
రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా, కాలు నిలవకుండా కంటి మీద కునుకు లేకుండా, కాసిన్ని మేతుకులేనా ముట్టకుండా రూపు దాల్చిన ఉద్రేకం లాగ తెగ హైరానా పడిపోతున్న శంకరాన్ని చూసి హడలి పోసాగింది సావిత్రి. నామినేషన్ పడేసి వచ్చాక సాయంత్రం నుంచీ అతని పరిస్థితి మరీ విషమించింది.
మొహం అంతా కందగడ్డ లా తయారయింది. కళ్ళు రెండూ చింత నిప్పుల్లా ఖణఖణ లాదిపోతున్నాయి. ఉద్రేకం తోనూ, కోపంతో నూ కింది పెదవి వణికి పోతోంది. సమీపించడానికి మహా భయంకరంగా ఉన్నాడు.
ఇంత పట్టుదల, ఉద్రేకం, కోపం ఉన్న మనిషి నెగ్గితేనే సరి కాని ఈ ఎన్నికల్లో-- లేకపోతె ఇంకేమైనా ఉందా!.....ఎటువంటి అఘాయిత్యాని కైనా సిద్దం అవుతారు. భగవంతుడా మా మొహాన్ని ఏమి రాసి పెట్టావు?.....ఈ ఎన్నికలు ఎందుకు తెచ్చి పెట్టావు మా ప్రాణానికి?......
అంటూ భయంతో వణికి పోతూ మధ్య మధ్య కూతుర్ని కౌగలించు కొని ఏడుస్తూ , ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉపసంహరించు కోకుండా ఇలా ఒళ్ళు తెలియకుండా పందెపు గుర్రాలు లాగ పరిగేట్టడం ఎటువంటి పరిణామాల కి దారి తీస్తుందో అని పదేపదే గుండె పగిలేలాగ బాధపడ సాగింది సావిత్రి.
అమ్మ భయాన్ని అర్ధం చేసుకుంది మణి. ఆమె బాధని చూడలేక పోయింది.
ఈ ప్రమాదాన్ని తప్పించాలి ఏమైనా సరే అనుకుంది.
మారుతున్న పరిస్థితులు చూస్తుంటే మణికి కూడా మతి పోసాగింది. ఆందోళన అధికం కాసాగింది. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. అయిదారు నెలల క్రితం , ఆ మిట్ట మధ్యాహ్నం, పెద్ద పనున్నట్టు వచ్చి, చల్లగా కబుర్లు చెప్పి నాన్నని రంగం లోకి దింపారు ఆ మునసబూ, పంతులూను, తీరా దిగాక ఇంక నాన్నకి ఒళ్ళు తెలియడం లేదు, ఆఖరికి నామినేషన్ కూడా పడేశాడు శేషయ్య మావయ్య కి వ్యతిరేకంగా- ఎంతయినా ఏమయినా నాన్న ఉపసంహరించు కోనేలాగా లేడు. నాన్న కాకపొతే పోనీ మావయ్యే నా మానుకుంటే బాగుండును, మనుకుంటూన్నది, నిలబడినదీ నిర్ణయించేది రేపే !.......అందువల్ల ఏం జరిగినా ఇవాళే జరగాలి. ఇవాళే జరగాలి.
చీకటి పడుతోంది.
నాన్న ఎన్నికల ప్రచారం కోసం కాబోలు ఊళ్లోకి వెళ్ళాడు. అమ్మ వంట హడావుడి లో ఉంది. ఇదే అదనను కొని వంటి నిండా చీర కప్పుకొని, పైట చెంగు చెవుల మీంచి తీసుకుని, తడబడుతున్న కాళ్ళతో వడివడిగా శేషయ్య ఇంటి వైపు నడిచింది మణి.
శేషయ్య అప్పుడే ఊళ్ళో కి వెళ్లి వచ్చినట్టున్నాడు. పెరట్లో కాళ్ళు కడుక్కుంటూన్నాడు. కాళ్ళు తుడుచుకుని పై మీద కండువా , పాగా కొయ్యకు తగిలించడం కోసం మిద్దె గదిలోకి వెళ్ళాడు. అంతక్రితమే వెలిగించి గడప మీద పెట్టిన కోడి గుడ్డు లాంపు వెలుతురు పడకుండా క్రీనడలో మణి నిలబడి ఉంది.
ఆమెని చూసి ఆశ్చర్యంతో ఆగిపోయాడు శేషయ్య.
శేషయ్య వచ్చిన అలికిడి విని తలెఎత్తి చూసింది మణి.
'ఈ సమయంలో వచ్చిందేమిటి మణి. అని తెల్లబోతున్నావా మావయ్యా?" అంది.
శేషయ్య వెంటనే సర్దుకుంటూ "అబ్బే లేదు, తెల్లబోవడం ఎందుకు?....నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చే చోటుకి నీకు సమయం, నియమం ఏమిటమ్మా" అన్నాడు.
"నిన్నొకటి అడుగుదాం అని వచ్చాను మావయ్యా?
'అడుగు తల్లీ?....నీకు నా దగ్గర సందేహం దేనికి."
"ఇదంతా ఏవిటి మావయ్యా?...నువ్వూ నాన్న ఒకళ్ళతోఒకళ్ళు పోటీ పడుతూ నుంచో'డమా!....ఇది చూసి ఊళ్ళో వాళ్ళంతా చప్పట్లు కొడుతూ సంతోషించడమా?....ఏవిటి మావయ్యా ఇది"
శేషయ్య ముఖం వెంటనే గంబీరంగా మారిపోయింది . మణి అడిగిన దానికేం సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు మౌనంగా.
"చెప్పు మావయ్యా! మీరిద్దరూ ఎంత ప్రాణంగా ఉండేవారు. ఒకరంటే మరి యొకరు ఎంత గౌరవం చూపించేవారు. అటువంటిది ఇవాళ ఇలాగ ఆగర్భ శత్రువులు లాగా పోటీలు పడుతూ కక్షలు పెంచుకుంటారా ? మధ్యన మేం ఏం కావాలి?
శేషయ్య తలెత్తి మణి కేసి చూశాడు.
"ఇది ఇలా సాగవలసిందేనా? అపు చేయ్యదానికేం ఉపాయం లేదూ? చెప్పు మావయ్యా ఎవరో ఒకరు తగ్గి ఈ ఎన్నికల నుంచి ఉపసంహరించు కోకూడదూ?"
శేషయ్య ముఖం పక్కకి త్రిప్పుకున్నాడు.
దుఃఖం ముంచుకోచ్చేసి కళ్ళల్లో బాధ బిందు రూపం దాలుస్తోంది మణి కి డగ్గు కత్తికతో "ఏం మావయ్యా , మాట్లాడవేం?"....మానుకోకూడదూ...."
"లాభం లేదు మణి....' అంటూ శేషయ్య గోడ వేపు తిరిగాడు.
వస్తూన్న ఏడుపును ఆపుకుంటూ "ఎందుకు లాభం లేదు ....ఇంతప్పటి నుంచి నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావే .......అటువంటిది ఇవాళ నేను ఒక్క కోరిక కోరుకుంటే కాదంటారా ?........" నా మొహం చూసి నువ్వీ పోటీ నుంచి మానెయ్యి మావయ్యా .......మానెయ్యి ' అంది మణి.
"ఈ మాటే నాన్నకి చెప్పక పోయావ్?" అన్నాడు శేషయ్య ఇంకా అటు తిరిగి గోడ వేపే చూస్తూ.
"నాన్న!...హు!...అటు నాన్న ఇటు నువ్వు. మీరు ఇద్దరికీ ఇద్దరే. రాతి గుండె ఉన్న వాళ్ళు. తక్కిన వాళ్ళు ఏమైపోయినా మీకు అక్కర్లేదు. మీ కక్షలే మీకు కావాలి" అంటూ బావురు మంటూ ఏడిచింది మణి. ముఖం ఇటు తిప్పి మణిని చూస్తె ఎక్కడ మణి మాటలకి లొంగి పోతానో అని జంకుతూ, మణి ఎడుపుకి గుండె కరిగి పోతున్నా చిక్క బట్టుకుని బింకంగా అలాగే నిలబడి ఉండి పోయాడు శేషయ్య.
మణి కాస్సేపు అలా ఏడ్చి ఏడ్చి "సరే ...సరే మావయ్యా వస్తా అంటూ పైట చెంగు తో కళ్ళు తుడుచుకొని లేచి వచ్చేసింది. శేషయ్య దీర్ఘంగా శ్వాస వదిలి, కండువా తో కళ్ళు ఒత్తుకున్నాడు.
బాగా చీకటి పడిపోయింది . నాన్న రాకుండా ఇంటికి చేరుకోవాలనే కంగారు లో గబగబా వస్తూన్న మణికి వాసు ఎదురయ్యాడు చెరువు గట్టు మీద.
దగ్గరగా వచ్చి "ఏమిటి మణీ!....ఇంత రాత్రి వేళ ఎక్కడ నుంచి వస్తున్నావు?' అన్నాడు.
మణి నిజానికి మాట్లాడే స్థితిలో లేదు.
ప్రపంచం మీదా మనుష్యుల మీదా, నిమిషా నిమిషాని కి పెంచు కుంటూన్న కోపంతో నూ అసహ్యం తోనూ మనస్సంతా నిండిపోయి ఉంది తన మాట మీద గౌరవం ఉంచి తను అడగ్గానే ఉపసంహరించు కోడా అనే ధీమాతో ఇంటి దగ్గర బయలుదేరిందేమో , శేషయ్య అలా, స్థాణువులా చలించకుండా తన నిర్ణయాన్ని మార్చుకోక పోవడంతో మణికి మరింత బాధా రోషమూ ఎక్కువైంది. ఇప్పుడీ వాసు తనని పలకరించే సరికి. ఆ తండ్రికి కొడుకుని కదా నీ తోటి మాట్లాడ్డం దీనికిలే అనుకుంది మొదట.
కాని వెంటనే ఇంకో ఆలోచన రావడంతో "వాసూ -- నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలా సావంచాల రేపు కేసి వెళదాం వస్తావా?" అంది.
కెప్టెన్ వెనకాల మారు మాటాడ కుండా వచ్చే సైనికుడిలా తలవంచు కుని ఆమెని అనుసరించాడు వాసు.
"నేను అన్నా నా మాట అన్నా నీకు అభిమానమూ, గౌరవమూ ఉన్నాయా వాసూ?" అంది.
"అదేవిటి ?....ఆ అనుమానం ఎందుకొచ్చింది నీకిప్పుడు."
"అయితే విను-- మన రెండు కుటుంబాలూ హాయిగా సుఖపడుతూ ఆనందంగా కాలక్షేపం చెయ్యాలంటే, మీ నాన్నని ఎలాగేనా ఒప్పించి ఈ ఎలక్షన్ లో పోటీ చెయ్యకుండా తప్పించు."
"అమ్మ బాబోయ్! నేనా? ...మా నాన్నకి చెప్పడమా? లాభం లేదు"
"ఇంత వయస్సు వచ్చినా మీ నాన్న అంటే అంత భయమేమిటి నీకు?...ఇలా చేయడం మంచిది కాదు. అంటూ గట్టిగా చెప్పలేవూ? ఆడపిల్లవా?"
"నువ్వు ఎం అనుకో! నేను మాత్రం మా నాన్నని ఎదిరించి చెప్పలేను-- నా వల్ల కాదు"
"హు.... ఇంతే అన్నమాట?....ఈ చదువూ ఈ రూపం, ఈ డాబూ ఇవన్నీ పై పటారమే కానీ నిజంగా మగవాడికి ఉండవలసిన ధైర్యం చొరవా ఏవి లేవన్న మాట నీకు?"
వాసు ఏం సమాధానం చెప్పలేడు.
"పోనీ ఓ పని చేస్తావా?"
వాసు ఆమె కళ్ళల్లో కి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"నాకా ఈ కక్షలూ కావేశాలూ అల్లర్లూ ఆ నాగరికత తాండవీస్తున్న ఈ వాతావరణం నుంచి దూరంగా ఏ ప్రశాంతమైన ప్రదేశం లో కో వెళ్లి శుభ్రంగా చదువుకొని పరీక్షలకి కట్టుకోవాలని ఉంది. నువ్వు ఈ వీధి రాజకీయాల మధ్యన పడి ఉంటె మానసికమైన శాంతీ, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఇవేం లేకుండా ఉండిపోతావు. అందువల్ల ఇద్దరం దూరంగా ఏ ఊరు అయినా వెల్లిపోదాం. అక్కడ నేను హాయిగా చదువు కుంటాను.నువ్వు ప్రాక్టీసు చేసుకుందువు గాని, నువ్వు లేక ఈ సేవాసదనం కనక మూసేస్తే, పోటీ తగ్గి కక్షలు సమసిపోయి, ఇవాళ కాకపొతే రేపయినా నాన్నా, మావయ్యా ఏకం అవుతారు? ఏమంటావు."
"ఏవిటి ?....మన ఇద్దరం కలిసి పారిపోవడమా? అమ్మో, లాభం లేదు. అలా చేస్తే లోకం ఎటువంటి అర్ధాలు తీస్తుంది?....అనక మీ నాన్న మా నాన్నాతల ఎత్తుకొని ఊళ్ళో తిరగ గలరా?....మనకి మాత్రం చెడ్డ పేరు కాదూ అలా చేస్తే.
"లోకం -- నాన్న-- పేరూ-- ఎంతసేపూ నీకివి తప్ప మరొకటి ఏం లేవు. నువ్వు వట్టి పిరికి వాడివి -- భయస్తుడివి , నీకు ఇష్టం అయిన నిర్ణయాన్ని కూడా ధైర్యం చేసి చేసుకోలేవు ఉండి ఎదిరించ్ లేనంటావు ...పోనీ దూరం గా పోయి సాధిద్దాం అంటే రాలేనంటావు ....ఇంక ఎందుకు పనికొస్తావు?.....నిన్ను నమ్ముకొని నువ్వేదో ఉద్దరిస్తావు అనుకోవడం వట్టి భ్రమ , చాలు చాల్లే!....ఎవత్తి చేసుకుంటుందో కాని నిన్ను చాలా సుఖ పడుతుంది -- నాకు ఇలాంటి పిరిగి మగవాళ్ళ ని చూస్తె మహా చికాకు-- వస్తా -- ఇవాళ నేను చెప్పినట్లు ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకో నందుకు, కొన్నాళ్ళు పోయాకైనా పశ్చాత్తాపం పడతావు -- కాని పొరపాటు చేశాను మణీ! అంటూ అప్పుడు వచ్చినా లాభం ఉండదు, సమయం మించిపోతోంది , జ్ఞాపకం ఉంచుకో!" అంటూ అక్కడ నుంచి లేచి కోపంగా బయలుదేరింది మణి. వెనకాలే "మణి ....మణీ" అంటూ వాసు రాసాగాడు. కొన్ని ముఖ్యమైన విషయాల్ని మునసబు తోటి పంతుల తోటి మాట్లాడి అప్పుడే ఇంటికి తిరిగి వెళుతూన్న శంకరం , చీకట్లో వాసు కంఠన్ని విని అనమాలు పట్టాడు. రెండు అంగల్లో వాళ్ళని సమీపించాడు, ముందు మణి వెనకాల వాసు నడుస్తూ వస్తున్నారు.
ఇద్దరూ శంకరాన్ని చూసి బిత్తర పోయి నిలబడి పోయాడు. అంత చీకట్లో నూ కూడా శంకరం కళ్ళు మహా భయంకరంగా కనిపించాయి ఇద్దరికీ ......హత్య చెయ్యబోయే ముందు హంతకుడు విసిరే భయానక మైన చూపు ఒకటి వాసు మీద విసిరి , గట్టిగా హుంకరించి హు........ఇదా మీరు ఇన్నాళ్ళ నుండి రహస్యంగా సాగిస్తున్న వ్యవహారం !........ఊ...నడు.......ఇంటి కి నడు" అన్నాడు మణి మీద నిప్పులు కురిపిస్తూ.
వాసు నోటి వెంట మాట రాక అలాగే నిలబడి పోయాడు.
మణి దాదాపు చైతన్యాన్ని కోల్పోయి ఎలాగో తేలిపోతూ నడిచి వచ్చి ఇంట్లో పడింది -- ఆమె వెనకాలే భయంకరమైన తుఫాను లా ఇంట్లో ప్రవేశించి వీధి తలుపు భళ్ళున గడియ వేసి పెద్ద మంచాన ఉన్న పందిరి కర్ర ఊడబెరికి మణిని సమీపించాడు శంకరం --
తండ్రి కోపోదిక్త రూపాన్ని చూసి కెవ్వున కేకవేసి అమ్మని కౌగలించుకొంది మణి. సావిత్రి అదిరిపడింది -- ఆమె కేం అర్ధం కాలేదు. ఏం జరిగింది ?....ఇప్పటిదాకా మణి ఎక్కడి కెళ్ళింది ?.....ఇప్పుడెందుకిలా ఏడుస్తూ తనని కౌగలించు కొంది . భయంతో ఎందుకిలా ఒణికిపోతోంది ? ఆయనలా పందిరి కర్ర పట్టుకొని వస్తున్నారేవిటి? ....మొహం అదేవిటి అంత ప్రళయ భయంకరంగా ఉంది ?......
"నువ్వు అడ్డు తప్పుకో ?....ఇవాళ్టితో దాని ఆయువు తీరి పోయింది "- శంకరం కంఠం గుండె ఆదరే లాగ ఉరిమింది.
