అంతా ఆశీస్సులు పంపారు. ఇప్పుడు వియ్యంకులిద్దరూ ఒకే పార్టీ కావడం నుంచి ఏ స్పర్ధలూ లేకుండా, చూడ ముచ్చటగా , వేడుకగా వివాహ మయింది. కన్న తల్లుల హృదయాలు ఉప్పొంగి పోయినాయి.
పదహారు రోజుల పండుగ వెళ్ళగానే నూతన వధూవరులిద్దరూ హైదరాబాదు రమేష్ ఇంటికి వెళ్ళారు. నూతన వధూవరులను వసుంధర ఎంతో ఆప్యాయంగా ఆదరించింది.
శ్యామసుందరి, వసుంధర కన్న బాగున్నది. ఆమె మనస్సులో, హృదయం లో , ఆలోచనల లో ఎల్లప్పుడు సురేంద్ర ప్రతిరూపమే కనబడుతున్నది.
వారం రోజులు అక్కడే ఉన్నారు. ఈ వారం రోజుల్లో అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.
శారద ను కూడా పరిచయం చేసింది , వసుంధర. శారదను చూడగానే మొదట్లో కొంచెం బేరు కనిపించినా వసుంధర చెప్పిన మాటలను బట్టి శారద మనస్సును అర్ధం చేసుకుంది శ్యామ సుందరి.
వసుంధర, శ్యామసుందరి ఉభయుల కన్నా శకుంతల చక్కనిదని తేలింది. కామాక్షి కూడా అదే అన్నది.
"ఇద్దరు బిడ్డల తల్లి వైనా, మూడో బిడ్డను ఎత్తుకోపోతున్నా నీ పుటక చాలా మంచిది, శకుంతలా. బింకం చెడని పిల్లల తల్లివి" అన్నది కామాక్షి ఎగతాళి గా.
శకుంతల కూడా నవ్వింది. కాని ఆ నవ్వు వెనకాల నిగూడమైన ఆవేదన నిండి ఉంది. ఆ ఆవేదన పైకి పోక్కనిది. ఇతరులతో చెప్పరానిది. చెప్పినా నమ్మశక్యం కానిది. నమ్మినా సానుభూతి కనబరచలేనిది.
రామయ్య గారు, రాయుడు గారు కూడా హైదరాబాదు వచ్చారు. రామయ్య గారు కొత్త రాజకీయాల్లో ప్రవేశించటానికి అది నాందీ ప్రస్తావన.
కామాక్షి కాశీ యాత్రకు స్పెషల్ రైలు లో వెళ్ళటానికి నిశ్చయించు కుంది. ప్రయాణానికి ఏర్పాట్లన్నీ అయినాయి. మర్నాడు ప్రయాణ మనగా రమేష్ తన యింట్లో పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందుకు రామయ్య గారిని, రాయుడు గారిని కూడా ఆహ్వానించాడు. వాళ్ళూ వచ్చారు. రామారావు, శారద కూడా వచ్చారు. కామాక్షి సంతోషానికి మేరలేదు. అంతా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ విందు సలక్షణంగా పూర్తీ చేశారు.
అంతమంది లోనూ శకుంతల, శారద ల మనస్సులు ఏదో రకమైన అభావంతో నిండినాయి. ఒకరు అందగత్తె, ఒకరు అనాకారి. ఒకరి హృదయం భర్త తో కాపురం చేస్తున్నా తృప్తి లేని జీవితం. భర్త అనే వ్యక్తీ దొరికితే చాలని తపించి పోయి, అతనికే తన సర్వస్వమూ ధారా పోసి, భర్త సాన్నిధ్యం లోనే జీవితం వెళ్ళదీసు కోవాలని తపించి పోయేది మరొకరి హృదయం.
వసుంధర, శ్యామసుందరులు ఒక ఎత్తు. జీవితాన్ని యౌవన ప్రారంభ దశలోనే ఒక చక్కని మార్గం లోకి మలచుకుని , వలచి , వలపించు కున్న వారినే చేపట్ట గలిగారు. అదే వారి జీవితంలో అనుక్షణమూ తొంగి చూసే కాంతి రేఖ.
రమేష్, సురేంద్ర లు విచిత్ర గతిని జీవిత మార్గాన్ని పూల బాటగా మలచుకున్న యువకులు.
రాయుడు గారూ, రామయ్య గారూ ఎప్ప్జుడూ లౌకిక వ్యవహారాలు, అలౌకిక వ్యవహారాలు ముచ్చటించే వ్యక్తులు. వ్యక్తుల మనస్తత్వాలు వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరి కీ తెలియవు. వరలక్షమ్మ, సుభద్రమ్మ లు నిస్సహాయులు. వారి అంతర్యాలు పిల్లల మనస్సు ల పైన, నిశ్శబ్ద మైన వ్యాఖ్యానంగా తీసుకోవచ్చు.
నాగభూషణం, రాఘవరావు లు కొన్ని కొన్ని పల్లెల్లో అందరికీ కనుపించే వారే. విషాద సంఘటనను నేర్పుగా తప్పించు కోలేని గ్రామీణులు.
రామారావు , తన నీడను తను చూసుకుని భయపడే వ్యక్తీ.
ప్రశాంత వదనంతో, నేత్ర ద్వయంతో ఆప్యాయమైన వెలుగుతో, ఈ లోకంలోని వ్యక్తులను అర్ధం చేసుకుని, ఎవరి మనస్సు నూ కష్ట పెట్టకుండా , కాల ప్రవాహం లో మునగ కుండా అలల మీద తేలిపోయే సహృదయురాలు కామాక్షి.
సమాజంలో ఇలాంటి వ్యక్తులు కొందరికి తారసిల్లు తూనే ఉంటారు. నిశితమైన ఆత్మ శోధన అందరి జీవితాల్లో నూ ఉండదు. అందరి అంతరాంతర కల్లోలాలనూ అర్ధం చేసుకుని, అందరి జీవితాలూ అమూల్యమైనవి గానే భావించి, ఎవరి మనస్సూ కష్ట పెట్టకుండా ముందుకు సాగిపోయేవారు నూటికి ఒక్కరే. జీవితపు ఉత్తమమైన విలువల పట్లా, అనుభూతికి అందని సుకుమార హృదయాల ఉనికి పట్లా విశ్వాసం లేనివాడు, ఏదైనా ఎవరైనా సరి అయిన దృక్పధం లో గోచరించడం అసంభవం. వాస్తవ జీవితంలో ఇలాంటి వ్యక్తులు నిజంగా ఎదురు పడితే అహంభావం ఎంతో గాయపడుతుంది. అప్పుడే అందరినీ అర్ధం చేసుకో గలగడం సాధ్యం.
పైకి అసాధారణంగా గోచరించినా, అసాదారణాన్వేషణ లూ, ఔన్నత్యాలూ, ఉన్నా శకుంతల, శారద లాంటి వ్యక్తులు లేకపోలేదు.
ఈనాడు, మేధ మాట్లాడే భాష మాత్రమె అర్ధమవుతున్నది గాని, మానవ హృదయాలు మాట్లాడే భాష అర్ధం కావడంలేదు. ఎండమావుల వంటి గృహ జీవితాలన్నీ తలుచుకుంటే లోకం పోకడ తప్పక తెలుస్తుంది.
"మంగళా శాసనపరై
ర్మదాచార్యపురోగమై!
సర్ర్వేశ్చ పూర్వైరాచార్యై
స్సత్క్రుతాయాస్తూ మంగళమ్!!"
(సమాప్తం)
