Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 35


    "అప్పుడే పిల్లను కూడా చూసేసారా?'

                                    
    'మీ నాన్న- నేనూ వెళ్లి చూసాం-- చక్కని పిల్ల నాయనా. విశాల లాగానే వుంటుంది. ఒక విధంగా =విశాల కంటే మెరుగే గాని తరుగు కాదు.'
    'విశాల బ్రతుకే మైందో తెలుసా?' అన్నాడు.
    ఈ ప్రశ్న తడబడుతూనే వేసి ఎందుకు వేసానని నొచ్చుకున్నాడు.
    'ఏమైంది నాయనా-- ఏమైంది?'
    'భర్త పోయాడు'
    'రామ రామ-- ఎంత ఘోరం జరిగింది.' ఆమె కళ్ళల్లో కన్నీరు తిరిగి పోయింది. కాస్సేపయ్యాక చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ "ఇప్పుడెక్కడుంది నాయనా?'
    'ఈ ఊర్లోనే'
    'ఏం చేస్తోంది?'
    'చదువు కుంటోంది.'
    'ఎవరా పుణ్యాత్ములు నాయనా. చదివిస్తున్నారు. భర్త యేమైనా వదలి పోయాడా?'
    'ఏమీ లేదు.'
    'అయ్యో రాత-- ఒకసారి చూడాలని వుంది.'
    విశాల విషయంలో పడ్డ విచారంతో సూర్యం సమ్మంధం మాటలు ఆనాటికి ఆగిపోయాయ్. మరుసటి రోజు సాయంత్రం కారు చేసి అమ్మను విశాల వద్దకు తీసుక వెళ్ళాడు. అప్పుడే విశాల కాలేజీ నుంచి వచ్చి చూసింది. సూర్యం తల్లిని చూడగానే ఆమె కాళ్ళ మీద పడిపోయింది. విశాలను లేవనెత్తి గట్టిగా కౌగలించుకుని కన్నీరు కార్చింది. విశాల కూడా ఆమె మీద పడి యేడ్చింది. ఆమె యేడుపు చూడలేక సూర్యం బయటకు వచ్చేసాడు.
    'ఊరుకో తల్లీ! దేముడు నీ పై యింత ఆక్రోశం చూపించడానికి నివ్వెం తప్పు చేసావ్? కర్మ -- మనచేత ఏం లేదు -- ధైర్యం తప్పించి...ఎలాంటి మాణిక్యానికి యెంత కష్టం వచ్చింది.'
    విశాల బొట్టు ఆమె చీరకు అంటుకుంది. ఇద్దరూ చాప మీద కూర్చున్నారు.
    'నిన్నటి వరకు అబ్బాయి చెప్పాడు కాదు. బాబు పెళ్లి విషయమై వచ్చాను. నిన్ననే చెప్పాడు. ఈ మాట విని బేజారై పోయాను.'
    విశాల ఆమె యిల్లు కదిలే వరకూ తలెత్తి మాటాడలేదు, చూడలేదు.
    అమ్మ త్రోవలో అంది.
    'చిన్న పిల్ల -- దాని ముద్దు ముచ్చట లెం తీరాయి!'
    సూర్యం ఆలోచనలో పడి జవాబు చెప్పలేదు. అయినా తల్లి యింకా చెప్పుకు పోతోంది.
    "అంత చక్కటిది మోడై పోవలసిందేనా?'
    'సంఘం కట్టుబాట్లు అలా వుంటే యింకేమౌతుంది?'
    'లేదు నాయనా-- ఆ చక్కదనం అడవిని కాసిన వెన్నెల కాకూడదురా! చూడు మీ స్నేహితుల్లో యెవరైనా ముందు కొస్తే -- విశాలకు మళ్లీ పెళ్లి చేయ్యించీ నాయనా?'
    'అమ్మా-- నివ్వేనా యీ మాటలంటూన్నావ్?' ఆశ్చర్యంగా ఆశతో సూర్యం అనగానే "తప్పేం వుంది నాయనా!'
    'మన గౌరీ కి చెయ్య గలిగామా?'
    'గౌరీ కడుపు పండింది. ఆ బిడ్డ ఒక దీపమై వెలుగు చూపిస్తుంది. కానీ విశాల కదేదీ లేదు. ఎవరూ 'నా' అన్న వాళ్లు లేరు. మనిషి బ్రతుకే ముంది నాయనా? అంధకారం. ఈ అభిమానాలు వెలగులా ముందుకు పోనిస్తాయ్. ఎవరెంత అభిమానం చూపించినా రక్త సంబంధమైన అభిమానానికి మించింది యింకొకటి లేదు. ఆ అభిమానమే నీలో లేకపోతె మేం యింతగా గర్వించే వాళ్ళమా నాయనా?'
    సూర్యం తల్లి పిల్లడు, ఆమె యేమన్నా అతని ఒళ్ళు పులకరిస్తుంది. ఆమె పేరెత్తితే ఒళ్ళంతా భక్తీ భావంతో ప్రణమిల్లుతుంది. ఇంత యెదిగినా యింకా తను తన తల్లి దగ్గర నున్న బిడ్డడినే అనుకుంటాడు. అలాంటి తల్లి యింత ముందడుగు వేస్తుందని తను నమ్మలేక పోయాడు. ఇలాంటి అమ్మతో తన వుద్దేశం చెప్తే యేమంటుందో? అనుకున్నాడే గానీ సమాధానం తల్చుకుని చెప్పలేక పోయాడు. విశాల తనది కాకుండా యింకోకరిది కావటం తను సహించ లేడు. మూడు ముళ్ళు పడకపోయినా విశాల కూ తనకూ యేనాడో బాంధవ్య మేర్పడింది. వాళ్ళిద్దరి కి దేవలోకం లోనే దివ్యుల ఎదరగా పెళ్ళయి పోయింది. ఆ పెళ్ళికి వాగిన బాజా భజంత్రీలు నరులకు వినిపించవు. వాళ్ళ ప్రేమను చూడటానికి యీ కళ్ళు పనికి రావు. అర్ధం చేసుకోడానికి యీ మనసు చాలదు.
    మరుసటి రోజు సాయంత్రం లాన్ లో రెండు కుర్చీలు కావు, మూడు కుర్చీలున్నాయ్. తండ్రి వేగంగా తిరిగి వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నాడు. ఈవేళ తను వేగంగా తిరిగి వచ్చాడెప్పుడో మళ్లీ పెళ్లి ప్రసక్తి వస్తుందని తనకు తెలుసు.
    'మీ అమ్మ చెప్పే వుంటుంది. ఈ వైశాఖం దాటితే మళ్ళీ ముహూర్తాలుండవు.'
    'నా పెళ్ళికి తొందరేం వచ్చింది?
    'మనకు లేకపోవచ్చు. వాళ్ళ ఆతృత వాళ్ళ కుండదు?'
    'నాకీ పెళ్లి వద్దు.'
    'మతి పోయిందిరా?' తండ్రి కాస్త కటువుగానే అన్నాడు.
    'ఆ వచ్చిన ఆడది వూరు కుంటుందా?'
    'ఏం చేస్తుంది? నీకా భయం అక్కర్లేదు.'
    'ఏం చేస్తుందా? నేను చూస్తూనే వున్నాను-- నా యిరుగు పొరుగున జరుగుతున్నవి, నేను పెళ్లి చేసుకుంటే నాయింట్లోనే జరిగితాయ్. నా జీతం దాని చీరలకి, వేషాలకి సరిపోతుంది. తమ్ముళ్ళ చదువులు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఆయె వరకు నాకు పెళ్లి వద్దు.'
    'అంతవరకు వూరుకుంటే ఆ వయసులో సరియైన పిల్ల దొరకటం కష్టం నాయనా!' అని తల్లి అందుకుంది. తండ్రి కాస్త కోపంగానే 'నీ అభ్యంతరం అంతా, నీ మాటలు బట్టి తమ్ముళ్ళ చదువు విషయమే కదా! చెల్లెళ్ళు యిద్దరిలో ఒకదాని సంబంధం స్థిరమైపోయింది-- ఇంకోక్కర్తి చిన్నది కదా. మిగతా వాళ్లు దాని పెళ్లి టైము కు కలసి వస్తారు-- నీ పెళ్ళాం అంతా వెచ్చ పెట్టినా ఫరవాలేదు.'
    'తమ్ముళ్ళ చదువు సాగదు.'
    'పోనీ నీకా భయం వుంటే వాళ్లిస్తామన్న కట్నం వాళ్ల చదువుకని బ్యాంకు లో వేసి సరిపోతుంది.'
    'అంత కట్నమే--!'
    'మనం ఒకరికి యిస్తున్నప్పుడు ఒకరి దగ్గర పుచ్చు కోవటం లో తప్పేం వుంది. నేనేం వారిని యింత యిమ్మని దండించ లేదు. వాళ్లిస్తామన్నదే పుచ్చు కుంటున్నాను. ఆవిడ మమ్మల్ని దూరం చేసినా -- నివ్వు మమ్మల్ని చెయ్యవనే విశ్వాసం మాకుంది.'
    'కొడుకు మా చేతిలో వుంటే కోడలెం చేస్తుంది.' అంది తల్లి.
    'కొండ మీద నించి దిగి వచ్చిన కోతిని నమ్మలేం అమ్మా.'
    'అలా అనకు నాయనా. అన్ని విధాలా , నీ హోదా కు, రూపుకు, తెలివి కి తగ్గ సమ్మంధం. మనం మళ్లీ వెతికినా దొరకదు. చెయ్యి వదలుకోవటం యిష్టం లేదు. ఒకసారి అమ్మాయిని చూడటానికి రావాలి. వారం రోజులు శలవు మీద యింటికి వచ్చావంటే అక్కడ నించి వెళ్దాం. నీకు తప్పక నచ్చుతుంది.' తల్లి మాటలకు సూర్యం మౌనంగా వూరుకున్నాడు.
    'మౌనం అంగీకారమేనా?' ప్రశ్నించాడు తండ్రి.
    'నన్ను బలవంత పెట్టకండి.'
    'అల్లుడే వేధించాడు అనుకున్నాను...'
    'నాన్నా! సూర్యం ఆవేశ పడ్డాడు. తండ్రి అక్కడి నించి లేచి వెళ్ళిపోయాడు. అతను యింకా అక్కడ ఉంటె అతని కోపం అల్లకల్లోలం చేస్తుందని కామోసు లేచి వెళ్ళిపోయాడు.
    'అమ్మా' అన్నాడు. తల్లి వేపు చూడగానే సూర్యం కళ్ళల్లో నే నీళ్ళు పెరుకున్నాయ్.
    'అమ్మా-- నేను వేదిస్తున్నానా?'
    'అతని కోపం యెప్పుడో వున్నదేగా! మనసులో యేమీ వుండదు. నేను ఇన్నాళ్ళ పడుతున్నది నువ్వు ఒక్కసారి పడలేవురా!'
    'ఒక్కసారి కాబట్టే కష్టమని పోస్తోందమ్మా!
    'అతని భయం అతనిది నాయనా! నీలో ఏం లేవు చెప్పు? పొరపాటున ఏ తప్పటడుగు వేస్తావో అని అతని భయం. చెయ్యి కాలాకా ఆకులూ పట్టుకోవటం వలన లాభమేం వుంది?'
    'మీ భయంతో నా శక్తి మీరు అనుమానిస్తారెందుకమ్మా.'
    'అనుమానించే అవకాశం యిచ్చావు.'
    'నేనే యిచ్చానా? ఎవరన్నారమ్మా?'
    'మీ నాన్నగారు ఏదో గాలి కబురు విన్నారు. ఎవరో అమ్మాయి నీ యింటికి వస్తోందని!' కాస్త మెల్లగా.
    'పోనీ నీకా పిల్ల నచ్చిందా? మన జాతి పిల్లేనా? నీకు నచ్చితే మనజాతి పిల్లయితే వాళ్ళ కేం లేకపోయినా చేసేస్తాను. నివ్వు సంతోషంగా హాయిగా వుండటం మాక్కావాలి.'
    సూర్యం జావాబు చెప్పటాని కి తటపటాఇస్తుంటే తండ్రి తిరిగి వచ్చాడు. కూర్చుంటూ.
    'నీ యిష్ట మోచ్చినట్లు చెయ్యి. చిన్న వాడివి కాదు. పెద్ద అఫీసరువు. ఒకరు వేలెత్తి చూపించేటట్లు చెయ్యకు.'
    'వాడికి తెలియంది ఏముందండి' అని తల్లి అందుకుంది.
    'మా వంశం లో డబ్బు లేక పోయినా మర్యాదకు కొదవ లేదు. ఎలాంటి వంశాన పుట్టాడు! ఆమర్యాదను నిలపడమే కాదు-- మరింత వృద్ది చెయ్యాలి.'
    'చుట్టరికాలు చేసుకున్నప్పుడు సంప్రాదాయం చూస్తారు గాని డబ్బు చూడరు.' ఇప్పటికి మచ్చ లేకుండా పోతున్నాం.'
    'అమ్మా--' ఆవేశంతో సూర్యం పిల్చాడు. 'అక్కడకు నేనే మచ్చ తెస్తున్నాట్లు బాధపడ్తున్నారు. మీ సంప్రదాయానికి గౌరవానికి భంగం తెచ్చే యే పని చెయ్యనని హామీ యిస్తున్నాను. తండ్రికి తగ్గ కొడుకు, తాత కు తగ్గ మనుమడినని నిరూపించుకుంటానమ్మా!'
    ఈ మాటలు అన్నాక సూర్యం అలసి పోయాడు. కళ్ళల్లో నీళ్ళు పెరుకున్నాయ్. గతం అంతటిని ఆ కన్నీటి తెర కప్పి వేసింది. మళ్లీ క్రొత్త జన్మ యెత్తి నట్లనిపించింది.

                              *    *    *    *
    తల్లీ తండ్రి వెళ్ళిపోయినా ఆరోజు సాయంత్రం జరిగిన సంఘటన హృదయంలో మఠం వేసుకుని కూర్చుంది. ఒక యోగనిష్టలో నున్న ఋషి పుంగవుని లా సూర్యం యింకే విషయాన్నీ పట్టింపు చేసుకోలేదు. ఏకాగ్రత కోసం పెనుగులాడి విశాల ఎదరకు నెలరోజుల వరకు పోలేదు. విచిత్రమేమంటే ఆమె కూడా తన దగ్గరకు రాలేదు. అతని ధ్యానం లో దేనికి బదులు ఆమె ప్రతిబింబం ప్రత్యక్షం కాగానే కళ్ళు తెరచేవాడు. కంటికి యింకేవో కనిపించినా మనసులో విశాల విహరించేది. ఈమె వేరు, తను వేరని యెంత ప్రయత్నించినా నిర్ణయించు కోలేక పోతున్నాడు. వసంతం లో చెట్టు ఆకులూ రాల్చటం యెలా కాదో యౌవ్వనం లో ప్రేమ తలపులను రాల్చటం సాధ్యంకాదు. చిగురించిన వలపు పుష్పించి పలకబారి పండుగా రాలితేనే చెట్టుకు తృప్తి. తనకు యెన్ని వున్నా ఏం చేసినా తృప్తి లేకపోడానికి కారణం తను కాలానుగుణ్యంగా , ఒక రీతి గా నడవక పోవటమే.
    నెల రోజులు కట్టడితో మనసును గొలుసులతో బంధించేసాడు. తరవాత మరి యెంత కాలమో యీ బలవంతపు బంధాలను వదల్చు కోకుండా ఉండలేక పోయాడు. సహజంగా అల్లుకున్న పూల తీగల్లాంటి ఆమె వలపు తీగల దరికి చేరకుండా యెలా గడప గలడు? ఒకనాడు తెగించి వెళ్ళాడు. విశాల యింట్లో ఉన్నా అతనిని చూచి చాటుకు వెళ్ళిపోయింది. ఏదో పరాయి వాడికి మన్నన చేసే యిల్లాలు గా ఆమె సంచరించటం తనకు కష్ట మనిపించింది. ఎన్నెన్నో మాటాడుదామని యేవేవో చెప్పు కుందామని వచ్చాడు. అతని కంటి లో నీరు వెంటనే బయట పడటానికి సిద్దంగా వుంది. అతని ఆవేశం అప్పటికే నొక్క బడ్డ స్ప్రింగు లా ఉంది. అతను స్ప్రింగు వదలటానికి సిద్దంగా వచ్చాడు. ఆమె ప్రవర్తన తో అతని మనసు చివుక్కు మన్నది.
    మూగపోయినది ఆమె గొంతుకే కాదు-- మనసు -- ఆ విశాల నేత్రాలు. నెల రోజులు రాలేదన్న అలుక అలా చేసిందేమోనని "ఇన్నాళ్ళూ పని తొందరల వలన రాలేక పోయాడు విశాలా!'
    దీనికీ ఆమె జబాబు యీయలేదు. తను అబద్దం ఆడినట్లు ఆమె పోల్చుకుంది. ఈ నెల రోజుల్లో ఆఫీసు పని మీద ఒకయైదుసార్లైనా పట్నం వెళ్లాడు. రెండు సార్లు రామం కంట పడ్డాడు. రామం విశాలతో చెప్పే వుంటాడు. ఆమె యెప్పటికి యిది వరకున్న విశాల కాలేదు. ఏదో అవమానం అతని మనసులో చొచ్చుక పోయింది. ఆమె నగు మోము చూడాలన్న కోరిక తీరలేదు. ఆమె తేనే పలుకులు విని అర్రులు చాచి ఆవేశ పడాలన్న వూహ చచ్చి పోయింది. తిరిగి యింటికి వచ్చాక మనసు పరి పరి విధాల పోయింది. ధర్మాధర్మ విచారణ  చేసుకున్నాడు. దోషి న్యాయాధి పతిగా తనే రెండు భాగాలై విమర్శించుకుని తీర్పు చెప్పుకున్నాడు, విశాలను తను కట్టుకో లేనప్పుడు తనకేం అధికారం వుంది? తన తత్వానికి తగ్గట్టే తను మెసలుతున్నాడని తట్టింది.
    మళ్లీ మరుసటి రోజు వెళ్ళాడు. ఆమె స్వభావం లో మార్పు రాలేదు. కోపంతో తిరిగి వచ్చినా నాల్గో రోజు మళ్లీ వెళ్ళాడు. ఆమె యీ సారి యింకా లోనికి వెళ్ళిపోయింది. సూర్యం యేవేవో నిష్టూరాలాడాలను కున్నాడు. కాని ఒక్క మాటా దుఃఖంతో బయటకు రాలేదు. ఇలా ఆమె యింత వేగిరం మారటానికి కారణం అడక్కుండా పోదల్చు కోలేదు.
    "ఏం అదోలా వున్నావు' వెళ్లి పోయేముందు అడిగాడు.
    "ఏం> బాగానే వున్నాను' జవాబు చాతునుంచే వచ్చేసింది.
    ఒకసారి యిద్దరూ యీ శనివారం రాకూడదు?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS