43
స్టేషన్ కు వచ్చిన గోవిందరావు, శాంతి కూడా ఉన్న శ్రీహరిని చూచి కొంచెం నిరుత్సాహ పడ్డట్టు కన్పించాడు.
"శ్రమపడి మీరు వచ్చారే! ఇక్కడ నేనెలాగూ రిసీవ్ చేసుకుంటానుగా?" అన్నాడు.
శ్రీహరి నవ్వాడు. "శ్రమపడందే మీబోంట్ల దర్శనం లభిస్తుందా మరి? ఇదివరలో ఒకటి రెండు సార్లు మాత్రమే చూచాను మిమ్మల్ని. ఎలా సాగుతోంది చదువు?"
"బాగానే. ఈ సంవత్సరం ఎమ్మే అవుతాను. ఇక్కడే ప్రొఫెసర్ గా పనిచేస్తాను. ఉద్యోగం ఒకటి ఖాళీగా వుంది. అది నాకే." గర్వంగా శాంతివైపు చూస్తూ అన్నాడు గోవిందరావు.
శ్రీహరి తృప్తిగా నవ్వాడు. కాని, అట్టే సేపు అతడి ముఖం చూడలేక, అందాల బొమ్మను - శాంతిని - అతడి ప్రక్కన ఊహించలేక త్వర త్వరగా ముఖం మరోదిశకు త్రిప్పుకున్నాడు.
టాక్సీలో హోటల్ చేరారు. భోజనాలైన తర్వాత గోవిందరావు అడిగాడు: "శాంతినికేతన్ కు వెళ్ళిపోదామా? టాక్సీ మాట్లాడవా?" అని.

శాంతి, శ్రీహరి దెస చూచింది.
శ్రీహరి మెల్లగా మాట తప్పించాడు. గోవిందరావు కుటుంబ విషయాలడిగాడు. సమాధానాలు చెప్పటానికి గోవిందరావు చాలా యిబ్బంది పడుతున్నట్లనిపించింది.
జమీందారీ వంశమని, అలాగని ఇలాగని ఏమేమో చెప్పాడు. కాని, ప్రస్తుత విషయాలూ, అవసర విషయాలూ ఏమీ చెప్పలేదు.
శ్రీహరి మెల్లగా శాంతికి సైగజేసి బయటికి వెళ్ళి వరండాలో నిల్చున్నాడు.
"ఏమిటి మీ అన్నయ్యచేత యక్షప్రశ్నలు వేయిస్తున్నావ్?" అడిగాడు మెల్లగా గోవిందరావు. ముఖం నవ్వుతూనే ఉంది.
సిగ్గుపడుతూ అంది శాంతి: "తెలియకే అడుగుతున్నారా?"
"ఏమిటి విశేషం?" ముఖం చిట్లించాడు గోవిందరావు.
శాంతి కొంచెం ఆశ్చర్యపోయింది. "కాబోయే బావగారి గురించి తెలుసుకోరామరి?" అనడిగింది.
షాక్ తిన్నట్లు చూచాడు గోవిందరావు. "ఏమిటో నాకేమీ బోధపడటం లేదు."
"నా నోటితోనే చెప్పించాలనా? అన్నయ్య మన వివాహం నిర్ణయించటాని కొచ్చాడు" అంది శాంతి.
గోవిందరావు చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయాడు. "మనకు వివాహమేమిటి? అసలీ ప్రయత్నాలు ఏ ఆధారంగా జరుగుతున్నాయి?"
అతడి ముఖం పరిశీలనగా చూచింది శాంతి. అతడు హాస్య మాడటం లేదు!
శాంతి ముఖం పాలిపోయింది. గొంతు పూడిపోయింది. తెలియని నీరసం ఆవరించేసింది. "మరి నాకంత దగ్గరగా ఎందు కొచ్చినట్టు?" అడిగింది లేనిబలం తెచ్చుకుని.
కుర్చీలోనుంచి లేస్తూ హేళనగా నవ్వాడు, గోవిందరావు, "బెల్లంచుట్టూ చీమలు ఎందుకు జేరతాయి? కాని, బెల్లమే కరిగివస్తుంటే ఆ పాకంలో అంటుకుపోతామేమోనని భయపడి పారిపోతాయి. అహ్హహ్హహ్హ!" అంటూనే గబగబా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతూన్న అతడిని చూస్తూ శ్రీహరి ఆశ్చర్యంగా లోనికి వచ్చాడు.
"శాంతీ, ఆయనలా వెళ్ళిపోతున్నారేం?"
కుర్చీలో కూర్చున్న శాంతిలో చలనం లేదు. కాని తల కొంచెం ముందుకు వాలి ఉంది.
"శాంతీ, శాంతీ!" హడావిడిగా వచ్చి చెల్లెల్ని కదిపిన శ్రీహరి శాంతి స్పృహతప్పి అచేతనంగా ఉండడంచూచి కంగారు పడిపోయాడు.
* * *
శాంతికి తెలివి వచ్చేసరికి కళ్ళకు ముందు కన్పించిన వ్యక్తి రాజా. ఆత్రుతగా చూస్తున్నారు రాజా, శ్రీహరీను.
"ఎప్పుడైనా ఇలా వస్తూంటుందా?" అడిగాడు డాక్టర్.
"ఎప్పుడూ లేదండి" అంది శాంతి.
"ఎలావుంది?" అని దగ్గరగా వచ్చాడు రాజా.
"బాగానే ఉన్నా" నంటూ లేచింది శాంతి. కాఫీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్.
శ్రీహరి దూరంగా పోయి కిటికీ దగ్గర నిల్చున్నాడు బయటికి చూస్తూ. శాంతి ఆశ్చర్యపోయింది. దగ్గరగా వెళ్ళి "అన్నయ్యా, నేను దురదృష్టవంతురాల్ని!" అంది మెల్లగా.
"హు! వేరే చెప్పాలా?" నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళి కళ్ళు మూసుకు పడుకున్నాడు, శ్రీహరి.
ఆ అన్నా చెల్లెళ్ళిద్ధర్నీ దిగ్భ్రాంతుడై చూచాడు రాజశేఖరం. మెదలకుండా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు బయటకు.
శ్రీహరి మానసికావస్థ వర్ణనాతీతం. మహాసాగరమై ఘోషించసాగింది అంతరంగం. కళ్ళు మూసుకు పడుకున్నాడే కాని మధ్య మధ్య జుట్టు పీక్కోసాగాడు.
శాంతి మెదడు మైదానంలాగ ఉంది. ఆలోచనా లేదు, బాధా లేదు; ఆశ అసలే లేదు. నిరామయంగా కూర్చుంది అన్నకు ఎదురుగా.
దెబ్బ ప్రథమంగా తగిలితే బాధకాని దెబ్బమీద దెబ్బ తగిలి బొప్పి కడుతూంటే అలవాటుగా పరిణమిస్తుంది.
సాయంత్రం కళ్ళు విప్పి లేచిన శ్రీహరి ఎదురుగా కదలక బొమ్మలాగ కూర్చున్న చెల్లెల్ని చూచాడు. కాని పలకరించలేదు. వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. బయటికి వెళ్ళిపోబోతూన్న అతడిని శాంతే పలుకరించింది. "వెళ్ళిపోదామా, అన్నయ్యా?"
శ్రీహరి మాట్లాడలేదు. తీక్షణంగా చూచాడు చెల్లెలి వంక.
శాంతి చూపులు త్రిప్పుకుంటూ మెల్లగా అంది: "ఒక్కసారి శాంతినికేతన్ వెళ్ళి వద్దాం."
"ఏం? ఇంకా ఏమైనా నగుబాట్లు తక్కువైనాయా?" తీక్షణంగా అడిగాడు.
పూర్వపు మందస్వరంతోనే జవాబిచ్చింది శాంతి: "అక్కడ కొంత సామానుంది. తెచ్చుకోవాలి."
శ్రీహరి మాట్లాడలేదు. గది బయటకు వెళ్ళిపోయాడు. కాని వెళ్ళుతూనే కొంచెం ఆశ్చర్యపోయాడు. గది ప్రక్కన కుర్చీలో కూర్చుని ఉన్నాడు రాజా. శ్రీహరిని చూడగానే లేచి దగ్గరగా వచ్చాడు. "ఎక్కడికి? పద లోపలికి" అన్నాడు భుజం పై చెయ్యి వేస్తూ.
శ్రీహరి మాట్లాడకుండా అలా నిల్చున్నారు. నౌకర్ని పిలిచి టిఫిన్ తీసుకురమ్మని చెప్పి "నడువు, శ్రీహరీ" అని ఒక విధంగా బలవంతంమీదే లోపలికి తీసుకువచ్చాడు రాజా.
ముగ్గురూ ఒకరితో ఒకరేమీ మాట్లాడుకో లేదు. నిశ్శబ్దంగా ఉపాహారం స్వీకరించారు.
ఉదయంనుండీ ఏమీ తీసుకోనందువల్లా, మానసికంగా తగిలిన దెబ్బవల్లా కడుపులో ఆహారం పడగానే పాలిపోయినట్టు పడుకొని నిద్రపోసాగింది, శాంతి. గదిలో ఎవరు ఉన్నదీ కూడా గమనించగల స్థితిలో లేదు.
ఒక్కసారి అటు చూచి నిట్టూర్చుతూ బయటకు నడిచారు ఇద్దరూ.
"అయితే ఉదయంనుంచీ ఎక్కడున్నావ్?" అడిగాడు శ్రీహరి, రాజాను.
"క్షమించు. ఎలా ఓదార్చాలో తెలియలేదు. కాని యింత విచారంలో వదిలి వెళ్ళలేకపోయాను. అందుకే బయట వేచి ఉన్నాను."
"ఊఁ." మూలిగాడు శ్రీహరి. "అంతా గ్రహించావా?"
రాజా మాట్లాడలేదు. అక్కడ మాటలు అనవసరం.
చాలాసేపు ఇద్దరూ మౌనంగానే కూర్చుండిపోయారు. క్రమంగా వెలుతురు అంతరించి చీకట్లు అలుముకోసాగాయి.
"అయితే ఇక్కడికి వస్తున్నట్లు నాకు వ్రాయలేదేం? వచ్చి మా యింట్లో ఉండ కూడదా? నేను పరాయివాణ్ణయిపోయావా?" అడిగాడు రాజా.
నిర్జీవంగా నవ్వాడు సీహరి. "ముఖం చెల్లలేదు."
తిరిగి రాజా అన్నాడు: "ఉదయం నీ ఫోన్ కాల్ వచ్చేసరికి అప్పుడే ఆఫీసుకు బయల్దేరబోతున్నాను. అంతలో పిలుపు విని కంగారుగా వచ్చేశాను."
"శాంతికి స్పృహ తప్పితే కంగారుపడిపోయాను. లేకపోతే అసలు నీకు తెలియకుండానే వెళ్ళిపోయేవాడిని."
కొంతఃసేపు నిశ్శబ్దం.
"బహుశః నా ఉత్తరంవల్లనే మళ్ళీ ఈ పరిస్థితులొచ్చాయనుకుంటాను?" అన్నాడు రాజా.
"కాదులే. అసలు నాలోనూ అలాగే ఉన్నాయి ఆలోచనలు. అందుకు నీ సలహా బలమిచ్చింది."
"గోవిందరావు నాకు ఈ వీధి మొగలో టాక్సీలు బేరమాడుతూ కనిపించాడు. బహుశః అందుకూ, ఇందుకూ సంబంధముందనుకున్నాను."
"ఊఁ."
తిరిగి కొంతసేపు మానం ఆవరించింది.
"మరి ఏంచేద్దామని?" కడకు అడిగాడు రాజా.
"చెయ్యడానికేముంది? వచ్సినదారి పట్టడమే."
"ఒక్క కోరిక, శ్రీహరీ. ఈ స్థితిలో నీతో పూర్వమంత చనువుగా మాట్లాడలేక పోతున్నాను." ఒక్కక్షణం ఆగాడు రాజా.
"......."
"శాంతిపట్ల చాలా ఉదాసీనంగా ఉన్నట్లుంది నీ ప్రవర్తన. మనకే యింత బాధగా ఉంటే యిక ఆవిడ మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు."
శ్రీహరి మాట్లాడలేదు.
"కొంచెం ఓదార్పు అవసరం శాంతికి ఈ స్థితిలో. ఇంతకంటే ఏం చెప్పలేను. ప్రేమించటం తప్పుకాదు, శ్రీహరీ. కాని, ఆ ప్రేమను అవతలి వ్యక్తి అందుకోలేకపోతే దోషం ప్రేమించినవారిది కాదు."
శ్రీహరి అప్పటికీ మాట్లాడలేదు.
"మరి నేను వెళ్తాను. తిరిగి ప్రొద్దున్న వస్తాను. వెళ్ళమంటావా?"
"ఊఁ. వెళ్ళు."
"నా సలహాను గౌరవిస్తావా?"
"ప్రయత్నిస్తాను."
"సరే."
ఉదయం శ్రీహరి నిద్రలేచేసరికే శాంతి స్నానాదులు ముగించి కూర్చుంది. శ్రీహరి కూడ తయారయ్యాడు మౌనంగానే.
టాక్సీకోసం హోటల్ మెట్లు దిగుతూమ్తే రాజా ఎదురుపడ్డాడు. ముఖమంతా పీక్కుపోయి ఉంది. రాత్రంతా నిద్రలేనట్లుంది వదనం. బహుదూర ప్రాయం చేసినట్టు దుస్తులు నలిగి మాసి ఉన్నాయి.
పరీక్షగా చూస్తూ "శాంతినికేతన్ కు వెళ్తున్నాం" అన్నాడు శ్రీహరి.
"వెళ్ళు కాని, పనిచూచుకు వచ్చెయ్యి. ఎవ్వరితోనూ ఏ విషయమూ మాట్లాడకు" అన్నాడు రాజా. అని "గది తాళం యిలా పడెయ్యి. కాస్సేపు పడుకుంటాను" అంటూ తాళాలందుకుని వెళ్ళిపోయాడు.
శ్రీహరికి ఏమీ అర్ధం కాలేదు. అయినా తర్కించలేదు.
శాంతికి అనారోగ్య కారణంగా శాంతి నికేతన్ లో విద్యాభ్యాసం విరమించు కొంటూందని చెప్పి శాంతి తాలూకు మంచం, పెట్టె వగైరా సామగ్రి తీసుకుని బయల్దేరారు.
'శాంతినికేతన్! సాక్షాత్తూ శాంతి నగరం. గురుదేవుని శాంతిపీఠం. నాకుమాత్రం అశాంతి కారణమైంది. ఎందు కిక్కడికి వచ్చాను? ఏంజేశాను? ఎందుకు వెళ్ళిపోతున్నాను?' ప్రశ్నించుకుంది శాంతి. 'అయినా వెళ్ళిపోవడం దేనికి? పోనీ ఇక్కడే ఉండి మరే దృష్టి లేకుండా కళను వృద్ది జేసుకుంటూ నన్ను నేను మైమరచిపోతే?' అని ఆలోచించింది. కానీ ఇంత జరిగాక ఇక అన్నయ్యముందు ఆ ప్రసక్తి తేలేకపోయింది.
శాశ్వతంగా వదిలి వెళ్ళుతూన్న శాంతినికేతన్ కు మనస్సులోనే అంజలి ఘటించింది. 'నీ నీడన కళాభివృద్ధికి అంకితం కాలేని అదృష్టహీనను" అని లోలోన నిందించుకుంది.
రాధూను కబురంపి రప్పించింది. ఆ విరక్తిలో ఏమీ తెలియడంలేదు. తన వ్రేలినున్న పెద్ద నీలిరాయి ఉంగరాన్ని వాడు ఎప్పుడూ ఆసక్తిగా చూచేవాడు. అది తీసి వాడికి ఆప్యాయంగా బహూకరించింది. రాధూ మొదట విస్తుపోయాడు. తర్వాత సంతోషంగా స్వీకరించాడు. పెట్టె సర్దుతూంటే 'కళాతపస్వి' తగలింది. అది చూచినా కొద్దీ ఆమెకు అశాంతి అధికమౌతూంది.
"ఆడుకో!" అని రాధూకు యిచ్చేసిందా చిత్రాన్ని.
"మరి రావా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వాడు వాడి భాషలో,
బాధగా తల అడ్డంగా త్రిప్పింది.
వాడి అమాయక పసి హృదయంలో బాధ అశ్రురూపంలో నేత్రాలలో ద్యోతక మైంది. స్వార్ధాసూయాద్వేషా లెరుగని పసి మమత అది! ఏమనుకున్నాడో పరుగు పరుగున పోయి పావుగంటలో తిరిగి వచ్చాడు. వాడి చేతిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన అందమైన చక్రం. శాంతి చేతిలో ఉంచుతూ 'శ్రీ నికేతన్' అన్నాడు.
అర్ద్జమైంది శాంతికి. శ్రీనికేతనం ద్వారాల ఆకృతిని ఈ పసివాడు ప్రతిగా తయారు చేశాడు. పసిబాలలనుకూడ కళాకారులను చేయగల శాంతినికేతనాన్ని స్థాపించిన గురుదేవుడెంత ధన్యుడు! తనకా అదృష్టం అందటం లేదు.
